రైతులకు ఆధునిక పద్ధతులపై అవగాహన


మహబూబ్‌నగర్‌: ఆధునిక వ్యవసాయ పద్దతులు ఆచరించి అధిక దిగుబడులు సాధించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రైతులకు పిలుపునిచ్చారు. వ్యవసాయం పట్ల రైతుల ఆలోచనావిధానం మారాలి, వ్యవసాయ పద్దతులు మారాలి, ఒకప్పటి వ్యవసాయం వేరు నేటి వ్యవసాయం వేరు ఎపంటవేస్తే లాభం వస్తుందో ఆపంటే వేయాలి , అని ఆయన చెప్పారు. సోమవారం ఆయన మహబూబ్‌నగర్‌ జిల్లా మాచన్‌ పల్లి గ్రామంలో రైతు చైతన్య యాత్రలను ప్రారంభించారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో 35 కోట్ల జనాభా వున్నప్పటికి ఆహరధాన్యాలు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకొన్నామని, ప్రస్తుతం 110 కోట్ల జనాభా వున్నపటికి ఆహర ధాన్యాలు సమృద్దిగా వున్నాయని చెప్పారు. కొత్త వంగడాలు, ఆధునిక పద్దతుల వల్లనే ఇది సాధ్యమైందని అన్నారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందన్న ఉద్దేశ్యంతో రైతుల సంక్షేమం కోసం రాష్ట్రప్రభుత్వం గత 6 సంవత్సరాల నుండి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నదని, ఇందులో భాగంగానే బ్యాంకు ఋణాలమాఫి, రాయితీ పై విత్తనాలు, ఎరువుల పంపిణి, వంటివి కల్సించటంతోపాటు 2003లో 530/- రూ.లుగావున్న వరి మద్దతు ధర 2010 నాటికి 1030/- రూ.లకు పెంచామని తెలిపారు.

అంతేకాక కేంద్రప్రభుత్వం గత సంవత్సరం ఒక్కడిఎపిపైనే లక్ష కోట్ల రూపాయల సబ్సిడి భరించి తక్కువధరకు రైతులకివ్వటం జరిగిందన్నారు. రైతులు అన్ని విషయాలు తెలుసుకోవాలని, లాభంవచ్చే పంటలేసాగు చేయాలని, ఇజ్రాయిల్‌ తరహలో బింధు, తుంపర సేద్యంతోపాటు ఆధునిక పద్దతులు పాటించాలని, రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా సేంద్రీయ ఎరువులే వాడాలని కోరారు. గుళికల మందు కొంటేనే ఎరువులు అమ్ముతామని ఎరువుల దుకాణాదారులు అంటున్నారని రైతులు మంత్రికి పిర్యాదు చేయగా, ఎరువులకు గుళికల మందుకు లంకెపెట్టే ఎరువుల దుకాణాదారులు, డీలర్లపై చర్య తీసుకుంటామని ,లైసెన్సు రద్దు చేస్తామని అంతేకాక సంబంధిత వ్యవసాయు శాఖ అధికారిపై కూడా చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

నెల్లూరు సన్న రకం ధాన్యం తక్కువధరకు అమ్మవద్దని, ఐకెపి, సివిల్‌ సప్లయ్స్‌ ద్వారా జిల్లాలో 10 కేంద్రాలు ఎర్పాటు చేసి ప్రభుత్వం ధాన్యం కొంటున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి పాడి రైతులకు పశు గ్రాసవిత్తనాలు పంపిణి చేశారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షులు వీరా రెడ్డి మాట్లాడుతూ సహకార పరపతిలో భాగంగా డిసిసి బ్యాంకు ద్వారా ధీర్గకాళిక రుణాలిచ్చేందుకు సిద్దంగా వున్నామని 6శాతం రిబేటుపై వీటిని ఇస్తున్నందున రైతులు ఉపయోగించుకోవాలని కోరారు.

జిల్లా కలెక్టర్‌ యం .పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయం, పంటలపై రైతులకు అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారుల ద్వారా ఈ నెల 17 నుండి వచ్చే నెల 2 వరకు రైతు చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎరువుల దుకాణాదారులు ఎరువులకు మందు గుళికలకు లంకె పెట్టరాదని, ఈ విషయంలో జిల్లా స్థాయిలో సమావేశం నిర్వహించి తగు చర్య తీసుకొంటామని చెప్పారు. రైతులు ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు కొంటే తప్పక బిల్లులు తీసుకోవాలని సూచించారు.

సర్పంచుమళ్లికార్జున రెడ్డి ఎంపిటిసిలు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి మహబూబ్‌ నగర్‌ శాసనసభ్యులు ఎన్‌ .రాజేశ్వర్‌ రెడ్డి, పశుసంవర్దకశాఖ జె.డి రామచంద్రుడు, ఆర్డీఓ రాజేశం, తహశీల్దారు, ఎంపిడిఓలు హజరయ్యారు. అంతకుముందు ఆయాశాఖల అధికారులు వారి శాఖలపై రైతులకు అవగాహన కల్పించారు.

Advertisements

అన్ని గ్రామాల్లో రైతు చైతన్య యాత్రలు


మహబూబ్‌నగర్‌: వచ్చే నెల 2వ తేదీ వరకు జిల్లాలోని అన్ని గ్రామాలలో రైతు చైతన్య యాత్రలు నిర్వహించనున్నట్లు మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌ యం.పురుషోత్తం రెడ్డి తెలిపారు. రైతు చైతన్య యాత్రలలో వ్యవసాయాధికారులతో పాటు వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, ఒక వ్యవసాయ శాస్త్రవేత్త కూడా గ్రామాలను సందర్శించి రైతులను చైతన్య పరుస్తారని అన్నారు. ఈ సదస్సులలో ప్రసంగాలు లేకుండా గ్రామ రైతులు వేసుకుంటున్న పంటలు, వారి భూముల స్వభావము, వేసుకోవలసిన పంటలు, వాటికి వాడవలసిన రసాయనిక ఎరువులు వాడకం గురించి వివరించడం జరుగుతుందన్నారు.

వచ్చే ఖరీఫ్‌లో రైతులు వారి భూముల స్వభావము గుర్తించి అవసరమైన పంటలు వేసుకొని అధిక దిగుబడి సాధించడానికి వీలుగా ఈచైతన్య యాత్రలు దోహదపడతాయన్నారు. వ్యవసాయ అనుబంధ శాఖలు ఉద్యానవనం, మత్స్యశాఖ, పశుసంవర్దక శాఖ, పట్టుపరిశ్రమ, మార్కెటింగ్‌ శాఖ అధికారులు పాల్గోని రైతులకు చైతన్యపరుస్తారని అన్నారు. ఈ ఖరీఫ్‌లో మండలాల వారిగా గ్రామాల వారిగా అవసరమైన విత్తనాలు, రసాయనిక ఎరువులు ముందుస్తుగానే నిలువ చేసి వుంచనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. వచ్చే ఖరీఫ్‌లో రైతులు అనుసరించవలసిన మెళకువలు ఈ యాత్రలలో తెలియజేయడం జరుగుతుందన్నారు.

దాంతో పాటు రైతులకు రాయితీపై అందించనున్న పనిముట్ల గురించి అవగాహన కల్పించబడునని చెప్పారు. మండల వారిగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకొని రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ సారి క్యాట్‌ ఫిష్‌ పెంపకం ప్రాంతాలలో కూడా అధికారులు సందర్శించి క్యాట్‌ ఫిష్‌ పెంపకం నివారించడానికి కఠిన చర్యలు తీసుకోవడానికి ఆదేశించడం జరిగిందని కలెక్టర్‌ చెప్పారు. గత ఖరీఫ్‌లో తీవ్ర కరువు వల్ల పంటలు నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం వారి అకౌంట్లలో జమ చేయబడునని కలెక్టర్‌ వెల్లడించారు.

రైతు చైతన్య సదస్సులలో అధికార బృందాలు సందర్శించే రోజు, సమయం, ముందుగానే ఆయా గ్రామాలలో ప్రచారం ద్వారా తెలియపరచడం జరుగుతుందని తెలిపారు. ఈ రైతు చైతన్య యాత్రలలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని వినూత్న వ్యవసాయ విధానాలను అవగాహన పరచుకోవాలని కలెక్టర్‌ కోరారు. ఇటీవల వడగండ్ల వానకు జరిగిన పంట నష్టాలను అంచనా వేసి ప్రభుత్వానికి పరిహారం మంజూరుకై ప్రతిపాదనలు సమర్పించడం జరిగిందని ఆయన తెలిపారు.

ఈ వసూవేశంలో వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు వినయ్‌ చంద్‌ పాల్గొన్నారు.

సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: జూపల్లి


మహబూబ్‌నగర్‌: ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అదికారులపై చర్యలు తీసుకొంటామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల మండలం కందూర్‌ గ్రామంలో బుధవారం జరిగిన ప్రజాపథం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అధికారులు ఎల్లప్పుడు ప్రజాసేవలోనే వుండాలని సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయవద్దని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

విద్యుత్‌ హెల్పర్‌ మక్బూల్‌ అహ్మద్‌ గ్రామంలో వుండకపోవటం వల్ల విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలుగటమే కాక రాత్రి వేళల్లో బోరు మెటార్లు కాలిపోవటం, కరెంట్‌ షాక్‌ వల్ల ప్రమాదాలకు లోనుకావటం జరుగుతున్న విషయం ప్రజలు మంత్రి దృష్టికి తెచ్చారు. ఇందుకు మంత్రి స్పందిస్తూ మక్బూల్‌ అహ్మద్‌ పై సత్వరమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం ఉపేక్షించేది లేదని ట్రాన్స్‌ కో ఉన్నతస్థాయి అధికారులను ఆదేశించారు.

కందూర్‌ గ్రామంలో సుమారు 200 కుటుంబాలు వివిధ కారణాల వల్ల ఇందిరమ్మ గృహాలు నిర్మించుకోలేక పోయిన విషయం కూడా గృహ నిర్మాణ శాఖ అధికారుల నిర్లక్ష్యమేనని మంత్రి స్పష్టం చేశారు. గృహాలు నిర్మించుకుంటున్న లబ్దిదారులతో అధికారులు వారానికి ఒకసారి కలిసి పనుల పురోగతిని సమీక్షించి బిల్లులు చెల్లింపులకై సత్వరమే చర్యలు తీసకోవాలన్నారు. అలాగే మంజూరు లేకుండా గృహాలు నిర్మించుకున్న కుటుంబాల వివరాలు సేకరించాలన్నారు. తాను రాష్ట్ర ముఖ్యమంత్రి తో కలిసి మంజూరు లేకుండా నిర్మించుకున్న ఇందిరమ్మ గృహాలకు బిల్లుల చెల్లంపులు జరిగే విధంగా కృషి చేస్తానని మంత్రి హామినిచ్చారు.

ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులు ఇందిరమ్మ గృహాలు నిర్మించుకునెె స్థితిలో లేకుంటే వారి గృహాలు శాఖా పరంగా నిర్మించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వేసవిని ధృష్టిలో వుంచుకొని ఉపాధి హామి పథకం కింద కూలిలకు దినసరి కూలీని 50 శాతం అదనంగా పెంచడం జరిగిందని ఈ విషయం ప్రజలకు తెలపాలని చెప్పారు. ప్రతిరోజు ఆయా గ్రామపంచాయతిలలో ఉపాధి హామి పనులు చేపట్టుటకై కూలీలను ఆహ్వానించి పనులు చూపాలని అధికారులకు మంత్రి సూచించారు.

ప్రతి గ్రామ పంచాయతిలో మైక్‌ సెట్లు నెలకొల్పుటకై చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కందూరు గ్రామానికి ఒక ఒహెచ్‌ఎస్‌ఆర్‌ నిర్మాణంతో పాటు తాగునీటి సమస్య అధిగమించేందుకు పైపులు, పంపుసెట్ల ఖరీదు, బోరువేయుటకు గాను రు. 3 లక్షలు మజూరు చేస్తున్నానని మంత్రి ప్రకటించారు. అనంతరం మంత్రి గుడిబండ, అడ్డాకుల గ్రామాలలో జరిగిన ప్రజాపథం కార్యక్రమాలలో మాట్లాడుతూ ప్రజాపథం సమావేశాలలో తీసుకుంటున్న నిర్ణయాలు మినిట్స్‌ నమోదు చేసి ప్రతులు జిల్లా కలెక్టర్‌, సంబంధిత మంత్రులకు యిచ్చి అట్టి నిర్ణయాలు సత్వరమే అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రత్యేకాధికారికి సూచించారు.

ఆరుహులైన లబ్దిదారులు పించన్లు, రేషన్‌ కార్డులు లేకుండా ఎ ఒక్కరు కూడా వుండకూడదన్నారు. దేవరకద్ర శాసనసభ్యురాలు సీతదయాకర్‌ రెడ్డి ఈ సభలకు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మేల్సీ జగదీశ్వర్‌ రెడ్డి, జడ్పిటసి బాల్‌నర్సింహులు, ఎంపిపి అరుణా రామన్‌ గౌడ్‌, మండల ప్రత్యేకాధికారి మల్లయ్య, ఆర్‌డిఓ రాజెశం, ఎంపిడిఓ, తహాశిల్దారు, సంబంధిత అధికారులు, అనధికారులు పాల్గోన్నారు.

కల్లు పారుతోంది


గోపాల్‌పేట: ఉదయం నుంచి సాయంత్రం వరకు కాయకష్టం చేసి పేదోడు సేద తీరేందుకు తాగే కల్లులో పూర్తిగా కల్తీ ఉండడం వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కల్తీకల్లు నివారణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఈత చెట్లు లేనిది స్వచ్ఛమైన కల్లెక్కడిదని ప్రశ్నిస్తున్నారు. ప్రజల బలహీనతను ఆసరాగా తీసుకొన్న కల్లు వ్యాపారులు అధిక మొత్తంలో విషపదార్థాలను వేయడం ప్రజల ప్రాణాలతో చలగాటమాడడం వంటి సంఘటనలు మండలంలో చోటుచేసుకుంటున్నాయి.

గతంలో గోపాల్‌పేటలో కల్లుడిపో ఉండి మండలంలోని అన్ని గ్రామాలకూ కల్లును సరఫరా చేస్తుండేవారు. ప్రస్తుతం కల్లు డిపో లేకపోవడంతో వనపర్తి నుండి కల్లు సరఫరా అవుతోంది. మండలంలోని కొన్ని గ్రామాలలో కల్తీకల్లు తయారు కావడం గమనార్హం. గ్రామాలలో తయారయ్యే కల్తీకల్లులో అధిక మొత్తంలో విష పదార్థాలను వేయడం, దానికి అలవాటు పడిన వారంతా తెల్లవారే సరికి కల్లు దుకాణాలకు వెళ్లి సీసా బదులు రెండు సీసాల కల్లు సేవిస్తున్నారు. కల్లులో వేసే డైజోఫాంకు అలవాటు పడిన వారంతా అధిక మొత్తంలో సేవించి బస్టాండు, పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న వారి ఇళ్లముందు అపస్మారక స్థితిలో పడిపోతున్నారు. ఇలాంటి సంఘటనలు మండలంలో నిత్యకృత్యాలయ్యాయి.

అయినా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టకపోవడం వల్ల వారిపై ఎన్నో అనుమానాలకు దారి తావిస్తోంది. గతంలో కల్తీకల్లు సేవించి గ్రామంలో ఇద్దరు మృతి చెందినప్పటికీ వ్యాపారులపై అధికారులు ఏమాత్రం చర్యలు చేపట్టకపోవడం విచారకరం. కల్తీకల్లే అమ్మకాన్ని ధ్యేయంగా పెట్టుకొని కొంత మంది వ్యాపారులు మండల ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రస్తుతం గ్రామాల్లోనే కల్తీకల్లు తయారవుతోంది.

ఇదేమని ప్రశ్నిస్తే తమ బతుకులు ఈకల్తీకల్లు మీదనే ఆధారపడ్డాయని వ్యాపారులే అనడం గమనార్హం. గ్రామాలలో అమ్మే కల్లు దుకాణాలు గ్రామాల మధ్య, చివరన ఉంటున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కల్లు దుకాణాలు అపరిశుభ్రంగా ఉంటున్నాయి. సీసాలపై ఈగలు, దోమలు వాలుతున్నాయి. ఈగలు వాలిన కల్లు సేవిస్తే అతిసార వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి గ్రామాలలో తయారయ్యే కల్తీకల్లు వ్యాపారులపై చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా‚ ఉంది.

క్యాట్‌ఫిష్‌ అక్రమసాగుపై కొరడా


గద్వాల: గద్వాల మండల పరిధిలోని లత్తిపురం గ్రామంలో కొన్నేళ్ళుగా కొనసాగుతున్న క్యాట్‌ఫిష్‌ అక్రమ సాగుపై అధికారులు కొరడా ఝులిపించారు. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే క్యాట్‌ఫిష్‌ పెంపకాన్ని ప్రభుత్వం నిషేధించినా లత్తిపురం గ్రామంలో కొన్ని సంవత్సరాల నుంచి కృష్ణా జిల్లావాసులు అక్రమంగా చేపడుతున్నారు. లత్తిపురం గ్రామంలో క్యాట్‌ఫిష్‌లను పెంచుతున్న విషయం తహసీల్దార్‌ మంజూర్‌అహ్మద్‌కు తెలిసింది. ఫిషరీష్‌ ఏడీ సాలమన్‌రాజు దృష్టికి ఆయన తీసుకెళ్లారు.

అక్రమ సాగుపై దాడులు….
లత్తిపురం గ్రామంలో 11చెరువుల్లో క్యాట్‌ఫిష్‌ అక్రమసాగు చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం ఫిషరీష్‌ డెవలెప్‌మెంట్‌ అధికారి సుజాత, తహసీ ల్దార్‌ మంజూర్‌అహ్మద్‌ సిబ్బందితో కలిసి ఆకస్మికదాడులు చేశారు. దాడులకు వెళ్తున్న సందర్భంలో మార్గమధ్యంలోనే క్యాట్‌ఫిష్‌ పిల్లలతో కూడిన లోడ్‌ను తీసుకెళ్తున్న వ్యాన్‌ను పట్టుకుని సీజ్‌ చేశారు. అనంతరం చెరువుల దగ్గరకు వెళ్లి పరిశీలించారు. ఫిషరీష్‌ డెవలప్‌మెంట్‌ అధికారి సుజాత చేపలను క్యాట్‌ఫిష్‌గా నిర్దారించారు. దాడులు చేసిన సమ యంలో చెరువుల యజమానులు లేరు. వారిస్థానంలో భార్యాపిల్లలు ఉన్నారు. 11చెరువుల్లో ఉన్న క్యాట్‌ఫిష్‌ విలువ సుమారు రూ. 50లక్షలు ఉంటుందని అంచనా వేశారు.

సబ్సీడీ ఎలా ఇచ్చారు…?
క్యాట్‌ఫిష్‌కు ఆహారంగా కోళ్ల, కోడి గుడ్ల వ్యర్థపదార్థాలను వేసి పెంచు తున్నారు. వీటిని ఆహారంగా తీసుకుంటే అనారోగ్యం పాలవుతారన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం క్యాట్‌ఫిష్‌ల పెంపకాన్ని నిషేధించిందిధి 11చెరువుల్లో క్యాట్‌ఫిష్‌ను పెంచుతున్న పెంపకం దారులకు మత్స్యశాఖ హెక్టార్‌కు రూ. 80వేల సబ్సీడీ ఇచ్చింది. సబ్సీడీ ఇచ్చే సమయంలో మత్స్యశాఖ అధికారులు చెరువులను, చేపలను తనిఖీ చేయాల్సి ఉంటు ంది. ఇవేమీ చేయకుండానే సబ్సీడీలను ఇచ్చింది. వీటికి తోడు దాడులు చేసే సమయంలో చెరువుల యజమానులు లేకపోవడంపట్ల మత్స్యశాఖ అధికారులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కఠిన చర్యలు తప్పవు….
క్యాట్‌ఫిష్‌ను అక్రమంగా సాగుచేసేవారిపై కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్‌ మంజూర్‌అహ్మద్‌ హెచ్చరించారు. ప్రభుత్వం నిషేధించిన క్యాట్‌ఫిష్‌ను సాగుచేస్తే చర్యలు తీసుకుం టామన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవహరి స్తామన్నారు.

కల్వకుర్తిలో మావోయిస్టుల సంచారం?


కల్వకుర్తి (మహబూబ్‌నగర్‌ జిల్లా): కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ, మాడ్గుల మండలాల్లో మావోయిస్టు దళ సభ్యులు సంచరిస్తున్నట్లు పలు గ్రామాలనుండి సమాచారం… ఇటీవల మావో యిస్టు జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిం చిన బొంత పార్వతమ్మ అలియాస్‌ స్వర్ణక్క నేతృత్వంలో పది మంది సభ్యులు గల దళం కల్వకుర్తి నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలలో తమ కార్యకలాపాలను విస్తృత పర్చు కునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలిసింది. వెల్దండ మండలం అజిలాపూర్‌ గ్రామ వ్యవసాయ పంట పొలాల్లో వారం క్రితం మావోయిస్టు సానుభూతి పరులతో సమావేశం నిర్వహించి పార్టీ స్థితి గతుల గురించి చర్చించినట్లు వాదనలొస్తున్నాయి.

నల్లమల ప్రాంతంలో పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతుండటంతో మావోయిస్టులు మైదాన ప్రాంతాలను సేఫ్‌జోన్‌గా ఎంచుకొని తమ టార్గెలను పూర్తి చేసుకునేందుకు కసరత్తులు ప్రారంభించినట్లు వినికిడి.బొంత పార్వతమ్మ గతంలో కల్వకుర్తి ప్రాంతంలో మావోయిస్టు కార్యకలపాలు నిర్వహించిన అనుభవం ఉండటంతోనే ఆమె కల్వకుర్తి ప్రాంతంలో మావోయిస్టు పార్టీని బలోపేతం చేసే అవకాశాలున్నాయని మావోయిస్టు సానుభూతి పరులు విలేకరులకు తెలిపారు. అయితే పది మంది గల దళం విడిపోయి ఇద్దరు ముగ్గురు సభ్యులుగా యాక్షన్‌ టీంలను ఏర్పాటు చేసుకొని గ్రామాలలో సంచరిస్తున్నారని సమాచారం. మావోయిస్టులు తమ ఉనికిని చాటుకోవడానికి చాపకిందినీరులా పార్టీ బలోపేతానికి పాటుపడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కొంత కాలంగా కల్వకుర్తి నియోజకవర్గంలో వారి కార్యకలాపాలు తగ్గుముఖం పట్టడంతో పల్లెప్రాంతాలు ప్రశాంతంగా వున్నాయి. కాగా ఇటీవల మళ్లీ మావోయిస్టు యాక్షన్‌ టీం కదలికలు మొదలు కావడంతో నియోజకవర్గంలో అలజడలు రేగే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.