జీరో సైజులో సంజన సంతోషం!


”కన్నడ రంగానికి చెందిన ఏ తారకైనా ఆ కోరిక ఉంటుంది. నాకూ ఆ కోరిక ఉంది” అంటోంది బెంగళూరు బ్యూటీ సంజన. ఇంతకీ ఆ కోరిక ఏమిటీ అనుకుంటున్నారా? ఆ విషయానికే వస్తున్నాం. కన్నడ రంగంలో డాక్టర్ రాజ్‌కుమార్‌కి నటుడిగా ఓ విశిష్టమైన స్థానం ఉంది. పాత తరం నాయికలు ఎంతోమంది రాజ్‌కుమార్‌ సరసన జతకట్టారు. నేటి తరం నాయికల్లో చాలామంది రాజ్‌కుమార్‌ తనయుల సరసన సినిమా చేయడం తమ అదృష్టంగా భావిస్తారు.

అలా అనుకునే వారిలో సంజన ఒకరు. కన్నడ రాజ్‌కుమార్‌ తనయుడు శివరాజ్‌కుమార్‌ సరసన ఆమె ఓ చిత్రంలో నటిస్తున్నారు. దీని గురించి చెబుతూ ”కన్నడంలో రాజ్‌కుమార్‌గారిది చాలా పెద్ద ఫ్యామిలీ. ఆయన తనయుడి సరసన నటించాలనే నా కోరిక తీరడం ఆనందంగా ఉంది” అని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మడు. ఇంకో విషయం ఏంటంటే.. ఈ చిత్రంలో కొత్త లుక్‌లో కనిపించి అలరించబోతున్నానంటూ సెలవిచ్చింది. ఈ మధ్యకాలంలో ‘జీరో సైజ్‌’ ట్రెండ్‌ నడుస్తోంది కదా.

బహుశా ఆ ట్రెండ్‌కి అనుగుణంగా ఉండాలనే ఉద్దేశంతో సంజన జీరో సైజ్‌కు మారినట్లుంది. ఈ కొత్త లుక్‌ అందరికీ నచ్చుతుందనే నమ్మకాన్ని వ్యక్తపరిచారామె. శివరాజ్‌కుమార్‌ సరసన చేస్తున్న సినిమా కాకుండా ఆమె రవీంద్ర దర్శకత్వంలో ఓ కన్నడ సినిమా చేస్తున్నారు. మలయాళంలో అంగీక రించిన చిత్రం షూటింగ్‌ జూన్‌లో ఆరంభం కానుంది. కేరళలో ఇది ఆమెకు తొలి చిత్రం. తెలుగులో కూడా అవకాశాలు ఉన్నాయని, అధికారికంగా ఒప్పందం కుదిరిన తర్వాత ఆ చిత్రాల గురించి చెబుతానని సంజనా అన్నారు.

Advertisements

సినీ వాణిజ్యంలో మనదే సింహభాగం!


భారతదేశంలో జరుగుతున్న మొత్తం సినీ వాణిజ్యంలో సింహభాగం దక్షిణాదిదే. ఈ నిజాన్ని అంగీకరించడానికి బాలీవుడ్ వాణిజ్య వర్గాలు అంగీకరించవేమో గానీ, వాస్తవంలో మాత్రం దీన్ని ఎవరూ కాదనలేరు. దేశంలోని మొత్తం సినీ పరిశ్రమ ఆదాయంలో నాలుగింట మూడొంతుల వాటా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలదే. 2008-09లో ఈ నాలుగు దక్షిణాది భాషా చిత్రాలు రూ.1,700కోట్ల పైగా ఆదాయం ఆర్జించాయి. సాధారణంగా దక్షిణాది చిత్రాల మొత్తం ఆదాయాల్లో తెలుగు, తమిళ సినిమాల వాటా చెరి 45శాతం, మలయాళం 8శాతం, కన్నడ చిత్రాల భాగం సుమారు 2శాతం వుంటోంది.

మొత్తం హిందీ చిత్ర పరిశ్రమ నిర్మించే చిత్రాల కన్నా తెలుగులో తయారయ్యే సినిమాలే అత్యధికం. ఎర్న్ స్ట్ అండ్ యంగ్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ), ఇండియన్ ఎంటర్ టైన్మెంట్ డౌన్ సౌత్ సంస్థలు కలిసి తయారుచేసిన నివేదిక ప్రకారం గత ఏడాది 230 తెలుగు సినిమాలు రిలీజయ్యాయి. ఇక దేశంలోని థియేటర్లలో సగభాగం దక్షిణాదిలోనే వున్నాయి.

దక్షిణాదిన సినిమాల నిర్మాణం స్ర్కిప్ట్ నుంచి స్ర్కీన్ దాకా ఓ క్రమశిక్షణతో సాగిపోతుంది. గడిచిన అయిదేళ్ళుగా దక్షినాది చిత్రాలు ఓ రకంగా భారతీయ ఫిల్మ్ ఇండస్ట్రీని కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. లేటెస్ట్ టెక్నాలజీలు, యానిమేషన్, స్పెషల్ ఎఫెక్ట్ లు ఉపయోగించుకోవడంలోనూ సౌత్ సినీ ఇండస్ట్రీ ముందుంటోంది.

ఆస్కార్ను అందుకున్న ఎ.ఆర్.రెహమన్, రసూల్ పొకుట్టి కూడా దక్షిణాది వారే. సౌత్ సినిమాలంటే రజనీకాంత్ స్టయిల్స్, క్విక్ గన్ మురుగన్ తరహా పాత్రలేనని మిగతా ప్రాంతాల వారు అనుకున్నా బాక్సాఫీసు దగ్గర కాసులు రాబట్టుకోవడంలో ఈ చిత్రాలే ముందుంటున్నాయి.

సినిమా విడుదల హక్కులను పరిశ్రమ గట్టిగా నియంత్రించడం దక్షిణాది చిత్రాల విజయంలో ప్రధాన పాత్ర పోషిస్తోందని ఎర్న్ స్ట్ అండ్ యంగ్ కి చెందిన ఫారుఖ్ బర్సాలా అభిప్రాయపడ్డారు. పైరసీ సంగతి పక్కనపెడితే సినిమా విడుదలైన ఏడాది దాకా టీవీల్లో ప్రసారం కాకుండా జాగ్రత్త పడతాయి కాబట్టి థియేటర్ల కలెక్షన్లు ఎక్కువగా వుంటాయని ఆయన విశ్లేషించారు.

2008-09లో వచ్చిన రూ.1,700కోట్ల ఆదాయంలో రూ.1,300కోట్లు దేశీయంగా థియేటర్ల కలెక్షన్ల ద్వారానే రావడం దీనికి ఊతమిస్తోంది. దక్షిణాది పరిశ్రమ వ్యాపార ధోరణిని కూడా మార్చుకుంది. కోటి, రెండు, మూడు కోట్ల బడ్జెట్ సినిమాలనుంచి ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తోంది. ఈ ప్రభావం కలెక్షన్లమీద కూడా కనిపిస్తోంది. రూ.7కోట్లపైగా బడ్జెట్ తో తీసిన సినిమాలపై ఆదాయం గతంలో 45శాతం దాకా వుండగా, ప్రస్తుతం 65శాతం వుంటోంది. దేశంలోని మిగతా ప్రాంతాల్లో పంపిణీ తక్కువే అయినా, ఈ సినిమాలు దక్షిణాదిలోని పొరుగు రాష్ట్రాల్లో కూడా మంచి కలెక్షన్లనే సాధించుకోగలుగుతున్నాయి.

తమిళ సినిమాల ఆదాయంలో నాలుగోవంతు పొరుగు రాష్ట్రాల నుంచే వుంటోంది.

దక్షిణాది సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి ఆదరణ దక్కించుకోగలిగే సామర్థ్యం వుందని బల్సారా చెప్పారు. అయితే, థియేటర్ కలెక్షన్ల విషయంలో పారదర్శకత లేకపోవడం, తరచూ టికెట్ ధరలు పెంచడం అడ్డంకులని ఆయన అభిప్రాయపడ్డారు. సెన్సార్ బోర్డు ఆమోదం పొందిన తర్వాత కూడా వివిధ కారణాల వల్ల 35శాతం సినిమాలు విడుదల కావన్నారు. దీనికితోడు తారల పారితోషికం ఆకాశాన్నంటుతుండడంతో బడ్జెట్ లు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.

పి.టి.నాయుడు.