బొమ్మిరెడ్డి కప్పదాటు రాజకీయం


నెల్లూరు: ప్రజారాజ్యంపార్టీకి రాజీనామా చేయడం ద్వారా ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి మరోమారు కప్పదాటు రాజకీయాలకు తెర తీశారు. అనంతసాగరం జడ్పీటిసి సభ్యుడుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన బొమ్మిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే బొమ్మిరెడ్డి సుందర్‌రామిరెడ్డి కుమారుడు. బొమ్మిరెడ్డి కుటుంబం అనాదిగా ఆనం వర్గానికి నియోజకవర్గంలో అండదండలు అందిస్తూ నమ్మిన భంటులా పని చేస్తోంది. ఈ క్రమంలోనే అప్పటి ఆనం చెంచు సుబ్బారెడ్డి (ఎసి సుబ్బారెడ్డి)ని అటు తర్వాత అదే కుటుంబానికి చెందిన ఆనం సంజీవరెడ్డిని ఆత్మకూరు నుంచి ఎమ్మెల్యేలుగా గెలిపించడంతో బొమ్మిరెడ్డి సుందర్‌రామిరెడ్డి కుటుంబం కీలక పాత్రను పోషించింది. ఆనం కుటుంబం తమ రాజకీయ పరపతిని రాఫూరు, నెల్లూరు, నెల్లూరు రూరల్‌ ఇలా జిల్లా వ్యాప్తంగా విస్తరించడం వల్ల తమకు ముఖ్యఅనుచరుడైన బొమ్మిరెడ్డి సుందర్‌రామిరెడ్డిని తన వారుసుడుగా ఆత్మకూరు ఎమ్మెల్యేగా పోటీ చేయించి ఆనం కుటుంబం గెలిపించింది. అప్పటి నుండి డాక్టర్‌ బొమ్మిరెడ్డి సుందర్‌రామిరెడ్డి కుటుంబం కాంగ్రెస్‌లో పూర్తిగా మమేకమై పని చేస్తోంది. ఈ క్రమంలోనే బొమ్మిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి అనంతసాగరం జడ్పీటిసిగా తొలుత కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అటు తర్వాత జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు జడ్పీటిసి పదవికి కూడా రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ మద్ధతుతో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అప్పట్లో పార్టీ సీనియర్‌ నేత టివి శేషారెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేయగా కాంగ్రెస్‌పార్టీలోని ఒక వర్గం టివికి వ్యతిరేకంగా పని చేయడం, తెలుగుదేశం బొమ్మిరెడ్డి రాఘవేందర్‌రెడ్డికి పరోక్షంగా సహకరించడం వల్ల బొమ్మిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి ఎమ్మెల్సీగా గెలుపొందారు. బొమ్మిరెడ్డి రాఘవేందర్‌రెడ్డిని తెలుగుదేశంలోకి చేర్చుకోవడానికి ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్‌రెడ్డి విఫలయత్నం చేశారు. కారణాలు ఏమైనా బొమ్మిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి తెలుగుదేశంలో చేరడానికి తొలుత నిర్ణయించి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని కలిసి కూడా చివరి క్షణంలో తన నిర్ణయాన్ని విరమించుకున్నారు. అటు తర్వాత కొత్తగా పార్టీ పెట్టిన ప్రజారాజ్యంలో ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. పార్టీ బొమ్మిరెడ్డిని జిల్లా కన్వీనర్‌గా నియమిస్తూ ఎన్నికల్లో గురుతర బాధ్యతలను అప్పగించింది. ఎన్నికలకు మూడు నెలల ముందు కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టడంతో పాటు ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్లు కేటాయింపులో సైతం కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో ఆయన తెలుగుదేశాన్ని అధికారంలోకి రానీయకుండా పీఆర్పీ అభ్యర్థులను ప్రయోగించడంలో కొంత విజయం సాధించారనే చెప్పాలి. ఈనేపథ్యంలోనే ఆత్మకూరు నియోజకవర్గంలో పీఆర్పీ ముస్లిం అభ్యర్థిని కాంగ్రెస్‌తో కుమ్మకైయేందుకు కీలక పాత్ర పోషించడం ద్వారా అక్కడి నుంచి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కొమ్మి లక్ష్మయ్యనాయుడును ఓడించడంలో కీలక పాత్ర పోషించారు. చిత్రమేమిటంటే బొమ్మిరెడ్డి రాఘవేందర్‌రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించడంలో టిడిపి అభ్యర్థి బొమ్మి లక్ష్మయ్య నాయుడు విశేషంగా కృషి చేయడం గమనార్హం. కాగా అదే కొమ్మి లక్ష్మయ్య నాయుడును ఓడించడానికి బొమ్మిరెడ్డి కాంగ్రెస్‌తో కుమ్మకైన వైనం జిల్లాలో ఆ కుటుంబం యొక్క అవకాశ రాజకీయానికి అద్దం పట్టింది. ఇదంతా ఒక ఎతైతే అటు తర్వాత రాఘవేందర్‌రెడ్డి నెల్లూరు జిల్లాలో పీఆర్పీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కన్వీనర్‌ పదవికి రాజీనామా చేశారు. ఆదివారం నాడు పీఆర్పీ అధినేత చిరంజీవి నెల్లూరు జిల్లా అధ్యక్షుడుగా ఉంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డిని నియమించడంతో ఇక పార్టీలో తనకు విలువ లేదంటూ భావించిన బొమ్మిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి పీఆర్పీ పార్టీకి కూడా రాజీనామా చేశారు. ప్రజారాజ్యంపార్టీ సిద్థాంతాలు, సామాజిక న్యాయం తనకెంతో నచ్చాయని ఆరు నెలల ముందు ప్రజారాజ్యంలో చేరిన బొమ్మిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి ప్రజారాజ్యంపార్టీ ప్రజల మద్దతును కూడబెట్టడంలో విఫలమైందని, ఆ పార్టీ సిద్ధాంతాలను ప్రజలు నమ్మరని ఆరోపిస్తూ పార్టీకి రాజీనామా చేయడం గమనార్హం. ప్రస్తుతం బొమ్మిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం అందింది. ఏది ఏమైనా నేర రాజకీయాలకు వేదికగా చెప్పబడే నెల్లూరు జిల్లాలో బొమ్మిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి త్వరలో కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారన్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి.

Advertisements

ఔను! వాళ్లే జెండా పీకేశారు!!


ఏలూరు: ప్రజారాజ్యం పార్టీ అధినేత మెగాస్టార్‌ చిరంజీవి సొంత జిల్లాలోనే ఆ పార్టీ పరిస్థితి ఘోరంగా ఉంది. సెప్టెంబర్‌ 8న జరగనున్న రెండు జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పీఆర్పీ పోటీ చేయడానికి వెనుకంజ వేసింది. ఈ పరిణామం పీఆర్పీ భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకునేలా చేసింది. చిరంజీవి సొంత జిల్లాలోనే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం రాజకీయవర్గాల్లో తీవ్ర సంచలనాన్ని రేపింది. ద్వారకా తిరుమల, గణపవరం జడ్పీటీసీల ఉప ఎన్నికల సమరంలో పీఆర్పీ తలపడే పరిస్థితులు కరువయ్యాయి. పీఆర్పీకి చెందిన కోటగిరి విద్యాధరరావు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ పీఆర్పీ తరఫున పోటీ చేసేందుకు ఎవ్వరికీ ధైర్యం చాలడం లేడు. గణపవరం జడ్పీటీసీ ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ గెలుపు బాధ్యతను మంత్రి వట్టి వసంతకుమార్‌ భుజస్కందాలపై వేసుకున్నారు. ద్వారకా తిరుమలలో కూడా ఇదే తరహా బాధ్యతను ఆరోగ్య శాఖమంత్రి పితాని సత్యనారాయణ తీసుకున్నారు.
కాదు… కాదు…..
ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకే ఈ రెండు ఉప ఎన్నికలపైననే మంత్రుల భవిష్యత్‌ ఆధారపడి ఉన్నది. ఈ రెండు జడ్పీటీసీల ఉప ఎన్నికలను తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. రాజమండ్రి స్థానానికి పోటీచేసి ఓడిపోయిన మురళీమోహన్‌ తోపాటు మాజీమంత్రులు మాగంటిబాబు, కె.రామచంద్రరాజులు ఉప ఎన్నికల్లో టీడీపీ గెలిచే వ్యూహానికి పదునుపెట్టారు. మాగంటిబాబు ఏకంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడితే, ముఖ్యమంత్రి వైఎస్‌ మంత్రులిద్దరిని తొలగిస్తారా? అనే చర్చను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ పరిస్థితుల్లో పీఆర్పీ ఈ ఎన్నికల్లో తమ సత్తాను ఏ తరహాలో నిరూపించుకుంటుందో అన్న ఆసక్తి ప్రజల్లో నెలకొని ఉంది. అయితే నామినేషన్‌ల సమయంలో గణపవరం స్థానంలో పీఆర్పీ తరఫున పోటీకి ఎవ్వరూ ఇష్టపడలేదు. తెర వెనుకనుండి టీడీపీ అభ్యర్థి పి.నర్సింహరాజుకు సహకరించేందుకు పీఆర్పీ శ్రేణులు సిద్ధపడినట్లు సమాచారం అందుతున్నప్పటికీ ఆ వర్గం నేతలు కొందరు ఇప్పటికే రాష్ట్ర మంత్రి వసంతకుమార్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిపోయారు.
ఇక ద్వారకా తిరుమల స్థానంలో పీఆర్పీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన శ్రీనివాస్‌ ఆఖరి క్షణంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ రామచంద్రరాజు బావమరిది మేడవరపు అశోక్‌ జోక్యంతో రంగం నుండి తప్పుకున్నారు. మొత్తంమీద ఈ రెండు స్థానాల్లో టీడీపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరిగా తలపడే పరిస్థితికి ప్రజారాజ్యం పార్టీ కావడంతో పార్టీ భవిష్యత్‌పై ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ చర్య వ్యూహాత్మకమా? లేక ఆత్మస్థైర్యలోపమా? అన్న వాదన కూడా వినిపిస్తుండగా మొత్తంమీద పరిస్థితి చూస్తే సొంత జిల్లాలోనే చిరంజీవికి కష్టకాలం దాపురించినట్లు కనిపిస్తోంది. ఒకవర్గం నాయకులు తమ పార్టీని భూస్థాపితం చేయడానికి కుట్ర పన్నుతున్నారనే చిరంజీవి ఆరోపణల నేపథ్యంలో చర్చ సాగుతుండగా సొంత వర్గం నుండే ఆయనకు మెగా సహకారం రాకపోవడం విశిష్ట పరిణామంగా చెప్పుకుంటున్నారు.

ఆత్మవిమర్శ దిశగా పీఆర్పీ


నెల్లూరు: ప్రజారాజ్యంపార్టీ ఏర్పడి సంవత్సర కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్నికల నేపథ్యంలో ఏర్పడ్డ చేదు అనుభవాలను, సమస్యలను ఏకరువు చేసుకోవడంతో పాటు ఆ పార్టీ ఆత్మవిమర్శదిశగా అడుగులు వేస్తోంది. 2009 ఎన్నికల్లో పది అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక ఎంపి స్థానానికి పోటీ చేసిన ఆ పార్టీ కేవలం ఒక నెల్లూరు నగరంలో తప్ప మిగతా అన్ని నియోజకవర్గాలలో దారుణమైన ఓటమి చవి చూసిన విషయం తెలిసిందే. కొన్ని నియోజకవర్గాలలో డిపాజిట్లు కూడా దక్కకపోవడం గమనార్హం కాగా ఆ పార్టీకి చెందిన నాయకులంతా ఒక్కొక్కరు కనుమరుగు అయిపోవడం పార్టీని ఆందోళనకు గురి చేస్తోంది. మరో రెండు నెలల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనుండగా పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేసేందుకు పార్టీ కసరత్తు చేయడంతో పాటు పార్టీలో నెలకొన్న అంతర్గత విబేధాల మీద ఆత్మవిమర్శ చేసుకుంటుంది. ఇందులో భాగంగా మంగళవారం నాడు జిల్లా పీఆర్పీ చెందిన నాయకులంతా హైదరాబాద్‌లో సమావేశమై పార్టీ పటిష్ట పట్ల ఆలోచన చేసినట్లు సమాచారం. పార్టీ దాదాపుగా ఆర్థికంగా బలహీనమైపోవడంతో ఆందోళనలు, ధర్నాలు, ఇతర వాటిని నిర్వహించేందుకు, అలాగే పార్టీ కార్యకర్తలను నడిపించి ఆందోళనలో భాగస్వాములు చేసేందుకు నానా బాధలు అనుభవిస్తోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి పార్టీ కార్యకలాపాలకు స్వస్తి చెప్పి సొంత పనుల్లో నిమగ్నమైపోగా పార్టీకి పెద్ద దిక్కుగా చెప్పబడే ఆనం వెంకటరమణరెడ్డి తదితరులు అంటి అంటనట్లుగా వ్యవహరిస్తున్నారు. మూడు రోజుల క్రితం చిరంజీవి జన్మదినం సందర్భంగా నెల్లూరులో పర్యటించిన నాగబాబును నెల్లూరు నగర ఎమ్మెల్యే ఉంగమూరు శ్రీధర్‌ కృష్ణారెడ్డి, పార్టీ నాయకులు ఆనం వెంకటరమణారెడ్డి తప్ప మరెవ్వరూ కలవకపోవడం పార్టీ దయనీయ స్థితికి అద్దం పడుతుంది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఎస్సీ మహిళా కోటాలో పీఆర్పీ టికెట్‌ పొందిన తుపాకుల మున్నెమ్మ ఎన్నికలు ముగియగానే అంతోఇంతో కూడబెట్టుకుని తిరిగి తన సొంత పనుల్లో నిమగ్నమైపోయారు. దీంతో పది నియోజకవర్గాల నుంచి పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులను వారి అనుచర వర్గాన్ని ఉత్సాహపరిచి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేలా చేయాలని నాయకత్వం బావిస్తోంది. పార్టీ ఏర్పడి సంవత్సర కాలం అయిన సందర్భంగా గ్రామాలలో సాధాసీదాగాని జెండా కార్యక్రమాన్ని నిర్వహించాలని స్థానిక నాయకులకు ఆదేశాలు అందాయి. ఇదే సమయంలో పార్టీకీ వెన్నుదన్నుగా ఉన్న చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌, రాంచరణ్‌తేజా, అభిమాన సంఘాల నాయకులను, అభిమానులను పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనే దిశగా ప్రోత్సహించాలని చిరంజీవి భావించిన నేపథ్యంలో ఇటీవల జిల్లాలో పర్యటించిన నాగబాబు పార్టీ నాయకుల కంటే అభిమాన సంఘాల నాయకులు అధిక ప్రాధాన్యతనిచ్చారు. రాజకీయాల్లోకి రాకముందు చిరంజీవి అభిమాన సంఘాల నాయకులకు చిరంజీవి దృష్టిలో ఎంత విలువ ఇచ్చారో దాన్ని కొనసాగించడానికి పీఆర్పీ చేస్తున్న ప్రయత్నం గ్రామ స్థాయిలో ఏ మేరకు నెరవేరుతోందో వేచి చూడాల్సిందే.

కలంపై దాడి వెనుక.. కులం కోణం?


హైదరాబాద్‌: ప్రజా రాజ్యం పార్టీ నాయకత్వం హటాత్తుగా మీడియాపై దాడి చేయడం వెనుక కారణాలేమిటన్న చర్చ ఆ పార్టీ నాయకులలో మొదలయింది. సినీ పరిశ్రమలో ఉన్న సమయం నుంచి చిరంజీవికి, మీడియాకు ఘర్షణ జరుగుతోంది. కొన్ని సందర్భాల్లో పవన్‌ కల్యాణ్‌ సహా అభిమానులు పత్రికా కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించడం కొత్త కానప్పటికీ.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తొలిసారిగా స్వయంగా చిరంజీవి మీడియాపై విరుచుకుపడటం నేతల్లో చర్చకు కారణమయింది. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మరో అడుగు ముందుకేసి, ఆ వ్యవహారంలో సామాజికవర్గ కోణాన్ని ఆవిష్కరించడం ఆసక్తి కలిగిస్తోంది.

పాత ‘కాపు’ల కోసమేనా?
పీఆర్పీ నాయకత్వం మీ డియాపై దాడి ప్రారంభిం చడానికి కులం కోణమే కారణమన్న వాదన ప్రము ఖంగా వినిపిస్తోంది. ఎన్నికల తర్వాత పార్టీకి దూరమ యిన కాపులను తిరిగి దరి చేర్చుకునే లక్ష్యంతోనే పీ ఆర్పీ నాయకత్వం సామాజి కవర్గ విషయాన్ని ప్రము ఖంగా ప్రస్తావించినట్లు కనిపిస్తోంది. కోస్తాంధ్రలో ఎన్నికలు ముగిసిన తర్వా త పార్టీలో ఉన్న చాలా మంది కాపు నాయకులు, యువకులు వెనక్కి వెళ్లిపోయారు. కమ్మ సామాజికవర్గాన్ని ఎదు ర్కొనేం దుకు చిరంజీవి పనికి వస్తారని ఊహించిన కాపు నేతలు, ఆయ నలో అంతటి సా మర్థ్యం లేదని తె లుసుకుని ఫలి తాల తర్వాత పా ర్టీనుంచి నిష్ర్క మించారు. అ లాంటి వా రిలో ఎక్కు వ మంది కాంగ్రెస్‌లో, మిగిలిన వారు టీడీపీ లో చేరిపోయారు. ఈ నేపథ్యంలో తిరిగి కాపులను ఆకర్షించే ఎత్తుగడకు పీఆర్పీ నాయకత్వం ప్రయత్ని స్తోంది.

‘సామాజిక’ సమరం
పార్టీ కొద్దో గొప్పో బలంగా ఉందని భావిస్తున్న ఉభయ గోదావరి జిల్లాల్లోనే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నిర్వహించిన ధర్నా కార్యక్రమాలు అత్యంత పేలవంగా ముగియడం పార్టీ నాయకత్వాన్ని తీవ్ర నిరాశ పరిచింది. పార్టీకి పెట్టని కోటలా ఉంటారనుకున్న కాపులంతా వెనక్కి వెళ్లిపో వడంతో పార్టీ భవిష్యత్తు ఏమిటన్నది బోధపడిన పీఆ ర్పీ నాయకత్వం.. అందుకు ప్రత్యామ్నాయంగా మీడి యాపై విరుచుకుపడేందుకు సామాజికవర్గ కోణాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికల్లో ఓడిన తర్వాత మీడియాలో పార్టీ విధానాలపై వార్తా పత్రికల్లో పుంఖా నుపుంఖాలుగా విమర్శలు వెలువడినా పట్టించుకోని పీఆర్పీ, ఒక్కసారి హటాత్తుగా మీడియాపై విరుచుకు పడటానికి కారణం ఏమిటన్నది విశ్లేషిస్తే.. కమ్మ సామాజికవ ర్గాన్ని ఎదుర్కొనేందుకు పార్టీ నాయకత్వం మానసి కంగా సిద్ధమైనట్లే కనిపిస్తోందన్న వ్యాఖ్యలు పీఆర్పీ నేతల నుంచి వినిపిస్తున్నాయి. ఆ వర్గానికి వ్యతిరే కంగా తాము పోరాడుతున్నామన్న సంకేతా లిస్తే తప్ప దూరమయిన కాపులు దగ్గరకురారన్న అంచనాతోనే ఈ నిర్ణయానికి వచ్చారంటున్నారు.

భిన్నాభిప్రాయాలు…
అయితే, మారిన పార్టీ వైఖరిపై నేతల్లో భిన్నాభి ప్రా యాలు లేకపోలేదు. చిరంజీవి సినీ పరిశ్రమలో ఉన్న త స్థానానికి వెళ్లడానికి కమ్మ సామాజికవర్గమే ప్రధాన కారణమన్నది నిర్వివాదం. ప్రస్తుతం ఆయన తనయు డుతో సినిమాలు తీస్తున్న నిర్మాతలు ఆ వర్గానికి చెం దిన వారే. చిరంజీవి పక్కన ఎక్కువగా కనిపించేది ఆ సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో ఈ వ్యూహం ఎక్కువ కాలం కొనసాగ కపోవచ్చని పార్టీ లోని ఒక వర్గం చెబుతోంది. ఒకవేళ అదే జరిగితే కోస్తాలో కాపులను వ్యతిరేకించే బీసీ వర్గాలు కమ్మ వర్గంతో చేతులు కలిపితే అసలుకే ఎసరు వస్తుందం టున్నారు. అయితే, పార్టీ వ్యూహం సరై నదేనని, ఈర కంగానయినా పార్టీకి దూరమయిన కాపులు దగ్గరవు తారని మరికొందరు నే తలు అంచనా వేస్తున్నా రు. తమ పార్టీ వైఫల్యం కార ణంగా కాంగ్రెస్‌ వైపు చూస్తున్న కాపులను అటు వెళ్లకుండా అడ్డుకోవచ్చని చెబుతున్నారు.

మీడియా దూరమవడానికి కారణమేమిటి?
పీఆర్పీ స్థాపించక ముందు నుంచీ రాష్ట్రం లోని ప్రముఖ దినపత్రికలన్నీ చిరంజీవిని ఆకా శానికెత్తాయి. రాష్ట్ర రాజకీయ చరిత్రలో సునామీ సృష్టించిన ఎన్టీఆ ర్‌ తెలు గుదేశం పార్టీ స్థాపించకముందు ఆ స్థా యి ప్రచారం ఏ పత్రి కా ఇవ్వలేదు. అయితే, మీడి యా సహకారాన్ని సద్విని యోగం చేసు కోవడంలో తాము విఫలమయ్యామ ని, దానికి చిరంజీవి పక్కనుండే ఆత్మ బంధువే కారణమని సీని యర్లు విశ్లేషిస్తున్నారు. చిరుపై అభిమానం ఉన్నప్పటికీ ఆయన వల్లే మీడి యా పీఆర్పీకి దూరమయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తు న్నాయి. చిరు ఎక్కువ కాలం సినీ పరిశ్రమలో ఉన్న సమయంలో ఆయన వ్యవహారాలు చూసే సదరు ఆత్మబంధువు, మీడియా తమను ఆకాశానికెత్తేసే సగ టు సినీ పత్రికల మాదిరిగా, జర్నలిస్టులందరినీ సినీ జర్నలిస్టులుగా భావించి..

మీడియా అంతా చిరంజీ విని చూసి లాభపడుతోందన్న భ్రమలు చిరుకు కల్పిం చడం వల్లే ఈ చిక్కులొచ్చాయని చెబుతున్నారు. తాజాగా మీడియాపై దాడి వ్యవహారంలో ఆత్మబం దువు హస్తమే ఉందని పార్టీ నేతలు అను మానిస్తున్నా రు. ఈ వ్యవహారంలో పార్టీలోని మెజారిటీ నేతలు అసంతృప్తితోనే ఉన్నారు. పార్టీ కష్టాల్లో ఉంటూ, రోజుకొకరు వెళ్లిపోతున్న సమయంలో ఈవిధంగా మీడియాపై దాడి చేయడం వల్ల లాభం కన్నా నష్టాలే ఎక్కువగా ఉంటాయని స్వయంగా ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ‘ఈ క్లిష్ట రాజకీయ పరిస్థితిలో మీడియా సహకారం లేకపోతే మేమేమీ చేయలేము. పైగా ఇప్పుడిప్పుడే మేమంతా రాజకీ యాల్లో ఎదుగుతున్నాం. మీడియాకు వ్యతిరేకంగా వెళితే మా భవిష్యత్తేమిటో బాగా తెలుసు. అందుకే నిన్న ధర్నాకు వెళ్లలేద’ని పీఆర్పీ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించడం బట్టి.. మీడియాపై దాడుల విషయంలో వారి మానసిక పరిస్థితి ఏమిటన్నది స్పష్టమవుతూనే ఉంది.

చిరంజీవి జన్మదినోత్సవానికి భారీ ఏర్పాట్లు


నెల్లూరు: ఈనెల 22న ప్రజారాజ్యంపార్టీ అధినేత చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని చిరంజీవి అభిమాన సంఘాలు, చిరంజీవి సేవా సమితి, ప్రజారాజ్యంపార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన 55వ జన్మదినాన్ని పురస్కరించుకుని మధ్యాహ్నం ఒంటి గంటకు ఆర్‌ఆర్‌ వీధిలో పేదలకు అన్నదానం నిర్వహించనున్నట్లు చిరంజీవి అభిమాన సంఘాల నాయకులు ద్వారకా నాథ్‌ తెలిపారు. అలాగే ఆయన 55వ జన్మదినాన్ని పురస్కరించుకొని 55 కిలోల కేక్‌ను రూపొందిస్తున్నారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా చిరంజీవి సోదరులు నాగబాబు విచ్చేస్తున్నట్లు అభిమాన సంఘాల నాయకుడు తెలిపారు.

ఎంతమంది చనిపోతే స్పందిస్తారు: చిరు


హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎంతమంది రైతులు చనిపోతే ప్రభుత్వం కదలిక వస్తుంది, ఎన్ని పంటలు ఎండిపోతే స్పందిస్తారు అని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శాసనసభలో చిరంజీవి మాట్లాడుతూ ‘‘ప్రభుత్వం వెంటనే రాష్ట్రాన్ని కరవు రాష్ట్రంగా ప్రకటించాలి. ఆకలితో జనం నకనకలాడుంతంటే ప్రభుత్వం ఆలోచిస్తూ కూర్చోవడం సరికాదు. సత్వర చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనకాడుతున్నారు. అదే వచ్చే నెలలోనే ఎన్నికలుంటే ప్రభుత్వం ఇలా వ్యవహరించేదా?’’ అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని కరవు ప్రాంతంగా ప్రకటించి సత్వరమే రైతులను ఆదుకోవాలని కోరారు. రైతుల రుణాలు మాఫీ చేసి, కొత్త రుణాలు ఇవ్వాలని, పశుగ్రాసం ఉచితంగా పంపిణీ చేయాలని, పింఛన్లు వెయ్యి రూపాయలు ఇవ్వాలి డిమాండు చేశారు.

నెల్లూరు నుంచి ప్రజారాజ్యానికి ముప్పు


నెల్లూరు: ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రక్రియకు నెల్లూరులోనే బీజాలుపడ్డట్లు తెలుస్తూ ఉంది. పార్టీల మనుగడను శాషించే నెల్లూరు పాలిటిక్స్‌కు రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక స్థానం ఉంది. 1994లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు ప్రభుత్వాన్ని కూలద్రోసేందుకు నెల్లూరులోనే బీజాలు పడ్డాయి. రామారావుకు అత్యంత సన్నిహితుడైన అప్పటి నగర ఎమ్మెల్యే తాళ్లపాక రమేష్‌రెడ్డి రామారావు పెద్ద కూమారుడైన హరికృష్ణను, ఇతర కుటుంబ సభ్యులను తెరమీదకు తీసుకురావడం ద్వారా రామారావు ప్రభుత్వాన్ని కూలద్రోయడంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ప్రజారాజ్యంపార్టీని విలీనం చేసే ప్రక్రియలో నెల్లూరుకు చెందిన ఒక ఎమ్మెల్యే పార్టీలో మరో కీలకమైన వ్యక్తులు ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు నగర ఎమ్మెల్యే ఉంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి బుధవారం నాడు హైదరాబాద్‌లో మీడియాతో తాను చిరంజీవితోనే ఉంటానని, ఆయన పార్టీ మారితే మారతానని చేసిన వ్యాఖ్యలే ఇందుకు అద్దం పడుతున్నాయి. స్వతహాగా నెల్లూరులోని ఆనం వర్గానికి అత్యంత సన్నిహితుడుగా ఉంటూ వస్తున్న శ్రీధర్‌ కృష్ణారెడ్డి కారణాంతాల వల్ల రెండు సార్లు కౌన్సిలర్‌గా తెలుగుదేశం తరఫున ఎంపికయ్యారు. అటు తర్వాత కాలంలో పార్టీలో ఇమడలేక ఎన్నికల సమయానికి ప్రజారాజ్యంలో చేరి నెల్లూరు నగర ఎమ్మెల్యేగా కేవలం 90 ఓట్ల స్వల్ప మెజార్టీతో కాంగ్రెస్‌ అభ్యర్థి మీద గెలుపొందారు. కాంగ్రెస్‌ అభ్యర్థి టి. అనీల్‌కుమార్‌ ఓటమికి పరోక్షంగా ఆనం సోదరులే సహకరించడం ఉంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డికి కలిసి వచ్చింది. ఈ నేపథ్యంలో గెలుపొందిన రోజు నుంచే ఆయన ఆనం పంచన చేరిపోయారు. ఇక ప్రజారాజ్యం జిల్లా అధ్యక్షుడు బొమ్మిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి (ఎమ్మెల్సీ)గా తెలుగుదేశం మద్దతుతో గెలుపొంది చివరి నిముషంలో ప్రజారాజ్యంలో చేరారు. ఆత్మకూరు మాజీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బొమ్మిరెడ్డి సుందర్‌రామిరెడ్డి కుమారుడైన రాఘవేందర్‌రెడ్డి కుటుంబానికి మొదటి నుంచి కాంగ్రెస్‌తోనే ఎక్కువ సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజారాజ్యం అధినేత చిరంజీవిని కాంగ్రెస్‌ వైపు మొగ్గేలా ప్రోత్సహించడంలో వీరిద్దరూ కీలక పాత్ర పోషించినట్లు సమాచారం అందుతుంది. మంత్రి ఆనం రాంనారాయణరెడ్డితో ఎక్కువగా సంబంధాలు నడిపే ఉంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి ఆనం సూచలన మేరకే ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు పథక రచన చేస్తున్నట్లు తెలుస్తోంది. సంచలన రాజకీయాలకు కేంద్రబిందువు అయిన నెల్లూరు జిల్లా రాజకీయ పార్టీలకు భవిష్యత్తు కల్పించడం, అలాగే పార్టీలను ప్రక్కదోవ పట్టించడంలో ఇక్కడి నాయకులు సిద్ధహస్తులు. ఈ క్రమంలో ఒక వేళ ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం అయితే అందులో నెల్లూరు జిల్లాది ప్రధానపాత్ర అని చెప్పడానికి సందేహించాల్సిన పని లేదు.