ఐదవ కాంటూరు వరకు కొల్లేరు అభివృద్ధికి ప్రణాళిక


ఏలూరు: పశ్చిమ గోదావరి, కృష్ణాజిల్లాల పరిధిలో గల కొల్లేరు మరోసారి వార్తల్లోకెక్కింది. గతంలో ఆనాటిముఖ్యమంత్రి డా వైఎస్‌ రాజశేఖరరెడ్డి సారధ్యంలో కొల్లేరు అభయారణ్య పరిధిని 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరు వరకు తగ్గించాలని కోరుతూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. అయితే ఆ ప్రతిపాదనలను కేంద్రం తిరస్కరించినట్లు విదితమవుతోంది. రాజధానిలో కొల్లేరు సరస్సుపై ముఖ్యమంత్రి రోశయ్య సమక్షంలో సమీక్షా సమావేశం జరిగింది.

అనంతరం రాష్ట్ర అటవీ శాఖామంత్రి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కొల్లేరు సంరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, 5వ కాంటూరు వరకు అభివృద్ధి చేస్తామని, అందుకోసం తక్షణ సాయంగా కేంద్రాన్ని రూ.665 కోట్లు విడుదల చేయాలని కోరాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. మరోవైపున కొల్లేరులో ప్రస్తుతం తవ్విన చేపల చెరువుల ధ్వంసానికి రంగం సిద్ధమైంది. త్వరలోనే మరోసారి ఈ ప్రక్రియ చేపట్టనున్నారు.

గతంలో జిల్లా కలెక్టరుగా లవ్‌ అగర్వాల్‌ బాధ్యతలు నిర్వహించిన సమయంలో సుప్రీంకోర్టు సాధికారిక కమిటీ ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున చేపల చెరువులు ధ్వంసం చేశారు. దీంతో కొల్లేరు ప్రాంతంలోని దళితులు, బిసిలు ఘోరంగా నష్టపోయారు. ముఖ్యంగా బిసి వర్గానికి చెందిన వడ్డీ కులస్తుల చెరువులు, బడా భూస్వాముల ఆధీనంలో ఉన్న లీజు చెరువులు ధ్వంసమయ్యాయి. మళ్ళీ అదే తరహాలో ఈ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు ముందు విచ్చలవిడిగా, నిబంధనలకు విరుద్ధంగా చేపల చెరువులు తవ్వారు. అనూహ్యరీతిలో ఎన్నికల్లో కొల్లేరు పెద్దలు అధికార కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. కానీ మళ్ళీ కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో వారు ఖంగుతిన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు ఇంకా మౌనంగానే ఉన్నారు.

ఈ దశలో మరోసారి చేపల చెరువులు ధ్వంసం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.మూడు కోట్లు మంజూరు చేసింది. మరో రూ.మూడు కోట్లు అవసరమవుతాయని కూడా అధికారులు అంచనా వేసి నివేదిక పంపినట్లు తెలిసింది. ఈ పరిస్థితిపై మంత్రి రామచంద్రారెడ్డి 5వ కాంటూరు వరకు కొల్లేరు అభయరణ్యాన్ని అభివృద్ధిపరచేందుకు కేంద్రాన్ని సహాయం కోరాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. దీనిని బట్టి గతంలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయం బుట్టదాఖలైనట్లు తెలుస్తోంది.

అంతేగాకుండా కొల్లేరును ప్రముఖ టూరిస్టు సెంటర్‌గా తీర్చిదిద్దడానికి ఒక ప్రైవేటు ఏజెన్సీకి లీజుకు ఇచ్చినట్లు తెలిసింది. ఈ విధంగా కొల్లేరు మరోసారి వార్తల్లోకొచ్చింది. ఈ పరిణామం కొల్లేరు ప్రాంత ప్రజలకు మింగుడుపడని సమస్యగా మారింది. ఏది ఏమైనా టూరిస్టు సెంటర్‌గా కొల్లేరును తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయిస్తే స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో అగ్ర ప్రాధాన్యం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. 5వ కాంటూరు వరకు అభివృద్ధి చేసే క్రమంలో కొల్లేరు స్థానిక ప్రజలను భాగస్వాములను చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

Advertisements

ఔను! వాళ్లే జెండా పీకేశారు!!


ఏలూరు: ప్రజారాజ్యం పార్టీ అధినేత మెగాస్టార్‌ చిరంజీవి సొంత జిల్లాలోనే ఆ పార్టీ పరిస్థితి ఘోరంగా ఉంది. సెప్టెంబర్‌ 8న జరగనున్న రెండు జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పీఆర్పీ పోటీ చేయడానికి వెనుకంజ వేసింది. ఈ పరిణామం పీఆర్పీ భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకునేలా చేసింది. చిరంజీవి సొంత జిల్లాలోనే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం రాజకీయవర్గాల్లో తీవ్ర సంచలనాన్ని రేపింది. ద్వారకా తిరుమల, గణపవరం జడ్పీటీసీల ఉప ఎన్నికల సమరంలో పీఆర్పీ తలపడే పరిస్థితులు కరువయ్యాయి. పీఆర్పీకి చెందిన కోటగిరి విద్యాధరరావు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ పీఆర్పీ తరఫున పోటీ చేసేందుకు ఎవ్వరికీ ధైర్యం చాలడం లేడు. గణపవరం జడ్పీటీసీ ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ గెలుపు బాధ్యతను మంత్రి వట్టి వసంతకుమార్‌ భుజస్కందాలపై వేసుకున్నారు. ద్వారకా తిరుమలలో కూడా ఇదే తరహా బాధ్యతను ఆరోగ్య శాఖమంత్రి పితాని సత్యనారాయణ తీసుకున్నారు.
కాదు… కాదు…..
ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకే ఈ రెండు ఉప ఎన్నికలపైననే మంత్రుల భవిష్యత్‌ ఆధారపడి ఉన్నది. ఈ రెండు జడ్పీటీసీల ఉప ఎన్నికలను తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. రాజమండ్రి స్థానానికి పోటీచేసి ఓడిపోయిన మురళీమోహన్‌ తోపాటు మాజీమంత్రులు మాగంటిబాబు, కె.రామచంద్రరాజులు ఉప ఎన్నికల్లో టీడీపీ గెలిచే వ్యూహానికి పదునుపెట్టారు. మాగంటిబాబు ఏకంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడితే, ముఖ్యమంత్రి వైఎస్‌ మంత్రులిద్దరిని తొలగిస్తారా? అనే చర్చను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ పరిస్థితుల్లో పీఆర్పీ ఈ ఎన్నికల్లో తమ సత్తాను ఏ తరహాలో నిరూపించుకుంటుందో అన్న ఆసక్తి ప్రజల్లో నెలకొని ఉంది. అయితే నామినేషన్‌ల సమయంలో గణపవరం స్థానంలో పీఆర్పీ తరఫున పోటీకి ఎవ్వరూ ఇష్టపడలేదు. తెర వెనుకనుండి టీడీపీ అభ్యర్థి పి.నర్సింహరాజుకు సహకరించేందుకు పీఆర్పీ శ్రేణులు సిద్ధపడినట్లు సమాచారం అందుతున్నప్పటికీ ఆ వర్గం నేతలు కొందరు ఇప్పటికే రాష్ట్ర మంత్రి వసంతకుమార్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిపోయారు.
ఇక ద్వారకా తిరుమల స్థానంలో పీఆర్పీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన శ్రీనివాస్‌ ఆఖరి క్షణంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ రామచంద్రరాజు బావమరిది మేడవరపు అశోక్‌ జోక్యంతో రంగం నుండి తప్పుకున్నారు. మొత్తంమీద ఈ రెండు స్థానాల్లో టీడీపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరిగా తలపడే పరిస్థితికి ప్రజారాజ్యం పార్టీ కావడంతో పార్టీ భవిష్యత్‌పై ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ చర్య వ్యూహాత్మకమా? లేక ఆత్మస్థైర్యలోపమా? అన్న వాదన కూడా వినిపిస్తుండగా మొత్తంమీద పరిస్థితి చూస్తే సొంత జిల్లాలోనే చిరంజీవికి కష్టకాలం దాపురించినట్లు కనిపిస్తోంది. ఒకవర్గం నాయకులు తమ పార్టీని భూస్థాపితం చేయడానికి కుట్ర పన్నుతున్నారనే చిరంజీవి ఆరోపణల నేపథ్యంలో చర్చ సాగుతుండగా సొంత వర్గం నుండే ఆయనకు మెగా సహకారం రాకపోవడం విశిష్ట పరిణామంగా చెప్పుకుంటున్నారు.

136 క్వింటాళ్ల బియ్యం పట్టివేత


ఏలూరు: కృష్ణా జిల్లానుండి, తూర్పుగోదావరి జిల్లాకు ఆక్రమంగా రవాణా అవుతున్న 136 క్వింటాళ్ల బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులు గురువారం ఏలూరులో పట్టుకున్నారు. బియ్యం విలువ 3 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ప్రజాపంపిణీ వ్యవస్థ కింద మంజూరైన ఈ బియ్యాన్ని లారీలో కృష్ణా జిల్లా విస్సన్నపేట నుంచి రవాణా చేస్తున్నారు. సమాచారం అందున్న జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధికారి కె. రంగాకుమారి సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఏలూరు బైపాస్‌ రోడ్డులో లారీని పట్టుకున్నారు. ఆనంతరం బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, లారీని సీజ్‌ చేశారు.

అవినీతి నిరోధక శాఖ అంటే హడల్‌


ఏలూరు: ఆశ అనేది మనిషిని ఎంతకైనా తెగింపజేస్తుంది. ఆశ పడడంలో తప్పు లేదు. కానీ, ఆ ఆశ ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తే ఆశపడ్డ వ్యక్తికి నిరాశ తప్పదు. ఇలాంటివే ఏసీబీకి పట్టుబడుతున్న కేసులు. ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ అధికారులను, ఉద్యోగులను గమనిస్తే దాదాపు అందరూ కొద్దిపాటి మొత్తానికి ఆశపడి తమ ఉద్యోగాలకు, జీవితాలకు ముప్పు కొనితెచ్చుకుంటున్నారు. ఇది స్వయంకృతాపరాధమే అని చెప్పవచ్చు. కేవలం లంచం సొమ్ము తీసుకుంటున్నప్పుడు పట్టుకోవడమే కాకుండా, అటువంటి వారు అక్రమంగా సంపాదించిన ఆస్తులపైనా అవినీతి నిరోధక శాఖ( ఎసిబి) దాడులు నిర్వహిస్తూ అక్రమార్కుల గుండెల్లో రైళ్ళు పరిగెట్టిస్తున్నారు.

ఇటీవల ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి ఎంతటి పెద్ద అధికారి అయినా అవినీతికి పాల్పడితే ఎసిబి అధికారులు ఉపేక్షించ వద్దని ఆదేశాలు జారీ చేశారు. కనుక ఎసిబి అధికారులు చిన్న చిన్న ఉద్యోగులను కాకుండా పెద్ద పెద్ద అవినీతి తిమింగళాల పై కూడా దృష్టి సారించాలి. కాగా జిల్లా వ్యాప్తంగా ఏసీబీ అధికారులు చేస్తున్న దాడులతో అక్రమార్కుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. ఇటీవలే ఏసీబీ డిఎస్పీగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన కె.సుదర్శన్‌రెడ్డి నేతృత్వంలో మొట్టమొదటి సారిగా జంగారెడ్డిగూడెం హాస్టల్‌ వార్డెన్‌ గొల్ల మరియరాజు ఇంటిపై శుక్రవారం దాడులను నిర్వహించి అరకోటి మేర అక్రమ ఆస్తులను గుర్తించారు.

గత ఏడాది కూడా అధికారులు దాడులు చేసి ఉన్నత స్థాయి అధికారులను పట్టుకోవడం జరిగింది. గత ఏడాదిలో ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డవారి వివరాలు పరిశీలిస్తే… 2008 జనవరి 23వ తేదీన చెట్లు నరికివేతలో నష్టపరిహారంగా వచ్చిన రూ.19వేలు 250లు మంజూరు చేసేందుకు రాజమండ్రి ట్రాన్స్‌మిషన్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ట్రాన్స్‌కో ఎఈగా పనిచేస్తున్న కె.కేశవ్‌ నల్లజర్ల సెంటర్‌లో రూ.మూడు వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఫిబ్రవరి 3వ తేదీన చాగ ల్లు తహసీల్దార్‌ డి.కోటేశ్వరరావు, 13వ తేదీన ఐటిడిఎలో మత్స్యశాఖ అధికారిగా పనిచేస్తున్న సంజీవరావు పట్టుబడ్డారు.

మే 2వ తేదీన ఏలూరు రేంజ్‌ ఫారెస్ట్‌ అధికారి ఎం.వి.వి. సత్యనారాయణమూర్తి, 16వ తేదీన పింఛను సొమ్ము ఇవ్వడానికి రూ.10వేలు లంచం డిమాండ్‌ చేసిన కొవ్వూరు సబ్‌ డివిజినల్‌ ట్రెజరీ అధికారి పి.రామశర్మ, 27వ తేదీన గుత్తేదారు నుంచి రూ.3వేలు లంచం తీసుకుంటున్న డిఆర్‌డిఎ అధికారి రాము పట్టుబడ్డారు. జూన్‌ 19వ తేదీన భీమడోలు పంచాయతీరాజ్‌ ఎఈ శ్రీనివాసరావు, 25వ తేదీన పెంటపాడు ఎస్‌ఐ షానవాజ్‌లు దాడుల్లో దొరికిపోయారు.

ఆదర్శ రైతులకు ఇచ్చే ప్రోత్సాహకాలు మంజూరుకు రూ.7వేల 500లు డిమాండ్‌ చేసిన పెనుమంట్ర వ్యవసాయాధికారి నేతల ఆంజనేయులు, నవంబర్‌ 5వ తేదీన రూ.రెండు వేల500లు లంచం తీసుకుంటున్న భీమవరం రూరల్‌ ఎస్‌ఐ జి.ఆర్‌.వి.వి.ఎస్‌.ఆంజనేయులు, 17వ తేదీన భూమి సర్వే చేసేందుకు రూ.రెండు వేల 500లు డిమాండ్‌ చేసిన జంగారెడ్డిగూడెం సర్వేయర్‌ యాదగాని వెంకటరమణ రూ.1500లు లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డారు.

ఇలా ఎంతో మంది అధికారులు ఎసీబీ దాడుల్లో పట్టుబడ్డారు. ఇక్కడ ఒక విషయం గమనిస్తే ఆశ్చర్యకరమైన విషయం బోధపడుతుంది. నెలనెలా ప్రభుత్వం నుంచి వేలాది రూపాయలను జీతభత్యాల కింద పొందుతున్న అధికారులు కేవలం కొద్దిపాటి మొత్తానికి ఆశపడి ఉద్యోగ జీవితానికి స్వయంగా నష్టపెట్టుకుంటున్నారు. ఏసీబీ దాడుల్లో పలువురు అధికారులు పట్టుబడుతున్నప్పటికీ, మిగితా అధికారుల్లో ఎటువంటి మార్పూ రాకపోవడం గమనించ దగ్గ విషయం. జిల్లాలో ఏసీబీ దాడుల్లో పట్టుబడి సస్పెండ్‌కు గురైన వారిలో అత్యధికంగా పెదవేగి మండలానికి చెందినవారు ఉన్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన పలువురు తహసీల్దార్లు, ఎంపీడీవోలు సస్పెండ్‌ అయ్యారు. అధికారుల్లో ఎప్పటికైనా మార్పు వస్తుందో? లేదో? ఆ పైవాడికే తెలియాలి.

కరవు వాత – ధరల మోత


ఏలూరు: జిల్లాలో ఒక వైపున కరవు పట్టిపీడిస్తుండగా మరోవైపున రోజురోజుకూ ఆకాశానికి అంటుతున్న ధరలతో సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికీ అరకొరగా వర్షాలు పడుతున్నప్పటికీ, మెట్ట ప్రాంతంలో ఖరీఫ్‌కు ఎటువంటి ప్రయోజనం లేదని, ఇదే వర్షాలు పది రోజుల క్రితం వచ్చి ఉంటే కాస్త ప్రయోజనం ఉండేదని రైతు నాయకులు పేర్కొంటున్నారు. గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో, జిల్లాలోనూ సకాలంలో వర్షాలు పడి, పంట దిగుబడి బాగా వచ్చినప్పటికీ, ఈ ఏడాది నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. ఈ కరవు ప్రభావం వల్ల రానున్న రోజుల్లో అన్ని రకాల వస్తువుల ధరలు మరింతగా పెరుగుతాయోమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

నిత్యావసర ధరల వస్తువుల ధరలు తగ్గించడానికి రాష్ట్ర మంత్రులతో కూడిన సబ్‌ కమిటీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. మంత్రులు కనీసం కొన్ని జిల్లాల్లో అయినా పర్యటించి వాస్తవ పరిస్థితి తెలుసుకుని, నిత్యావసర వస్తువులు బ్లాక్‌ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవడం మాని రాజధానిలో కూర్చుని సమీక్షలకే పరిమితమయ్యారు. జిల్లా అధికార యంత్రాంగం కిలో బియ్యం 20 రూపాయలకు, కంది పప్పు కిలో 61 రూపాయలకు విక్రయించడానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసింది. అయితే జిల్లాలోని 26 కేంద్రాల్లో పిఎల్‌ బియ్యం రకం కిలో 20 చొప్పున కేవలం తెల్ల కార్డు ఉన్న వారికి ఐదు కిలోలు చొప్పున మాత్రమే అందిస్తోంది.

అంతేకాకుండా కందిపప్పు కిలో 61 రూపాయల చొప్పున తెల్ల కార్డుదారులకు కుటుంబానికి ఒక కిలో చొప్పున ఒక ఏడాది పాటు అందివ్వడానికి భీమవరం, పాలకొల్లు, నరసాపురం, కొవ్వూరులలోని రైతుబజార్లలో, తాడేపల్లిగూడెం, తణుకు, జంగారెడ్డిగూడెం, నిడదవోలులో ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయించడానికి రంగం సిద్ధం చేసింది. అయితే జిల్లాలోని తెల్ల కార్డుదారులందరికీ బియ్యం, కందిపప్పు సరిపడినంతగా ఇవ్వడం లేదు. అంతేకాకుండా పంచదార ధర కూడా భారీగా పెరిగింది. ఆయిల్‌ ధరలు, కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ధరల నియంత్రణకు అక్కడక్కడా ఆకస్మిక దాడులకు అధికార యంత్రాంగం ప్రయత్నిస్తున్నా, వాస్తవానికి ధరలు తగ్గక ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఈ పరిస్థితులను అధిగమించడానికి, ప్రజలను కరవు రోజుల్లో ఆదుకోవడానికి , భవిష్యత్తులో కూడా నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా ఉండడానికి చిత్తశుద్ధితో ప్రభుత్వం, అధికార యంత్రాంగం కృషి చేయాలి.

నగరాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్‌ వాణీప్రసాద్‌


ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ ఎ.వాణీప్రసాద్‌ గురువారంనాడు ఏలూరు నగరంలో ఆకస్మికంగా పర్యటించారు. నగరంలో పలు డివిజన్‌లలో ఆమె సుడిగాలి పర్యటన జరిపారు. తెల్లవారుజామున మూడు గంటలకే నిద్రలేచిన కలెక్టర్‌ అధికారులకు ఎవ్వరికీ చెప్పకుండా నగరంలోని వివిధ ప్రాంతాలలో పర్యటించారు. ప్రధానంగా పారిశుద్ధ్య పరిస్థితిపై ఆమె ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నగర పాలక సంస్థ సిబ్బంది కొన్ని చోట్ల పారిశుద్ధ్యాన్ని సక్రమంగా మెరుగుపర్చకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర పాలక సంస్థ అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టించారు. శానిటరీ సిబ్బంది పారిశుద్ధ్యాన్ని సరిగ్గా మెరుగుపర్చకపోవడం పట్ల కార్పొరేట్‌ అధికారుల పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా నగరంలో డ్రైన్లు ఆక్రమణలకు గురైన విషయాన్ని ఆమె గుర్తించారు. ఆక్రమణలను తొలగించకుంటే బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు. భవిష్యత్‌లో డ్రైన్లను ఆక్రమించేవారిపై కేసులు నమోదుచే స్తామని హెచ్చరించారు. నగరాన్ని అన్నిరకాలుగా సుందరీకరణ చేయడానికి చర్యలు తీసుకోవాలని కమీషనర్‌ వెంకటేశ్వర్లను కలెక్టర్‌ ఆదేశించారు. కాగా కలెక్టర్‌ వాణీప్రసాద్‌ నగరంలోని ఒక పెట్రోల్‌ బంక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. టిష్యూ పేపర్‌తో పెట్రోల్‌ నాణ్యతను ఆమె పరిశీలించారు. వినియోగదారులకు సరఫరా చేసే పెట్రోల్‌, డీజిల్‌ కొలతలను పరిశీలించారు.

వర్షం రాకతో రైతుల్లో చిగురించిన ఆనందం


ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా గురువారంనాడు కురిసిన వర్షంతో తడిసి ముద్దయింది. తెల్లవారుజామునుంచి జిల్లావ్యాప్తంగా పలు చోట్ల ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి. పోలవరం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, చింతలపూడి, నవజల్ల వంటి మెట్ట ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల రైతులకు కొంత స్వాంతన లభించింది. జిల్లా కేంద్రమైన ఏలూరులో మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో హోరుగాలులతో కూడిన వర్షం పడింది. వేసవిని తలపించిన ఎండలతో అల్లాడిపోయిన నగరవాసులు నేటి వర్షంతో సేదతీరారు. అదేవిధంగా నర్సాపురం, తణుకు, భీమవరం ప్రాంతాల్లో ఒక మాదిరి వర్షం కురిసింది. కాగా ఇప్పటికే కరువు కారణంగా జిల్లాలో 42 వేల ఎకరాల్లో నారుమళ్లు ఎండిపోయాయి. మరో 30 వేల ఎకరాలకు సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. భారీ వర్షాలపై రైతులు పెట్టుకున్న ఆశలు ఇప్పటికే వమ్మయ్యాయి. దాంతో ప్రత్యామ్నాయ పంటలవైపు జిల్లాయంత్రాంగం రైతులను సన్నద్దం చేయగా కొద్దిపాటి వర్షాలు కురవడం ప్రారంభించాయి.