సీబీఐని రాజకీయప్రయోజనాలకు వాడుకోం ప్రధాని


న్యూఢిల్లీ: కేంద్రీయ దర్యాప్తుసంస్థ (సీబీఐ) రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోబోమని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ స్పష్టంచేశారు. లోక్‌సభలో కోత తీర్మానం సందర్భంగా ఎస్పీ, బీఎస్పీల మద్దతుకుతాము ప్రయత్నించలేదని ఆయన తెలిపారు. తనకు పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి మధ్య ఎలాంటి అభిప్రాయభేదాలు లేవన్నారు. స్పెక్ట్రం కుంభకోణానికి సంబంధించి సీబీఐ విచారణ పూర్తయిన అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు. దేశం ఎదుర్కొంటున్న అంతర్గతసమస్యల్లో నక్సలిజమే అతిపెద్ద సమస్యన్నారు.

Advertisements

సోనియాతో సమావేశమైన రోశయ్య


న్యూఢిల్లీ: రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశమయ్యారు. రాష్ట్రమంత్రివర్గ విస్తరణ, సంక్షేమ పథకాల తీరు, రాజ్యసభ ఎన్నికలు, పార్టీలో కొందరి ధిక్కారస్వరం.. తదితర అంశాలపై ఆయన సోనియాగాంధీతో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి వీరప్పమొయిలీ కూడా పాల్గొన్నారు. మధ్యాహ్నం ప్రధానమంత్రితో రోశయ్య సమావేశమనున్నారు.

రూ.60 వేల కోట్లతో సెయిల్‌ స్టీల్‌ ప్లాంట్‌


న్యూఢిల్లీ: పబ్లిక్‌ రంగ స్టీలు సంస్థ సెయిల్‌ ఇండియా జార్ఖండ్‌ రాష్ట్రంలో రూ.60,000 కోట్ల పెట్టుబడులతో కొత్త స్టీలు ప్లాంటును ఏర్పాటు చేయనుంది. దీంతో సెయిల్‌ సంస్థ వార్షిక స్టీలు ఉత్పత్తి సామర్థ్యం 2020 సంవత్సరానికి 60 మిలియన్‌ టన్నులకు చేర నుంది. త్వరలో నిర్మాణం కానున్న సమీకృత స్టీలు ఉత్పత్తి ప్రాజెక్టు రెండు దశలో పనులను చేపట్టనున్నామని ప్రభుత్వ అధికారులు తెలిపారు. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌ జిల్లాలోని సింధ్రీ ప్రాంతానికి చెందిన ఫెర్టిలైజర్‌ మిల్లుకు చెందిన స్థలంలో సెయిల్‌ సంస్థ స్టీలు ప్రాజెక్టు పనులను ప్రారంభించనుంది. తాజాగా సెయిల్‌ సంస్థ 12 మిలియన్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి కలిగిన ప్లాంటు ఏర్పాటుకై కేంద్ర కెమికల్‌ అండ్‌ ఫర్టిలైజర్‌ శాఖకు దరఖాస్తు ప్రతిపాదన కూడా చేసిందని అధికారులు అన్నారు.

ఈ ప్రతిపాదన ప్రకారం సెయిల్‌ సంస్థ 1.15 మిలియన్‌ టన్ను బొగ్గు లేదా గ్యాస్‌ ఆధారిత యూరియా ప్లాంటును ఏర్పాటు చేయనుంది. సెయిల్‌ సంస్థ ప్రస్తుతం దక్షిణ కొరియా స్టీల్‌ ఉత్పత్తి సంస్థ పొస్‌కోతో భాగస్వామ్యం ద్వారా రెండు స్టీలు ప్లాంట్ల ఏర్పాటుకై చర్చలు జరుపుతోంది. సుమారు రూ.15,000 కోట్ల రూపాయలతో దేశంలో స్టీలు ప్లాంటులను నెకొల్పనుంది. దీనికి అదనంగా అంతర్జాతీయ ఉక్కు దిగ్గజ సంస్థలైన కోబ్‌ స్టీల్‌, ఆర్స్‌లర్‌ మిట్టల్‌లతో కూడా సెయిల్‌ సంస్థ పలు బిజినెస్‌ వెంచర్‌లకై ప్రతిపాదించింది. విస్తరణ కార్యకలాపాలను సంస్థ ఇటీవల అధికం చేయడం విశేషం.

థాయ్‌లాండ్‌లో టాటా ప్యాసెంజర్‌ కారు


న్యూఢిల్లీ: ఆటోమోబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ సంస్థ థాయ్‌ల్యాండ్‌లో ప్యాసెంజర్‌ కారు విడుదలకు సన్నాహాలు మొదలు పెట్టింది. ఉత్తరదక్షిణ ఆసియా ప్రాంతంలో ఎకో కార్‌ ప్రాజెక్టును ప్రవేశపెట్టే క్రమంలో టాటా మోటార్స్‌ ఈ ప్రకటన చేసింది. సరైన పెట్టుబడులతో థాయ్‌ల్యాండ్‌ ప్రాంతంలో ఉత్పత్తిని ప్రారంభించనున్నామని, కొత్త ప్యాసెంజర్‌ కారు విడుదల ద్వారా సంస్థ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించనున్నామని టాటా మోటా ర్స్‌ అధికారి తెలిపారు. టాటా మోటార్స్‌ కొత్త ప్యాసెంజరు కారు విడుదల ఎప్పుడన్నది వెల్లడించకపోయినా, అధిక ఇంధన సామర్థ్యంతో రానుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. థాయ్‌లాండ్‌లో ఎకో కారు స్థానంలో లక్ష రూపా యల నానో కారునువిడుదల చేయడానికి టాటా సంస్థ యెచిస్తోంది.

గత ఏడాది థాయ్‌లాండ్‌ ప్రభుత్వ అధికారులు కూడా టాటా నానోకారు విడుదల కానుం దని ప్రకటించారు. భవిష్యత్‌లో టాటా మోటార్స్‌ సంస్థకు థాయ్‌లాండ్‌లో నానో కారును ఎకనామిక్‌ విభాగానికి కోసం విడుదల చేసే ఆలో చనలో ఉందని థాయ్‌ల్యాండ్‌ బోర్డు ఆఫ్‌ ఇన్‌వెస్ట్‌మెంట్‌ సెక్రటరీజనరల్‌ అట్‌ చాకా బ్రింబ్లే గత ఏడాది జూన్‌లో పేర్కొన్నారు. గత 2008 సంవత్సరంలో టాటా మోటార్స్‌కు థాయ్‌ల్యాండ్‌ ప్రభుత్వం ఎకో కారు ఉత్పత్తి కొరకై హరిత ఉత్పత్తి కేంద్రం నెలకొల్పేందుకు అమోదం తెలిపింది.

నార్కో విశ్లేషణ తప్పు: సుప్రీం


న్యూఢిల్లీ: అనుమానితుల విషయంలో నార్కో విశ్లేషణ, మెదడు శ్రేణి రేఖాచిత్రాలు, నిజాలను వెలికి కక్కించేందుకు తీసే పోలీగ్రాఫ్‌లు తప్పనిసరిగా వినియోగించటం అక్రమమని సుప్రీంకోర్టు బుధవారం తీర్పునిచ్చింది. ఇది దర్యాప్తు సంస్థలకు ఎదురు దెబ్బ కాగలదు. ఒక వేళ నిందితుడు స్వచ్ఛందంగా సహకరించింతే అలాటి పరీక్షలు చేయవచ్చని ఆ సమాచారాన్ని తదుపరి దర్యాప్తు కోసం వినియోగించుకోవచ్చని తెలిపింది.

కాగా అలాటి టెక్నిక్‌లను ఏ వ్యక్తిపై అయినా బలవంతంగా రుద్దరాదని అలా చేస్తే వ్యక్తిగత స్వాతంత్య్రాన్ని హరించటంతో సమానమవుతుందని ప్రధాన న్యాయమూర్తి కె.జి.బాలకృష్ణన్‌ నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ పేర్కొంది. ఒక నిందితుడికి గాని సాక్షికి గాని ఇలాటి పరీక్షలను బలవంతంగా చేస్తే రాజ్యాంగం లోని 203 అధికరణాన్ని ఉల్లంఘించినట్లేనని ఎవరూ కూడా తనకు తాను నేరానికి పాల్పడే చర్యలకు పాల్పడరాదని రాజ్యాంగం ప్రకారం ఇది నిషేధమని తెలిపారు.

పలువురు ఉన్నతస్థాయి వ్యక్తులపై దర్యాప్తు ఏజన్సీలు నార్కో విశ్లేషణ, బ్రెయిన్‌ మ్యాపింగ్‌, పోలీగ్రాఫ్‌ పరీక్షలు నిర్వహించిన నేపధ్యంలో ఈ తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది. నకిలీ స్టాంప్‌ పేపర్‌ కుంభకోణం ప్రధాన సూత్రధారి అబ్దుల్‌ కరీం తెల్గీ, నిథారీ హత్యానేరాల నిందితులు, ఆరుషి హత్య కేసు, కౌమార ప్రాయపు యువతి తల్లిదండ్రులపై ఇలాటి పరీక్షలు నిర్వహించారు. బెంచ్‌లోని ఇతర సభ్యులైన ఆర్‌.వి.రవీంద్రన్‌, దలవీర్‌ భండరీ , ఇలాటి దర్యాప్తు ప్రక్రియలను ఒక వ్యక్తిపై ప్రయోగించటం వల్ల చట్ట ప్రక్రియ కొనసాగేందుకు ఆటంకం కలుగుతుందన్నారు. ఒక వేళ నిందితుడి అంగీకారంపై ఇలాటి పరీక్షలు నిర్వహించినా ఆ పరీక్షా ఫలితాలను సాక్ష్యంగా ఆమోదించమని స్పష్టం చేశారు.

తిరుపతికి మెట్రో రైలు మంజూరు చేయండి


న్యూఢిల్లీ: కోట్లాది మంది భక్తుల ఆరాధ్యదైవం వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుపతి నగరంలో మెట్రోరైలు సౌకర్యం కల్పించాలని స్థానిక ఎంపీ చింతామోహన్‌ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ప్రధానికి ఓ లేఖ రాశారు. తిరుపతిలో జనాభా నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో అంతర్జాతీయస్థాయి రవాణా సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తిరుపతి నగర సమీపంలో కృష్ణపట్నం నౌకాశ్రయం, శ్రీహరి కోట అంతరిక్ష పరిశోధన కేంద్రం, ప్రతిపాదిత మన్నవరం బీహెచ్‌ఈఎల్‌-ఎన్‌టీపీసీ ప్రాజెక్టు, తిరుపతిలో అంతర్జాతీయస్థాయి రైల్వేస్టేషన్‌, విమానాశ్రయం, చెన్నై మహానగరం వంటివి ఉన్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. వీటన్నింటినీ కలుపుతూ, భక్తుల సౌకర్యార్థం మెట్రో రైలును మంజూరు చేయాలని ప్రధానిని కోరారు. తిరుపతిలో మెట్రో రైలు ప్రాజెక్టుపై దృష్టి సారించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి జైపాల్‌రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్యకు కూడా చింతామోహన్‌ విజ్ఞప్తి చేశారు.

యూపీ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు


న్యూఢిల్లీ: కాన్షీరాం విగ్రహాలు, స్మారకచిహ్నల ఏర్పాటులో యూపీ ప్రభుత్వానికి గట్టి దెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేయతలపెట్టిన కాన్షీరాం, అంబేద్కర్‌ విగ్రహాలు, స్మారకచిహ్నాల పనులను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశాలు జారీచేసింది. లక్నోలో జరుగుతున్న పార్కుల నిర్మాణం, విగ్రహాల ఏర్పాటు పనులను ఆరుగంటల్లో ఆపాలని, పనివాళ్లను అక్కడినుంచి తరలించాలని ఆదేశించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేశారు.