రూ.3 లక్షల ధాన్యం సీజ్‌


నెల్లూరు: కావలి నుంచి అక్రమంగా తరలిస్తున్న 3 లక్షల రూపాయలు విలువచేసే 552 బస్తాల ధాన్యాన్ని కావలి అధికారులు బుధవారం రాత్రి సీజ్‌ చేశారు. పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహశీల్దార్‌ శ్రీనివాస్‌రావు, మల్లికార్జున, ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావుల బృందం ఈ దాడులు నిర్వహించింది. దగదర్తి మండలం సున్నంబట్టి వద్ద బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం అందడంతో పౌరసరఫరాల అధికారులు ఈ దాడులు నిర్వహించారు. రెండు లారీల్లో ఉన్న ఈ బియ్యాన్ని జిలకరమసూరి బియ్యంగా గుర్తించారు. వీటిని ఒకటి కావలిలోని రైస్‌ మిల్‌కు, మరొకటి మెదక్‌ పట్టణానికి తరలిస్తున్నట్లు గుర్తించారు. వేబిల్లును, ఇతర ఎటువంటి నిబంధనలు లేకుండా వెళుతున్న ఈ బియ్యాన్ని అక్రమ రవాణాగా గుర్తించి సీజ్‌ చేశామని అధికారులు తెలిపారు.
ఇదిలాఉండగా గతంలో జాతీయ రహదారి మీద చిల్లకూరు వద్ద సుమారు రెండు కోట్ల రూపాయలు విలువచేసే 19 లారీల బియ్యాన్ని నెల్లూరు నగర డిఎస్పీ రాధికారెడ్డి సీజ్‌ చేయగా, రాజకీయ ఒత్తిళ్లకు జిల్లా ఉన్నతాధికారులు నిందితులకే సహకరించడం ద్వారా కోర్టు స్టేటో ఆ బియ్యం తిరిగి అక్రమ రవాణాదారులకే వసమయ్యాయి. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి సీజ్‌ చేసిన బియ్యం కూడా స్మగ్లర్లకే తిరిగి వెళ్లే అవకాశం ఉందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.

Advertisements

ఎర్రచందనం పట్టివేత


నెల్లూరు: ఇప్పటివరకు అటవీ ప్రాంతాల గుండా అక్రమ రవాణ జరుగుతున్న ఎర్రచందనం ఇప్పుడు ఏకంగా నిత్యం రద్దీగా ఉండే నెల్లూరు నగరం నుంచి స్మగ్లింగ్‌ జరుగుతుండడం అటవీశాఖ అసమర్థతకు అద్దం పట్టింది. నెల్లూరు నగరంలోని పలు లాడ్జీల్లో మకాం వేసి ఉన్న ఎర్రచందనం స్మగ్లర్లు, స్మగ్లింగ్‌ కోసం ఏకంగా నెల్లూరు నగరాన్నే ప్రధాన కేంద్రంగా చేసుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో జనసమర్ధం కలిగిన నెల్లూరు నగరంలో ఏసిఎం హైస్కూల్‌ కంపౌడ్‌లో సుమారు లక్షా 50 వేల రూపాయలు విలువచేసే 13 ఎర్రచందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎర్రచందనం రాపూరు, పోదలకూరు అడవుల నుంచి రవాణా అయినట్టు భావిస్తున్నారు. అయితే పొదలకూరు నుంచి, రాపూరు నుంచి, అటు తడ చెక్‌పోస్టు దాటించే అవకాశం ఉండగా నెల్లూరు నగరం గుండా ఏ ప్రాంతానికి తరలిస్తున్నారనే విషయమై అధికారుల్లో చర్చ మొదలైంది. ఈ దాడుల్లో నెల్లూరు అటవీ రేంజ్‌ అధికారి నయీం ఉద్దీన్‌, సెక్షన్‌ అధికారి తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి


నెల్లూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఆరు మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడినవారిని నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి… నెల్లూరుపాలెం నుంచి ఆత్మకూరు పట్టణంలోకి వస్తున్న ఆటోను, ఆత్మకూరు నుంచి ఉదయగిరికి వెళుతున్న ఆర్టీసీ బస్సు సెయింట్‌మెరి స్కూల్‌ వద్ద ఎదురుగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరణించిన ఆటోడ్రైవర్‌ రహంతుల్లా(32), కె.బాలకేశవులు(30) ఈ ప్రమాదంలో మృతిచెందగా, వీరిరువురూ ఎ.ఎస్‌.పేట మండలం పెద్దద్దిపురం గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. కె.భాగ్యలక్ష్మి(14) నెల్లూరు బొలినేని ఆస్పత్రిలో మృతిచెందింది. ఈమె ఎ.ఎస్‌.పేట మండలం చల్లపాడు గ్రామానికి చెందినదిగా పోలీసులు తెలిపారు. ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

నెమళ్లను వేటాడుతున్న వ్యక్తి అరెస్టు


శ్రీకాకుళం: ఒరిస్సాలోని పర్లకిమిడి పరిధిలో గల నారాయణాపూర్‌ వద్ద సోమవారం ఓ వ్యక్తి ఎనిమిది నెమళ్లతో పోలీసులకు పట్టుబడ్డాడు. వన్యప్రాణులైన ఈ నెమళ్లను అనధికారికంగా వేటాడి అక్రమంగా తీసుకుపోతుండడంతో అటవీశాఖ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి


శ్రీకాకుళం: జిల్లాలోని నర్సన్నపేట మండల పరిధిలో గల కోమర్పి కూడలి సమీపంలో 5వ నెంబర్‌ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళితే… ఇదే మండలంలోని పలు గ్రామాలకు చెందిన కొంతమంది దినసరి కూలీలు పనుల కోసం నడుచుకుంటూ వెళుతున్నారు. అదే సమయంలో నర్సన్నపేట నుంచి శ్రీకాకుళం వైపు వస్తున్న లారీ కోమర్తి కూడలి సమీపంలోకి వచ్చేసరికి ఒక్కసారిగా అదుపుతప్పి వారిపైకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో గుండువళ్లి గ్రామానికి చెందిన జలుమూరు అచ్చయ్య(50), లావలవలస గ్రామానికి చెందిన ఎచ్చర్ల జగన్‌(45)లు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను వెంటనే శ్రీకాకుళంలోని రిమ్స్‌ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించి నర్సన్నపేట పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

జిల్లాలో ముగిసిన ఐజీ పర్యటన


నెల్లూరు: జిల్లాలో పోలీస్‌స్టేషన్ల తీరు తెన్నులను పరిశీలించడానికి రెండు రోజుల పాటు జిల్లాకు విచ్చేసిన ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ కిషోర్‌కుమార్‌ పర్యటన ఆదివారం నాటితో ముగిసింది. వెంకటగిరి, నెల్లూరు నగరంలోని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లను పరిశీలించిన ఆయన చివరిగా ముఖ్యమంత్రి పర్యటన మీద సమీక్షా సమావేశాన్ని ఆదివారం రాత్రి అధికారులతో నిర్వహించారు. ముఖ్యమంత్రి పాల్గొనే రెండు కార్యక్రమాలకు అవసరమైతే పక్క జిల్లాల నుంచి మరింత సిబ్బందిని పిలిపించుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పర్యటనలో భద్రత కోసం చిత్తూరు, ప్రకాశం జిల్లాల నుంచి పోలీసు సిబ్బందిని నెల్లూరుకు పిలిపిస్తున్నారు. వీరంతా సోమవారం సాయంత్రానికి జిల్లా ప్రధాన కేంద్రంలో రిపోర్టు చేసుకోవాల్సి ఉంది. బుధవారం నాడు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటిస్తుండగా సోమవారం నుంచే పోలీసులను ఆయా ప్రాంతాలలో భద్రత కోసం నియమిస్తున్నారు. అంకులపాటూరులో స్టీల్‌ ఫ్లాంట్‌ ప్రారంభోత్సవంతో పాటు రచ్చబండ కార్యక్రమాలలో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటుండడంతో వేర్వేరుగా భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో పోలీస్‌ స్టేషన్ల తీరు బాగానే ఉందని అయితే కావలిలో విచ్చలవిడిగా జరుగుతున్న దొంగతనాల మీద దృష్టి సారించి ప్రజల ఇబ్బందులను తొలగించాలని ఐజీ కిషోర్‌కుమార్‌ జిల్లా ఎస్పీ బి.మల్లారెడ్డిని గత రాత్రి జరిగిన సమావేశంలో హెచ్చరించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఇటీవల నగర డిఎస్పీ రాధిక సీజ్‌ చేసిన 21 లారీల బియ్యానికి సంబంధించి పూర్తి వివరాలను ఈ సందర్భంగా ఆమె పై వచ్చిన రాజకీయ ఒత్తిడులను కిషోర్‌కుమార్‌ అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది.

ఎర్రచందనం పట్టివేత


నెల్లూరు: నెల్లూరు జిల్లాలో స్మగ్లింగ్‌ కార్యకలాపాలపై ప్రభుత్వం ఉక్కుపాదాన్ని మోపింది. అటవీ శాఖ ఛీఫ్‌ కన్జర్వేటర్‌ మురళీకృష్ణ శని, ఆదివారాల్లో జిల్లాలో జరిపిన పర్యటనలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. స్మగ్లింగ్‌ కార్యకలాపాల మీద పోలీసుల సహకారంతో నిరోధించాలని ఆయన చేసిన సూచనల ఫలితంగా తన్వాయి మండలం వెంకటరామరాజుపేట గ్రామ సమీపంలో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన సుమారు మూడు లక్షలు విలువ చేసే ఎర్రచందనం దుంగలను అటవీ శాఖ అధికారులు సోమవారం తెల్లవారు జామున స్వాధీనం చేసుకున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అటవీ శాఖ అధికారులు దాడులచేసి టాటా సుమోలో ఎర్రచందనం దుంగలను గుర్తించి సీజ్‌ చేశారు. రాపూర్‌ రేంజ్‌ అధికారి ఎన్‌.నాగేంద్రబాబు, అటవీ శాఖ సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు.