యుద్ధప్రాతిపదికన చర్యల్లో దిగిన సర్కారు


హైదరాబాద్: రాజకీయం, తీవ్రవాదం, వేర్పాటువాదం అన్నీ మరుగునపడిపోయాయి.. అటు జనంలోను, ఇటు సర్కారులోనూ ఇప్పుడంతా లైలా భయమే. తుపాను ముప్పు తీరాన్ని తాకడంతో.. సహాయచర్యలంటూ ప్రభుత్వం, ముందస్తుజాగ్రత్తల్లో జనం నిమగ్నమయ్యారు. సెలవు రద్దు చేసిమరీ అధికారులను పరుగుపెట్టిస్తోంది ప్రభుత్వం. వీలైనంత నష్టాన్ని తగ్గించడమే లక్ష్యంగా యుద్ధప్రాతిపదికన చర్యల్లో దిగింది సర్కారు. ఉత్తర, దక్షిణకోస్తాల్లో తుపాను అలజడి షురూ అవడంతో.. ప్రభుత్వం ముందే మేలుకుంది. సెక్రటేరియట్, కలెక్టరేట్లలో కదలిక కనిపించింది. స్వయంగా రంగంలో దిగిన ముఖ్యమంత్రి ఉన్నతాధికారులు, మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నెల్లూరు- శ్రీకాకుళం మధ్యనున్న తొమ్మిది జిల్లాల కలెక్టర్లు ఆన్‌లైన్లోకొచ్చి.. సహాయకచర్యలపై ఆదేశాలందుకున్నారు. తీవ్రత ఎక్కువగా వుండవచ్చని, తేలిగ్గా తీసుకోవద్దని సీఎం అధికారులను కోరారు. ప్రజలకు భరోసా కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.ఈనెల 25 వరకూ అధికారులందరికీ సెలవులు రద్దయిపోయాయ్. తుపాను పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడానికి స్పెషల్ కమిటీ ఒకటి నియమితమైంది. ముంపు ప్రాంతాల నుంచి RTC ప్రత్యేక బస్సులు నడపనుంది. బాధితులకు ఆహారం, ఇతర నిత్యావసర వస్తువులు అందించడానికి పౌరసరఫరా అధికారులు సమాయత్తమయ్యారు.

శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఉధృతి ఎక్కువగా కనిపించే అవకాశముంది కనుక.. అక్కడ 139 తుపాను షెల్టర్లు ఏర్పాటయ్యాయి. 224 లోతట్టు ప్రాంతాలను గుర్తించి.. వాటిపై ప్రత్యేక దృష్టి సారించారు టాస్క్‌ఫోర్స్ అధికారులు. కళింగపట్నం ఓడరేవులో రెండవ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ అయింది. ప్రతి జిల్లాలోనూ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి.. అత్యవసర సాయం కోసం ప్రజలకు టోల్‌ఫ్రీ నంబర్లను అందుబాటులో వుంచారు. తుపాను హెచ్చరికలతో ఉభయగోదావరి జిల్లాల్లో ఆందోళన నెలకొంది. భైరవపాలెం వద్ద ఓ ఫిష్షింగ్ బోట్‌ తప్పిపోయి.. 8 మంది మత్స్యకారుల ఆచూకీ కనబడక.. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం గాలింపు చర్యల్లో నిమగ్నమైంది. బాధిత కుటుంబాలను పరామర్శించిన కలెక్టర్ రవిచంద్ర, పొంచివున్న తుపాను ముప్పుపై కూడా సీరియస్‌గా స్పందిస్తున్నారు.

దక్షిణకోస్తాలోనూ అదే పరిస్థితి. రుతుపవనాల రాక, లైలా తుపానుల కారణంగా భారీవర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ లోతట్టు ప్రాంతాల్లో టూరేశారు. తీరంలోని మత్స్యకారులను చేపల వేటకు వెళ్లకుండా నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. తీరప్రాంతం తక్కువగా వున్న గుంటూరు లాంటి జిల్లాల్లోనూ అధికారులు అప్రమత్తమయ్యారు. దాదాపు అన్ని ఓడరేవుల్లోనూ డేంజర్ లైట్లే వెలుగుతున్నాయి. చేపల వేట ఆగిపోయింది. ఫిష్షింగ్ బోట్లన్నీ లంగరేసి రెస్ట్ తీసుకుంటున్నాయి. ప్రస్తుతానికి ఓ మోస్తరు వర్షంతో సద్దుచేయకుండా కనిపిస్తున్న రాష్ట్రంలో.. రేపు తెల్లారేసరికి తుపాను తీరం దాటితే.. సీను మారిపోయే ప్రమాదముంది. ముఖ్యంగా తీరప్రాంతం భారీగా నష్టపోవడం గ్యారంటీ అన్న హెచ్చరికల నడుమ.. బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు జనం.

Advertisements

జగన్‌ కోసం ఆందోళన ఉధృతం


నెల్లూరు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ కుమారుడు జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలన్న డిమాండ్‌ రోజు రోజుకు ఉధృతమవుతోంది. జిల్లాలో నలుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు గానూ సర్వేపల్లి శాసన సభ్యుడు ఆదాల ప్రభాకర్‌రెడ్డి తప్పించి మిగతా ఆనం రాంనారాయణరెడ్డి, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిలు జగన్‌కు బేషరతుగా మద్దతు ప్రకటించారు. సర్వేపల్లి ఆదాల ప్రభాకర్‌రెడ్డి ముఖ్యమంత్రి చనిపోయిన మొదటి రోజు నుంచే జగన్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సంతాప సభల్లో సైతం క్లుప్తంగా ప్రసంగిస్తున్న ఆయన జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలని ఎక్కడ కూడా వ్యాఖ్యానించిన దాఖలాలు లేవు. మంత్రి ఆనం రాంనారాయణరెడ్డికి తొలుత ఈ విషయంలో తీవ్రంగా వ్యాఖ్యలు చేసినప్పటికీ బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్నందు వల్ల జగన్‌ ముఖ్యమంత్రిత్వంపై ఒక వైపు మద్దతు ప్రకటిస్తునే మరో వైపు రోశయ్యకు విధేయుడుగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. కాగా ఆందోళన బాటలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. నాలుగు రోజుల క్రితం జగన్‌ను ముఖ్యమంత్రి చేయకపోతే తాను రాజీనామా చేస్తానని చంద్రశేఖర్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఉదయగిరి నియోజకవర్గంలోని పలు గ్రామాలు ఆందోళనలతో రగిలిపోతున్నాయి. నియోజకవర్గంలోని బసివినేని పల్లి, జంగాళ్లపల్లి గ్రామాలలో వందలాది మంది కార్యకర్తలు మంగళవారం నాడు ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించి రాజ్యసభ సభ్యుడు హనుమంతరావు వ్యాఖ్యలను నిరసిస్తూ దిష్టిబొమ్మలను కూడా దగ్ధం చేశారు. ఇదిలా ఉండగా ఆత్మకూరు నియోజకవర్గంలో సైతం కార్యకర్తలు ఉద్యమ బాట పట్టారు. ఈ నియోజకవర్గానికి మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు తెలుగుదేశం కొవ్వూరు శాసన సభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సైతం రాజీనామాలకు సిద్ధం కావడంతో కాంగ్రెస్‌ ఆందోళనకు మరింత బలాన్ని చేకూర్చినట్లు అయింది. గత మూడు నెలలుగా చంద్రబాబు నాయుడును వ్యతిరేకిస్తూ పార్టీని వీడిపోవాలని ప్రయత్నిస్తున్న నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సెప్టెంబర్‌ 2వ తేదీన అంటే ముఖ్యమంత్రి చనిపోయే రోజు గూడూరులోని ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ప్రారంభోత్సవం చేయాల్సిన ఎస్‌బిక్యూ కంపెనీ ప్రారంభోత్సవానికి కూడా హాజరయ్యారు. అయితే అదే రోజు ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో దుర్మరణం పాలవడం, తదితర నాటకీయ పరిణామాల నేపథ్యంలో నల్లపురెడ్డి కాంగ్రెస్‌లో చేరిక అర్థాంతరంగా నిలిచిపోయింది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తాను తెలుగుదేశంలో కొనసాగనని నిర్ణయించుకున్న నల్లపురెడ్డి జగన్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కోసం రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. ముఖ్యమంత్రి మరణించిన తర్వాత జరిగిన మరణాలు సాధారణమైనవేనంటూ రాజ్యసభ సభ్యుడు హనుమంతరావు మంగళవారం నాడు చేసిన వ్యాఖ్యలను తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో యూత్‌కాంగ్రెస్‌ బుధవారం నుంచి భారీ ఉద్యమానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే హనుమంతరావు దిష్టిబొమ్మలను పలు చోట్ల తగులబెట్టగా బుధవారం నుంచి ఈ ఆందోళనను మరింత ఉధృతం చేయనున్నామని పిసిసి కార్యదర్శి కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలియజేశారు. అదే విధంగా జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ ఆందోళనను తీవ్రతరం చేసి జగన్‌ను ముఖ్యమంత్రిగా ప్రకటించేంత వరకు కొనసాగించాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి గ్రామాల వారీగా ఆందోళనలకు రూపకల్పన చేశారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు శాంతి భద్రతలను పరిరక్షించేందుకు పోలీసు బలగాలను వినియోగిస్తున్నారు.

శ్రీరిడి సాయి మహోసమాధి ఆరాధనోత్సవాల ప్రారంభం


నెల్లూరు: శ్రీరిడీ సాయిబాబా చనిపోయి 91 సంవత్సరాలు పురస్కరించుకుని ఆయన ఆరాధనోత్సవాలను నెల్లూరులో ఆదివారం నుంచి ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటలకు బిక్షాటన కార్యక్రమాలతో ఈ కార్యక్రమం స్థానిక స్థానిక సాయిబాబా మందిరం నుంచి ప్రారంభం అయింది. సాయిబాబాకు అష్టోతర శతనామాలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఆదివారం రోజంతా కొనసాగుతాయి. సోమవారం నాడు సాయిబాబాకు బంగారు పాపడంతో చేసిన కిరీటాన్ని అలంకరిస్తారు. ఆరోజున భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మంగళవారం నాడు నగర సంకీర్తనంతో పాటు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఈ ఉత్సవాలు ముగుస్తాయని పద్మావతి నగరంలోని సాయిబాబా దేవస్థానం చైర్మన్‌ మధుసూదన్‌రావు తెలిపారు.

వచ్చే నెల మూడున ఎస్‌.పి.బాలుకు మరుకూరు కోదండరామిరెడ్డి అవార్డు


నెల్లూరు: ప్రముఖ సాహితీవేత కళాప్రపూర్ణ మరుకూరు కోదండరామిరెడ్డి స్మారక అవార్డును ఈ ఏడాది ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యంకు ఇవ్వడానికి కోదండరామిరెడ్డి స్మారక అవార్డు కమిటి నిర్ణయించింది. ఈ మేరకు స్మారక అవార్డు కమిటి కార్యదర్శి శైలజ ఒక ప్రకటన చేస్తూ అక్టోబర్‌ 3 సాయంత్రం 6 గంటలకు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యానికి నెల్లూరులోని టౌన్‌ హాలులో ఈ అవార్డును ప్రదానం చేస్తారని తెలిపారు. ప్రపంచంలోనే అరుదైన నేపథ్య గాయకుడిగా ఖ్యాతి గడించిన ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యంకు ఉత్తమ సాహితీవేత విమర్శకుడు, దార్శినికుడు అయిన మరుకూరు కోదండరామిరెడ్డి సాహితీ అవార్డు ఇవ్వడం ఎంతైనా సముచితమని కమిటీ నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ రచయిత వెన్నెలకంటి రాజేశ్వరరావు అధ్యక్షత వహిస్తారని అన్నారు. నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, నగర ఎమ్మెల్యే శ్రీధర్‌కృష్ణారెడ్డితో పాటు పలువురు రచయితలు, గాయకులు, ప్రముఖులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

జగన్‌ కోసం పెరుగుతున్న ఒత్తిడి


నెల్లూరు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమారుడు జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలంటూ జిల్లా కాంగ్రెస్‌లో క్రమంగా ఒత్తిడి పెరుగుతోంది. సెప్టెంబర్‌ 4వ తేదీ నుంచి ఈ ప్రక్రియ జిల్లాలో ఊపందుకోగా ఆనం సోదరులు జగన్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రకటనలు చేయడంతో పాటు జగన్‌కోసం పదవి త్యాగానికి సిద్ధమంటూ తొలిసారిగా జిల్లాలో గళం ఎత్తారు. నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి జగన్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను ముఖ్యమంత్రి చేయకపోతే కాంగ్రెస్‌లో చీలిక వస్తుందని స్పష్టం చేసిన ఆయన తనతోపాటు 80 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారంటూ ప్రకటించారు. అటు తర్వాత కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో టెలికాన్ఫరెన్స్‌ను ఆనం ఆధ్వర్యంలోనే భగ్నం చేశారు. ఇంతటితో ఆగక శనివారం రాత్రి జరిగిన బహిరంగ సభలో వివేకానందరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అన్ని పార్టీల వారు జగన్‌కోసం తమ పదవులకు రాజీనామా చేస్తారంటూ ప్రకటించడం గమనార్హం. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, తన సోదరుడు ఆనం రాంనారాయణరెడ్డితో పాటు కోవ్వూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, పీఆర్పీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేందర్‌రెడ్డిలతో పాటు అన్ని పార్టీలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు జగన్‌కోసం తమ పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారంటూ స్పష్టమైన సాంకేతాలు ఇచ్చారు. పీఆర్పీ అధ్యక్షుడు ప్రస్తుత నగర ఎమ్మెల్యే ఉంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డిని ముఖ్యమంత్రి సంతాప సభలకు ఆహ్వానించడం ద్వారా పరోక్షంగా ఆయన్ను కూడా జగన్‌కోసం రాజీనామాలు చేయిస్తామని వివేకానందరెడ్డి పార్టీ అధిష్ఠానానికి స్పష్టమైన సాంకేతాలు పంపారు.

కాంగ్రెస్‌ దిశగా పీఆర్పీ నేతల అడుగులు


నెల్లూరు: అనుకున్నదంతా అయింది. శాసన సభ ఎన్నికల్లో తన ఉనికిని కోల్పోయిన ప్రజారాజ్యంపార్టీ నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నారు. శాసన సభ ఎన్నికల్లో జిల్లాలోని పది స్థానాలతోపాటు ఒక ఎంపి స్థానానికి కూడా పోటీ చేసిన పీఆర్పీ కేవలం ఒక్క నెల్లూరు తప్ప మిగతా అన్ని స్థానాల్లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అది కూడా ఆనం సోదరులు తన సొంత పార్టీ అభ్యర్థి అయిన నెల్లూరు నగరంలో అనీల్‌కుమార్‌కు వ్యతిరేకంగా పోటీ చేయడం వల్ల అది పరోక్షంగా పీఆర్పీ నగర అభ్యర్థి ఉంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డికి సహకరించి ఆయన 90 ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే కాంగ్రెస్‌లో నుంచి శాసన సభ ఎన్నికల్లో పీఆర్పీలో చేరిన వారంతా తిరిగి పాత గూటికే చేరడం ఎన్నికలు ముగియగానే ప్రారంభమైంది. కాంగ్రెస్‌ పీసీసీ ఉపాధ్యక్షులు వంకి పెంచలయ్య, సర్వేపల్లి మాజీ శాసన సభ్యుడు సీనియర్‌ నేత టి.వి.శేషారెడ్డితో పాటు పలువురు అనేక మంది సీనియర్లు ఎన్నికల్లో టికెట్‌ కోసం పీఆర్పీలో చేరగా వారంతా తిరిగి మళ్ళి కాంగ్రెస్‌ గూటికే వస్తున్నారు. గతంలో కాంగ్రెస్‌లో ఉండి అటు తర్వాత తెలుగుదేశం కౌన్సిలర్‌గా 9 ఏళ్ళ పాటు కొనసాగిన నెల్లూరు నగర ఎమ్మెల్యే ఉంగమూరు శ్రీధర్‌ కృష్ణారెడ్డి సైతం పార్టీ మారుతున్నట్లు ప్రకటించుకున్న ఆనం సోదరులతో కలివిడిగా తిరగడం ఆయన పరోక్షంగా కాంగ్రెస్‌లో ఉన్నట్లేనని పరిశీలకులు భావిస్తున్నారు. ఉంగమూరుశ్రీధర్‌కృష్ణారెడ్డి ఇటీవలె ప్రజారాజ్యంపార్టీ అధ్యక్షుడుగా పదవీ బాధ్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా ఎన్నికల్లో పీఆర్పీ అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు పోషించిన బొమ్మిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు నేరుగా ప్రకటించారు. వారం రోజుల క్రితం పీఆర్పీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన బొమ్మిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి త్వరలో తాను కాంగ్రెస్‌లో చేరి జగన్‌ ముఖ్యమంత్రిని చేయడానికి తన వంతు కృషి చేస్తానని ప్రకటించారు. సెప్టెంబర్‌ 2వ తేదీన దివంగత నేత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జిల్లాలో పర్యటించాల్సి ఉండగా ఆ రోజునే ఆయన ముఖ్యమంత్రిని కలిసి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించడానికి నిర్ణయించుకున్నారు.అయితే అదే రోజు ఆయన హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించడంతో ఈ ప్రక్రియ కొంత కాలం నిలిచిపోయింది. తిరిగి శనివారం నాడు పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడిన బొమ్మిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి జగన్‌ నాయకత్వంపై విశ్వసాన్ని ప్రకటించడంతో పాటు తాను కాంగ్రెస్‌లో చేరుతానని ప్రకటించారు. అవసరమైతే తాను ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తామని ప్రకటించడం ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరడం దాదాపు ఖాయమైపోయింది. బహుశా మరో వారం రోజుల్లో ఆయన కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకుంటారని చెబుతున్నారు. తొలినుంచి బొమ్మిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్‌తో ప్రగాఢ అనుభవం ఉంది. ఆయన తండ్రి బొమ్మిరెడ్డి సుందర్‌రాంరెడ్డి ఆనం కుటుంబానికి నమ్మిన భంటులా ఉంటూ ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కూడా ఆయన కాంగ్రెస్‌ తరఫున ఎంపిక అయ్యారు. ఆయన కుమారుడు బొమ్మిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి అనంతసాగరం జడ్పీటిసి సభ్యుడుగా కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎంపికై అటు తర్వాత కాలంలో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా తెలుగుదేశం మద్ధతుతో ఎమ్మెల్సీగా గెలిచారు. శాసన సభ ఎన్నికల నాటికి ఆయన పీఆర్పీలో చేరారు. కాంగ్రెస్‌లో స్పష్టమైన చీలిక ఏర్పడి జగన్‌ సారథ్యంలో ఒక వేళ ప్రాంతీయ పార్టీ ఏర్పడితే అందులో చేరేందుకైనా బొమ్మిరెడ్డి సిద్ధంగా ఉండడానికి ఇప్పటి నుంచే పావులు కదపడం గమనార్హం.

25న రెవిన్యూ ఉద్యోగుల ధర్నా


నెల్లూరు: రెవిన్యూ ఉద్యోగులు సుదీర్ఘ కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ, ఈనెల 25న భోజన విరామ సమయంలో కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రెవిన్యూ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి టి.రవీంద్రబాబు తెలిపారు. రెవిన్యూ శాఖలోని డిప్యూటీ తహశీల్దార్ల పోస్టులను ర్యాంక్‌ ప్రమోటీలుగా, డైరెక్ట్‌ డిప్యూటీలను సీనియర్లుగా ప్రభుత్వం పరిగణించడాన్ని నిరసిస్తూ ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం డిప్యూటీ తహశీల్దార్‌ కేడర్‌ ఖాళీలలో ప్రతి పది మందిలో ఏడుగురికి సీనియర్‌ కేడర్‌ పదోన్నతి కల్పించి మూడు ఖాళీలను గ్రూప్‌-2 కేడర్‌ నుంచి భర్తీ చేయాలని, తదితర డిమాండ్లతో ఆందోళన చేపడుతున్నట్లు తెలిపారు.