తడ చెక్‌పోస్టుపై ఏసీబీ దాడులు


నెల్లూరు: జిల్లా సరిహద్దుప్రాంతమైన తడ చెక్‌పోస్టు మీద గురువారం తెల్లవారు జామున ఏసీబీ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. రవాణా, కమర్షియల్‌ టాక్స్‌, అటవీ శాఖ, ఇలా ప్రధాన ప్రభుత్వ శాఖలకు చెందిన చెక్‌పోస్టులకు తడ కేంద్రంగా ఉంటుంది. ఈ క్రమంలో రోజు చెన్నై – కలకత్తా జాతీయ రహదారి మీద తడ చెక్‌పోస్టు మీదుగా సుమారు రెండు వైపుల 30 వేల లారీలు ప్రయాణిస్తాయి. వివిధ లోడ్‌లతో వచ్చిన ఈ లారీలను పరిశీలించి బిల్లులను సక్రమంగా తనిఖీ చేసి పంపించాల్సిన బాధ్యత ఇక్కడి అధికారులది కాగా లారీ డ్రైవర్ల నుంచి లంచాలు తీసుకుని లారీలను వది వేస్తున్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో గురువారం తెల్లవారు జామున దాడులు నిర్వహించారు. పెద్ద మొత్తంలో ఏసీబీ అధికారులు ఈ సందర్భంగా సొమ్మును స్వాధీనంచేసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisements

ఇందిరమ్మ అక్రమాల నేపథ్యంలో ఇద్దరు వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ సస్పెండ్‌


నెల్లూరు: నాయుడుపేటలో ఇందిరమ్మ గృహాలలో అక్రమాలు జరిగినట్లు రుజువు కావడంతో జిల్లా యంత్రాంగం బి.మస్తానయ్య అనే వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ను నెల్లూరు నుంచి పూర్తిగా విధుల నుంచి తొలగించడంతో పాటు అతని మీద క్రిమినల్‌ చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసింది. ఇతడితో పాటు మరో వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ను కూడా సస్పెండ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే సస్పెండ్‌ చేయనున్న వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ పేరును రాజకీయ ఒత్తిడిల నేపథ్యంలో గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించి నాయుడుపేట డిప్యూటి ఇంజనీర్‌గా ఉన్న రమణమూర్తిపై ఇంతకు ముందే సస్పెన్షన్‌ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా ప్రభుత్వం ఇందిరమ్మ గృహనిర్మాణ పథకంలో అవకతవకల మీద దృష్టి సారించడం లబ్దిదారుల్లో హర్షం వ్యక్తమవుతుంది.

హామీ పేదలకు… ఉపాధి పెద్దలకు!


నెల్లూరు‌: ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినా అది పేదల సమున్నతి కోసమే ఉద్దేశించినదంటూ ప్రకటనలు గుప్పిస్తుంటుంది. ఆచరణలో మాత్రం పథకంలో పేదల దరి చేరేది మాత్రం పిసరంత మాత్రమే. కారణాలేమైనా పేరులో పేదలకు హామీనిస్తూ ఉపాధి మాత్రం పెద్దలకు చూపిస్తూ ఉపాధి హామీ పథకం కూడా ఇతర సంక్షేమ పథకాల సరసన చేరిపోయింది. జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద భారీ ఎత్తున పనులు చేపట్టేందుకు నిధులు కూడా భారీగా మంజూరు కావడం జరిగింది. ప్రస్తుతం జిల్లాలో సుమారు రూ.564 కోట్ల రూపాయల పనులు సాంకేతికంగా మంజూరై వివిధ దశల్లో ఉన్నాయి. ఈ పనుల్లో అవకతవకలు కూడా భారీస్థాయిలో జరుగుతున్నాయి.

గ్రామంలోని వ్యవసాయ కూలీలు పనులు లేక పస్తులుండలేక ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లడాన్ని నిరోధించేందుకు ఉద్దేశించిన ఈ పథకం కొన్ని చోట్ల ఉద్దేశ్యాన్ని కాపాడుకుంటున్నా అనేక చోట్ల మాత్రం స్వార్థపరులైన ప్రజాప్రతినిధులు, అధికారుల అవకతవకలకు అక్షయపాత్రగా మారిపోతోంది. ఇప్పటివరకూ జిల్లాలో రూ.73,45,819లు ఉపాధి హామీ పథకంలో దుర్వినియోగం అయినట్లు అధికార్లు తమ సామాజిక తనిఖీల్లో నిర్ధారించారు. అయితే ఇప్పటివరకూ కేవలం ఆరు లక్షల రూపాయల వరకే అధికారులు అక్రమార్కుల వద్ద నుంచి వసూలు చేయడం జరిగింది. దుర్వినియోగ మైన సొమ్ములో పది శాతాన్ని కూడా అధికారులు వసూలు చేయకపోవడాన్ని బట్టి చూస్తే, ఈ పథకంలో జరుగుతున్న అవకతవకలపై అధికారులకున్న శ్రద్ధ స్పష్టమవుతోంది.

ఈ దుర్వినియోగానికి బాధ్యులుగా 37 మంది సిబ్బందిని విధుల్లోంచి తొలగిస్తూ, ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకోవడం మాత్రమే చేసి తమ పని అయిపోయినట్లు చేతులు దులిపేసుకున్నారు. జిల్లాలోని వివిధ మండలాల్లో జరుగుతున్న సామాజిక తనిఖీల్లో ఇప్పటికీ ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవకతవకలు బయటపడుతూనే వుండడం గమనార్హం. ముఖ్యంగా వలసలు ఎక్కువగా ఉన్న మెట్ట ప్రాంత మండలాల్లో ఈ పథకం సద్వినియోగమయ్యేట్లు చూడాల్సిన బాధ్యతను అధికారులు, ప్రజాప్రతినిధులు ఏనాడో పెడచెవినపెట్టారు. గత ప్రభుత్వ హయాంలో వచ్చిన పనికి ఆహార పథకంలో జరిగిన అవినీతికి రెట్టింపుగా ప్రస్తుత ఉపాధి హామీలో అవకతవకలు జరుగుతున్నాయని విపక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నా, నిత్యం పత్రికలు ఘోషిస్తున్నా జిల్లా స్థాయి అధికారుల పరిస్థితి ‘చెవిటోడి ముందు శంఖం ఊదినట్లు’గా ఉంది.

అయితే అవినీతికి పాల్పడుతున్న సిబ్బంది మీద, ప్రజాప్రతినిధుల మీద చర్యలు తీసుకోనేందుకు అధికారులు సైతం జంకుతున్నారు. అధికారపార్టీ ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్న ఒత్తిడుల మూలాన కిందిస్థాయి ఛోటాలపై చర్యలు తీసుకునే ధైర్యం అధికారులు చేయలేకున్నారు. సుమారు 2 లక్షల నిధులు దుర్వినియోగమైన దుత్తలూరు మండలంలో బాధ్యులుగా ఆరు మంది సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్న అధికారులు, అయిదున్నర లక్షల రూపాయల వరకూ అవినీతి జరిగినట్లు అధికారులు నిర్ధారించిన పొదలకూరు మండలంలో ఇప్పటివరకూ ఇందుకు బాధ్యులుగా ఒక్కరిపైనా చర్య తీసుకోకపోవడాన్నే ఇందుకు ఉదహరించవచ్చు. జిల్లా కలెక్టర్‌ ఇకనైనా జిల్లాలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం తీరుతెన్నులను పరిశీలించి పథకం ద్వారా నిజమైన పేదలు లబ్ధిపొందేందుకు బాటలు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.