ఉపకార వేతనాల గడువు పొడిగింపు


నిజామాబాద్‌: విద్యార్థులు పండిస్తున్న ఉపకార వేతనాల దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు బుచ్చయ్య తెలిపారు. బిసి, ఎస్టీ, ఎస్సీ విద్యార్థుల ఉపకార వేతనాల దరఖాస్తు గడువును అక్టోబర్‌ 10వ తేదీ వరకు పొడిగించినట్లు ఆయన వివరించారు. విద్యార్థులు ప్రభుత్వ వెబ్‌సైట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చునని ఆయన సూచించారు. గడువు తర్వాత వచ్చే దరఖాస్తులను తిరస్కరిస్తామని ఆయన పేర్కొన్నారు. కొత్తగా ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులతో పాటు అందుకు అవసరమైన ధృవీకరణ పత్రాలను జత చేసి సంబంధిత కళాశాలల ప్రిన్సిపాల్‌లకు అందజేయాలని ఆయన తెలిపారు.

Advertisements

నిజామాబాద్‌లో వర్షం


నిజామాబాద్‌: గత కొన్ని రోజులుగా ఉక్కపోతతో తల్లడిల్లిన జిల్లా ప్రజానికానికఇజీ రాత్రి నుంచి కురిసిన వర్షం ఉపశమనం ఇచ్చింది. శనివారం అర్థరాత్రి నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు కురిసిన వర్షంతో జిల్లాలో వాతావరణం చల్లబడింది. ఖరీఫ్‌ పంటకు చివరి దశలో అవసరమయ్యే నీటి కోసం తపన పడ్డ రైతాంగానికి ఈ వర్షాలు కొద్దిపాటి మేలు చేసే అవకాశం ఉంది. అయితే అదే దశలో ప్రమాదం కూడా ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుసగా వర్షాలు కురవకపోతే దోమ పోటు తదితర రోగాలతో పంట నష్టం జరిగే అవకాశం ఉందని వాపోతున్నారు. మరోవైపు జిల్లా రైతాంగానికి ముఖ్యమైన నీటి వనరు నిజాం సాగర్‌ ప్రాజెక్టు నుంచి పంటలను కాపాడేందుకు మూడు రోజుల క్రితం 1 టిఎంసీ నీటిని వదిలారు. వదిలిన ఈ నీటిని పంటలు పండిస్తూ చెరువులను నింపడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అదే విధంగా నిజాం సాగర్‌ ప్రాజెక్టుకు చివరి ఆయకుట్టు ప్రాంతమైన ఎడపల్లి, నవిపేట, నిజామాబాద్‌, డిచ్‌పల్లి, మాట్లూరు, ఆర్మూరు, నందిపేట ప్రాంత రైతాంగ పంటలను కాపాడేందుకు గుప్తా అలీసాగర్‌ ఎత్తిపోతల నుంచి అధికారులు నీటిని వదిలారు. అయితే ఈ వదిలిన నీటిని రైతులందరికీ ప్రయోజనం కలిగేలా మరో అయిదు రోజుల పాటు నీటి విడుదలను కొనసాగిస్తామని నిజాంసాగర్‌ ప్రాజెక్టు డిఈ శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

13న ట్రైనింగ్‌ కానిస్టేబుళ్ళకు వ్రాతపరీక్ష


నిజామాబాద్‌: పోలీసుశాఖలో స్టైఫండరీ ట్రెనింగ్‌ కానిస్టేబుళ్ళ శారీరక దారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 13వ తేదీన వ్రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. నిజామాబాద్‌లోని నిర్మలహృదయ్‌ బాలిక హైస్కూల్లో ఉదయం 9నుండి మధ్యాహ్నం 12గంటలవరకు వ్రాత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు పరీక్షా సమయంకంటే ముందే పరీక్షా కేంద్రంలో ఉండాలని తెలిపారు. పరీక్షా కేంద్రంలోకి సెల్‌ఫోన్‌లు, క్యాలిక్యూలేటర్‌లు, రిస్ట్‌వాచ్‌లు తీసుకురావద్దని ఆయన సూచించారు. పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వస్తే పరీక్షకు అనుమతించబోమని వెల్లడించారు.

జిల్లాలో ఇద్దరి దారుణహత్య


నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా బీచ్‌కుంద మండలంలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో ఒకరు చనిపోగా అందుకు కారణం నువ్వే అంటూ మరొకరినీ దారుణంగా హత్య చేసిన సంఘటన బుధవారం తెల్లవారు జామున జరిగింది. బీచ్‌కుంద మండలం సీతారాంపల్లి గ్రామంలో పంటచేనుకు వెళ్ళిన బి.శ్యామ్‌ అనే (30) సంవత్సరాల యువకున్ని గుర్తు తెలియని వ్యక్తుల మంగళవారం రాత్రి గొడ్డలితో దారుణంగా నరికిచంపారు. అయితే తన సోదరున్ని చంపారని మృతుని అన్నదమ్ములు ఆవేశానికి లోనై కమ్మరి విఠల్‌(50) అనే వ్యక్తిని బుధవారం తెల్లవారుజామున గొడ్డలితో నరికి చంపడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సంఘటన విషయాన్ని తెలుసుకున్న బీచ్‌కుంద ఎస్‌ఐ చందర్‌రాథోడ్‌ సంఘటనా స్థలానికి వెళ్లి శవపంచనామా జరిపి పోస్టుమార్టం కోసం రెండు మృతదేహాలను బీచ్‌కుంద ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

గణేష్‌ నిమజ్జనంలో మరో అపశృతి


నిజామాబాద్‌: గణేష్‌ నిమజ్జనంలో మరో అపశృతి దొర్లింది. సోమవారం జిల్లాలోని బీర్కూర్‌ మండలంలో నిమజ్జనానికి వచ్చిన యువకుడు నీటిలో పడిమృతి చెందిన సంఘటన మరవకముందే మంగళవారం తెల్లవారు జామున జిల్లాలో మరో ప్రాంతంలో జరిగిన సంఘటనలో ఇద్దరు యువకులు విద్యుదాఘాతానికి గురై మృతిచెందారు. నిజామాబాద్‌ నగరానికి మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న భూపన్‌పల్లి గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని గణేష్‌ మందిరం నిర్వాహకులు గణేష్‌ నిమజ్జనం కోసం ట్రాక్టర్లలో ముబారక్‌నగర్‌ గ్రామ చెరువుకు తీసుకువెళుతుండగా మార్గమధ్యంలో విద్యుత్‌ తీగలు తగిలి అశోక్‌ (32), నారాయణ (30) అనే ఇద్దరు యువకులు మృతిచెందారు. దీంతో ఆ రెండు కుటుంబాలలో విషాధచాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న జాయింట్‌ కలెక్టర్‌ జగన్నాథం సంఘటనా స్థలాన్ని సందర్శించి మృతుల కుటుంబాలను పరామర్శించారు.రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన అధికారి


నిజామాబాద్‌: మంగళవారం నిజామాబాద్‌ నగరంలో ఒక లంచగొండి అధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు. అటవీ శాఖ ముదపుపల్లి సెక్షన్‌ ఆఫీసర్‌ 4 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా అతని నివాసంలో మంగళవారం ఉదయం రెడ్‌ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఫారెస్ట్‌ సెక్షన్‌ అధికారి ఎల్‌ ప్రసాద్‌ అదే శాఖలో బీట్‌ అధికారిగా పనిచేస్తున్న మారుతి నుంచి 4 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఎంవి పుస్తకంలోని సంతకం కోసం ప్రసాద్‌ను సంప్రదించగా 4 వేలరూపాయలు డిమాండ్‌ చేశాడు. బీట్‌ అధికారి మారుతి ఏసీబీ అధికారులను సంప్రదించగా వ్యూహం పన్ని మంగళవారం ప్రసాద్‌ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడి చేసి లంచం తీసుకుంటున్న ప్రసాద్‌ను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ దాడిలో ఏసీబీ డిఎస్పీ కరుణానిధి తదితరులు పట్టుబడ్డ అధికారిని రిమాండ్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు.

గాయ్‌పార్థీముఠాను పట్టుకున్న జిల్లా పోలీసులు


నిజామాబాద్‌: ఆంధ్ర మహారాష్ట్ర ప్రాంతాల్లో దోపీడీ దొంగతనాలకు పాల్పడుతున్న గాయ్‌పార్థీముఠాను నిజామాబాద్‌ జిల్లా పోలీసులు అరెస్టు చేసారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాయలంలో ఎస్పీ జగన్మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. గాయ్‌పార్థీముఠాకు చెందిన 13మంది గల సభ్యులు గత సంవత్సర కాలంగా ఆంధ్ర, మహారాష్ట్రలో దోపీడీ దొంగతనాలకు పాల్పడ్డారని ఎస్పీ తెలిపారు. నిజామాబాద్‌, మాక్లూరు, ఆర్మూరు, బాల్కోండ పోలీసుస్టేషన్‌ పరిధిలో 15చోట్ల దోపీడీలకు పాల్పడ్డారని ఎస్పీ తెలిపారు. 13 సభ్యుల్లో 9మందిని శుక్రవారం తెల్లవారుజామున ఆర్మూరు మండలం అంకాపూర్‌ వడ్డెర కాలనీ వద్ద అరెస్టు చేసామని ఆయన తెలిపారు. అరెస్టు అయిన వారంతా మహారాష్ట్రకు చెందిన దొంగల ముఠా సభ్యులని పేర్కొన్నారు. ఈ ముఠాకు నాయకుడు షీలా అలియాస్‌ భాస్కర్‌బొస్లే, వకీలా బొస్లే, అనియా, అభిషేక్‌, రాహూల్‌పవార్‌, ఎస్మాన్‌పవార్‌, అమృష్‌పవార్‌, చవాన్‌ కైలాష్‌, సంతోష్‌ చవాన్‌లను అరెస్టు చేసి వీరివద్ద నుండి 71తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. వీటి విలువ రూ.10లక్షల50వేల వరకు ఉంటుందని, అదే విధంగా రెండు సెల్‌ఫోన్‌లు, ఆరు మరణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ ముఠా పగలు తాళాలు ఇళ్లను ఎంచుకుని, రాత్రీ వేలల్లో దొంగతనాలకు పాల్పడేవారని ఆయన చెప్పారు. ఈముఠాను పట్టుకోవడానికి కృషి చేసిన ఆర్మూరు డిఎస్పీ హతిరాం, ఆర్మూర్‌, భీంగల్‌ సిఐలు బసవారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిలతోపాటు పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.