మావోయిస్టులపై ఆకాశ దాడులు!


రంగంలోకి హెలికాప్టర్లు
వైమానిక మద్దతు కోరుతున్న రాష్ట్రాలు
ఎటూ తేల్చుకోని కేంద్రం
లాభం కంటే నష్టమే ఎక్కువ: నిపుణులు
హైదరాబాద్‌: మావోయిస్టుల చేతుల్లో వరుస ఎదురుదెబ్బలు తింటున్న భద్రతా బలగాలకు ఇక ‘ఆకాశమార్గం’ తప్పేటట్లులేదు. నక్సల్స్‌పై పోరాటంలో గగనతల దాడులే శరణ్యమని రాష్ట్రాలు కోరుతున్నాయని కేంద్ర హోంమంత్రి చిదంబరం సోమవారం ఢిల్లీలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పరిస్థితి తీవ్రత దృష్ట్యా రాబోయే రోజుల్లో హెలికాప్టర్లను రంగంలోకి దించే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అడుగడుగునా మందుపాతర్లు అమర్చడంతో ఛత్తీస్‌గఢ్‌, ఒరిస్సా రాష్ట్రాల్లో భద్రతా బలగాలు ఎటూ కదలలేని పరిస్థితి. ఇక మిగిలిన ఏకైక ప్రత్యామ్నాయం ఆకాశమార్గమే. ఇది కాస్త క్లిష్టమైన ప్రక్రియే అయినప్పటికీ ఇంతకు మించి ప్రత్యామ్నాయం కనిపించకపోవడంతో ఇప్పుడు కేంద్రం కూడా ఆలోచనల్లో పడింది.

వాస్తవానికి మావోయిస్టులపై దాడులకు వైమానిక మద్దతు తీసుకోవాలన్న ఆలోచన ఇప్పటిది కాదు. చాలాకాలం నుంచి నలుగుతూనే ఉంది. దశాబ్దకాలం క్రితమే మన రాష్ట్ర పోలీసులు ఏరియల్‌ సర్వేకోసం గ్రేహౌండ్స్‌ ఆధ్వర్యంలో రెండు ఎయిర్‌క్రాఫ్ట్‌లు కొనుగోలు చేశారు. కాని వాటివల్ల ఆశించిన ఫలితాలు రాలేదు. అత్యవసర సరిస్థితుల్లో బలగాలను తరలించేందుకు 35 మందిని మోసుకొని వెళ్లగలిగే ట్రూప్‌ క్యారియర్‌ హెలికాప్టర్‌ అందించాలని మన రాష్ట్రం నాలుగైదేళ్ల నుంచీ కేంద్రాన్ని కోరుతోంది. దీనికి కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి స్పందనా రాలేదు. ఛత్తీస్‌గఢ్‌లో మావోలు పెట్రేగిపోతుండటంతో వారిపై గగనతల దాడులు మినహా గత్యంతరం లేదని కేంద్రం భావిస్తున్నట్లు చిదంబరం వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది.

ఒకవేళ నిజంగా కేంద్రం వైమానిక దాడులు మొదలుపెడితే పర్యవసానాలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా పూర్తిస్థాయి యుద్ధం సమయంలోనే వైమానిక దాడులు నిర్వహిస్తారు. శత్రువులు సమూహాలుగా సంచరించేటప్పుడు వారందర్నీ మట్టుబెట్టే ఉద్దేశంతో నిముషానికి ఆరువేల రౌండ్ల వరకూ కాల్చగలిగే సామర్థ్యం ఉన్న ‘మల్టీ బ్యారెల్‌ గ్యాట్లింగ్‌ గన్‌’ బిగించిన హెలికాప్టర్‌ను రంగంలోకి దింపుతారు. ఇలాంటి తుపాకులు కొనుగోలు చేసేందుకు ఇటీవల కేంద్ర హోం మంత్రిత్వశాఖ టెండర్లు పిలిచింది. శత్రుదేశంపై దాడి సమయంలో ఈ తరహా దాడుల వల్ల ప్రయోజనం ఉటుందేమోకాని దేశ ప్రజలతో కలిసిపోయి ప్రభుత్వ విధానాలపై పోరాడుతున్న మావోయిస్టులను ఏరివేయడానికి మాత్రం పనికి రాకపోగా కొత్త సమస్యలు ఎదురవుతాయనే వాదన బలంగా వినిపిస్తోంది.

మావోయిస్టులు ఇంకా గెరిల్లా యుద్ధతంత్రంతోనే పొంచి ఉండి దాడులు చేస్తున్నారు. ఎదురుబొదురు నిలబడి పోరాడే పొజిషనల్‌వార్‌ దశకు ఇంకా చేరుకోలేదు. అటవీ ప్రాంతంలో గిరిజనులతో కలిసి ఉన్న వీరిపై ఆకాశమార్గంలో గుర్తించి దాడిచేయడం సాధ్యంకాదు. ఒకవేళ అటువంటి ధైర్యం చేస్తే మావోయిస్టుల కంటే సాధారణ ప్రజలకే ఎక్కువ నష్టం కలుగుతుంది. అనేక పురాతన గిరిజన జాతులు ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో సాధారణ ప్రజలకు ప్రాణహాని కలిగే పక్షంలో వెల్లువెత్తే విమర్శలు తట్టుకోవడం కష్టం. పైగా శత్రువు బలంగా ఉన్నప్పుడు ఒక అడుగు వెనక్కి వేసినా తప్పులేదన్నది గెరిల్లా సిద్దాంతం. ఒకవేళ ప్రభుత్వం వైమానిక దాడులకు దిగే పక్షంలో మావోయిస్టులు సాధారణ ప్రజల్లో కలిసిపోతారు. అటువంటప్పుడు వారిని గుర్తించడం కూడా కష్టమే. అన్నిటికంటే ముఖ్యంగా మావోయిస్టులు రాకెట్‌ లాంచర్లు సమకూర్చుకున్నారు. వీటిద్వారా హెలికాప్టర్లపై దాడిచేసే పక్షంలో నష్టం అపరిమితంగా ఉంటుంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మావోయిస్టులపై వైమానిక దాడుల వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందనేది నిపుణుల వాదన. అయితే బలగాలను తరలించేందుకు పరిమితంగానైనా హెలికాప్టర్లను వినియోగించడం వల్ల ప్రయోజనం ఉంటుందని మావోయిస్టు కార్యకలాపాలు ఎదుర్కోవడంలో విశేష అనుభవం ఉన్న ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ముందుగా మావోయిస్టుల కదలికలకు సంబంధించి నిర్దుష్టమైన సమాచారం సేకరించిన తర్వాత వారికి సమీపంలో ట్రూప్‌ క్యారియర్ల ద్వారా బలగాలను తరలించాలి. ఆపరేషన్‌ పూర్తి చేసిన తర్వాత మళ్లీ హెలికాప్టర్‌లో వారిని అక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు చేర్చడం ద్వారా కొంతవరకైనా ప్రయోజనం ఉంటుంది. ఇక ఇదే పద్దతిలో హెలికాప్టర్‌ల ద్వారా బలగాలను ఒక ప్రాంతంలో దింపి కొంతదూరం అడవుల్లో గాలింపులు నిర్వహించిన తర్వాత మరో ప్రదేశం నుంచి వారిని తరలించడం వల్ల కూడా లాభం ఉంటుంది. అయితే హెలికాప్టర్లను వాడుతున్నప్పుడు వాటిని కూల్చివేసేందుకు జరిగే ప్రయత్నాలను తట్టుకునేలా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా మావోలపై విరుచుకుపడటం సాధ్యంకాకపోయినా వాటిని వ్యూహాత్మకంగా వాడుకోగలిగితే ప్రయోజనం ఉంటుందని పేర్కొంటున్నారు.

Advertisements

తెలంగాణాలో మావోల బంద్‌


ఖమ్మం: ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మావోయిస్టులు రెండు రోజుల పాటు బంద్‌ పిలుపునిచ్చారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నక్సల్స్‌ ఉద్యమంపై చేపడుతున్న అణచివేతకు నిరసనగా ఈ బంద్‌ పిలుపునిచ్చినట్లు తెలిసింది. ఈ మేరకు జిల్లాలోని దమ్ముగూడెం మండలంలో రెండు రోజుల బంద్‌ను విజయవంతం చేయాలని మావోయిస్టుల బ్యానర్లు వెలిశాయి. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు నడవకుండా నక్సల్స్‌ చెట్లు నరికి రోడ్డుకు అడ్డంగా వేశారు. ఈ నేపథ్యంలో నక్సల్స్‌ విధ్వంస చర్యలకు పాల్పడే అవకాశం ఉండటంతో మారుమూల ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సు సర్వీసులను నిలిపివేశారు. అయితే మావోయిస్టుల బంద్‌ను విఫలం చేసేందుకు పోలీసులు ఆయా ప్రాంతాల్లో గస్తీ నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్‌ చేస్తున్నట్లు తెలిసింది.

ఏజెన్సీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నక్సల్స్‌ బ్యానర్లు


ఖమ్మం: ఖమ్మం జిల్లా చర్ల అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగు, హిందీ భాషల్లో బ్యానర్లు కట్టారు. అందులో అధిక ధరలకు వ్యతిరేకంగా పోరాడండి, అధిక ధరలకు కారణమైన పాలకులకు తగిన బుద్ధి చెప్పండి, గ్రామాలకు వచ్చే అధికారులను నిలదీయండి అని వ్రాసి ఉంది. అంతేకాకుండా జిల్లాలోని వేలాది ఎకరాల పంట భూములను పొలవరం పేరుతో లాక్కుంటూ, ఓపెన్‌ కాస్టుల పేరుతో గిరిజనులను నిరాశ్రయులను చేస్తూ, చారిత్రక నగరాలనుండి వారిని ప్రభుత్వ ఖాళీ చేయిస్తుందని వాపోయారు. జల సంపదను బహుళ జాతి సంస్థలకు ఆదివాసీల భూములను ధారాదత్తం చేస్తోందని దీనివెనుక కాంగ్రెస్‌ నేతల హస్తం ఉన్నదని ఆరోపిస్తూ వాల్‌ పోస్టర్లు వేశారు. పోలీసులు వెంటనే చేతి వ్రాతని గుర్తించి సమాచారం ఇవ్వాలని తగిన పారితొషిక ఇస్తామని ఫోన్‌నంబర్లుతో సహా పోస్టర్లు వేశారు. సెప్టెంబర్‌ 1న నక్సల్‌ బంద్‌ ప్రకటించడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు.