నిప్పు లేనిదే పొగ రాదు: వైఎస్‌


హైదరాబాద్‌: నిప్పు లేనిదే పొగ రాదని ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అన్నారు. తెలుగుదేశం నాయకుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కాంగ్రెసు పార్టీలో చేరుతారని వస్తున్న వార్తలపై ఆయన ఆ విధంగా వ్యాఖ్యానించారు. దీనిపై తెలుగుదేశం చేస్తున్న విమర్శలు అర్థరహితమని ఆయన అన్నారు. మంగళవారం ఆయన కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తమ కాంగ్రెస్‌ పార్టీలోకి ఎవరిని బడితే వారిని తీసుకోబోమని ఆయన అన్నారు. పార్టీలో చేర్చుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తామని ఆయన చెప్పారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఇటీవల ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కలిశారు. దీంతో ఆయన కాంగ్రెసులో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాను ఆ వార్తలను గోపాలకృష్ణారెడ్డి ఖండించారు.

Advertisements

సాగర్‌ నీటిని పంటలకు విడుదల చేయాలి: కోడెల


వినుకొండ (గుంటూరు): వినుకొండ ప్రాంత పరిధిలోని సుమారు 8లక్షల ఎకరాల భూమికి నాగర్జున సాగర్‌ జలాలను విడుదల చేయాలని మాజీ మంత్రి డాక్టర్‌ కోడెల శివప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం నర్సారావుపేట టిడిపి కార్యాలయంలో జరిగిన టెలికాన్పరెన్సులో ఆయన మాట్లాడుతూ, తమది రైతు ప్రభుత్వమని చెపుకుంటున్న ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి, ఖరీఫ్‌ ముగుస్తున్న నీటిని విడుదల చేయలేకపోవడం శోచనీయమని అన్నారు. 2003 -04 టిడిపి ప్రభుత్వం, సాగర్‌ రిజర్వాయర్‌లో నీటి పరిమానం అశించిన విధంగా లేకపోయిన సాగునీటిని విడుదల చేశామని అన్నారు. ప్రస్తుతం సాగర్‌ రిజర్వాయర్‌లో 500 అడుగులు, శ్రీశైలం రిజర్వాయర్‌ 800 అడుగుల నీరు ఉన్నప్పటికీ సాగునీటిని విడుదల చేయకపోవడం సమంజసంగా లేదని అన్నారు. శ్రీశైలం నీటిని, సాగర్‌ రిజర్వాయర్‌కు పంపకుండా పోతిరెడ్డిపాడు రిజర్వాయర్‌కు పంపడంలో ప్రభుత్వ విధానం ఏమిటో అర్థం కావడంలేదని అన్నారు. సాగర్‌ నీటిపై హక్కుఉన్న కృష్ణ, గుంటూరు, ప్రకాశం, ఖమ్మం జిల్లాలోని 30లక్షల మంది రైతులు సకాలంలో నీరు అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కోడెల అన్నారు. బియ్యం, కందిపప్పు ధరలు ఆకాశాన్నంటుతున్నాయని సామాన్యులు వాటిని కొనలేని దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం ధరలను తగ్గించడంలో చోద్యం చూస్తున్నదే తప్ప అదుపు చేయలేకపోతున్నదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని పెరిగిన ధరలను తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని కోడెల శివప్రసాద్‌ కోరారు. టెలికాన్పరెన్సులో మాజీ యార్డు చైర్మన్‌ ఆర్‌.లక్ష్మినారాయణ, టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

టిడిపి ఇక ఫినిష్‌ : వైఎస్


హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ నేతల్లో చంద్రబాబు విశ్వసనీయతను కోల్పోయారని, ఇక టిడిపి ఫినిష్‌ కావడం తధ్యమని ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి పేర్కొన్నారు. సోమవారం శాసనసభ ఆవరణలోని తన ఛాంబర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ తెలుగుదేశం నాయకులను ప్రలోభపెడుతుందని వస్తున్న వార్తలను ముఖ్యమంత్రి ఖండించారు. తామెవరిని ఆకర్శించడం లేదని, వారే తలుపులు తొసుకుని వస్తున్నారన్నారు. ఇక టిడిపి పని అయిపోయినట్లేనన్నారు. రోజా కాంగ్రెస్‌ పార్టీలో చేరే విషయాన్ని గతంలో తాను స్పష్టం చేస్తానని, తాను చెప్పింది ఇప్పుడు జరుగుతుందని, ఇది తన విశ్వసనీయతకు నిదర్శనమన్నారు. ప్రజల్లో మంచి పేరు ఉన్న వారిని మాత్రమే పార్టీలోకి తీసుకుంటున్నామన్నారు. బడ్జెట్‌ సెషన్‌ జరుగుతున్న తీరుపట్ల ముఖ్యమంత్రి విచారాన్ని వ్యక్తం చేశారు. చర్చలు జరకుండా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయన్నారు. రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై ప్రధాన మంత్రిని కలిసి వివరించనున్నట్లు చెప్పారు. కె.జి.బేసిన్‌ గ్యాస్‌ విషయంలో రాష్ట్ర వాటాపై రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటినుండో ఒత్తిడి తెస్తున్నట్లు చెప్పారు. తనను మొద్దెద్దు అని, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

అక్రమ ప్రాజెక్టులపై టీడీపీ ధర్నా


హైదరాబాద్‌: గోదావరి, కృష్ణానదులపై పొరుగు రాష్ట్రాలు నిర్మిస్తున్న అక్రమ సాగునీటి ప్రాజెక్టులకు నిరసనగా తెలుగుదేశం, వామపక్షాలు సోమవారం ధర్నా చేశాయి. తెలుగుదేశం, వామపక్షాలు శాసనసభ్యులు శాసన సభ ఎదురుగా గల గన్‌పార్కు వద్ద ధర్నా నిర్వహించాయి. పొరుగు రాష్ట్రాలు నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై ప్రభుత్వం ఏ మాత్రం స్పందించడం లేదని తెలుగుదేశం నాయకులు విమర్శించారు. పొరుగు రాష్ట్రాల అక్రమ ప్రాజెక్టులపై, దేవాదాయ శాఖ అవినీతిపై సభలో చర్చించేందుకు అనుమతి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు స్పీకర్‌ను కోరారు. ఇటీవల వెలుగు చూసిన తిరుమల తిరుపతి దేవస్థానం నగల గోల్‌మాల్‌ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై చర్చ జరుపేందుకు సాయంత్రం వరకు సభను కొనసాగించాలని, ఎంత రాత్రి అయినా తాము దీనిపై చర్చించడానికి సిద్ధమని అన్నారు. కావాలంటే ముఖ్యమంత్రికి భోజనాల ఏర్పాటు కూడా తామే చూస్తామన్నారు. అదేవిధంగా మన రాష్ట్రానికి నీరు రాకుండా పొరుగు రాష్ట్రాలు నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల చర్చకు ఆయన పట్టుబట్టారు. అవసరమైతే శాసనసభా సమావేశాలను సాయంత్రం వరకు పొడిగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ముగుస్తున్నాయి.