రాజమండ్రి ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఏకగ్రీవం


కాకినాడ: రాజమండ్రి ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవమైంది.ఈ ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు కాంగ్రెస్‌, టిడిపి నాయకులు చేసినప్రయత్నాలు శనివారం రాత్రికి ఫలించాయి. టిడిపి 3 డైరెక్టర్‌ పదవులతో సంతృప్తి చెందింది. వచ్చే ఏడాది కార్యవర్గంలో ముఖ్యపదవులను కట్టబెడతామని కాంగ్రెస్‌ నాయకులు హామీ ఇవ్వడంతో డైరెక్టర్‌ పదవులకు అంగీకరించినట్లు టిడిపి నాయకులు జి.కృష్ణా తెలిపారు. ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఎన్నికలు ఏకగ్రీవం చేసేందుకు పీసీసీ కార్యదర్శి ఎస్‌.శివరామసుబ్రహ్మణ్యం నాలుగు రోజులుగా ఇరువర్గాలతో చర్చలు జరిపగా ఫలించాయి. కాంగ్రెస్‌లోని ఆకుల వీర్రాజు, కొండపాటి శంకరరావు వర్గాలకు చెందినవారు ముఖ్య పదవులు పొందగలిగారు. అధ్యక్షుడిగా తోకల సీతయ్య గౌరవ కార్యదర్శిగా మద్దుల మురళీకృష్ణ, ఉపాధ్యక్షులుగా కొత్త చలపతిరావు, వి.మురళీధర్‌, సంయుక్త కార్యదర్శిగా ఎర్ర వీరవెంకట నాగమాణిక్యరావు, కోశాధికారిగా పి.కళ్యాణ్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడు ట్రస్ట్‌బోర్డు డైరెక్టర్‌ పదవులకు ఎల్‌.వీరభద్రరావు, షేక్‌ అసుద్దులా అహ్మద్‌, టిహెచ్‌ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Advertisements

వెంకటేశ్వర ఆయుర్వేధంకు పేటెంట్‌ అవార్డు


కాకినాడ: సాంప్రదాయక ఆయుర్వేధ వైద్యంలో ప్రసిద్ధికెక్కిన తూర్పుగోదావరి జిల్లా చింతలూరు వెంకటేశ్వర ఆయుర్వేధ నిలయంకు ఎట్టకేలకు పేటెంట్‌ అవార్డును దక్కించుకుంది. హైదరాబాద్‌లోని హోటల్‌ మారియట్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో కేంద్ర వాణిజ్య, పరిశ్రమ శాఖా మంత్రి ఆనంద శర్మ నుంచి సంస్థ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ డి.వెంకటశ్రీరామ్మూర్తి అవార్డు అందుకున్నారు. ముఖ్యమంత్రి కె. రోశయ్య, కెన్యా ఆరోగ్య శాఖ మంత్రి ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆయుర్వేధ రంగాలలో ఈ పేటెంట్‌ సంపాదించిన సంస్థ వెంకటేశ్వర ఆయుర్వేధ నిలయం మాత్రమే కావడం విశేషం. 1925 సంవత్సరంలో మారుమూల గ్రామమైన చింతలూరులో 5 శాఖలతో వెంకటేశ్వరరావు ఈ సంస్థను స్థాపించారు. 1945 వరకు ఆయన నిర్వహణలో సంస్థ అఖండ ఖ్యాతి గడించింది. అనంతరం వారి వారసుడు అయిన శ్రీరామ్మూర్తి సంస్థను చిన్నతరహా పరిశ్రమల్లో అగ్రస్థానానికి తీసుకెళ్ళారు. ప్రతిష్ఠాత్మకమైన ఐఎస్‌ఓ 9001-2009 సర్టిఫికెట్‌ను కౌవసం చేసుకున్నాడు. ఇప్పటికీ ఈ సంస్థకు ఆర్‌ అండ్‌ టి యూనిట్‌ను కూడా నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి నిచ్చింది. ఫలితంగా ఈ సంస్థ ఉత్పత్తులను అంతర్జాతీయంగా మార్కెటింగ్‌ చేసుకునే అవకాశం లభించింది. తొమ్మిదేళ్ళ పరిశోధన అనంతరం ఈ సంస్థ మధుమేహ నివారణకు వికె-4 డయాకాన్‌ మందును రూపొందించింది. ఈ సంస్థ ఉత్పాతైన వేదాక్వ రక్తపోటును అదుపులో ఉంచి కంటిలో శుక్లాలు తొలగిస్తుందని శాస్త్ర పరిశోధనలో రుజువైంది. ఈ రోజు మందులు త్వరలో మార్కెట్‌లోకి విడుదల కానున్నాయి. మరిన్ని ఔషధాలను ఉత్పత్తి చేసేందుకు సంస్థ పరిశోధన కొనసాగిస్తోంది.

వరకట్న వేధింపులకు యువతి బలి


కాకినాడ: కాకినాడ కొండయ్యపాలెం రైల్వేగేటు సమీపంలో నివాసముంటున్న అడబాల నాగేశ్వరరావు అలియాస్‌ నాగుకు నాగమూరు మండలం నవాబు పేటకు చెందిన దారం సౌజన్యను ఈ సంవత్సరం ఏప్రిల్‌ 17న అతనికి ఇచ్చి పెళ్ళి చేశారు. వివాహం అయినప్పటి నుంచి సౌజన్యను నాగు వేధింపులకు గురి చేస్తూ ఉన్నాడు. అయితే శనివారం ఉదయం సౌజన్య తన అక్కకు ఫోన్‌ చేసి నా భర్త వేధింపులకు గురి చేస్తున్నాడని నన్ను చంపేస్తాడని భయంగా ఉందని తెలిపింది. అయితే ఆదివారం ఉదయం నాటికి ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో సౌజన్య బంధువులు భర్తే చంపివేశాడని ఆరోపిస్తున్నారు. అయితే భర్త మాత్రం నాకేమీ తెలియదని ఉదయం లేచి చూసేసరికి ఉరి వేసుకుని ఉందనది పేర్కొన్నారు. సంఘటనా స్థలికి టౌన్‌ సిఐ రవికాంత్‌, ఎస్సైలు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అక్కడున్న పరిస్థితుల ప్రకారం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం భర్తను అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. అయితే అడపాల నాగేశ్వరరావు అలియాస్‌ నాగుపై గతంలో రౌడీషీటు కేసులు ఉన్నాయని హత్యాయత్నం కేసు కూడా ఉందని ఇతనికి ఒక మహిళతో అక్రమ సంబంధం ఉందని తెలిపారు. ఈ దిశగా కేసు నమోదు చేసుకొని డిఎస్పీ అచ్యుతరావు పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తున్నారు.

ఆటో కన్సల్‌టెన్సీ షోరూంలో అగ్నిప్రమాదం


కాకినాడ: రాజమండ్రి నగరం నడిబొడ్డున తాడికోట సెంటర్‌లో శనివారం రాత్రి ఆటోకన్సల్‌టెన్సీ షోరూంలో అగ్నిప్రమాదం సంభవించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీ లక్ష్మీసాయి మోటార్స్‌లో పని చేస్తున్న సూపర్‌వైజర్‌ రాత్రి 8 గంటలకు కరెంటు పోవడంతో షాపు మూసివేసి ఇంటికి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికే షాపులో నుంచి మంటలు రావడం చూసి వెంటనే తాళాలు పగులగొట్టి చూడగా మోటారు సైకిళ్లు తగలబడుతున్నాయి. స్థానికులు సాహసించి ఆరు మోటారు సైకిళ్లను బయటికి తీయగలిగారు. మోటారు సైకిళ్లలో పెట్రోలు ఉండడంతో భారీ పెలుడు సంభవించింది. దాంతో ఎవరు షాపులోకి వెళ్ళడానికి సాహసించలేదు. ఇంతలో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదంలో 40 మోటారు సైకిళ్ళు దగ్ధమయ్యాయని ఫైర్‌ ఆఫీసర్‌ శ్రీహరి జగన్నాథ్‌ తెలిపారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌ దారిలో ఈ సంఘటనచోటు చేసుకోవడంతో అటుగా వెళ్లే వాహనాలన్నీ నిలిచిపోయి ట్రాఫిక్‌ స్థంభించింది. ఈ ప్రమాదంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కరెంటు పోవడంతో కొవ్వోత్తు వెలిగించిన సూపర్‌వైజర్‌ దాన్ని ఆర్పకుండా దుకాణం మూసి వేసి వెళ్ళిపోవడంతో పెట్రోలు అంటుకుని ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. షాట్‌ సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని ఫైర్‌ ఆఫీసర్‌ శ్రీహరి జగన్నాథ్‌ అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్‌రావు సంఘటనా స్థలికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న శ్రీలక్ష్మీసాయి మోటార్స్‌ యజమాని గంగాప్రసాద్‌ అక్కడికి చేరుకుని దుకాణంలో ఉన్న మోటారు సైకిళ్ల వివరాలను ఫైర్‌ ఆఫీసర్‌కు వెళ్లడించారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

అశ్లీల చిత్రాలు చూపించి కోరిక తీర్చమంటున్న గురువు


రాజమండ్రి: తొమ్మిదవ తరగతి విద్యార్థినికి అశ్ల్లీల చిత్రాలు చూపించి కోరిక తీర్చమన్న కీచక గురువు దయాసాగర్‌పై గతంలోను విద్యార్థులపై వేధింపులకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. దయాసాగర్‌ తమతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ అతను పనిచేస్తున్న ఇంటర్నేషనల్‌ పాఠశాల యాజమాన్యానికి గతంలో ఓ విద్యార్థి ఫిర్యాదు చేసింది. కానీ స్కూలు పరువు పోతుందేమోనని యాజమాన్యం ఈ విషయాన్ని బయటకు పొక్కనివ్వలేదు.

గోదావరినదిలో యువకుడి అనుమానాస్పద మృతి


రాజమండ్రి: ఈనెల 13వ తేదీన అదృశ్యమైన యువకుడు గోదావరి నదిలో శవమై తేలింది. స్థానిక దానవాయిపేటకు చెందిన కోటారి సతీష్‌(22) మృతదేహం గౌతమి ఘాట్‌ సమీపంలోని ఇసుక తెన్నెలపై కనిపించింది. సతీష్‌ స్నేహితులతో కలిసి ఈనెల 13వ తేదీన కేతవరం పోతురాజు గుడికి వెళ్లిన సతీష్‌ తిరిగి రాలేదని తండ్రి అన్నవరం ఈనెల 20వ తేదీన వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా బుధవారం గౌతమి ఘాట్‌ సమీపంలో మృతదేహం ఉన్నట్టు సమాచారం తెలుసుకొని వెళ్లి పరిశీలించగా సతీష్‌ మృతదేహంగా గుర్తించారు. మృతదేహం బాగా కుమ్మిపోయి ఉండడంతో కొద్దిరోజుల క్రితమే మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతదేహానికి సంఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించి వన్‌టౌన్‌ ఎస్సై రామకృష్ణ అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

స్వైన్‌ఫ్లూతో మరో యువకుడి మృతి


రాజమండ్రి: కాకినాడ రూరల్‌ మండలం అరహ్యకట్టకు చెందిన ప్రత్తిపాటి రాజేష్‌(18) కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో గత 20 రోజులుగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. అరహ్యకట్టలో స్వైన్‌ఫ్లూ వ్యాపించిందన్న ఉదంతం నేపథ్యంలో రాజేష్‌ మృతితో గ్రామంలో మృతుల సంఖ్య నాలుగుకు చేరుకుంది. రాజేష్‌ తల్లి ప్రతిపాటి వరలక్ష్మి, అదే వీధిలో ఉంటున్న సత్యనారాయణ, బి.రాజేష్‌కుమార్‌ మృతి చెందిన విషయం విదితమే. రాజేష్‌ రక్త పరీక్షల్లో స్వైన్‌ఫ్లూ నెగిటివ్‌ రిపోర్టు వచ్చిందని, గ్రామంలో స్వైన్‌ఫ్లూ లేదని మండల వైద్యాధికారిణి డాక్టర్‌ ఎం.రత్నడిర్తీ తెలిపారు. రాజేష్‌ మృతదేహాన్ని అంబులెన్స్‌లోనే శ్మశానానికి తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు.