శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి


తిరుమల: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయినట్లు టీటీడీ ఛైర్మన్‌ ఆదికేశవులు నాయుడు తెలిపారు. దీంతో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 21 నుంచి అన్ని ఆర్థిక సేవలు, వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. స్థానిక అన్నమయ్య భవన్‌లో అధికారులతో ఆయన సమీక్షించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు సంబంధించి చర్చించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి నిత్యం లక్ష మందికి పైగా అన్నదాన సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

ప్రసాదం కొరత తలెత్త కుండా రోజూ 3 లక్షల లడ్డూలను నిల్వ ఉంచే ఏర్పాట్లను చేసినట్లు ఆదికేశవులు నాయుడు వివరించారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా అదనంగా నాలుగు వేల మంది భద్రతా సిబ్బందిని నియమించినట్లు ఆయన తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వికలాంగులు, వృద్ధులు, చిన్నపిల్లల తల్లిదండ్రులకు మహాద్వార ధర్శనాన్ని రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్‌ ప్రకటించారు.

Advertisements

తిరుమలకు’ఆక్టోపస్‌’ రక్షణ


తిరుమల: తిరుమల రక్షణకు ఆక్టోపస్‌(ఆర్గనైజేషన్‌ టు కౌంటర్‌ టెర్రరిస్టు ఆపరేషన్స్‌) భద్రతాదళాన్ని వినియోగిస్తున్నట్టు డీజీపీ యాదవ్‌ తెలిపారు. తిరుమలలో నెలకొల్పిన ఆక్టోపస్‌ కమాండో యూనిట్‌ యూనిట్‌ను ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా ఈ భద్రతదళాన్ని తిరుమలలో మొహరించినట్టు ఆయన వెల్లడించారు.

జగన్‌ సిఎం చేయాలని ఎస్సీ,ఎస్టీ, బిసీ, మైనార్టీల సంతకాల సేకరణ


తిరుమల: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి తనయుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు రంగారమణారావు, టి. దేవరాజు, ఎస్‌కె. భాషా జిల్లా కేంద్రం చిత్తూరు గాంధీ విగ్రహం ఎదురుగా సుమారు 10మీటర్ల బ్యానర్‌పై సంతకాలు, ప్రజల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చారని వాటిని అమలు చేయడానికి తగిన వ్యక్తి జగన్‌ అని అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని 2004లో ఒకసారి 2009లో మరోసారి ఓడించి కేంద్రానికి 33మంది ఎంపీలను పంపిన కీర్తి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డికే చెందుతుందని తెలిపారు. రాజశేఖర్‌రెడ్డి ఆకస్మిక మరణం వల్ల రాష్ట్రంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని దానికి వై.ఎస్‌.జగన్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రిని చేస్తే కొంతవరకు ఇలాంటి మరణాలను ఆపినవారు కాగలరని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం లేక ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీలు రాష్ట్ర ప్రజాభీష్టం మేరకే జగన్‌కు సీఎం పదవి ఇవ్వాలని కోరారు. రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన జలయజ్ఞం, వృద్ధాప్య పింఛన్లు, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ, పేదల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్ర చరిత్రలో వై.ఎస్‌.ఆర్‌ చిరస్థాయిలో నిలిచిపోయారని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాలకే కాక వ్యవసాయ రుణాలను మాఫీ చేసిన చరిత్ర ఆయనకే దక్కుతుందని తెలియజేసారు. తాము చేపట్టిన సంతకాల సేకరణ రాష్ట్ర ప్రజల అభీష్టం మేరకేనని అన్ని వర్గాలు, రాజకీయ పార్టీలు కూడా వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి తనయుడు వై.ఎస్‌.జగన్‌ ముఖ్యమంత్రి అయితే ప్రజలు సంతోషంగా ఉంటారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని కాపాడేందుకు ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఒక జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రకటించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బిసీ అధ్యక్షులు తెలిపారు.

టీటీడీ అవినీతి వ్యవహారంపై దద్దరిల్లిన సభ


హైదరాబాద్‌: తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అవినీతి వ్యవహారంపై సోమవారం శాసనసభను కుదిపివేసింది. పాలకపక్షాల, ప్రతిపక్షాల వాదోపవాదాల మధ్య సభ వేడెక్కిపోయింది. టీటీడీ అవినీతి వ్యవహారంపై సభా సంఘాన్ని వేయాలని విపక్షాలు పట్టుబట్టాయి. అందుకు ప్రభుత్వం తిరస్కరించడంతో సభ నుండి టీడీపీ, పీఆర్పీ, టీిఆర్‌ఎస్‌, సీపీిఎం, బీజేపీి పార్టీలు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, సభ నుండి వాకౌట్‌ చేశాయి. సోమవారం శాసనసభలో తిరుమల తిరుపతి దేవస్థానంలో నగల అవినీతిపై పాలక విపక్షాలు సుదీర్ఘంగా చర్చించాయి. ముందుగా తెలుగుదేశం పార్టీ చర్చను ప్రారంభిస్తూ, ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారంపై ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చర్చింకుంటున్నారని, ఇది కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఉందని దీనిపై ప్రభుత్వం సభా కమిటీని వేసి విచారణ జరిపించాలని డిమాండ్‌ చేసింది. శ్రీవారి ఆభరణాలపై సమగ్ర సమాచారం ఇవ్వాలని, ఉత్సవ విగ్రహాలు విదేశాలకు వెళుతున్నప్పుడు అవి సరిగ్గా తిరిగి వస్తున్నాయా? లేదా? శేషాద్రిపై అనేక ఆరోపణలు వస్తున్నాయని అయినా అతన్ని ఇంకా పదవిలో కొనసాగించడంలోగల ఆంతర్యమేమిటని, దేవుని ఆభరణాలు తాకట్టుకు వెళుతుంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్లా లేనట్ల్లా అనే అనుమానం కలుగుతుందని, వీటన్నింటికీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు డిమాండ్‌ చేశారు. శ్రీవారిపై ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, వారి కోరికలు తీరడంలో శ్రీవారికి ఆభరణాలు, బంగారం సమర్పిస్తున్నారని, సమర్పించిన వస్తువులకు రక్షణ లేకపోవడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. కాగా తిరుమలలోని ఆలయ నగల తాకట్టు ఒక వ్యవహారం మాత్రమేనని, ఇలాంటి వ్యవహారరలో అక్కడ కోకొల్లలని తీగలాగితే డొంకకదులుతుందని అందుకు సభా సంఘాన్ని వేయాలని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి డిమాండ్‌ చేశారు. తిరుమలలో ఏమి జరగనట్లు ప్రభుత్వం భావిస్తోందని విమర్శించారు. అక్కడ ఏమీ జరగలేదని ప్రభుత్వం గుండెమీద చేయి వేసుకొని చెప్పగలరా? అని ఆయన ప్రశ్నించారు. ఏ వ్యవహారమైతేనేమి కోట్లాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందని, వారిలో లేనిపోని అనుమానాలకు దారితీస్తుందన్నారు. దీనిపై నిగ్గు తేల్చాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. స్వామివారి ఊరేగింపులు భక్తులు వేసిన నాణేలు తగిలి డైమండ్‌ పగిలిపోయిందని చెప్పడం హాస్యాస్పందంగా ఉందన్నారు. 500 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఎస్పీ భక్తి ఛానల్‌ ప్రజలకు ఆశించిన మేరకు ఉపయోగపడకపోగ ఉద్యోగులకు మాత్రం భుక్త్తిి ఛానల్‌గా మారిందని చిరంజీవి ఎద్దేవా చేశారు. పాలకమండలి మొత్తం అవినీతిలో కూరుకుపోయిందని వెంటనే దానిని ప్రక్షాళన చేయాలని డిమాండ్‌ చేశారు. బీజేపీి పక్షం నేత జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, టీటీడీిలోని అవినీతి వ్యవహారం దేవాలయాల పవిత్రతను దెబ్బతీసేవిధంగా ఉందని విమర్శించారు. అవినీతి కుంభకోణాలతోపాటు అక్కడ అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. తమ పాపం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో ప్రభుత్వం వ్యవహారాన్ని చర్చకు రాకుండా చూస్తోందని విమర్శించారు. నేడు దేవాలయాలు, పాలక మండళ్లకు, రాజకీయ నాయకులకు పునరావాస కేంద్రాలుగా మారాయని కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆది కేశవులనాయుడు టీటీడీ ఛైర్మన్‌గా అయిన తరువాత టీటీడీ పవిత్రత పూర్తిగా దెబ్బతిన్నదని ఆరోపించారు. లోక్‌సత్తా నేత డాక్టర్‌ జయప్రకాశ్‌ నారాయణ మాట్లాడుతూ, టీటీడీలో అవకతవకలు ఉన్నమాట వాస్తవమన్నారు. దేవాలయాల ఆభరణాలు ఏ మేరకు ఉన్నాయి, అన్ని విషయాలపై ప్రజల్లో నమ్మకం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్‌బిఐ, అప్రెజర్లు, జమాలజీ నిపుణులతో కమిటీని వేసి వారితో ఆభరణాల విలువలు లెక్కించాలన్నారు. విచారణ అనంతరం తప్పుచేసిన వారు ఎంతటివారినైనా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ, టీటీడీ వ్యవహారంలో రాజకీయ జోక్యం ఉండకూడదన్నారు. టీటీడీ ఛైర్మన్‌గా రాజకీయ నాయకున్ని నియమించవద్దని, ప్రస్తుతం ఉన్న పాలకమండలిని రద్దు చేసి అవకతవకలపై సభా సంఘాన్ని వేసి విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. అనంతరం దేవాదాయ శాఖమంత్రి గాదె వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలోని దేవాలయాల ఆస్తుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఒక్క ఆలయంలో అర్చకుడు దేవుని వస్తువులు తాకట్టు పెట్టినంత మాత్రాన దానిని టీటీడీ మొత్తానికి అనుసయించడం సరికాదన్నారు. కేవలం దీనికోసమే సభా సంఘాన్ని వేయవలసిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. అలాగే పాలకమండలిపై ఏ విధమైన ఆరోపణలు లేవని అలాంటప్పుడు దానిని రద్దు చేయాల్సిన అవసరం కూడా లేదన్నారు. అందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు మాట్లాడుతూ, దేవుని ఆస్తులను అక్రమంగా కాజేయాలని చూస్తే ఎవ్వరూ బాగుపడరన్నారు. నగల వ్యవహారంపై సభా సంఘాన్ని వేయాలని డిమాండ్‌ చేశారు. అవసరమైతే పాలకమండలిని రద్దు చేయాలని అన్నారు. స్వామివారి కార్యక్రమాలు ప్రసారం చేయడానికి అనేక ఛానళ్లు సిద్ధంగా ఉన్నాయని, దీనికోసం ప్రత్యేకంగా ఛానల్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. వీటన్నింటికీ ప్రభుత్వం నుండి సరైన సమాధానం రాకపోవడం, సభా సంఘానికి ప్రభుత్వం అంగీకరించకపోవడంతో విపక్షాలు సభ నుండి వాకౌట్‌ చేశాయి. దీనితో స్పీకర్‌ ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి సభను రేపటికి వాయిదా వేశారు.