ప్రమాణాలకు విరుద్ధంగా బాజ్పే విస్తరణ


మంగళూరు: బాజ్పే విమానాశ్రయంలో రెండో రన్‌వే నిర్మాణం తప్పుల తడకలా సాగిందా? స్థిరాస్తి, స్థానిక హోటల్‌ పరిశ్రమ, వ్యాపార సంస్థల లాబీ తెచ్చిన ఒత్తిడికి లొంగి, ప్రతికూలమైన ప్రదేశంలో రన్‌వేను నిర్మించారా? ఆ కారణంగానే ప్రస్తుత దుర్ఘటన జరిగిందా? అవుననే అంటున్నాయి స్వచ్ఛంద సంస్థలు. బాజ్పే అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణలో భాగంగా చేపట్టిన రెండో రన్‌వే నిర్మాణంలో నిబంధనలు, ప్రమాణాలను పట్టించుకోవటం లేదని బెంగళూరుకు చెందిన స్వచ్ఛంద సంస్థ ఎన్విరాన్‌మెంట్‌ సపోర్ట్‌ గ్రూప్‌ (ఈఎస్‌జీ), విమాన నిల్దన విస్తరణ విరోధి సమితిలు అప్పట్లోనే తీవ్రస్థాయిలో పోరాడాయి.

1997, 2002 సంవత్సరాల్లో కర్ణాటక హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలూ దాఖలు చేశాయి. భారీ విమానాల రాకపోకల కోసం విమానాశ్రయ విస్తరణలో భాగంగా.. రెండో రన్‌వే నిర్మాణాన్ని 2004లో మొదలు పెట్టారు. 2006 నుంచి వాడకంలోకి తెచ్చారు. ఇక్కడి రన్‌వే డిజైన్‌ డీజీసీఏ, భారత జాతీయ నిర్మాణ కోడ్‌, పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ నిర్దేశిత ప్రమాణాలకు తగినట్లుగా లేదని నిర్మాణం మొదలుపెట్టే ముందు కూడా ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చామని ఈఎస్‌జీ సంస్థ ఇంటర్‌నెట్‌లో ఉంచిన ఓ ప్రకటనలో పేర్కొంది.

దీనిని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చేటప్పుడు రెండో రన్‌వే అంతర్జాతీయ పౌర విమానయాన ప్రాధికార సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా లేదనీ పోరాడామని పేర్కొంది. 2003లో తమ పిటిషన్‌ ఆధారంగా రన్‌వే నిర్మాణాన్ని నిబంధనలకు అనుగుణంగా నిర్మించాల్సిందేనని సుప్రీంకోర్టు సూచించినా పట్టించుకోలేదని వాపోయింది. 2004లో భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లినా ప్రతిస్పందన కరవైందని తెలిపింది. రన్‌వేకు మూడువైపులా లోతైన లోయలు ఉండటం అత్యవసర ల్యాండింగ్‌కు అనుకూలం కాదని నిరసన ప్రదర్శనలూ చేశామని ఆ ప్రకటనలో తెలిపింది.

డీజీసీఏ, ఏఏఐ, పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ, కర్ణాటక ప్రభుత్వ ఉన్నతాధికారులే దీనంతటికీ బాధ్యత వహించాలని పేర్కొంది. ప్రత్యామ్నాయాలున్నా అధికారులు పట్టించుకోకుండా.. స్థిరాస్థి, వ్యాపార, హోటళ్ల లాబీకి లొంగి అక్కడే నిర్మించారని ఆరోపించింది. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జుడిషియల్‌ విచారణ చేపట్టాలని కోరింది.

Advertisements

విమానప్రమాద దర్యాప్తుకు అమెరికా సాయం


మంగళూరు: శనివారం జరిగిన విమానప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్న కేంద్రబృందాలకు సాయపడేందుకు అమెరికా పరిశోధన బృందాలు రంగంలోకి దిగనున్నాయి. అమెరికాకు చెందిన నేషనల్‌ ట్రాన్‌పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డు అధికారులతో పాటు బోయింగ్‌, జీఈ సంస్థల సిబ్బంది కూడా ఈ దర్యాప్తుకు సహకరించనున్నాయి. భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు తాము దర్యాప్తుకు సహకరిస్తున్నట్టు ఎన్‌టీఎస్‌బీ తెలిపింది.

మంగళూరు చేరుకున్న ఫోరెన్సిక్‌ బృందం


మంగళూరు: మంగళూరు విమానప్రమాదంలో గుర్తుపట్టని మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించేందుకు ఫోరెన్సిక్‌ బృందం మంగళూరుకు చేరుకుంది. విమానప్రమాదంలో 158 మంది మరణించగా వీరిలో 36మంది దేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. దీంతో వీరి మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు జరపనున్నారు. డీఎన్‌ఏ పరీక్షల అనంతరం మృతదేహాలను వారి బంధువులకు అప్పగించనున్నట్టు అధికార్లు తెలిపారు.