భవిష్యత్తుపై ఆశతో…: జెనీలియా


అల్లరి పిల్లగా అందరినీ ఆకట్టుకుని దర్శక, నిర్మాతలకు కాసులు కురిపించిన ‘బొమ్మరిల్లు’ ముద్దుగుమ్మ జెనీలియా ప్రణాళికాబద్ధమైన భవిష్యత్తును ఊహించుకుంటోంది. కెరీర్‌ ఆరంభంలో పూర్తి స్థాయి మాస్‌ మసాలా చిత్రాల్లో చేసిన ఈ అమ్మడు తర్వాత తర్వాత బొమ్మరిల్లు తరహా క్లాస్ సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంది. అయితే ఆ చిత్రాలు తన కెరీర్‌కు ఏ మాత్రం ఉపయోగపడవని ఆలస్యంగా తెలుసుకున్న జెనీలియా బొమ్మరిల్లుతో తన పంథాను మార్చుకుంది. భవిష్యత్తు ఎటుపోతుందో తెలియని పరిస్థితుల్లో ‘బొమ్మరిల్లు’ అవకాశం వచ్చిందని చెబుతున్న ఈ అమ్మడు ఆ సినిమాయే తన సినీ జీవితానికి మేలిమలుపు అయ్యిందని పేర్కొంటోంది. ఆ చిత్రం తమిళ, కన్నడ, హిందీ రీమేక్స్‌లో కూడా తనే నటించి ఆయా భాషల్లో కూడా ప్రత్యేకతను చాటుకుంది. ”ఒకే పాత్రను నాలుగు భాషల్లో చేయడం అరుదుగా జరుగుతుంది. ఆ అవకాశం నన్ను వరించింది. ‘రెడీ’ సినిమా విషయంలో కూడా ఇలా జరుగుతోంది. ఈ చిత్రం తమిళ రీమేక్‌ ‘ఉత్తమ పుత్తిరన్‌’లో కూడా నేనే కథానాయికగా నటిస్తున్నాను” అని జెనీలియా చెప్పారు.

”అంగాంగ ప్రదర్శనకు వీలైనంత దూరంగా ఉండాలని మొదటిసారి మేకప్‌ వేసుకున్నప్పుడు నేను ఫిక్స్‌ అయ్యాను. లక్కీగా నన్నెవరూ అలాంటి పాత్రలకు అడగడంలేదు. ఓ కాలేజ్‌ గాళ్‌ ఎలా ఉంటుందో సినిమాల్లో నాకు అలాంటి పాత్రలే వస్తున్నాయి. దాంతో అందరూ నన్ను తమ అమ్మాయిలా భావిస్తున్నారు. ఎక్స్‌పోజింగ్‌తో నెట్టుకొచ్చేకన్నా చక్కని అభినయం కనబర్చి మంచి పేరు తెచ్చుకోవాలన్న నా కోరిక నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉంది.

ఒకానొక దశలో నేను యంగ్‌ హీరోల సరసన మాత్రమే నటిస్తాననే ప్రచారం జరిగింది. ఆ వార్తలు విని కొంచెం బాధపడ్డాను. ఎందుకంటే ఓ సినిమాకి సైన్‌ చేసే ముందు నా పాత్ర బాగుందా? లేదా? అని మాత్రమే ఆలోచిస్తాను. హీరో గురించి అస్సలు ఆలోచించను. సీనియర్‌ హీరోల పక్కన నటించినప్పుడు వారి అనుభవం నాకు హెల్ప్‌ అవుతుంది కాబట్టి వారి పక్కన నటించడానికి నాకభ్యంతరం లేదు. అలాగే కథ నచ్చితే చాలు నా పాత్ర నిడివి ఐదు నిముషాలు ఉన్నా సరే ఒప్పేసుకుంటాను” అని అంటోంది.

”నేనెప్పుడూ ఏదీ ప్లాన్‌ చేయలేదు. ఫలానా సినిమా చేయాలని టార్గెట్‌ పెట్టుకుని సినిమాలు చేయలేదు. వచ్చిన అవకాశాలను ఒప్పుకున్నాను. కాకపోతే ఒకసారి మాత్రం ప్లాన్‌ చేశాను. ‘జానే తు య…’కి ముందు బాలీవుడ్‌లో నా కెరీర్‌ సరిగ్గా సాగలేదు. అప్పుడు మాత్రం దక్షిణాది చిత్రాలు చేయాలని ప్లాన్‌ చేసుకున్నాను. ఇప్పుడు ప్లానింగ్‌ ఏదీ లేదు. ఎక్కడ మంచి అవకాశం వస్తే అక్కడ చేస్తాను. కాకపోతే నన్ను తెలుగు పరిశ్రమ దాదాపు ఏడేళ్లుగా భరిస్తోంది (నవ్వుతూ). అందుకని తెలుగు చిత్రాలకు ప్రాధాన్యం ఇస్తాను.

జీవితంలో ఊహించని మలుపు ఎదురైనప్పుడు ఇది కలా? నిజమా? అనిపిస్తుంది. దాదాపు ఏడెనిమిదేళ్ల క్రితం ఆ సంఘటన జరిగిప్పుడు నాకు అలానే అనిపించింది. అప్పుడు నేనెవర్నో ఎవరికీ తెలియదు. ఓ సాదాసీదా అమ్మాయిని. ఓ పెళ్లిలో స్నేహితులతో సరదాగా కబుర్లాడాను. మేమంతా గోల గోల చేశాం. దాంతో నలుగురి దృష్టిలో పడిపోయాను. ఫలితంగా నా జీవితం మారిపోయింది. యాడ్‌లో నటిస్తావా? అంటూ ఆహ్వానం అందింది. ట్రై చేద్దామనుకుని వెళ్లా. ఏకంగా అమితాబ్‌ బచ్చన్‌ సరసన నటించబోతున్నానని తెలిసి షాకయ్యా. ఆశ్చర్యం, ఆనందం ఒకేసారి కలిగాయి. ఆ యాడ్‌ సినిమా రంగంలో నా రంగప్రవేశానికి నాంది పలికింది. ఆనాడు అమితాబ్‌ నన్ను ప్రోత్సహించారు. ఆ తర్వాత ‘బొమ్మరిల్లు’ సినిమా కోసం నేను ఫిలింఫేర్‌ అవార్డ్‌ అందుకున్నప్పుడు ఆ వేదిక మీద ఆయన ఉన్నారు. నేను యాక్ట్‌ చేసిన హిందీ చిత్రం ‘జానే తు య జానే న’ ప్రీమియర్‌ షోలో కూడా ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత తన బ్లాగ్‌లో ఆయన నా గురించి నాలుగు మంచి మాటలు చెప్పారు. వయసులో, అనుభవంలో చిన్నదాన్నయిన నేను ఆయన అభినందనలు అందుకోగలిగాను” అని జెనీలియా చెప్పుకొచ్చింది.

”బేసిక్‌గా నేను అథ్లెట్‌ని. జాతీయ స్థాయిలో ఫుట్‌బాల్‌ ఆడాను. నేను స్టేట్‌ లెవల్‌ రన్నర్‌ని. నా శరీరాకృతి కరెక్ట్‌గా ఉండటానికి క్రీడలే కారణం. నూనె వంటకాలు, పిజ్జాలు, బర్గర్‌లు ఇలా అన్నీ లాగించేస్తాను. అయినా బరువు పెరగకపోవడానికి వర్కవుట్లే కారణం.

సినిమా తప్ప నాకు వేరే దేని మీదా ఆసక్తి లేదు. ఆరంభంలో నా కెరీర్‌ ఆశించినంతగా సాగలేదు. అయినా నేను నిరుత్సాహపడలేదు. కష్టపడేవాళ్లని దేవుడు ఆదుకుంటాడనే నమ్మకంతో ఉండేదాన్ని. ఆ నమ్మకం వృధా కాలేదు. తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో నిరూపించుకున్నాను. మొత్తం మూడు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాను” అని నవ్వుతూ చెప్పే ఈ ముద్దుగుమ్మ మనసులో ప్రేమ చిగురించినట్లు ఇటీవలే మీడియాలో కూడా వార్తలు వెలువడ్డాయి. దీనిపై స్పందించేందుకు మాత్రం జెనీలియా ససేమీరా అంది.

Advertisements