గ్రామ స్థాయిలో సమస్యల పరిష్కారం


తిరుపతి: డివిజనల్‌ స్థాయిలో గ్రీవెన్స్‌ డే నిర్వహించడం వలన మారుమూల ప్రాంతాల నుండి వచ్చే వారికి వెసులు బాటు కలుగుతుందని చిత్తూరు జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్‌ శారదదేవి అన్నారు. సోమవారం స్థానిక రెవెన్యూ డివిజనల్‌ అధికారి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారి నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆమె ప్రసంగిస్తూ ప్రతి రెండొ సోమవారం తిరుపతిలోను, నాల్గవ సోమవారం మదనపల్లిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ముఖ్యమైన సమస్యలుగా ఇంటి పట్టాలు, భూమి స్వాధీనం, రేషన్‌ కార్డుల ఏరివేత, మునిపల్‌ పరిధిలోని సమస్యలు ముఖ్యమైనవన్నారు.

గత సోమవారం అందిన ఫిర్యాదు మీద స్పందించి అనధికారంగా నిర్వహిస్తున్న బెల్టు షాపును మూయించడం జరిగందన్నారు. తిరుపతి పట్టణం 8 వ వార్డులో నిర్వహిస్తున్న మునిసిపల్‌ పాఠశాలకు సొంత భవనం పై చర్యలు చేపట్టాలని మునిసిపల్‌ అధికారులకు జిల్లా కలెక్టర్‌ గారు ఆదేశాలు జారీ చేసారన్నారు. రేషన్‌ కార్డుల ఏరివేత సందర్బంగా అన్యాయం జరిగిందని భావించినవారు పై అధికారులకు అప్పీలు చేసుకుని న్యాయం పొందవచ్చని సూచించారు.

ప్రజల సమస్యలను తీర్చడానికి ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తున్నదని, అధికారులు తమ వంతు బాధ్యత నిర్వర్తించాలన్నారు. సోమవారం తప్పనిసరిగా అధికారులు తమ కార్యస్థానాలలో ప్రజలకు అందుబాటులో వుండాలన్నారు.

ఈ సమావేశంలో తిరుపతి రెవిన్యూ డివిజనల్‌ అధికారి ప్రసాద్‌, సహాయ బి.సి. సంక్షేమ అధికారి వెంకటయ్య, డివిజనల్‌ పంచాయతీ అధికారి ఎన్‌.ఎ.రజాక్‌, ఎ.టి.డబ్ల.ఒ ఇ. లలితబాయి, పశుసంవర్థక అధికారి డాక్టర్. ఎన్‌. శైలజ, హౌనింగ్‌ డివిజనల్‌ ఇంజనీరు బాలకృష్ణారెడ్డి, తిరుపతి రూరల్‌ ఎం .పి.డి.ఒ రాజశేఖరరెడ్డి, వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు. వివిధ శాఖలకు సంబంధించిన 8 అర్జీలు అందాయి.

Advertisements

మంత్రి గల్లా అరుణ కడప పర్యటన


కడప: జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి జిల్లా పర్యటనకు రానున్నారు. ఈ నెల 5న జిల్లాలో జరిగే ప్రజాపథం కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి హోదాలో ఆమె పాల్గొంటారు. ఈమేరకు జిల్లా కలెక్టర్ శశిభూషన్‌ కుమార్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.

మంత్రి 5న ఉదయం 8.30 గంటలకు ఒంటిమిట్ట మండలం, గొల్లపల్లె గ్రామ సభలో పాల్గొంటారు. అదే రోజ ఉదయం 11.30 గంటలకు కొండాపురం మండలం తాళ్ల ప్రోద్దటూరు, మధ్యాహ్నం 3 గంటలకు లక్కిరెడ్డిపల్లె మండలం దిన్నెపాడులో జరిగే ప్రజాపథం గ్రామసభల్లో పాల్గొంటారని కలెక్టర్ వివరించారు.

బాబును ఏమీ అనను: రోజా


హైదరాబాద్‌: తాను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని ఏమీ అనబోనని రోజా అన్నారు. తెలుగుదేశంలో వారే కొందరు తనను ఎన్నికల్లో మోసం చేసి ఓడించారని, చంద్రబాబుకు కూడా ఆ విషయం తెలుసునని రోజా అన్నారు. పార్టీ నాయకులు కొందరు అమ్ముడుపోయి కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన విషయం అందరికీ తెలుసునని ఆమె అన్నారు. పనిచేసే వారని పార్టీలో ఇబ్బంది పెడుతుంటే పనిచేయలేమని, అలాంటివి చేసినవారి విషయం చంద్రబాబు నాయుడికి కూడా తెలుసునని ఆమె అన్నారు. అలాంటి వారిని పక్కన పెట్టకపోతే ఎలా అని ఆమె అడిగారు. చంద్రబాబు కొందరు నాయకులు చెప్పినట్లే వింటూ పని చేసేవారిని ప్రోత్సహించలేకపోతున్నారని ఆయన అన్నారు. తనకు వాయల్పాడు గానీ నగరి గానీ ఇవ్వాలని కోరారని, కొత్త నాయకులు కావాలనే పేరుతో కొందరు తనను వాటికి దూరం చేశారని ఆమె అన్నారు. పార్టీలో జరిగిన వ్యవహారాలకు తన మనసు గాయపడిందని ఆమె అన్నారు. కాంగ్రెసులో చేరితే గనుక ప్రజలకు ఉపయోగపడేలా కార్యకర్తలను కాపాడుకుంటానని ఆమె అన్నారు. ముఖ్యమంత్రిపై ఆమె ప్రశంసలు కురిపించారు.

రోజాను బెదిరించారు: ఎర్రబెల్లి


హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు రోజా కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి వర్గీయులు బెదిరించడం వల్లనే ఆమెకు కాంగ్రెస్‌లోకి వెళ్లాలని లేకున్నా తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ తీర్థం పుర్చుకోవడానికి సిద్ధమైదని టీడీపీ సీనియర్‌నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు సోమవారం ఇక్కడ మీడియా సమావేశంలో ఆరోపించారు. తెలుగుదేశం పార్టీలో రోజాకు చాలా ప్రాధాన్యం ఇచ్చామని, ఎన్నో అంశాల్లో సీనియర్లను కాదని ఆమెకు సముచిత స్థానం కల్పించామన్నారు. పార్టీ నేతల వల్లనే తాను ఓడిపోయానని, తనకు పార్టీలో అవమానం జరిగిందని రోజా ఆరోపణలు చేయడంలో అర్థం లేదన్నారు. ఎమ్మెల్సీ పదవి ఇస్తానంటే పట్టుబట్టి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిందని, మళ్లీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఇవ్వలేదంటూ రాద్ధాంతం చేస్తుందన్నారు.

సీఎం రచ్చబండ చిత్తూరు నుంచే ప్రారంభం


చిత్తూరు: ప్రజాసంక్షేమం, అభివృద్ధికి సంబంధించి పది ముఖ్యమైన అంశాలు లక్ష్యంగా ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి సెప్టెంబర్‌ 2న తన రచ్చబండ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లాలో చేపట్టనున్నారు. జిల్లా అధికారులు ముఖ్యమంత్రి కార్యక్రమం సజావుగా జరిగేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా రచ్చబండ కార్యక్రమం కావడం పల్లె జనంతో నేరుగా ముఖ్యమంత్రి మాట్లాడి, సమస్యలు తెలుసుకుని అక్కడిక్కడే వాటి పరిష్కారానికై ఆదేశాలు జారీ చేయనున్నారని తేలడంతో ఆయా శాఖల అధికారుల్లో తీవ్ర ఉద్ఘంఠత ఏర్పడింది. ప్రజలు ఏ శాఖపై విమర్శలు గుప్పిస్తారో, అందుకు బలికావాల్సి వస్తుందేమోనని ప్రభుత్వా యంత్రాంగంలో ఒకింత వణుకు పుడుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పల్లెబాటలో భాగంగా చిత్తూరు నుంచే రచ్చబండ సమావేశాలకు శ్రీకారం చుట్టనున్నారు. సెప్టెంబర్‌ 2న ఈ కార్యక్రమాన్ని జిల్లాలో లాంఛనంగా ప్రారంభిస్తారని జిల్లా అధికారులకు ప్రాథమిక సమాచారం అందింది. దీంతో నివేదికలు సిద్ధం చేయడంలో అధికారులు తలమునకలయ్యారు.

వ్యవసాయానికి 9గంటలు ఉచిత విద్యుత్‌


గుడుపల్లె: రాష్ట్ర రైతాంగాన్ని అన్నివిధాలా ఆదుకోవాలని ప్రస్తుతం వ్యవసాయానికి ఇస్తున్న 7గంటలు ఉచిత విద్యుత్‌ను ఇకపై 9 గంటల పాటు సరఫరా చేయటం జరుగుతుందని రాష్ట్ర అటవీ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను 7 గంటలు మాత్రమే ఇవ్వడం జరుగుతోందని అయితే త్వరలోనే 9 గంటలు విద్యుత్‌ సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధ్దమవుతున్నట్లు పేర్కొన్నారు.

కుప్పం నుండి ఎన్నికై తొమ్మిదేళ్ల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. తన తొమ్మిదేళ్ల పాలనను హైదరాబాదుకే మాత్రమే పరిమితం చేశారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు, రైతుల కష్టాలను పరిష్కరించటంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యాడన్నారు. కాగా రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను తూచా తప్పకుండా అమలు చేస్తూ.. ప్రజల మనసులో చరగని ముద్ర వేసుకున్నారన్నారు.

చంద్రబాబుకు ఎన్నికల సమయంలో మాత్రమే రాష్ట్ర ప్రజలు గుర్తుకువస్తారని, దీంతో ఓట్ల కోసం ఆచరణకు సాధ్యం కాని వాగ్దానాలను చేస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించినందుకు ఆయనకు రాష్ట్ర ప్రజలు 2009 ఎన్నికల్లో తగిన గుణపాఠం నేర్పారన్నారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు పరిచిన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత న ా వల్ల కాదంటూ రూ.5.30 చేశారన్నారు. అయితే రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్ర ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మార్కెట్‌లో కిలో బియ్యం రూ.30 ఉన్నా..

మరలా రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. నిరుద్యోగ భృతి, ఏటిఎంల ద్వారా మహిళలకు నగదు బదిలీ చేస్తామన్న చంద్రబాబు 9 ఏళ్ల పాలననలో వాటిని ఎందుకు విస్మరించారని, అసలు ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను అమలు పరిచేందుకు నిధులు ఎక్కడ నుండి సమకూర్చుతాడో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రలకు తెలియజేయలేకపోయాడన్ని ఆయన విమర్శించారు. కుప్పం ప్రజలను మభ్యపెట్టి చంద్రబాబు గెలుపొందుతూ వస్తున్నాడన్నారు. ఇకపై కుప్పం ప్రజలు అభివృద్ధిని చూసి ఆదరించాలన్నారు.

రాజకీయాలకు అతీతంగా కుప్పంను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడం జరుగుతుందని కుప్పం అభివృద్ధి విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. రెండో రోజు మంత్రి పర్యటనలో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టున్న పంచాయతీల్లో సైతం ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టడాన్ని చూస్తే కుప్పంలో కాంగ్రెస్‌కు మళ్లీ పూర్వ వైభవం వస్తుందనే విషయం స్పష్టంగా తెలుస్తోందని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. ప్రధానంగా మంత్రి తన రెండు రోజుల పర్యటనలో ఓ వైపు చంద్రబాబుపై విమర్శానాస్త్రాలు సంధిస్తూ.. మరో వైపు రాజశేఖరరెడ్డి హయాంలోనే రాష్ట్రంతో పాటే కుప్పం అభివృద్ధి సాధ్యమని కుప్పం ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

కాణిపాకం లంబోదరుడికి ప్రభుత్వం పట్టువస్ర్తాలు


చిత్తూరు: కాణిపాకంలోని లంబోదరడికి ప్రభుత్వం తరుపున పట్టు వస్ర్తాలను రోడ్లు భవనాల శాఖ మంత్రి గల్లా అరుణ కుమారి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు బాగుండాలని కోరుకున్నట్లు చెప్పారు. ఇక్కడ వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.