సమన్వయంతో రైతు చైతన్య యాత్రలు


గుంటూరు: రైతు చైతన్య యాత్రల విజయవంతానికి వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ బి. రామంజనేయులు అన్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా ప్రారంభంకానున్న రైతు చైతన్య యాత్రల కార్యక్రమాన్ని స్ధానిక కృషిభవన్‌లో కలెక్టర్‌ లాంచనంగా ప్రారంభించారు. ఈ నెల 17 నుండి జూన్‌ 2వ తేదీ వరకు జిల్లాలోని ప్రతి మారుమూల గ్రామాలలో సైతం ఈ యాత్రలు జరుగనున్నాయి.

ఈ సందర్భంగా కలెక్టర్‌ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ గత సంవత్సరం జరిగిన రైతు చైతన్య యాత్రలలోని అనుభవాలను దృష్టిలో వుంచుకుని ఈ సవత్సరం తగిన ముండు జాగ్రత్తలతో, సమాచారంతోరైతుల వద్దకు వెళ్లాలన్నారు. ఇటీవల ముగిసిన ప్రజాప్ధం కార్యక్రమం వలెనే రైతు చైతన్య యాత్రలను కూడా ఘనంగా నిర్వహించాలన్నారు. రైతుచైతన్య యాత్రలలో అధికారుల దృష్టికి వచ్చిన రైతు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ముఖ్యమైన అంశాలపై జూన్‌ మాసంలో జరిగే రైతు సదస్సులలో ప్రస్తావించి తగిన నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందని కలెక్టర్‌ తెలియచేశారు.

ఈ విషయాలను రైతులకు స్పష్టంగా తెలిజెప్పాలన్నారు. 2009-10 సంవత్సరంలో జిల్లాలో వ్యవసాయ ప్రణాళిక అమలును పకడ్బందీగా నిర్వహించడం, వ్యవసాయ విధానాలను సక్రమంగా అమలుపరచడం, రైతుల పట్ల అధికారుల స్పందన, తదితర కార్యక్రమాల నిర్వహణ వలన రాష్ట్రస్ధాయిలో ఉత్తమ సంయుక్త సంచాలకులుగా ఐ.రామకృష్ణమూర్తి ప్రభుత్వం నుండి అవార్డు పొందడం హర్షదాయకమని అన్నారు. ఇదే రీతిలో ఈ సంవత్సరం కూడా మరిన్ని ముందస్తు ప్రణాళికలతో అధికారులు పనిచేయవలసి ఉంటుందని కలెక్టర్‌ సూచించారు.

ప్రజాపధం కార్యక్రమంలో ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీపై రైతులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందేనని అన్నారు. అలాగే నిల్వ ఉన్న ధాన్యాన్ని కోనెందుకు ఎవరూ ముండుకు రావడంలేదన్న విషయాన్ని రైతులు అనేక సార్లు తెలియజేశారని చెప్పారు. ధాన్యం కొనుగోలు విషయంలో దేశం మొత్తం మీద ఒకే నిబంధన ఉందన్నారు. రైతుల వద్ద వున్న ధాన్యాన్ని కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న విషయాన్ని రైతు చైతన్య యాత్రలలో అధికారులు రైతులకు తెలియజేయాలన్నారు.

అదే విధంగా మిర్చి యార్డులో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా నష్టపోయిన రైతులకు ఇంకనూ కోటి 80 లక్షల రూపాయలు చెల్లించవలసి వుందని అన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన వెంటనే రైతులకు చెల్లించడం జరుగుతుందన్న విషయాన్ని కూడా రైతులకు వివరించాలన్నారు. అలాగే భీమా తాలూకు సొమ్ము నాలుగున్నర కోట్ల రూపాయలలో ఇప్పటి వరకూ 3 కోట్లు చెల్లించడం జరిగిందన్నారు. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం పంట విస్తీర్ణం, దిగుబడి పెరిగే అవకాశం వుందన్నారు.

గ్రామాలలోని ఆదర్శ రైతుల ద్వారా ఏ రైతు ఎంత విస్తీర్ణంలో ఏ పంట వేసింది వివరాలను ముందుగా జాగ్రత్త చేసుకోవాలన్నారు. అలాగే ప్రతి రైతు బ్యాంకులలో ఖాతాలు కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని ఏ ఒక్క రైతుకు కూడా బ్యాంకులో ఖాతా లేదు అని చెప్పడానికి వీలు లేకుండా అధికారులు కృషి చేయవలసి ఉంటుందని ఆయన సూచించారు. గ్రామాలలో సభలను నిర్వహించి ఖరీఫ్‌లో డిమాండ్‌ ఎంత ఉందో చర్చించాలన్నరు. రైతులకు అనుకూలమైన సమయాలలో అధికారులు వెళ్ళి పంట దిగుబడి పెంచేందుకు తీసుకోవలసిన చర్యలను వివరించాలన్నారు. విధి నిర్వహణ లో అలసత్వం, నిర్లక్ష్యం పనికిరాదని ఆయన స్పష్టం చేశారు.

రైతు చైతన్య యాత్రలలో ప్రతి శాఖ అధికారి రైతులకు అండుబాటులో వుండాలని, వారు చెప్పిన సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేయాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో నిర్వహించవలసిన ఉమ్మడి కార్యక్రమం రైతు చైతన్య యాత్రలని కలెక్టర్‌ అన్నారు. కార్యక్రమానికి వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు శ్రీ ఐ.రామకృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. రైతు చైతన్య యాత్రలలో చేపడుతున్న కార్యక్రమాల గురించి కలెక్టర్‌ కు వివరించారు. ఈ సందర్భంగా వ్యవసాౖయ, సశుసంవర్ధక, మత్స్య, అటవీ, పట్టు పరిశ్రమ, ఉద్యానవన శాఖలు ముద్రించిన కరపత్రాలను కలెక్టర్‌ ఆవిష్కరించారు. అనంతరం రైతు చైతన్య యాత్రలను కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ దామోదర నాయుడు, మత్స్య శాఖ ఉప సంచాలకులు బసవరాజు, డివిజనల్‌ అటవీ శాఖాధికారి శ్రీనివాస శాస్త్రి, పట్టు పరిశ్రమ సహాయ సంచాలకులు సులేమాన్‌ బాషా, ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు మధుసూధన రెడ్డి, పద్మావతి, ఆయా శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Advertisements

గుంటూరులో విజయవంతంగా ప్రజాపథం


గుంటూరు: గత నెల 19న జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన ప్రజాపధం కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని గుంటూరు జిల్లా కలెక్టర్‌ బి.రామాంజనేయులు చెప్పారు. బుధవారం గుంటూరు నగరంలోని 47వ డివిజన్‌లో శివనాగరాజు కాలనీలో జరిగిన ప్రజాపధం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. వేసవిలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు, విద్యుత్‌, తదితర సమస్యలను సాధ్యమైనంతవరకు అక్కడికక్కడే పరిష్కరించడమే ప్రజాపధం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు.

గుంటూరు నగర జనాభా గత 2 సంవత్సరాల క్రితం 4 లక్షలుండగా ప్రస్తుతం 7 లక్షలకు పెరిగిందన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అవసరాలు, సమస్యలు కూడా పెరుగుతున్నాయని, వాటిని తీర్చేందుకు, పరిష్కరించేందుకు ప్రజాపధం కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి కావలసిన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

నగర ప్రజలకు దాహార్తిని తీర్చేందుకు 147 కోట్ల రూపాయలతో మంచినీటి పధకం మంజూరుకానున్నట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పధకాల వలన ప్రతి కుటుంబంలో 4, 5 ప్రయోజనాలు పొందుతున్నారని చెప్పారు. నగర మేయర్‌ శ్రీ రాయపాటి మోహన సాయి కృష్ణ మాట్లాడుతూ ఆగష్టు 1వ తేదీ నుండి నగరంలోని ప్రతి ఇంటికి తాగునీరు అందే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు.

ప్రతి పేదవానికి సొంత ఇంటి కలను నిజం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గుంటూరు-1 శాసనసభ్యులు శ్రీ మస్తాన్‌ వలి మాట్లాడుతూ, ప్రజాపధం కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రజాసమస్యల పరిష్కరానికే ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా వివిధ సమస్యలపై ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నగర కమీషనర్‌ డాక్టర్ ఇలంబరిది, తాసీల్దార్‌ బాపిరెడ్డి, కార్పోరేటర్లు, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

మైనింగ్‌శాఖ ఆదాయ లక్ష్యం 100 కోట్లు


గుంటూరు: జిల్లాలో మైనింగ్‌శాఖ ద్వారా 2009-10 సంవత్సరానికి 100 కోట్ల రూపాయల ఆదాయాన్ని సేకరించేందుకు లక్ష్యంగా నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్‌ బి.రామాంజనేయులు వెల్లడించారు. కలెక్టరేట్‌లోని డి.ఆర్‌.సి. సమావేశ మందిరంలో మైనింగ్‌ అధికారులు, స్టోన్‌ క్రషర్‌ యజమానులతో జిల్లా కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాల మేరకు 2010 సంవత్సరం మార్చి కల్లా పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే విషయంలో స్టోన్‌క్రషర్‌ యజమానులు అధికారులతో సహకరించాలన్నారు.

క్వారీ యజమానులు ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుతామనే భరోసా ఇస్తే ప్రభుత్వపరమైన సహకారం అందిస్తామన్నారు. మున్సిపాలిటీల్లో గ్రామ పంచాయితీలకు కావాల్సిన శానిటేషన్‌ మెటీరియల్‌ ఆర్డర్లు ఇప్పించడం జరుగుతుందన్నారు. స్టోన్‌క్రషర్స్‌, సున్నపు మిల్లుల్లో పనిచేసే కార్మికులు మరణించినట్లయితే వారి కుటుంబాలను ఆదుకోవాలన్నారు. అలాగే జిల్లా అధికారులకు సంబంధిత సమాచారం తెలియజేయాలన్నారు.

గుంటూరు జిల్లాను పారిశ్రామికీకరణ దిశగా పయనించడానికి అందరూ సహకరించాలన్నారు. సమాజ శ్రేయస్సు దృష్టిలో వుంచుకుని క్వారీ యజమానులు ముందుకు వచ్చినందుకు జిల్లా కలెక్టర్‌ క్వారీ యజమానులను అభినందించారు. ఈ సమావేశంలో మైనింగ్‌శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ బలరామయ్య, అసిస్టెంట్‌డైరెక్టర్‌ శ్రీనివాసరావు, సుబ్రహ్మణేశ్వరరావు, స్టోన్‌ క్రషర్‌ యజమానులు, తదితరులు పాల్గొన్నారు.

దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేది జర్నలిస్టు


గుంటూరు: దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటడంలో జర్నలిస్టు పాత్ర కీలకమని షార్జా యూనివర్శిటీ కమ్యూనికేషన్‌ విభాగం ఆచార్యులు గనీమ్‌ సమురాయ్‌ అభిప్రాయపడ్డారు. వర్శిటీ ఇంగ్లీష్‌ విభాగం ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా జరిగిన అంతర్జాతీయ సదస్సులో పాల్గోనేందుకు విచ్చేసిన ఆయన వర్శిటీ జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగం విధ్యార్థులతో ఏర్పాటు చేసిన ‘జర్నిలిస్టు పాత్ర’ అవగాహన కార్యక్రమంలో పాల్గోని ప్రసంగించారు.

ఈ కార్యక్రమానికి వర్శిటీ జర్నలిజం విభాగం కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ జి.చెన్నారెడ్డి అధ్యక్షత వహించగా, ఆస్ట్రేలియా వల్గార్‌ వర్శిటీ ఆచార్యులు ఎ.బ్లాక్‌మూర్‌ మరో అతిథిగా హజరయ్యారు. ఈ సంధర్బంగా సమురాయ్‌ మాట్లాడుతూ జర్నలిస్టులు ఎట్టిపరిస్థితుల్లో ప్రలోభాలకు లోంగకుండా సత్యంపైన నిలవాలని కోరారు. ప్రస్తుతం పత్రికలు ప్రభుత్వాల స్కోత్కర్షలకు, ప్రతిపక్షాల విమర్శలకే తప్ప ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తున్నాయని విమర్శించారు. ఈ పరిస్థితి వెనుకబడిన దేశాల్లోనే కాక అభివృద్ది చేందిన, చెందుతున్న దేశాల్లోను ఉందన్నారు. ప్రజా సమస్యలను ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకెళ్లడమే ముఖ్య విధిగా విలేఖరి పనిచేయాలన్నారు.

జర్నలిస్టులు పాత్ర కేవలం ప్రెస్‌నోట్‌లకే పరిమితమవుతుందని ఆవేదన వ్య్తం చేశారు. మరో అతిథి ఆస్ట్రేలియాలోని వల్గాన్‌ గాంగ్‌ వర్శిటీ ఆచార్యులు ఎ.బ్లాక్‌మూర్‌ విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తు ప్రజలకు, ప్రభుత్వాలకు మద్య వారధిలా జర్నలిస్టు పనిచేయాలన్నారు. సత్యనిరతి, దూరదృష్టి కలిగి మెలగాలని సూచించారు. ప్రజల సమస్యలను ఏకరువు పెట్టినపుడే ఆ దేశం ఆభివృద్ది పథంలో నడుస్తుందన్నారు. ఆ దిశగా కృషిచేయాల్సిన అవసరం జర్నలిస్టుకు ఉందన్నారు. ప్రజలు తమ దేశ వారసత్వసంపదను తెలుసుకోలేని రోజు ఆ దేశ ఔన్నత్యం, పురోగతి సాధించడం కష్టతరంమవుతుందన్నారు. దేశంపైన, ప్రజల జీవన స్థితిగతులపైన జర్నలిజం విద్యార్థులకు పూర్తఇవగాహన కల్గివుండాలన్నారు.

జర్నలిజం అంటే అది కేవలం ఒక సబ్జెక్టు కాదన్నారు. ప్రపంచంలోని సగటు మనిషిపై ప్రభావం చూపే ప్రతి అంశం ఇందులో చేర్చబడి వుంటుందన్నారు. కేవలం దీన్ని ఒక కోర్సుగా పరిగణలోకి తీసుకోలేమని, అలా తీసుకోవడం వల్ల లక్ష్యం పరిపుష్టం కాదన్నారు. జర్నలిజం విభాగం కో-ఆర్డినేటర్‌ జి. చెన్నారెడ్డి మాట్లాడుతూ ఇలాంటి ఉన్నత బోధనాప్రమాణాలు కల్గిన అధ్యాపకులచేత ఉపన్యాసాలు ఏర్పాటు చేయడంవల్ల విద్యార్థులకు జర్నలిజంపై అవగాహన పెంచవచ్చునని అన్నారు. ఎ.బ్లాక్‌మూర్‌, గనీమ్‌సమురాయ్‌లను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో విభాగం ఫ్యాకల్టీలు, విద్యార్థులు తదితరులు పాల్గోన్నారు.

పులిచింతల నిర్వాసితుల మౌలిక వసతులు త్వరగా కల్పించండి: జెసి


గుంటూరు: పులిచింతల ముంపు గ్రామాల నిర్వాసితులకు మౌలిక సదుపాయాల కల్పన ఏర్పాట్లను ముమ్మరం చేయాలని జెసి డాక్టర్‌ గౌరవ ఉప్పల్‌ అన్నారు. తన ఛాంబర్‌లో నేడు ఆయన పులిచింతల అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్వాసితులకు పక్కా గృహాలను వారు ఇష్టపడిన నమూనలో నిర్మించాలని, విద్యుత్‌ సౌకర్యం తదితర ఏర్పాట్లను త్వరతగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఏమ్మాజిగూడెం, బోధనం, కేతవరం గ్రామస్థులకు పునరావస ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. అదేవిధంగా వీలైనంత త్వరగా రహదారుల నిర్మాణం కూడా చేపట్టాలని అన్నారు. మౌలిక సదుపాయలు కల్పించినప్పుడే నిర్వాసితులు అసక్తి చూపుతారని, వెంటనే అందుకు సంబంధించిన కార్యక్రమాలను చేపట్టాలని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో పులిచింతల స్పెషల్‌ కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఆహ్మద్‌, నాగేశ్వరరావు, పులిచింతల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నియమాలను పాటించని కళాశాలలపై కఠిన చర్యలు


గుంటూరు: నిబంధనలు ఉల్లంఘించే జూనియర్‌ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్మీడియట్‌ బోర్డు ఆర్‌ఐఓ ఎస్‌.కోటేశ్వరరావు పేర్కొన్నారు. పట్టణంలోని ప్రవేటు జూనియర్‌ కళాశాలల తనిఖీ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని 227 జూనియర్‌ కళాశాలలు ఉన్నాయన్నారు. గత ఏడాది 45 వేల మంది ఇంటర్‌ విద్యనభ్యసించగా ఈ ఏడాది 50వేల మంది ఉండవచ్చని అన్నారు. గత నెల 22వ తేదితో ఇంటర్‌ ప్రవేశాలకు గడవుపూర్తయిందని అన్నారు. జిల్లావ్యాప్తంగా 21 ప్రైవేటు కళాశాలలు నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించామని తెలిపారు. ఈ కళాశాలల నుంచి లక్ష రూపాయల పెనాల్టీని వసూలు చేయనున్నట్లు పేర్కొన్నారు. కళాశాలలో మౌలిక వసతులు, ల్యాబ్‌ పరికరాలు, విద్యార్థుల సామర్థ్యం తదితర వివరాలను నమోదు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులు ఈనెల 14వ తేదిలోగా పరీక్ష ఫీజులు చెల్లించాలని అన్నారు. ఆర్‌ఐఓ వెంబడి ఉదయబాస్కర్‌, తదితరులు ఉన్నారు.

ముగ్గురు మినహా జిల్లాలో మావోయిస్టులు లేరు


గుంటూరు: జిల్లాలో మావోయిస్టుల ప్రభావం లేదని, ముగ్గురు నాయకులు మాత్రమే మిగిలారని ఎస్పీ శంఖ బత్ర బాగ్చీ తెలిపారు. దుగ్గిరాల పోలీసుస్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం, వెల్దుర్తి, నిజాంసాగర్‌ మండలాలో ముగ్గురు మావోయిస్టులు మాత్రమే మిగిలారని, వారు అడపా, తడపా ప్రాంతాల్లో సంచరిస్తున్నారని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి వంటి వారు దేశంలోనే లేరని అన్నారు. అంతటి ఆదరణ ఉన్న నాయకుడు కనుకనే ఆయన మృతితో 300 మంది గుండెచప్పుడు ఆగిపోయిందన్నారు. ఆయన ప్రవేశ పెట్టిన పథకాలే ఆయన్ను చిరస్మరణీయంగా చరిత్రలో నిలిచిపోయేవ్యక్తిగా చేశాయన్నారు. ఇతర దేశాల్లో కూడా ఆయా పథకాలు ఆదర్శంగా ఉన్నాయన్నారు. స్టేషన్‌లలో సిబ్బంది కొరతపై మాట్లాడుతూ, నవంబర్‌ నెలలో పోలీసు సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపారు. నరసరావుపేటలో మరొక పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు అవసరమవుతుందన్నారు. ప్రమాద సంఘటనలు నిరోధించేందుకు ఆర్‌ అండ్‌ బి శాఖతో మాట్లాడతామన్నారు. సమావేశంలో ఎస్‌ఐ రవికుమార్‌, తదితరులు పాల్గొన్నారు.