విషజ్వరాల బారిన విద్యార్థులు


రాయికల్‌: మండలంలోని ఒడ్డెలింగాపూర్‌ గిరిజన గురుకుల పాఠశాలలో విషజ్వరాలు విజృంభించాయి. జ్వరాలతో విద్యార్థులు మంచాన పడ్డారు. సకాలంలో వైద్యం అందకపోవడంతో విలవిల్లాడుతున్న విద్యార్థులను ఆశ్రమ పాఠశాల సిబ్బంది శుక్రవారం రాయికల్‌ ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. ఈ ఆశ్రమపాఠశాలలో వివిధ మండలాలకు చెందిన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కొన్ని రోజులుగా విద్యార్థులు జ్వరాలతో బాధపడుతున్నా పట్టించుకునే నాథుడే లేకపోవడం బాధాకరం. ప్రభుత్వ వైద్య సిబ్బంది ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు శ్రద్ద కనబరచకపోవడంతో విద్యార్థులు చాలా అవస్థలు పడుతున్నారు.

ఈ విషయం తెలుసుకున్న ఆదివాసి గిరిజన హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆత్రం రవిందర్‌ గురుకుల సిబ్బందిని నిలదీయడంతో బాధిత విద్యార్థులను వైద్య సేవల కోసం రాయికల్‌ ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. స్థానిక వైద్యులు వేదవ్యాస్‌ విద్యార్థినిలను పరీక్షించి మందులను అందజేసారు. గురుకులంలో వార్డెన్‌పోస్టు గత కొంత కాలంగా ఖాళీగా ఉండటంతో పర్యవేక్షణ కరువైందని, దాంతో ఉపాధ్యాయులు ఇష్టారాజ్యంగా విధులు నిర్వర్తిస్తున్నారని గిరిజన సంఘ నాయకుడు రవిందర్‌ ఆవేదన వ్యక్తం చేసారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వార్డెన్‌ పోస్టును భర్తీ చేయాలని విజ్ఞప్తి చేసారు.

Advertisements

వారపుసంతలకు తరలిస్తున్న కలప!


విశాఖపట్నం: మన్యంలో ఎటు చూసినా పచ్చదనం కనులపండువ చేస్తుంది. కొండకోనల్లో పెరిగిన వృక్షాలు పచ్చ ‘ధనానికి’ రక్షణగా కొలువు తీరుతాయి. అయితే స్మగ్లర్ల స్వార్థ్యం గొడ్డలివేటుకు ఈ చెట్లు నేలకూలుతున్నాయి. మరోవైపున రోజు గడవడానికి గిరిజనులు చెట్లను నరుకుతున్నారు. కలపను సంతల్లో సైతం అమ్ముతున్నారు. వారపు సంతల్లో బహిరంగంగా కలపను అమ్ముతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ వ్యవహారంపై అటవీ శాఖ అధికారులు దృష్టి పెట్టడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. బూదరాళ్ల పంచాయతీకి చెందిన సుమారు 30 గ్రామాల గిరిజనులు గతంలో వారపుసంతలకు అడ్డాకులు, కోవెల జిగురు వంటి అటవీ ఫలసాయాన్ని తెచ్చి విక్రయించేవారు. అటవీశాఖ అధికారులకు భయపడి కలపను చాటుమాటున విక్రయించేవారు. అయితే అటవీశాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో అవకాశం చూసుకుని కలపను బహిరంగంగా విక్రయిస్తున్నారు. వేలల్లో ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న కలప విక్రయం వైపు చాలా మంది మొగ్గు చూపుతున్నారు. మైదాన ప్రాంతాల నుంచి వ్యాపారస్తులు ఈ కలపను పెద్ద ఎత్తున కొని తోటల్లో భద్రపరిచి రాత్రి రవాణా చేస్తున్నారు. అయితే ఇంత బహిరంగంగా కలప వ్యాపారం జరుగుతున్నా అటవీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం శోచనీయమని స్థానికులు విమర్శిస్తున్నారు. గిరిజనులకు అవగాహన లేక విలువైన చెట్లను నరికేస్తున్నారని, అధికారులు దీన్ని అడ్డుకోవాలని కోరుతున్నారు.

గిరిజనుల జీవన స్థితిగతులపై అధ్యయనం


విశాఖపట్నం: గిరిజనుల సామాజిక జీవన విధానాలపై ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ లాండ్‌ యూనివర్సిటీ విద్యార్థినులు అధ్యయనం చేస్తున్నారు. హుకుంపేట మండలం మెట్టుజోరు పంచాయతీ రంగపల్లి గ్రామంలో ఆస్ట్రేలియా విద్యార్థినులు పర్యటించి గిరిజన మహిళల జీవన విధానాన్ని గూర్చి తెలుసుకున్నారు. గిరిజన సంస్కృతి, ఆచార సాంప్రదాయాల, ఆహారపు అలవాట్లు గురించి అడిగి తెలుసుకున్నారు. ఒక రోజంతా గిరిజనులతో గడిపి కుటుంబ పరిస్థితులను, ఆహార పదార్థాలను పరిశీలించారు. ముఖ్యంగా గిరిజన వ్యవసాయ పనులు, పంటలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఆస్ట్రేలియాలో క్విన్స్‌లాండ్‌ యూనివర్సిటీలో సామాజిక సేవలో బ్యాచిలర్‌ డిగ్రీ చదువుతున్నామని, గ్రామీణ వాతావరణ పరిస్థితులు, గిరిజన ప్రజల జీవన విధానం, ఆహారపు అలవాట్లు, వారి సమస్యలపై రీసెర్స్‌ చేయడానికి ఇండియా వచ్చినట్లు విద్యార్థినులు తెలిపారు. ఇండియాలో మూడు నెలలపాటు వివిధ గ్రామాలను పర్యటిస్తామని వారు చెప్పారు. విశాఖ జిల్లా లయ స్వచ్ఛంద సంస్థ ద్వారా వివిధ గ్రామాల్లో పర్యటించి సామాజిక పరిస్థితుల గురించి అధ్యయనం చేస్తున్నామని వారు తెలిపారు.

అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీల్ని వెంటనే భర్తీ చేయండి!


విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీల్ని భర్తీ చేయడానికి సత్వరం చర్యలు చేపట్టినట్టు గిరిజన సంక్షేమశాఖ మంత్రి పసుపులేటి బాలరాజు వెల్లడించారు. ఆయన ఇక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఏజెన్సీలో తహశీల్థార్లు, ఎం.పి.డి.ఒ. పోస్టులతో పాటు జి.సి.సి. ఇంజనీరింగ్‌, విద్య, వ్యవసాయం తదితర శాఖల్లో ఖాళీల్ని భర్తీ చేస్తామని చెప్పారు. వసతి గృహాల్లో విద్యావాలంటీర్ల నియామకానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలో 104 మంది విద్యా వాలంటీర్లరని నియమించి కొన్ని నెలల అనంతరం తొలగించారని, తిరిగి వారిని నియమిస్తామన్నారు. కరవు పరిస్థితుల నేపథ్యంలో కంటిజెన్సీ ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఏజెన్సీలో ఇప్పటికీ 15,088 హెక్టార్లలో వరినాట్లు జరగలేదని చెప్పారు. పంటల బీమా పథకంలో రాజ్‌మా, నువ్వు, మొక్కజొన్న, పసుపు పంటల్ని చేర్చేలా ప్రతిపాదనలు పంపాలని అధికారుల్ని ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు.

అటవీహక్కుల చట్టం పట్టాల పంపిణీ


కరీంనగర్‌: రాష్ట్ర ప్రభుత్వం 2006లో అటవీహక్కుల గుర్తింపు చట్టాన్ని తెచ్చింది. ఈ చట్టం క్రింద కరీంనగర్‌ జిల్లాలోని 1618 మంది గిరిజనులకు, ఇతర పరంపరాగత అటవీ నివాసితులకు ప్రయోజనం కలిగింది. ప్రభుత్వం గిరిజనులకు త్వరితగతిన పట్టాలు అందజేయాలని నిర్ణయించినమేరకు కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ సుల్తానియా ప్రత్యేక శ్రద్ధ, చొరవ తీసుకుని కార్యక్రమం అమలుకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా తేదీ 14-62009న మంథని అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కాటారంలో పంపిణీ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖామాత్యులు డి.శ్రీధర్‌బాబు గిరిజనులకు పట్టాలు అందజేసారు. నియోజకవర్గం పరిధిలో ఐదు మండలాలలోని 52గ్రామాలకు చెందిన 1125మంది లబ్దిదారులకు 10109ఎకరాలలో పట్టాలు మంత్రి అందజేసారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ అటవీహక్కుల ద్వారా గిరిజనులకు ఆ భూమిపై నివసించే హక్కు, చిన్నతరహా అటవీఉత్పత్తులు, అడవిలో పశువులు మేపుకొనేందుకు, చేపలు పట్టేందుకు మత సంబంధమైన స్థలాలపై హక్కు, సాంప్రదాయక అటవీ సంపద, మందు మొక్కలు, కొండపోడు భూములపై హక్కు లభిస్తుందన్నారు. ఈ చట్టం ద్వారా గిరిజనుల జీవితాలలో వెలుగులు వస్తాయని, గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం చేతనైనంత సహాయం చేస్తుందన్నారు. గిరిజనుల ఉత్పత్తులకు స్థానికంగా మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తామన్నారు. జిల్లా కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ సుల్తానియా మాట్లాడుతూ జిల్లాలోని 1618మందికి 2800ఎకరాలలో పట్టాలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. జగిత్యాల డివిజన్‌లో 87మందికి 104 ఎకరాలలో, సిరిసిల్లా డివిజన్‌లో 406మందికి 787ఎకరాలలో, మంథని డివిజన్‌లో 1125మంది 1909 ఎకరాలలోపట్టాలు అందజేసామన్నారు. ఈచట్టం క్రింద లబ్ధిపొందిన గిరిజనుడు లక్ష్మణ్‌ మాట్లాడుతూ తాను ఎన్నో సంవత్సరాలు ఇందుకొరకు ఎదురుచూస్తున్నానని అన్నాడు. ప్రభుత్వం తమ కోరికను మన్నించి భూమి ఇచ్చినందుకు ఆనందం వ్యక్తం చేసారు.

మంచాన పడిన ఆశ్రమ పాఠశాలలు


పార్వతీపురం‌: ఐటిడిఎ పరిధిలోని పలు గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు జ్వరాల బారిన పడ్డారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించడంలో సిబ్బంది నిర్లక్ష్యంపై ఐటిడిఎ పిఒ ఎం రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం పలు ఆశ్రమ పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జ్వరాలతో బాధపడుతున్న పలువురు విద్యార్థులను ఆయన దృష్టికి వచ్చింది. ఈ విద్యాసంవత్సరం మొదలై మూడు నెలలు గడుస్తున్నా విద్యార్థులకు వైద్య పరీక్షలు చేపట్టకపోవడంపై ఆయన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కురుపాం మండలానికి చెందిన పిఆమిటి, లంకాజోడు, గిరిజన సంక్షేమ ఆశ్రమబాలికల ఉన్నత పాఠశాలలను తనిఖీ చేశారు. కురుపాం మండలానికి చెందిన పిఆమిటి సంక్షేమ వసతిగృహంలో 10 మంది విద్యార్థులు జ్వరాలతో బాధపడుతున్నారు.

వారిలో పదో తరగతికి చెందిన సంకీర్తన, నాగమణి, 9వ తరగతికి చెందిన బిడ్డిక మందారి, కామేశ్వరి, నాలుగు, ఐదు, ఆరు తరగతులకు చెందిన మౌనిక, దేవి, అనీలా జ్వరంతో బాదపడుతూ కఠిక నేలపైనే పడుకున్న ఉండడాన్ని పిఒ గమనించారు. దీంతో పిఒ చలించిపోయారు. విద్యార్థులపట్ల సిబ్బంది తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. మండలానికి చెందిన లంకాజోడు ఆశ్రమ పాఠశాలలో నలుగురు విద్యార్థులు జ్వరాల బారిన పడి ఉన్నప్పటికీ సంబంధిత హెచ్‌ఎమ్‌ వి.పెంటారావు అవగాహన లేకుండా ఒక్కరికీ కూడా జ్వరాలు లేవని ప్రాజెక్టు అధికారిని తప్పుతోవపట్టించేందుకు చేసిన ప్రయత్నాన్ని గమనించిన పిఓ సంబంధిత హెచ్‌ఎమ్‌పై మరోమారు ఇదే పరిస్థితి కొనసాగితే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ పర్యటనలో పలు ఆసక్తికరమైన విషయాలు విలేకరుల దృష్టికి వచ్చాయి.

విద్యార్థుల ఆరోగ్యపై కానరాని శ్రద్ధ: మారుమూల గిరిజన ప్రాంతాల నుంచి వసతి గృహాల్లో చేరిన విద్యార్థులు అనారోగ్యం పాలైతే సిబ్బంది పట్టించుకునే పరిస్థితి ఎక్కడా కానరాలేదు. మరింత ముఖ్యంగా విద్యార్థులు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకునే పరిస్థితి కూడా లేదు. అనారోగ్యం గురైన విద్యార్థులపై కనీస శ్రద్ధ చూపిన పాపాన పోవడంలేదు. పి ఆమిటి ఆశ్రమ పాఠశాలలో 10 మంది రోగాల బారిన పడితే కేవలం రెండు మంచాలపైనే వారు ఉన్నారు. ఇకపోతే లంకాజోడు ఆశ్రమ పాఠశాలలో ఒక మంచం కూడా లేకపోవడం గమనార్హం. అనారోగ్యంపాలైన విద్యార్థులకు వైద్య సేవలందించే పరిస్థితి అంతంత మాత్రమే.

కానరాని వైద్య పరీక్షలు

నిభందనల మేరకు సంక్షేమ వసతిగృహంలో ఉంటున్న విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నెలనెలా చేయించాల్సి ఉంది. అయితే ఇంత వరకు ఎక్కడా ఆవిధంగా పరీక్షలు జరిపిన దాఖలాలు కనిపించలేదు. క్రమంలో పరీక్షలు చేపడితే ముందస్తు చర్యలు చేపట్టే వీలుంది.

వాకపల్లి దోషులను శిక్షించాలి


జి.మాడుగుల: వాకపల్లి ఆదివాసీ మహిళలపై రెండేళ్ల కిందట హత్యాచారం చేసిన దోషులను శిక్షించాలని జిల్లా పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు శ్రీరామ్మూర్తి డిమాండ్‌ చేశారు. జి.మాడుగుల మండలం నుర్మతి పంచాయతీ వాకపల్లిలో 11 మంది ఆదివాసీ మహిళలపై అత్యాచార ఆరోపణలు చోటు చేసుకుని రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మద్దిగరువు గ్రామంలో ఆదివాసీ స్వయంప్రతిపత్తి సాధన కమిటీ ఆధ్వర్యంలో నిరసన సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాకపల్లిలో 11 మంది ఆదివాసీ మహిళలపై అత్యాచారం జరిగిందని, అక్కడ దొరికిన గాజుముక్కలు, ఒకబాలుడు ఇచ్చిన సాక్ష్యం, సంఘటన జరిగిన ప్రదేశాలను బట్టి రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి నాగిరెడ్డి విచారణలో వెల్లడించారని ఆయన గుర్తు చేశారు.

అత్యాచారానికి పాల్పడిన 21 మంది పోలీసులను విశాఖపట్నం సర్క్యూట్‌ హౌస్‌లో ఆయన విచారించారని తెలిపారు. వైద్య పరీక్షలకు సంబంధించి అధికారుల నివేదికను, కమిషన్‌ విచారణ నివేదికలు, పోలీసులపై ఇచ్చిన సాక్ష్యాలను ప్రభుత్వం నమ్మలేదని, బాధిత మహిళలకు అన్యాయం జరిగిందని ఆయన ధ్వజమెత్తారు. పాడేరు కోర్టుకు పోలీసులు హాజరుకావాలని సమన్లు పంపితే వారు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుని తప్పించుకున్నారని, సుప్రీం కోర్టులో పౌరహక్కుల సంఘం కేసువేసిందని కోర్టు ఆదేశాల గురించి ఎదురు చూస్తున్నామన్నారు. వాకపల్లి బాధితులకు న్యాయం జరిగే వరకు దోసులకు శిక్షపడే వరకు ఆదివాసీలు మరో ఉద్యమం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గిరిజన ప్రాంతంలో గిరిజనేతరులకు ఇళ్లపట్టాలు ఇవ్వడానికి చట్టంలో లోసుగులను రాష్ట్ర ముఖ్యమంత్రి వెతుకుతున్నారని ఆరోపించారు.

1/70 చట్టం సవరణ చేసి గిరిజన ప్రాంతంలో 25 వేల గిరిజనేతరులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం కుట్రపన్నుతుందని శ్రీరామ్మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. బాకై్సట్‌ తవ్వకాలు చేపట్టి గిరిజన ప్రజలు జీవితాలను రోడ్డున పడేయడానికి ప్రభుత్వం పూనుకుంటుందన్నారు. జిల్లా మహిళా శక్తి అధ్యక్షురాలు సునీత మాట్లాడుతూ వాకపల్లి అత్యాచార సంఘటనపై న్యాయవిచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర అమరవీరుల బంధుమిత్రుల సంఘం అధ్యక్షుడు, జిల్లా పౌరహక్కుల సంఘం కార్యదర్శి జవ్వాది సూర్యనారాయణ తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో లింగేటి సర్పంచ్‌, కోంటా మత్స్యలింగం, కొర్రా సర్పంచ్‌ భీమ్‌ధర్‌, బొయితిలి సర్పంచ్‌ భీమ్‌బాబు, ఆదివాసీ స్వయం ప్రతిపత్తి సాధనకమిటీ అధ్యక్షుడు ఉల్లి సింహాచలం, పోతురాజు, సూరిబాబు, ధర్మన్నపడాల్‌ తదితరులు పాల్గొన్నారు.