120 కిలోల గంజాయి పట్టివేత


విశాఖపట్నం: నాలుగు లక్షల రూపాయల విలువచేసే 120 కిలోల గంజాయిని నర్సీపట్నం ఎక్సైజ్‌ అధికారులు పట్టుకున్నారు. రోలుగుంట మండలం ఎం.కొత్తపట్నం వద్ద వాహనాలను సోదా చేసి ఈ గంజాయిని పట్టుకున్నారు. విశాఖపట్నం డెప్యూటీ కమిషనర్‌ పి.చంద్రమౌళి, అనకాపల్లి ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు నర్సీపట్నం సీఐ ఎస్‌.జి.బహదూర్‌ గంజాయిని పట్టుకున్నారు. ముందుగా అందిన సమాచారం మేరకు ఎం కొత్తపట్నం వద్ద మాటు వేసి, ఆటోలో తరలిస్తున్న గంజాయిని ఎక్సైజ్‌ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. నాలుగు గోనె సంచులతో దీనిని తరలిస్తున్నారని ఎక్సైజ్‌ సీఐ తెలియజేశారు. అలాగే గూడెంకొత్తవీధిలో 30 కిలోల గంజాయిని గుట్టుచప్పుడు కాకురడా తరలిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు నిర్భంధించారు.

Advertisements

గంజాయి స్మగ్లర్లతో మావోయిస్టులకు అంతర్గత సంబంధాలు!


విశాఖపట్నం: ఆంధ్రా ఒరిస్సా సరిహద్దులో గంజాయి స్మగ్లర్లతో మావోయిస్టులకు అంతర్గత సంబంధాలున్నట్లు సందేహించాల్సి వస్తోందని విశాఖ జిల్లా ఎస్పీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ వ్యాఖ్యానించారు. గంజాయి అక్రమ రవాణా కేసుల్లో అరెస్టయిన వారిచ్చిన వాంగ్మూలాలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. దీనిపై మావోయిస్టులు ఏ నాడు ఖండించిన దాఖలాలు లేవన్నారు. సమసమాజ స్థాపన, నూతన ప్రజాస్వామిక విప్లవం అంటూ తిరుగుతున్న మావోయిస్టులకు గిరిజనుల జీవితాలు బుగ్గిపాలు చేస్తున్న గంజాయి సాగు, అక్రమ రవాణా కనిపించలేదా? అని ఎస్పీ ప్రశ్నించారు. స్మగ్లర్లను ఎప్పుడూ ఎక్కడా అడ్డుకోలేదని, ఇది అంతర్గతంగా వారి సంబంధాలను తెలియజేస్తోందని డబ్బు కోసమే చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని, రవాణా కూడా వారి కనుసన్నల్లోనే జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఎస్పీ వివరించారు. చోడవరం మండలం నర్సయ్యపేటలో అక్రమంగా రవాణా చేస్తున్న 115 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల రోజుల వ్యవధిలోనే 700 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు, 13 మందిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో గిరిజనులే అధికంగా ఉన్నారు. వ్యాపారులు వారిని పావులుగా వాడుకుంటూ గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నారని, అటువంటి ముఠాలపై కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ హెచ్చరించారు.

25 కిలోల గంజాయి పట్టివేత


విశాఖపట్నం: మాడుగుల ఎక్సైజ్‌ అధికారులు 25 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ముందుగా వచ్చిన సమాచారం మేరకు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.ప్రసాదరావు, ఎస్సై కిరణ్‌ మణీశ్వరులు సిబ్బందితో కలిసి దాడి చేశారు. చీడికాడ మండలం బైలపూడి గ్రామం సమీపంలో రవాణాకు సిద్ధంగా ఉంచిన సుమారు 25 కిలోల గంజాయి బస్తాను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల రాకను గమనించిన నిందితుడు సంఘటన స్థలం నుంచి పరారయ్యాడు. నిందితుని కోసం గ్రామంలో విచారిస్తున్నామని పట్టుబడ్డ గంజాయి సీలావతి రకానికి చెందిందని చెప్పారు. దీని విలువ రూ.50 వేలకు పైగా ఉంటుందని అధికారుల అంచనా. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ చెప్పారు.