ఆదుకోని ఆరోగ్యశ్రీ


ఇల్లందు: దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశే ఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టి పేద వారి గుండె చప్పుళ్లను ఆగకుండా చేశారు. అయితే ఆయన మృత్యుఒడిలోకి వెళ్లగానే వైద్యులు ఆరోగ్యశ్రీపై తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు కిడ్నీలు చెడిపోయి మృత్యు వుతో పోరాడుతున్న ఓ వ్యక్తిని ఆదుకునేనాథుడు లే ఆ కుటుంబం బోరున విలపిస్తోంది. రెక్కాడితే గానీ డొక్కాడని ఆ కుటుంబం ఇడ్లీ బండి పెట్టుకొని జీవనం సాగిస్తోంది. ఇల్లందు పట్టణానికి చెందిన సముద్రాల వెంకటేశ్వర్లు(60)కు రెండు కిడ్నీలు చెడిపోయి ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలోనే ఈ నెల 2వ తారీఖున షిరిడి తీసుకెళ్ళి వైద్యులకు చూపించారు.

ఆర్ధిక స్తోమత లేని కారణంగా తిరుగు ప్రయాణం చేసి 4వ తారీఖున ఖమ్మంలోని పలు వైద్యశాలలకు తీసుకెళ్ళి ఆరోగ్య శ్రీ కార్డు చూపిస్తే ఇది తమకు వర్తించదని డబ్బులు ఇస్తేనే వైద్యం చేస్తామని పేర్కొన్నారు. విధి లేని పరిస్థితులల్లో కుటుంబం ఇంటికి చేరుకుంది. తరువాత విజయవాడలోని మణిపాల్‌ ఆసుపత్రికి వైద్యం తీసుకెళ్ళారు. వెంకటేశ్వర్లును పరీక్షించిన వైద్యులు డయాలసిస్‌ చేయాలని అం దుకు పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుందని తెలిపారు.

దీంతో బాధితులు తెల్ల రేషన్‌కార్డు, ఆరోగ్య శ్రీ కార్డును వైద్యులకు చూపించారు. వీటిని చూసిన వైద్యులు ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మరణించాడని మాకు డబ్బులు ఎవరిస్తారని నిర్లక్ష్యంగా మాట్లాడినట్లు బాధితులు వివరించారు. రెండు కిడ్నీలు చెడిపోయి మృత్యువుతో పోరాడుతున్న వెంకటేశ్వర్లును ఆదుకుని తమ కుటుంబాన్ని కాపా డాలని దామర్థ హృదయులను వారు వేడుకుంటున్నారు. మగదిక్కు లేని వెం కటేశ్వర్లుకు నలుగురు కూతుర్లే కావడం, ఇతను మంచాన పడడంతో కుటుంబం పోషణ సైతం కష్టతరంగా మారింది.

Advertisements

సంక్షేమం పట్టని వసతి గృహాలు


ఖమ్మం: జిల్లాలోని సాంఘీక సంక్షేమ వసతి గృహాలను మెరుగుపర్చే చర్యలు ఈ విద్యాసంవత్సరానికి కూడా పూర్తయ్యే అవకాశాలు కనబడడం లేదు. ఆయా శాఖ ఇంజనీరింగ్‌ అధికారుల నిర్లక్ష్యం, నిధుల విడుదలలో జాప్యం వెరసి విద్యార్థులకు ఇబ్బంది తప్పేల లేదు. గత విద్యాసంవత్సరం ప్రారంభం సమయంలో చేపట్టిన పనులు విద్యాసంవత్సరం ముగిసినప్పటికీ కొన్ని సంక్షేమ వసతి గృహాల్లో ఎటువంటి పనులు చేపట్టకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సాంఘీక సంక్షేమశాఖ పరిధిలోని 90 వసతి గృహాల మరమ్మతుల కోసం 60 మరుగుదొడ్ల మరమ్మతులతోపాటు మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయించారు. వీటిలో 20 వసతి గృహాల మరమ్మతులను 14 మరుగుదొడ్ల మరమ్మతులను సాంఘీక సంక్షేమశాఖ ఇంజనీరింగ్‌ విభాగం వారు, 70 వసతి గృహాలు 46 టాయిలెట్ల పనులను పంచాయితీరాజ్‌ శాఖ వారు చేపట్టేవిధంగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే లక్షల కంటే ఎక్కువ పనులకు టెండర్లు తక్కువ పనులను నామినేషన్‌ పద్ధతి ద్వారా నిర్వహించాలని నిర్ణయించడంతో పనులు చేపట్టేందుకు లైసెన్స్‌డ్‌ కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో నామినేషన్‌ పనులు పూర్తయినప్పటికీ, టెండర్‌ పనులు మాత్రం చాలావరకు జిల్లాలో చేపట్టిన దాఖలాలు లేవన్న ఆరోపణలు వినవస్తున్నాయి.

అక్కడ నీళ్లన్నీ వృధా, ఇక్కడ నీళ్లందక వ్యధ


ఖమ్మం: ఖమ్మం పట్టణంలోని పలు ప్రాంతాలలో మున్సిపల్‌ పంపులకు ఆన్‌, ఆఫ్‌ నళ్లాలు లేకపోవడంతో మంచినీరు వృధా అవుతోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో నీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, మరికొన్ని ప్రాంతాలలో నీరు వృధాగా పోతోంది. దీనిని నివారించేందుకు మున్సిపల్‌ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. పంపులకు ట్యాబ్‌లు బిగిస్తే నీటి వృధాను అరికట్టవచ్చు. తద్వారా నీటి ఎద్దడిని కొంతవరకైనా తగ్గించవచ్చు. కానీ ఈ ట్యాపును ఏర్పాటుచేయడానికి మన మున్సిపల్‌ యంత్రాంగానికి ఏర్పడుతున్న అడ్డంకులు, ఆటంకాలు, అభ్యంతరాలు ఏమిటో బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్ధమవడం లేదు. ఖమ్మం పట్టణంలో రెండు రోజులకొకసారి నీరు విడుదల కావడంతో వచ్చే నీరు సరిపోక అనేక ప్రాంతాలలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని ప్రాంతాలలో ఆ నీటిని వినియోగించుకునే నాధుడే లేకపోవడంతో నీరంతా వృధాగా డ్రైనేజీల్లోకి చేరుతోంది. ఇప్పటికైనా మున్సిపల్‌ అధికారులు పంపులకు నళ్లాలు ఏర్పాటు చేసి నీటి వృధాను అరికట్టేందుకు తగిన చర్యలు సత్వరమే తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

విద్యుత్‌ పరికరాలు లేక పలు చోట్ల అవస్థలు


ఖమ్మం: ఖమ్మం మున్సిపల్‌ అధికారులకు ముందు చూపు కొరవడింది. ఫలితంగా ఖమ్మం పట్టణంలోని పలు చోట్ల చిమ్మచీకటి అలుముకుంది. ట్యూబ్‌లైట్లు, ఎస్వీ ల్యాంపులు లేకపోవడంతో వీధుల్లోను, హైవేపైన అంధకారం ఏర్పడుతుంది. దీంతో స్థానికులు రాత్రి వేళల్లో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనడంతోపాటు ప్రధాన వీధుల్లో ప్రమాదాలకు అస్కారం ఏర్పడింది. కోట్లాది రూపాయల పన్నులు వసూలుచేసే ఖమ్మం మున్సిపాలిటీ పనితీరు మామూలు గ్రామపంచాయితీల కన్నా హీనంగా తయారైందని పాలకవర్గ కౌన్సిలర్లే విమర్శిస్తున్నారు. పట్టణంలోని పలు వార్డులలో దాదాపు వంద వరకు అధికంగా వెలుతురునిచ్చే ఎస్‌యు లైట్లు, మరో 150 వరకు ట్యూబ్‌లైట్లు పాడయ్యాయి. ఇంతవరకు వాటి స్థానంలో కొత్తవి అమర్చిన దాఖలాలు లేవు. మున్సిపల్‌ ఎలక్ట్రిక్‌ గోడౌన్‌లలో సామగ్రి లేదు. దీంతో స్థానిక కౌన్సిలర్లు, యార్డు ప్రజల ఫిర్యాదు మేరకు వెలగని వీధు ట్యూబ్‌లైట్లను తీసుకువచ్చి భద్రపరచడం తప్ప కొత్తవాటిని వెలిగించలేకపోతున్నారు.

వానొచ్చే వరదొచ్చే… రాకపోకలకు తావొచ్చే


ఖమ్మం: ఎప్పుడు వాన వచ్చిందో, ఎక్కడ వాగులు, వంకలు పొంగిపొర్లతాయో, ఎక్కడ రహదారులు పొంగిపొర్లతాయో, రవాణా సౌకర్యాలు ఎక్కడ నిలిచిపోతాయో వర్షాకాలంలో గుండాల మండల ప్రజలు ఎంతో కాలంగా అనుభవిస్తున్న బాధ ఇది. గుండాల మండల కేంద్రం నుంచి భాహ్య ప్రపంచానికి ఉన్న రహదారులన్నీ గుంటల మయం, బురదల మయం కావడంతోపాటు మార్గ మధ్యంలో ఉన్న కల్వట్లు శిథిలావస్థకు చేరి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. గుండాల మండల ప్రజలకు ఏ చిన్న అవసరం వచ్చినా నిత్యావసర వస్తువులు కావాలన్నా గుండాలకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇల్లందు పట్టణానికి కుస్తీ పడుతూ వెళ్లాల్సిందే. ఇల్లందు-గుండాల రహదారి యావత్తు గుంటల మయమైంది. మార్గ మధ్యంలోని పది కల్వర్టులు శిథిల దశలో ఉన్నాయి. ఇల్లందు మండలం మర్రిగూడెం వద్ద గత ఏడాది వర్షాలకు పొంగిపోయిన ముర్రేడు బ్రిడ్జీ నిర్మాణ పనులు మంజూరు కాలేదు. దీంతో గట్టిగా వర్షం వస్తే మండల ప్రజలతో ఉన్న ఏకైక రహదారిపై రాకపోకలు కొనసాగే అవకాశం లేదు. ఇటువంటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఆయా రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు చేసినా పర్యవేక్షణ లేదని స్థానికులు వాపోతున్నారు. ఇటీవల ఇల్లందు-గుండాల రహదారి అభివృద్ధికి నిధులు మంజూరు కాగా ఇంజనీరింగ్‌ శాఖ పర్యవేక్షణ పనులను మమ అనిపించారు. దీంతో అది నెల రోజుల్లోనే గుంటలుగా మారి ప్రజలను పలు అవస్థలకు గురి చేస్తోంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఇల్లందు-గుండాల రహదారి అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

పర్యాటకంలో గిరి సాంప్రదాయం


ఖమ్మం: ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక గుర్తింపు కలిగిన ఖమ్మం జిల్లా గిరిజన సంస్కృతిని పర్యాటక రంగం ద్వారా మరింత గుర్తింపు తెచ్చేందుకు ట్రైబల్‌ హార్ట్‌ పేరుతో ఏజెన్సీలోని గిరిజన సాంప్రదాయ ఆచార వ్యవహారాలను పర్యాటకులకు తెలియజేప్పెందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది. జిల్లా కలెక్టర్‌ వాసురెడ్డి ఉషారాణి ప్రత్యేక చొరవతో భద్రాచలం కేంద్రంగా ట్రైబల్‌ హార్ట్‌ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లాలో కోయ, కొండరెడ్డి, బంజార, నాయకపోడు తదితర తెగల గిరిజనులు అనాధిగా జీవిస్తున్నారు. భాష, సంస్కృతి, ఇతర ఆచార వ్యవహారాల తోపాటు వీరి అలవాట్లు కూడా విభిన్నంగా ఉంటాయి. మొత్తం గిరిజన సంస్కృతిని చాటి చెప్పేవిధంగా ట్రైబల్‌హార్ట్‌ పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కసరత్తు జరుగుతోంది. గిరిజనులు నివాసం ఉండే ఇళ్లతోపాటు వారు ఉపయోగించే పనిముట్లు, వారు తయారుచేసే వస్తువులు, ఆహారపు అలవాట్లను తెలియజేసేవిధంగా క్యాంటీన్‌తోపాటు గిరిజన సంస్కృతిక దృశ్యాలు ఈ పర్యాటక కేంద్రంలో తెలియజేస్తారు. ట్రైబల్‌ మ్యూజియం కూడా ఇందులో ఏర్పాటు కానుంది. ఇందుకోసం భద్రాచలం సమీపంలో ఐదెకరాల స్థలాన్ని కూడా అధికారులు గుర్తించారు. ఈ ట్రైబల్‌హార్ట్‌ టూరిజం ప్రతిపాదనలో అనంతరం కేంద్ర పర్యాటక శాఖ నుంచి, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి నుంచి నిధులు కేటాయింపు జరగాల్సి ఉంది. దీంతోపాటు భద్రాచలంలోని రామాయణ గ్రీన్‌పార్క్‌ కూడా సుమారు ఆరు కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికోసం భద్రాచలం దేవస్థానానికి సంబంధించిన 25 ఎకరాల స్థలాన్ని పర్యాటక శాఖ లీజుకు తీసుకునేందుకు జిల్లా కలెక్టర్‌ లేఖ వ్రాసినట్లు తెలిసింది.

సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలి: ఏఐటియుసి


ఖమ్మం: సింగరేణి కార్మికుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటియుసి నేత గుత్తుల సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ యాజమాన్యం తీవ్ర జాప్యం చేస్తుందన్నారు. తాము ఇచ్చిన డిమాండ్ల నోటీసులపై యాజమాన్యం పలుసార్లు చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకుండాపోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 2008-09 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాల్లో 25 శాతం వాటా ధనాన్ని కార్మికులకు చెల్లించాలని, 8వ వేజి బోర్డు ఏరియల్స్‌ మొత్తం ఒకేసారి చెల్లించాలని చనిపోయిన కార్మికుల పిల్లలకు, మెడికల్‌ అన్‌ఫిట్‌ అయిన కార్మికుల పిల్లలకు యాజమాన్యం వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. తమ డిమాండ్స్‌పై యాజమాన్యం స్పందించని పక్షంలో తాము చేసే ఆందోళనకు సింగరేణి యాజమాన్యం బాధ్యత వహించాలని సత్యనారాయణ డిమాండ్‌ చేసారు.