ధాన్యం అమ్మకాలపై ఆందోళన వద్దు


మచిలీపట్నం: జిల్లాలో రైతాంగం ధాన్యం అమ్మకం గురించి కంగారు పడవలసిన అవసరం లేదనీ, మద్దతుధర కంటే తక్కువకు ఎటువంట పరిస్థితుల్లోనూ అమ్మవద్దనీ కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్ గౌరవ్‌ ఉప్పల్‌ రైతులను కోరారు. గత కొన్ని రోజులుగా ధాన్యం కొనుగోలుపై మద్దతుధర ఇవ్వడంలేదని ఫిర్యాదులు వస్తున్నాయని సమస్యను అధ్యయనం చేసి రైతులతోను మిల్లర్లతోను మాట్లాడుతున్నామని జాయింట్‌ కలెక్టర్‌ అన్నారు.

ఈ సందర్భంగా బందరు శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్యతో కలసి చిలకలపూడి వేర్‌హౌసింగ్‌ కార్పోరేషన్‌ గోడౌన్‌ వద్ద రైతులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తరువాత జాయింట్‌ కలెక్టర్‌ తన ఛాంబర్‌ లో మిల్లర్లతో సమావేశమైవారి సమస్యలను చర్చించి అనంతరం నిర్వహించిన పత్రికా సమావేశంలో పాల్గొన్నారు. జిల్లాలో ఈ రబీ సీజన్‌ లో 1001, 1010 రకం ధాన్యం ఎక్కువగా పండించడం జరిగిందనీ వీటి కొనుగోలు బాగానే జరుగుతుందనీ, యం7, నెల్లూరు సన్నాలు రకం కొనుగోలుకు సంబంధించి కొన్ని ఇబ్బందులు వున్నాయని వీటి విషయంలో రైతులు భయాందోళనలు చెందవలసిన అవసరం లేదనీ త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామనీ ఉప్పల్ అన్నారు.

నెల్లూరు సన్నాల రకంలో నల్లమచ్చ వుందనీ, 3 శాతం కంటే తక్కువ డేమేజ్‌ వుంటే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అయితే 3 శాతం కంటే ఎక్కువగా ఈ డ్యామేజ్‌ వున్నందున రిలాక్సేషన్‌ ఇవ్వాలనీ పౌర సరఫరాల శాఖ మంత్రితో మాట్లాడి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని జాయింట్‌ కలెక్టర్‌ తెలిపారు. భారత ఆహార సంస్థను మన జిల్లాకు మినహాయింపు ఇవ్వవలసినదిగా కోరినట్లు తెలిపారు. మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయడం లేదనీ వస్తున్న ఆరోపణలపై మిల్లర్లతో మాట్లాడడం జరిగిందనీ, వారు గోడౌన్‌ లు కొరత వున్న కారణంగా ధాన్యం కొనుగోలు చేయలేకపోతున్నామని చెప్పారనీ, గోడౌన్‌ కొరత నివారణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించవలసినదిగా భారత ఆహార సంస్థ జి.ఎం. లను కోరినట్లు జాయింట్‌ కలెక్టర్‌ తెలిపారు.

ఈ నెలలో లక్ష మెట్రిక్‌ టన్నుల ధాన్యానికి స్థలం వస్తుందనీ, 23 రైల్వే ర్యాకులు త్వరలో రానున్నాయనీ ధాన్యం నిల్వలకు పై#్రవేటు గోడౌన్ల యజమానులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నామని జాయింట్‌ కలెక్టర్‌ వివరించారు. మన జిల్లాలో కనీస మద్దతుధరతో ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేయడానికి 12 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, భారత ఆహార సంస్థ ఆధ్వర్యంలో సిడ్లబ్యుసి కైకలూరులో, సిడబ్ల్యుసి గుడివాడలో, ఎఫ్‌.సి.ఐ హనుమాన్‌ జంక్షన్‌ లోసిడబ్ల్యుసి నందిగామలో ఎస్‌.డబ్ల్యుసి జగ్గయ్యపేటలో 6 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

పౌర సరఫరాల కార్పోరేషన్‌ ఆద్వర్యంలో నాగాయలంక, బంటుమిల్లి, పెడన, నందిగామ, ఎ.కొండూరు, తిరువూరు లలో ఆయా మండల సమాఖ్య కేంద్రాలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి ధాన్యం నాణ్యత కనుగుణంగా కొనుగోలు చేయడం జరుగుతుందని కావున రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ అన్నారు. రైతులకు ధాన్యం అమ్మకం విషయంలో సమస్యలు వుంటే వెంటనే తమ దృష్టికి నేరుగా గానీ, జిల్లా పౌర సరఫరాల అధికారి ద్వారాగాని, ఆర్‌.డి.ఒ. ద్వారా గానీ తీసుకువస్తే వెంటనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జాయింట్‌ కలెక్టర్‌ తెలిపారు.

ఇప్పటివరకు జిల్లాలో 7.5 లక్షల మెట్రిక్‌ టన్నుల లక్ష్యానికి గాను 4.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందని మిల్లర్లు లక్ష్యం పెంచమని అడిగిన కారణంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందనీ మరో 50,000 మెట్రీక్‌ టన్నులకు లెవీ పెంచే అవకాశమున్నదని జాయింట్‌ కలెక్టర్‌ అన్నారు.

స్థానిక మార్కట్‌ యార్డుగోడౌన్‌లో గత సంవత్సరం ఎన్నికల సందర్భంగా ఇవిఎం మిషన్లను తీయించి ఖాళీచేసే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. మిల్లర్లు రైతులతో నేరుగా సంబంధాలు కలిగివుంటారు, కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బందులున్నా సమస్యలు తమ దృష్టికి తీసుకురావలసిందిగా జాయింట్‌ కలెక్టర్‌ మిల్లర్లకు విజ్ఞప్తిచేశారు. జిల్లా సివిల్‌ సప్లై అధికారి కె.సింగయ్య మాట్లాడుతూ రైతులు తాము అమ్మదలుసుకున్న ధాన్యాన్ని ఒకేసారి తీసుకురాకుండా కొంత శాంపిల్‌ తీసుకువస్తే ఇక్కడ సిబ్బంది ధాన్యం నాణ్యతను పరిశీలించి మద్దతుధర నిర్ణయిస్తారని ధర అనుకూలంగా వుంటే అప్పుడు మొత్తం ధాన్యాన్ని తీసుకురావచ్చునని అన్నారు.

కొనుగోలు కేంద్రం వరకు రైతులు తమ స్వంతఖర్చులతో ధాన్యాన్నీ తీసుకురావాలని అన్నారు.

ఈ సమావేశంలో బందరు శాసనసభ్యులు పేర్నినాని, భారత ఆహార సంస్థ జి.అన్నామలై, సివిల్‌ సప్లై సిబ్బంది, బందరు మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ మోకా భాస్కరరావు, సంబంధిత శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisements

కృష్ణ లంక గ్రామాల్లో కలెక్టర్ ప్రజాపధం


నాగాయలంక: కృష్ణా జిల్లా నాగాయలంక దీవి గ్రామాల ప్రజాపధంలో పాల్గోన్న – జిల్లా కలెక్టరు గుంటూరు జిల్లా రాజుపాలెం నుండి నాగాయలంక మండలం ఎదురుమెండి రిజర్వాయరుకు 7.50 కోట్ల వ్యయంతో స్పాంజ్‌ బ్రిడ్జి నిర్మించి దాని ద్వారా నీటి సరఫరా చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పియూష్‌ కుమార్‌ చెప్పారు.

ప్రజాపధం కార్యక్రమంలో భాగంగా, నాగాయలంక మండలం, దీవి గ్రామాలైన నాచుగుంట, ఈల చెట్లదిబ్బ గ్రామాలలో జరిగిన ప్రజాపధం కార్యక్రమంలో జిల్లా కలెక్టరు పియూష్‌ కుమార్‌ పాల్గొని ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు వాటి పరిష్కారానికి తగిన సూచనలు ఇచ్చారు. గుంటూరు జిల్లా రాజుపాలెం నుండి ఎదురుమొండి రిజర్వాయరుకు సాగునీరు, త్రాగునీరు సరఫరా అవుతుందని, ఎదురుమొండి రిజర్వాయరుకు నుండి పరిసర గ్రామాలకు తాగునీరు సరఫరా జరుగుతుందన్నారు.

రాజుపాలెం ఎదురుమొండి మధ్య యేరు ఉ ండడం వలన పైపుల ద్వారా నీరు సరిగా సరఫరా జరగక ప్రజలు ఇబ్బంది పడుచున్నారన్నారు. దీనికి పరిష్కారంగా రూ. 7.50 లక్షలతో స్పాంజ్‌ బ్రిడ్జి నిర్మించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఈ రకం బ్రిడ్జి నిర్మించగలవారు మన ప్రాంతంలో లేనందున ఇతర ప్రాంతాల నుండి కాంట్రాక్టర్లను పిలిచి బ్రిడ్జి నిర్మించడం జరుగుతుందని ఈ పనులు వచ్చే ఎడాది ప్రారంబిస్తారని కలెక్టరు వివరించారు. నాచుగుంట గ్రామంలో ప్రస్తుతానికి త్రాగునీటి సమస్య లేదని ప్రజలు కలెక్టరుకి తెలిపారు.

కృష్ణా వరదల సమయ ంలో ఈ గ్రామంలో పర్యటించినపుడు 150 ఇళ్లు కావాలని అడిగారని అన్ని ఇళ్లు మంజూరు చేశామన్నారు. వీటిలో 130 ఇళ్ల ప్రభుత్వ నిధులు మరియు అసిస్ట్‌ సంస్ధ సహకారంతో నిర్మాణం, జరుగుచున్నదన్నారు. వర్షా కాలం వచ్చే లోపు ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని కలెక్టరు చెప్పారు. ఎదరుమొండి రిజర్వాయేరు నుండి 10 గ్రామాలకు త్రాగునీరు సరఫరా జరుగుతుందన్నారు. ఇటీవ సంభవించిన వరదల వలన కరకట్లకు గండ్లు పడినాయని వీటి మరమ్మత్తుకు ఇ రిగేషన్‌శాఖను ఆదేశించడం జరిగిందన్నారు.

డెల్టా ఆధునీకరణ పనులలో ఈ పనులు పూర్తి చేస్తారన్నారు. వర్షా కాలం లోపు ఈ పనులు పూర్తి చేస్తారని కలెక్టరు చెప్పారు. ఉపాధి హామీ పధకం ద్వారా కూడా ఈ పనులు చేసుకోవచ్చునని కలెక్టరు చెప్పారు. ఈ నెల 19వ తేది నుండి జిల్లాలో ప్రజాపధం నిర్వ హిస్తున్నాయన్నారు. వేసవిలో ప్రజలు ఎదుర్కొనే త్రాగునీరు, విద్యుత్‌, ఆరోగ్యం వంటి సమస్యలను పరిష్క రించడానికి దివంగత ముఖ్యమంత్రి డా. వై.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి ప్రజాపధం ప్రారంబించారన్నారు. ప్రజాపధం ప్రజల సమస్యల పరిష్కారానికి ఒక వేదిక వంటిదని కలెక్టరు చెప్పారు.

జిల్లాకు వరదలు వచ్చినప్పటికి వర్షా బావ పరిస్దితుల వలన జిల్లాలో భూగర్బ జలాలు 2 మీటర్ల మేర తగ్గాయన్నారు. అందుచేత గ్రామాలలో త్రాగునీటి సమస్య వస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కొణిజేటి రోశయ్య జిల్లాలో త్రాగునీటి సమస్యల పరిష్కారానికి సుమారు 20 కోట్లు నిధులు విడుదల చేశారన్నారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ద్వారా గ్రామంలో 4 గురికి 1.07 లక్షలతో అపరేషన్లు చేయించడం జరిగిందని కలెక్టరు చెప్పారు. తెల్లకార్డుగల వారందరు ఆరోగ్యశ్రీకి అర్హలేనని కలెక్టరు చెప్పారు.

నాగాయలంక దీవి గ్రామాలలో 104 వైద్య సేవలు కల్పించడానికి అవకాశం లేనందున ఈ దీవి గ్రామాలలో పేదలకు వైద్యం కొరకు మైబైల్‌ ఆసుపత్రి ఏర్పాటుకు కృషి జరుగుచున్నదని కలెక్టరు చెప్పారు.

నాగాయలంకలో ఉపాధి హామీ పనులు


కృష్ణా: జాతీయ ఉపాధి హామీ పధకం కింద నాగాయలంక గ్రామంలో 22.39 లక్షలు విలువగల 40 పనులు గ్రామానికి మంజూరు చేసినట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ పియూష్ కుమార్ చెప్పారు. ఈ పధకం క్రింద గ్రామానికి అవసరమైన ఎన్ని పనులు అయిన చేసుకోవచ్చునని దానికి లిమిట్‌ లేదని కలెక్టరు చెప్పారు. సమగ్ర భూమి అబివృద్ది పధకం ఉపాధి హామీ పధకం ద్వారా గ్రామంలో పంట భూములను అబివృద్ది చేసుకోవచ్చునని కలెక్టరు చెప్పారు.

గ్రామంలో 48 కొత్త విద్యుత్‌ సంబాలు 10 కిలో మిటర్లు నిడివిగల కొత్త వైరు ఏర్పాటు చేస్తారని కలెక్టరు చెప్పారు. వరదల అనంతరం గ్రామంలొ 48 లక్షలు విలువ గల అంతర్గత రోడ్ల నిర్మించడం జరిగిందన్నారు. ఈలచెట్ల దిబ్బ గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పధకం ద్వారా చేపట్టిన మంచినీటి చెరువు పనులను కలెక్టరు పరిశీలించారు. ఈ గ్రామంలో అసిస్ట్‌ సంస్ధ వారు 2 త్రాగునీటి చెరువులను నిర్మిస్తున్నారని ఒక డిశాలినేషన్‌ ఫ్లాంటు ఒక ఆర్వో ఫ్లాంటు నిర్మిస్తున్నరన్నారు.

వరదల వల్ల గ్రామంలో 1200 వందల మీటర్ల పైపు లైను పాడైయినదని వీటిలో 800 మీటర్లు రిపేరు చేయడం జరిగిందని మిగిలిన 400 మీటర్లు పైపు లైను మరమ్మత్తులకు 2 లక్షలు మంజూరు చేసినట్లు కలెక్టరు ప్రకటించారు. గ్రామంలో అంతర్గత రొడ్ల నిర్మాణం కొరకు 20 లక్షలు మంజూరు చేయడం జరిగిందని కాని కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో పనులు జరుగలేదని ఈ పనులను నామినేషన్‌ పద్దతిపై పూర్తి చేయాలని కలెక్టరు పంచాయితీరాజ్‌ డిఇఇని ఆదేశించారు. గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు పధకం అమలు సరిగా లేదని వారం రోజులలో పరిస్దితి మెరుగు పడకపోతే ఎపివొ రవి కుమారును సస్పెండు చేయిస్తానని కలెక్టరు హెచ్చరించారు.

ఈలచెట్లదిబ్బ గ్రామంలో వీధి లైట్లు సమస్య ఉన్నదని గ్రామస్తులు కలెక్టరు దృష్టికి తీసుకురాగా విద్యుత్‌ అధికారులతో కలెక్టరు చర్చిం చి నెడ్‌ క్యప్‌ ద్వారా వీధి లైట్లు ఏర్పాటు చేయిస్తానని కలెక్టరు హామీ ఇచ్చారు. గ్రామంలో రాజీర్‌ ఆరోగ్యశ్రీ ద్వారా 1.35 లక్షల ఖర్చుతో 4 గురికి ఆపరేషన్‌ చేయించడం జరిగిందని కలెక్టరు చెప్పారు. గ్రామంలో 109 ఇళ్లు మంజూరు చేయాల్సి ఉందని , వరదల ఇళ్ల నిర్మాణం కింద 109 ఇళ్లు మంజూరు చేస్తారని కలెక్టరు చెప్పారు. ప్రభుత్వ పధకాల అమలులో ప్రజల భాగస్వామ్యం ఉన్నపుడే అవి విజయవంతం అవుతాయని కలెక్టరు చెప్పారు.

ఎదురుమొండి దగ్గర ఆ గ్రామస్తులు కలెక్టరును కలసి పేద విద్యార్దులకోసం ఎదరుమొండి గ్రామంలో హాస్టల్‌ను ఏర్పాటు చేయాలని కలెక్టరును కోరారు. వరదల వలన కరకట్ల గండ్లు పడినయాని వాటికి మరమత్తులు చేయాలని గ్రామస్తులు కోర గా ఇ రిగేషన్‌ ఎస్‌.ఇ ఈ ప్రాంతాలలో గురువారం పర్యటిస్తారని గండ్లు పడిన ప్రాంతాలను ఆయనకు చూపి సమస్యలను వివరించాలని కలెక్టరు కోరారు. ఈలచెట్లదిబ్బ గ్రామానికి పంటు ఏర్పాటు చేయాలని ప్రజలు కోర గా అసిస్ట్‌ సంస్ధ వారు 15 లక్షలు ఇవ్వడానికి ముందుకు వచ్చారని మిగిలిన 20 లక్షలు ప్రభుత్వ నిధుల నుండి మంజూరు చేయడానికి కృషి చేస్తానని కలెక్టర్ గ్రామస్తులకు వివరించారు.

ఈ కార్యక్రమంలో బందరు ఇన్‌ఛార్జి ఆర్‌డివో అలపాటి ప్రభావతి, మండల ప్రత్యేక అధికారి బి.సి వెల్పేర్ ఆఫీసరు ఆర్‌. శ్రీధర్‌ రెడ్డి , డిఎంఅండ్‌ హెచ్‌.వో డాక్టర్ యు. ప్రసాదరావు, ట్రాన్సుకో ఎస్‌ఇ శ్రీకృష్ణ, ఆర్‌ డబ్ల్యుఎస్‌ ఎస్‌ ఇ శ్రీరాముల నాయక్‌, ఇన్‌ ఛార్జి ఎండివో మణికుమార్‌ , వివిధి శాఖల అధికారులు నాచుగుంట సర్పంచ్‌ సైకం వసంతరావు, ఈలచెట్లదిబ్బ సర్పంచ్‌ దు ర్గమ్మ , జడ్పిటిసి సైకం విజయలక్ష్మి , ఎంపిపి కన్నా నాగరాజు, డిప్యూటి తహసిల్దారు ఆ ంజనేయులు, తదితరులు పాల్గోన్నారు.

పేదలకు అండగా ప్రభుత్వం: గీతారెడ్డి


విజయవాడ: పేదలకు గుండె, క్కాన్సర్‌ వంటి పెద్దజబ్బులకు కార్పోరేట్‌ వైద్యం అందించి వారి జీవన ప్రమాణాన్ని పెంచడానికి వీలుగా దివంగత ముఖ్యమంత్రి డా. వై.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి ప్రవేశపెట్టిన రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం భారతదేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి జె. గీతారెడ్డి పేర్కొన్నారు.

ప్రజాపథం కార్యక్రమంలో భాగంగా విజయవాడ 47వ వార్డు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఉన్నత పాఠశాలలో జరిగిన ప్రజాపథం కార్యక్రమానికి మంత్రి జె.గీతారెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి జె.గీతారెడ్డి మాట్లాడుతూ వేసవిలో గ్రామాలలో పరిస్థితులు భిన్నంగా వుంటాయన్నారు. తాగునీరు, విద్యుత్‌, కూలిపనులు లేకపోవడం వంటి సమస్యలతో సతమతమవుతూ ఉంటారన్నారు.

ఈ పరిస్థితులలో అధికారులు, ప్రజా ప్రతినిధులు గ్రామాలలో పర్యటించి ప్రజలను కలుసుకుని వాటి సమస్యలు తక్షణమే పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్‌. ప్రజాపథం ప్రారంభించారని మంత్రి వివరించారు. తాగునీరు విద్యుత్‌ వంటివి ప్రధాన సమస్యలు అన్నారు. ఈ వార్డులో త్రాగునీటి సమస్య లేదని సంతోషం వ్యక్తంచేశారు. ఈ వార్డులో ఇళ్ల స్థలాలు సమస్యలు ఎక్కువగా వున్నాయన్నారు. అర్హులైన వారందరకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. వీటికొరకు రెండు గ్రామాలలో భూసేకరణ పూర్తిఅయితే పట్టణంలో అర్హులైన వారందరికి ఇంటి స్థలాలు ఇవ్వడం జరుగుతుందని గీతారెడ్డి చెప్పారు.

డాక్టర్ వై.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి ప్రారంభించిన పథకాలుఅన్ని ముఖ్యమంత్రి రోశయ్య గారి నాయకత్వంలో పూర్తిస్థాయిలో అమలు పరుస్తున్నామన్నారు. ప్రజాపథంలో రాజకీయాలకు అతీతంగా అందరికి సంక్షేమ పథకాలు ఫలాలు అందేవిధంగా అధికారులు కృషిచేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి శ్రీ రోశయ్య నాయకత్వంలో ప్రజాపథం కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయన్నారు. మహిళా సాధికారత సాధనలో భాగంగా మహిళా గ్రూపులకు పావలావడ్డీకే ఋణాలు అందిస్తున్నామన్నారు.

భారతదేశంలో ఈ పథకం ఒక వినూత్నమైన పథకం అని మంత్రి గీతారెడ్డి చెప్పారు. అర్హులైన వారందరికి రేషన్‌ కార్డులు వుంచి బోగస్‌ కార్డులు ఏరివేత జరుగుతుందన్నారు. అది సర్వే మాత్రమేనని, అనర్హులకార్డులు తగ్గించడం జరుగుతుందన్నారు. అర్హులైన వారందరికి రేషన్‌ కార్డులు ఇవ్వాలని కార్డు పరిశీలన కార్యక్రమం జరుగుతున్నదన్నారు. ఈ మాసాంతానికి రేషన్‌ కార్డుల సర్వే పూర్తిచేసి అనర్హుల కార్డులు తొలగించి కొత్తగా రేషన్‌ కార్డులు జూన్‌ మాసంలో ఇస్తారని మంత్రి చెప్పారు.

ఆరోగ్యశ్రీ కార్డులు పోయినా తెల్లరేషన్‌ కార్డు ద్వారా వైద్యం చేస్తారన్నారు. ప్రజల ఆరోగ్యంగా వుంటేనే రాష్ట్రం సుఖశాంతులతో వర్థిల్లుతుందని మంత్రి చెప్పారు. సోనియాగాంధీ గారి నాయకత్నంలో మహిళలకు చట్టసభలలో 33 1/3 శాతం రిజర్వేషన్‌ కల్పించారని, రాజ్యసభలో ఇప్పటికే అనుమతించడం జరిగిందని లోక్‌ సభలో త్వరలో అనుమతి పొందనుందన్నారు. మహిళలు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదగడానికి, మహిళా సాధికారత సాధించడానికి మహిళలకు పావలావడ్డీకి రుణాలు అందిస్తున్నామన్నారు.

ఈ పథకంలో మనరాష్ట్రం దేశంలో నెం 1 స్థానంలో నిలచిందని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో సమసమాజస్థాపనకు అభివృద్థికి మీరు మేము అందరం కలిసి పనిచేయాలని మంత్రి చెప్పారు. పేద విద్యార్థులుసైతం ఉన్నత చదువులు చదవాలనీ ఉద్దేశ్యంతో విద్యార్థులకు ఫీజు రీఇంబర్స్‌ మెంట్‌ సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. విజయవాడలో ఉమాచిట్‌ ఫండ్‌ లో డబ్బు పోగొట్టుకున్నవారికి న్యాయం చేస్తామని మంత్రి చెప్పారు. విజయవాడ పర్యాటక కేంద్రంగా అభివృద్థి పరచడానికి ఇప్పటికే కొన్ని పనులు చేపట్టామన్నారు.

ఇప్పటికే భవానీపురంలో బెరంపార్కు అభివృద్థపంచడం జరిగిందని మంత్రి చెప్పారు. ఇంద్రకీలాద్రీ పై వేంచేసివున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి రొప్‌ వే ఏర్పాటు గురించి చెప్పారని, రెలిజియస్‌ గా ప్రజలు అడ్డుచెప్పకపోతే రోప్‌ వే నిర్మిస్తామని మంత్రి చెప్పారు. కొండపల్లి, మొగల్‌ రాజ్‌ పురం, తదితర పర్యాటక కేంద్రాల అభివృద్థి గురించి ప్రణాళికలు వున్నాయని, ఈనెలలో పర్యాటక శాఖ డైరెక్టరు కృష్ణాజిల్లాకు పంపుతానని, జిల్లా అధికారులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని మంత్రి కోరారు.

శాసనసభ్యులు మల్లాది విష్ణు మాట్లాడుతూ విజయవాడలో జె.ఎన్‌.ఎన్‌.యు.ఆర్‌.యం. క్రింద 1500 కోట్ల రూపాయలతో పలు అభివృద్థి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నదన్నారు. రూ. 500 కోట్లతో ప్రతి డివిజన్‌ లో మౌలిక సదుపాయాలైన త్రాగునీరు, రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైయినేజి పనులు చేస్తున్నామని చెప్పారు. మహిళా సాధిక దిశగా డా. వై.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి పావలావడ్డీ ఋణాలతోపాటు అభయహస్తం పథకం మహిళలకు ఎంతో ఉపయోగకరం అన్నారు. విజయవాడలో 108 ద్వారా 25,000 మంది వైద్య సేవలు పొందారన్నారు. 47వ డివిజన్‌ లో ఆరోగ్యశ్రీ క్రింద 63 మంది 20 లక్షలతో వైద్యం చేయించడం జరిగిందన్నారు.

ఈ డివిజన్‌లో 33 పనులు 70 లక్షలతో పూర్తిచేయనున్నట్లు శ్రీ విష్ణు చెప్పారు. అర్హులైన వారందరికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగతుందన్నారు. దీనికొరకు ప్రభుత్వపరంగా భూసేకరణ జరుగుతున్నదన్నారు. ఉమాచిట్‌ ఫండ్‌ బాధితులను అందరినీ ఇందుకోవడం జరుగుతుందని ఈ విషయాన్ని హోం మంత్రిగారి దృష్టికి తీసుకెళడం జరిగిందన్నారు. అమ్మవారి దేవాలయానికి రోప్‌ వే నిర్మాణం జరుగుతుందని జిల్లాలోశిల్పారామం ఏర్పాటుకు కృషిచేయడం జరుగుతుందన్నారు.

జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ మాట్లాడుతూ ప్రజాపథంలో ముఖ్యంగా 7 అంశాలపై చర్చ జరుగుతుందన్నారు. రేషన్‌ కార్డులు వెరిఫికేషన్‌ లో అనర్హులను తప్పించి అర్హులకు కార్డులు ఇవ్వడానికి సర్వే జరుగుతుందన్నారు. కార్డుల వెరిఫికేషన్‌ పూర్తి అయిన తరువాత క్రొత్త రేషన్‌ కార్డులు ఇవ్వడం జరుగుతుందని జాయింట్‌ కలెక్టర్‌ చెప్పారు. గతంలో తెల్లకార్డు వుండి ఎల్‌.పి.జి. కనెక్షన్‌ వుం టే కిరోసిన్‌ ఇచ్చేవారుకాదని, కాని ఇప్పుఢు వారికి 2 లీటర్లు కిరోసిన్‌ ఇస్తారన్నారు.

ఈ విషయంలో శాసనసభ్యులు మల్లాదివిష్ణు గారు కృషిచేశారన్నారు. జె.ఎన్‌.ఎన్‌.యు.ఆర్‌.యం. క్రింద 24,000 ఇళ్ల మంజూరు అయ్యాయని, వాటిలో 14,000 ఇళ్ల నిర్మాణం పూర్తిఅయిందని వీటిలో కొంతమంది ఇళ్ల అలాట్‌ మెంట్‌ జరిగిందని జాయింట్‌ కలెక్టర్‌ చెప్పారు. మిగిలిన ఇళ్ల నిర్మాణానికి స్థల సేకరణ చేయాల్సి వుందన్నారు. గొల్లపూడి, మాచవరం గ్రామాలలో భూసేకరణకు భూమి గుర్తించడం జరిగిందని ఆయన చెప్పారు. పేదలకు ఇచ్చిన ఇళ్లస్థలం రిజిస్ట్రేషన్‌ సౌకర్యం కల్పించడానికి కృషి జరుగుతున్నదని జాయింట్‌ కలెక్టర్‌ చెప్పారు.

ఈ కార్యక్రమంలో నగరమేయర్‌ రత్నబిందు, 47వ డివిజన్‌ కార్పోరేటర్‌ నాగలక్ష్మీ, డిప్యూటీ మేయర్‌ బ్రిటన్‌, మాజీ మేయర్‌ తాడిశకుంతల, సూరికుమారి, లతిత, లక్ష్మీ తులసి, సీనియర్‌ కార్పోరేటర్‌ సిష్లా రామలింగమూర్తి, రాజీవ్‌ ఆరోగ్య శ్రీ డిస్ట్రిక్‌ కో-ఆర్డినేటర్‌ ప్రసాద్‌, అర్బన్‌ తాహసీల్థారు, ప్రజాపథం టీమ్‌ లీడర్‌, కార్పోరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ప్రముఖ పర్యాటక కేంద్రంగా కృష్ణా జిల్లా


విజయవాడ: కృష్ణా జిల్లాను ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్థి పరచడానికి అవసరమైన ప్రణాళికలు సిద్థం చేయడం జరిగిందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ జె.గీతారెడ్డి చెప్పారు. స్థానిక 47వ వార్డులో సోమవారం నిర్వహించిన ప్రజాపథం కార్యక్రమంలో మంత్రి డాక్టర్ గీతారెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. సమావేశం అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ కృష్ణాజిల్లాను పర్యాటక కేంద్రం అభివృద్థి పరచడానికి అనేక చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.

హైదరాబాదులో శిల్పారామం ప్రాజెక్టు మంచి ప్రాచూర్యాన్ని సాధించుకున్నదన్నారు. విజయవాడలో శిల్పారామం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రప్రభుత్వం 5 కోట్లు రూపాయలు నిధులు మంజూరుచేసిందని మంత్రి చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కూచిపూడి నృత్యానికి పుట్టినిల్లుఅయిన కూచిపూడి కళాక్షేత్రాన్ని అభివృద్థిపరచడానికి 1 కోటి రూపాయలు మంజూరు చేసినట్లు మంత్రి చెప్పారు. దీనిలో కేంద్రప్రభుత్వంవారు 50 లక్షల రూపాయలు విడుదల అయ్యాయని, పర్యాటక అభివృద్థి కార్పోరేషన్‌ ద్వారా పనులు చేపట్టడం జరుగుచున్నదని మంత్రి చెప్పారు.

గోదావరి, కృష్ణా నదుల సర్క్యూట్‌ను రూ. 10 కోట్లతో అభివృద్థి చేస్తామని దీనిలో కేంద్రప్రభుత్వం వాటా 8 కోట్లు రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం వాటా 2 కోట్లు రూపాయలు అని మంత్రి చెప్పారు. దీనికై డి.పి.ఆర్‌. నివేదికలు కేంద్రప్రభుత్వానికి పంపడం జరిగిందన్నారు. హంసలదీవి అభివృద్థికి 7.50 కోట్లు రూపాయలు ప్రణాళిక రూపొందించడం జరిగిందనన్నారు. దీనికి సంబంధించిన డి.పి.ఆర్‌. నివేదికలు కేంద్రప్రభుత్వం పర్యాటక శాఖకు పంపడం జరిగిందన్నారు. కొండపల్లి అభివృద్థికి రూ. 15 లక్షలు నిధులు కేటాయించడం జరిగిందన్నారు.

మచిలీపట్నం కేంద్రంగా బందరుకోట మంగినపూడి బీచ్‌, కూచిపూడి ఘంటశాల సర్క్యూట్‌ రూట్‌ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి చెప్పారు. కొల్లేటికోట, కోటదిబ్బ, ఆటపాక బర్డ్‌ శాంక్చురీ అభివృద్థి పరచడానికి అలాగే జగ్గయ్యపేట మండలం ధనంబోడు బౌద్థ మాన్యుమెంట్లు పరిరక్షించడానికి, బ్రహ్మలింగం చెరువు, గజరాజు చెరువు (కొండపల్లి) అభివృద్థికి ప్రణాళికలు రూపొందించి డి.పి.ఆర్‌. నివేదికలను కేంద్రప్రభుత్వ పర్యాటక శాఖకు పంపడం జరుగుతుందని మంత్రి జె.గీతారెడ్డి చెప్పారు.

ఈ సమావేశంలో శాసనసభ్యులు మల్లాదివిష్ణు, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్ గౌరవ్‌ ఉప్పల్‌, నగరమేయర్‌ రత్నబిందు పాల్గొన్నారు.

దారితప్పిన శ్రీలంక జాలర్లు త్వరలో స్వస్థలాలకు


విజయవాడ: 2నెలల క్రితం నాగాయలంక చేరుకున్న శ్రీలంక జాలర్లను త్వరలోనే వారి దేశానికి పంపిస్తామని శ్రీలంక డిప్యూటి కమీషనర్‌ ఫెర్నాండో తెలిపారు. వారు సముద్రంలో చేపలవేటకు వెళ్లి దారితప్పి కృష్ణాజిల్లా నాగాయలంక ప్రాంతానికి రెండు నెలల క్రితం చేరుకున్నారు. మొత్తం ఏడుగురు శ్రీలంక జాలర్లు ఇక్కడ పునరావాసం పొందుతున్నారు. తొలుత వారిని శ్రీలంక తీవ్రవాదులుగా అనుమానించిన పోలీసులు అన్ని కోణాల నుండి దర్యాప్తు చేయగా వారు దారితప్పి ఇక్కడకు చేరినట్లు ధ్రువపడింది. దీంతో వీరి విషయమై శ్రీలంక హైకమిషన్‌కు పీయూష్‌కుమార్‌లేఖ రాసారు. దానికి స్పందించిన ఫెర్నాండో రెండు వారాలలోగా శ్రీలంక జాలర్లను వారి స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తామని అన్నారు.

ఆంధ్రాబ్యాంకు సమ్మెతో నిలిచిపోయిన కార్యకలాపాలు


విజయవాడ: ఆంధ్రాబ్యాంకు ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగడంతో నగరంలోని 16శాఖల్లో బ్యాకింగ్‌ కార్యకలాపాలు స్థంభించిపోయాయి. కిందిస్థాయి సిబ్బందిని ఉన్నతాధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఆంధ్రాబ్యాంకు ఉద్యోగులు శుక్రవారం సమ్మె చేపట్టారు. అయితే ముందస్తు లేకుండా వారు సమ్మెకు దిగడంతో ఖాతాదారులు ఇబ్బందులకు గురయ్యారు. వాణిజ్య రాజధాని అయిన విజయవాడలో ఆంధ్రాబ్యాంకు ద్వారా రోజుకు కనీసం రూ.30కోట్ల లావాదేవీలు జరుగుతుంటాయని అంచనా సమ్మె కారణంగా ఆంధ్రాబ్యాంకు శాఖలు మూతపడ్డంతో ఖాతాదారులు ఎటిఎంల వైపు పరుగుతీసారు. అనేక ఆంధ్రాబ్యాంకు ఎటిఎంలలో మధ్మాహ్ననికే ఖాళీ కావడంతో ఖాతాదారులకు ఏమీ పాలుపోని పరిస్థితులు ఎదురయ్యాయి.