జగన్‌ కోసం పెరుగుతున్న ఒత్తిడి


నెల్లూరు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమారుడు జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలంటూ జిల్లా కాంగ్రెస్‌లో క్రమంగా ఒత్తిడి పెరుగుతోంది. సెప్టెంబర్‌ 4వ తేదీ నుంచి ఈ ప్రక్రియ జిల్లాలో ఊపందుకోగా ఆనం సోదరులు జగన్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రకటనలు చేయడంతో పాటు జగన్‌కోసం పదవి త్యాగానికి సిద్ధమంటూ తొలిసారిగా జిల్లాలో గళం ఎత్తారు. నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి జగన్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను ముఖ్యమంత్రి చేయకపోతే కాంగ్రెస్‌లో చీలిక వస్తుందని స్పష్టం చేసిన ఆయన తనతోపాటు 80 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారంటూ ప్రకటించారు. అటు తర్వాత కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో టెలికాన్ఫరెన్స్‌ను ఆనం ఆధ్వర్యంలోనే భగ్నం చేశారు. ఇంతటితో ఆగక శనివారం రాత్రి జరిగిన బహిరంగ సభలో వివేకానందరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అన్ని పార్టీల వారు జగన్‌కోసం తమ పదవులకు రాజీనామా చేస్తారంటూ ప్రకటించడం గమనార్హం. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, తన సోదరుడు ఆనం రాంనారాయణరెడ్డితో పాటు కోవ్వూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, పీఆర్పీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేందర్‌రెడ్డిలతో పాటు అన్ని పార్టీలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు జగన్‌కోసం తమ పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారంటూ స్పష్టమైన సాంకేతాలు ఇచ్చారు. పీఆర్పీ అధ్యక్షుడు ప్రస్తుత నగర ఎమ్మెల్యే ఉంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డిని ముఖ్యమంత్రి సంతాప సభలకు ఆహ్వానించడం ద్వారా పరోక్షంగా ఆయన్ను కూడా జగన్‌కోసం రాజీనామాలు చేయిస్తామని వివేకానందరెడ్డి పార్టీ అధిష్ఠానానికి స్పష్టమైన సాంకేతాలు పంపారు.

Advertisements

కాంగ్రెస్‌ దిశగా పీఆర్పీ నేతల అడుగులు


నెల్లూరు: అనుకున్నదంతా అయింది. శాసన సభ ఎన్నికల్లో తన ఉనికిని కోల్పోయిన ప్రజారాజ్యంపార్టీ నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నారు. శాసన సభ ఎన్నికల్లో జిల్లాలోని పది స్థానాలతోపాటు ఒక ఎంపి స్థానానికి కూడా పోటీ చేసిన పీఆర్పీ కేవలం ఒక్క నెల్లూరు తప్ప మిగతా అన్ని స్థానాల్లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అది కూడా ఆనం సోదరులు తన సొంత పార్టీ అభ్యర్థి అయిన నెల్లూరు నగరంలో అనీల్‌కుమార్‌కు వ్యతిరేకంగా పోటీ చేయడం వల్ల అది పరోక్షంగా పీఆర్పీ నగర అభ్యర్థి ఉంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డికి సహకరించి ఆయన 90 ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే కాంగ్రెస్‌లో నుంచి శాసన సభ ఎన్నికల్లో పీఆర్పీలో చేరిన వారంతా తిరిగి పాత గూటికే చేరడం ఎన్నికలు ముగియగానే ప్రారంభమైంది. కాంగ్రెస్‌ పీసీసీ ఉపాధ్యక్షులు వంకి పెంచలయ్య, సర్వేపల్లి మాజీ శాసన సభ్యుడు సీనియర్‌ నేత టి.వి.శేషారెడ్డితో పాటు పలువురు అనేక మంది సీనియర్లు ఎన్నికల్లో టికెట్‌ కోసం పీఆర్పీలో చేరగా వారంతా తిరిగి మళ్ళి కాంగ్రెస్‌ గూటికే వస్తున్నారు. గతంలో కాంగ్రెస్‌లో ఉండి అటు తర్వాత తెలుగుదేశం కౌన్సిలర్‌గా 9 ఏళ్ళ పాటు కొనసాగిన నెల్లూరు నగర ఎమ్మెల్యే ఉంగమూరు శ్రీధర్‌ కృష్ణారెడ్డి సైతం పార్టీ మారుతున్నట్లు ప్రకటించుకున్న ఆనం సోదరులతో కలివిడిగా తిరగడం ఆయన పరోక్షంగా కాంగ్రెస్‌లో ఉన్నట్లేనని పరిశీలకులు భావిస్తున్నారు. ఉంగమూరుశ్రీధర్‌కృష్ణారెడ్డి ఇటీవలె ప్రజారాజ్యంపార్టీ అధ్యక్షుడుగా పదవీ బాధ్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా ఎన్నికల్లో పీఆర్పీ అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు పోషించిన బొమ్మిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు నేరుగా ప్రకటించారు. వారం రోజుల క్రితం పీఆర్పీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన బొమ్మిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి త్వరలో తాను కాంగ్రెస్‌లో చేరి జగన్‌ ముఖ్యమంత్రిని చేయడానికి తన వంతు కృషి చేస్తానని ప్రకటించారు. సెప్టెంబర్‌ 2వ తేదీన దివంగత నేత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జిల్లాలో పర్యటించాల్సి ఉండగా ఆ రోజునే ఆయన ముఖ్యమంత్రిని కలిసి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించడానికి నిర్ణయించుకున్నారు.అయితే అదే రోజు ఆయన హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించడంతో ఈ ప్రక్రియ కొంత కాలం నిలిచిపోయింది. తిరిగి శనివారం నాడు పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడిన బొమ్మిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి జగన్‌ నాయకత్వంపై విశ్వసాన్ని ప్రకటించడంతో పాటు తాను కాంగ్రెస్‌లో చేరుతానని ప్రకటించారు. అవసరమైతే తాను ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తామని ప్రకటించడం ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరడం దాదాపు ఖాయమైపోయింది. బహుశా మరో వారం రోజుల్లో ఆయన కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకుంటారని చెబుతున్నారు. తొలినుంచి బొమ్మిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్‌తో ప్రగాఢ అనుభవం ఉంది. ఆయన తండ్రి బొమ్మిరెడ్డి సుందర్‌రాంరెడ్డి ఆనం కుటుంబానికి నమ్మిన భంటులా ఉంటూ ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కూడా ఆయన కాంగ్రెస్‌ తరఫున ఎంపిక అయ్యారు. ఆయన కుమారుడు బొమ్మిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి అనంతసాగరం జడ్పీటిసి సభ్యుడుగా కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎంపికై అటు తర్వాత కాలంలో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా తెలుగుదేశం మద్ధతుతో ఎమ్మెల్సీగా గెలిచారు. శాసన సభ ఎన్నికల నాటికి ఆయన పీఆర్పీలో చేరారు. కాంగ్రెస్‌లో స్పష్టమైన చీలిక ఏర్పడి జగన్‌ సారథ్యంలో ఒక వేళ ప్రాంతీయ పార్టీ ఏర్పడితే అందులో చేరేందుకైనా బొమ్మిరెడ్డి సిద్ధంగా ఉండడానికి ఇప్పటి నుంచే పావులు కదపడం గమనార్హం.

జిల్లా అభివృద్ధిపై ముఖ్యమంత్రి మృతి ప్రభావం


నెల్లూరు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం కొనసాగుతున్న రాజకీయ పరిణామాలు జిల్లా అభివృద్ధిని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. సెప్టెంబర్‌ 2న ముఖ్యమంత్రి హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన నాటినుంచి ఈరోజు వరకు అభివృద్ధి పనులపై ఒక సమీక్షా సమావేశం కూడా నిర్వహించలేదంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. నిబంధనల ప్రకారం జిల్లా యంత్రాంగం కొన్ని సమీక్షలను నిర్వహించినప్పటికీ ఏమాత్రం ఆసక్తి లేకుండా ఏదో చేయాలన్న భావనతో నిర్వహించారే తప్ప సంబంధిత పథకాల అమలు ఎలా అనే అంశం జిల్లా యంత్రాంగాన్ని వెంటాడుతోంది. దీనికితోడు ఎమ్మెల్యేలు, మంత్రులు జగన్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై బిజిగా ఉండడంతో ఒక్కసారిగా జిల్లా అభివృద్ధిలో తీవ్ర ప్రతిష్టంభన నెలకొంది. కలెక్టర్లు, ఇతర శాఖాధికారులు తాము నామమాత్రంగా చేయాలే తప్ప ఏ పనికి ఏది అవసరమో అన్న విషయాన్ని పట్టించుకోకుండా సమావేశాలు నిర్వహించడం గమనార్హం. త్వరలో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కానుండగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల జిల్లాలోని 44 మండలాలను ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా ప్రకటించినప్పటికీ ఆ దిశగ నష్ట నివారణ చర్యలు జరగలేదు. ఖరీఫ్‌ సీజన్‌లో 50 శాతం సబ్సిడీకి విత్తనాలు పంపిణీ చేస్తామని అధికారులు చెబుతునప్పటికీ మినుము, పెసర, తదితర పంటల విషయంలో చేతులెత్తేశారు. ప్రభుత్వం నుంచి సంబంధిత కోట విడుదల కాకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. జిల్లాలోని మెట్ట ప్రాంతాలైన వింజమూరు, మర్రిపాడు, రాపూరు, పొదలకూరు తదితర ప్రాంతాలలో మినుము పంట కోసం 4,500 క్వింటాళ్లు అవసరమని జిల్లా వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదిక పంపింది. అయితే కేవలం 900 క్వింటాళ్లు మాత్రమే సరఫరా చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ఇదే విషయాన్ని బుధవారం జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశంలో వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ బాలయ్య ఇదే విషయాన్ని స్పష్టం చేసి తన నిస్సహాయతను వ్యక్తం చేశారు. ఇదే అదునుగా అనేకమంది అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న సంఘటనలు జిల్లా సర్వసభ్య సమావేశంలో నెలకొన్నాయి. నీటిపారుదల శాఖ పెన్నాడెల్టా ఆధునీకరణ, చెరువుల మరమ్మతులు, తెలుగుగంగ పథకం, సోమశిల జలాశయం, వ్యవసాయం, అంటువ్యాధులు వంటి కీలక అంశాలపై బుధవారంనాటి సర్వసభ్య సమావేశంలో అటు అధికారులు గాని, ఇటు ప్రజాప్రతినిధులు గాని సరిగ్గా హాజరుకాకపోవడం వైఎస్‌ మరణానంతర ప్రభావం సమావేశంలో ప్రస్పుటమైంది. మంత్రి రాంనారాయణరెడ్డితో సహా అధికార పార్టీకి చెందిన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా హాజరుకాకపోగా, కేవలం టిడిపికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం మాత్రమే హాజరవడం ఇందుకు నిదర్శనం. కీలకమైన అంశాల చర్చకు ఇందుకు సంబంధించి నిధులు రాబట్టడానికి మంత్రి ఖచ్చితంగా పాల్గొనాల్సి ఉంది. కారణాలు ఏమైనా ఆయన హాజరుకాకపోగా జిల్లా అధికార యంత్రాంగం తరఫున పాల్గొనాల్సిన కలెక్టర్‌ శ్రీహరికోటలో రాకెట్‌ ప్రయోగానికి వెళ్లడం గమనార్హం. ఇక నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి (కాంగ్రెస్‌), స్థానిక ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి నగరంలో ఉండి కూడా హాజరుకాకపోవడం చెప్పుకోదగ్గ విశేషం. ఒకవైపు జిల్లాను అంటువ్యాధులు కటవిటం చేస్తుండగా తండిలేని బిడ్డకు దిక్కెవరన్నట్టుగా జిల్లాకు పెద్ద దిక్కుగా నిలవాల్సిన అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా డుమ్మా కొట్టడంతో అనుశ్చిత స్థితి నెలకొంది. జిల్లా పరిషత్‌ సమావేశం సుమారు నాలుగున్నర గంటలపాటు కొనసాగినప్పటికీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోయాయి. రాజకీయంగా పరిశీలిస్తే జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ కాకాని గోవర్దన్‌రెడ్డిని వ్యతిరేకిస్తున్న ఆనం వర్గం కావాలనే సమావేశానికి హాజరుకాలేదని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యమంత్రి మరణించాక ఆయన తొమ్మిదవ రోజు అంటే సెప్టెంబర్‌ 11న జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం ఆయనకు నివాళులర్పించింది. కేవలం ముఖ్యమంత్రి సంతాప తీర్మానానికి పరిమితమైన ఆ సమావేశానికి కూడా మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, ఆయన సోదరులు నగరంలో ఉండి కూడా సమావేశానికి హాజరుకాకపోగా, అదే సమయంలో విఆర్‌సి గ్రౌండ్‌లో ప్రత్యేక సంతాపసభలు నిర్వహించి రాజశేఖర్‌రెడ్డి చావులో కూడా వర్గ రాజకీయాలు తప్పవన్న విషయాన్ని స్పష్టం చేశాయి. ఏదిఏమైనా మున్ముందు పరిస్థితులు ఇలానే కొనసాగితే జిల్లా అభివృద్ధి మరింత దిగజారే అవకాశం ఉందని చెప్పడానికి సందేహించాల్సిన పనిలేదు.

గ్రూపు రాజకీయాలకు వేదిక కానున్న ముఖ్యమంత్రి పర్యటన


నెల్లూరు: నెల్లూరు జిల్లాలో సెప్టెంబర్‌ 2న జరిగే ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పర్యటన గ్రూపు రాజకీయాలకు వేదికగా మారనుంది. చిల్లకూరుమండలం అంకులపాటూరు గ్రామంలో స్టీల్‌ ఫ్యాక్టరీని ప్రారంభించిన అనంతరం భోజన విరామం తరువాత రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో జిల్లాలో ఆనం, జడ్పీ చైర్మన్‌ కాకాని గోవర్థన్‌రెడ్డి వర్గాల మధ్య కొనసాగుతున్న గ్రూప్‌ రాజకీయాల మీద ముఖ్యమంత్రి దృష్టి సారించే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక జడ్పీ చైర్మన్‌ కాకాని గోవర్థన్‌రెడ్డి పార్టీలోని కొందరు సీనియర్‌ నాయకుల సహకారంతో ఆనం సోదరులకు వ్యతిరేకంగా వర్గాని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్మకూరు టికెట్‌ను ఆశించి భంగ పడ్డ గోవర్థన్‌రెడ్డి ఇందుకు ఆనం సోదరులు బాధ్యులుగా పేర్కొంటూ సర్వేపల్లి శాసన సభ్యుడు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి నెల్లూరు నగరం నుంచి పార్టీ తరఫున పోటీ ఓడిపోయిన అనీల్‌కుమార్‌ యాదవ్‌, పీసీసీ ఉపాధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తదితరులతో వర్గాన్ని ఏర్పాటు చేసిన ఆయన ఆనం సోదరులపై ప్రత్యక్ష యుద్ధానికి కూడా పూనుకున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని స్వర్ణముఖి, మైపాడు, వాకాడు, తదితర ప్రాంతాల నుంచి అక్రమంగా తరలిపోతున్న ఇసుక రవాణాలో ఆనం సోదరుల పాత్ర ఉందంటూ దుమారాన్ని లేవదీశారు. రోజుకు 30 లక్షలు విలువ చేసే ఇసుక అక్రమ రవాణాలో ఆనం సోదరులు పరోక్షంగా భాగస్వాములని ఇటీవల జరిగిన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణలను జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పరోక్షంగా సమర్థించారు. అటు తర్వాత ఆనం వర్గానికి చెందిన వెంకట రమణారెడ్డి అనే వ్యక్తికి సంబంధించి సుమారు కోటి 30 లక్షల రూపాయలు విలువ చేసే బియ్యం లోడ్లు నెల్లూరు నుంచి చెన్నైకి తరలిపోతుండగా అనీల్‌కుమార్‌ యాదవ్‌ ఇచ్చిన సమాచారంతో పోలీసులు సీజ్‌ చేయడం జరిగింది. ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి కూడా వెళ్ళింది. ఆ బియ్యాన్ని తిరిగి స్మగ్లర్లకు అప్పగించాలన్న ఆనం ప్రయత్నాలను జిల్లా పరిషత్‌ చైర్మన్‌ వర్గం సమర్థవంతంగా తిప్పికొట్టడంతో పాటు ఆ బియ్యాన్ని ప్రజలకు పంపిణీ చేయడంలో విజయం సాధించింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండగా జిల్లా వ్యాప్తంగా ఆనం వర్గాన్ని దెబ్బతీసేందుకు ఈ ఎన్నికలను తమకు అనుకూలంగా మలచుకోవాలని జడ్పీ చైర్మన్‌ వర్గం ఇప్పటి నుంచే పావులు కదుపుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమి పాలైతే అందుకు మంత్రులను బాధ్యులుగా చేస్తానని ఇటీవల ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలో ఆనం వర్గానికి నిలువ నీడ లేకుండా చేయడానికి జడ్పీ చైర్మన్‌ వర్గం సిద్ధమైంది. ఈ పరిస్థితుల్లో సెప్టెంబర్‌ 2న జరగనున్న ముఖ్యమంత్రి పర్యటన గ్రూపు రాజకీయాలకు వేదికగా మారనుంది.