పావురాలగుట్టకు సీబీఐ


కర్నూలు: నల్లమలలోని పావురాలగుట్టలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైన స్థలాన్ని సీబీఐ(కేంద్రీయ దర్యాప్తుసంస్థ) పరిశీలించనుంది. హెలికాప్టర్‌ ప్రమాదంపై సీబీఐచే దర్యాప్తు చేయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ ఇప్పటికే దర్యాప్తు సాగించిన సీఐడీనుంచి సమాచారాన్ని సేకరించింది.

Advertisements

హెలికాప్టర్‌ ఘటనపై పలు అనుమానాలు


కర్నూలు: వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రయాణించిన హెలికాప్టర్‌ నల్లమల అడవుల్లో కూలిపోయిన ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఇప్పటికే విచారణ మొదలైంది. ప్రమాదంలో సిఎంతో సహా అందరూ మరణించడంతో ఎంక్వైరీకి సాంకేతిక అంశాలే కీలకం కానున్నాయి. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రయాణించిన హెలికాప్టర్‌ ప్రమాద ఘటనపై సిబిసిఐడి పోలీసులు విచారణ జరుపుతున్నారు. హెలికాప్టర్‌ ప్రమాదంపై కర్నూలు జిల్లా ఆత్మకూరు ఎఆర్‌ఓ సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్నారు. హెలికాప్టర్‌ కొండను ఢీ కొందా? లేదా ఆకాశంలోనే పేలిందా అనే మిస్టరీని చేధించేందుకు సిబిసిఐడి పోలీసులు సంఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారుల నుంచి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. వైఎస్‌ పార్దీవ దేహాన్ని తొలిసారిగా గుర్తించిన వారిని సిఐడి బృందం విచారించనుంది. ప్రమాదంలో హెలికాప్టర్‌ తునాతునకలవడం, సిఎంతో సహా ప్రయాణించిన అందరూ చనిపోవడంతో విచారణకు సాంకేతిక ఆధారాలే కీలకం కానున్నాయి. ఎంక్వైరీకి ఉపయోగపడే అతి ముఖ్యమైన కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌, ట్రాన్స్‌ మీటర్‌లను గ్రేహౌండ్స్‌ దళాల నుంచి ఢిల్లీకి చెందిన ఏవియేషన్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాద ఘటనపై మిగతా సమాచారాన్ని కూడా త్యాగీ నేతృత్వంలోని బృందానికి అందిస్తామని కర్నూలు కలెక్టర్‌ మీనా ఆదివారం తెలిపారు. ప్రమాద వివరాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కో ఆర్డినేషన్‌ కమిటీని రూపొందించింది.

23 గంటల తర్వాత గుర్తింపు


కర్నూలు: 23 గంటల ఉత్కంఠ తర్వాత సీఎం హెలికాప్టర్‌ ఆచూకీ లభ్యమైంది. సంతజూటూరు-వెలుగోడు మధ్యలో కొండపై దీనిని వైమానికి దళం గుర్తించింది. అయితే హెలికాప్టర్‌ ఎలా ఉందనే విషయం ఇప్పుడే చెప్పలేమని అధికారులు పేర్కొన్నారు. క్షేమ సమాచారం తెలియడానికి మరికొంత సమాచారం పడుతుందని అధికారులు చెప్పారు. మరికాసేపట్లో అక్కడికి చేరుకున్నాకే పూర్తి సమాచారం అందుతుందని అధికారులు తెలిపారు. సీఎం హెలికాప్టర్‌ గుర్తించిన ప్రదేశంలో మూడు ఆర్మీ హెలికాప్టర్లు ల్యాండ్‌ అయ్యేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం.

ఎపీపీఎస్సీలో నాగులదిన్నె ఆణిముత్యం


నందవరం: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ నిర్వహించిన పబ్లిక్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌లో ఏఈ ఉద్యోగాలకు జరిగిన వ్రాత పరీక్షల్లో నాగలదిన్నె వాసి సతీష్‌కుమార్‌ తన ప్రతిభను చాటి రాష్ట్రంలో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో రాయలసీమలో ప్రథమ స్థానం చోటుచేసుకుంది. నవంబర్‌ 17న నిర్వహించిన వ్రాత పరీక్షల్లో పాల్గొన్న సతీష్‌కుమార్‌ ఆగష్టు 7వ తేది విడుదల అయిన ఫలితాలలో ఈ ఘనతను సాధించాడు. సాదారణ రైతు కుటుంబంలో జన్మించిన సతీష్‌ తన పదవ తరగతి విద్యాభ్యాసాన్ని నాగలదిన్నె ఉన్నత పాఠశాలలో కొనసాగించాడు. శ్రీశైలంలో పాలిటెక్నికల్‌ విద్యనభ్యసించి అటుపిమ్మట బిటెక్‌ సివిల్‌ ఇంజనీర్‌గా హైదారాబాద్‌ జేఎన్‌టీయూలో దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ మౌళిక పరిశ్రమల సంస్థలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా పులివెందులలో పని చేస్తున్నాడు. ఆయన పడ్డ కఠోర శ్రమకు పూర్తి స్థాయిలో ఫలితం దక్కిందని తల్లిదండ్రులు సుబ్బయ్యశెట్టి, వేదావతి, అన్న వీరేష్‌లు సంబంరపడిపోతున్నారు. సతీష్‌ తనను ద్వితీయ స్థానంలో రావడం శ్రమకు తగ్గ ఫలితం దక్కిందనే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

పసుపల ఎస్టీ హాస్టల్‌పై ఎసిబి దాడులు


బనగానపల్లె (కర్నూల్ జిల్లా): బనగానపల్లె మండలం పసుపల గ్రామంలోని ఎస్పీ హాస్టల్‌పై ఎసిబి దాడులు నిర్వహించారు. జిల్లా ఎసిబి సిఐ మహబూబ్‌బాష, డోన్‌ఇఓ ఆర్డీ ఐజయ్య, జూనియర్‌ అసిస్టెంట్‌ కాశినాధ్‌ప్రసాద్‌లు దాడి చేసిన వారిలో ఉన్నారు. ఎసిబి అధికారులు హాస్టల్‌పై దాడులను నిర్వహించగా హాస్టల్‌లోని ఒక గదిని వాచ్‌మెన్‌ సొంతం చేసుకొని తన అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. అందులో మద్యం బాటిళ్లు లభ్యం అయ్యాయి. వార్డన్‌ సుంకన్న మెనూ ప్రకారం విద్యార్థులకు భోజన వసతులు కల్పించడం లేదని విద్యార్థుల ఫిర్యాదు మేరకు అధికారులు సమాచారాన్ని సేకరించారు. మొత్తం హాస్టల్‌లో 146 మంది ఉండాల్సి ఉండగా 110 మందికి అటెండెన్స్‌ వేశారని అయితే తనిఖీలో 38 మంది మాత్రమే ఉన్నట్లు బయటపడింది. రికార్డులలో కూడా 110 మంది హాజరు అయినట్లు తప్పుడు సమాచారాన్ని వార్డన్‌ పొందుపరిచినట్లు బయటపడింది.

విద్యార్థులకు అందించే నిత్యావసర సరుకుల్లో వత్యాసం కనబడింది. భోజన వసతులను విద్యార్థులను ప్రశ్నించగా మెనూ ప్రకారం భోజనాల ఉండవని వారు పేర్కొన్నారు. హాస్టల్‌లో వార్డన్‌, కమాటి, వాచ్‌మెన్‌లు హవా కొనసాగిస్తునట్లు విద్యార్థులు ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేశారు. మద్యం బాటిళ్లు దొరికిన గదిని సీజ్‌ చేశారు. ఎన్నో రోజులుగా హాస్టల్‌లో విద్యార్థులకు అందాల్సిన భోజన వసతుల్లో అవినీతికి పాల్పడుతూ అర్ధాకలితో విద్యార్థులను ఉంచుతున్నట్లు అధికారులకు విద్యార్థులకు వివరించారు. వార్డన్‌, సిబ్బంది అవినీతిని బట్టబయలు చేసేందుకు స్వయంగా విద్యార్థులే ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎసిబి సిఐ మహబూబ్‌బాష హాస్టల్‌లో జరిగిన దాడుల్లో పలు అవినీతి అంశాలు బయటపడ్డాయని తాము జిల్లా కలెక్టర్‌కు ప్రభుత్వ సాంఘిక సంక్షేమ ప్రిన్సిపల్‌ సెక్రటరీ హైదరాబాద్‌కు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖకు, ఎసిబి ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

శ్రీశైలం నీటి మట్టం 855.20 అడుగులు


కర్నూలు: కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయంలో గురువారం ఉదయం 6 గంటలకు నీటి మట్టం 855.20 అడుగులు నీటి సామర్థ్యం, 133.5238 టిఎంసీలుగా ఉంది. గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కుడిగట్టు కేంద్రంలో నాలుగు యూనిట్లు ఒక్కొక్కటి 105 మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తామని, 19,878 క్యూసెక్కులు ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో మూడు యూనిట్లు 131 మెగావాట్ల చొప్పున విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ 18,434 క్యూసెక్కుల నీటి ప్రవహాన్ని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నట్లు ఆనకట్ట డిఈఈ పి.సేవానంద్‌ ఇఎంఎస్‌ ప్రతినిధికి ఫోన్‌లో తెలిపారు. అలాగే రోజా గేజింగ్‌ కేంద్రం నుంచి 13600 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తున్నట్లు ఆయన వివరించారు.

బిసి కార్పొరేషన్‌ ఈడీగా నాగేశ్వరరెడ్డి


కర్నూలు: కర్నూలుజిల్లా బిసి కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా నాగేశ్వరరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ప్రస్తుతం కడప జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారిగా పని చేస్తూ సెలవులో ఉన్నారు. ఈయనకు కర్నూలు బీసీ కార్పొరేషన్‌ ఈడీగా ప్రభుత్వం నియమించడంతో మరో రెండు రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్నారు.