ఐదవ కాంటూరు వరకు కొల్లేరు అభివృద్ధికి ప్రణాళిక


ఏలూరు: పశ్చిమ గోదావరి, కృష్ణాజిల్లాల పరిధిలో గల కొల్లేరు మరోసారి వార్తల్లోకెక్కింది. గతంలో ఆనాటిముఖ్యమంత్రి డా వైఎస్‌ రాజశేఖరరెడ్డి సారధ్యంలో కొల్లేరు అభయారణ్య పరిధిని 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరు వరకు తగ్గించాలని కోరుతూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. అయితే ఆ ప్రతిపాదనలను కేంద్రం తిరస్కరించినట్లు విదితమవుతోంది. రాజధానిలో కొల్లేరు సరస్సుపై ముఖ్యమంత్రి రోశయ్య సమక్షంలో సమీక్షా సమావేశం జరిగింది.

అనంతరం రాష్ట్ర అటవీ శాఖామంత్రి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కొల్లేరు సంరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, 5వ కాంటూరు వరకు అభివృద్ధి చేస్తామని, అందుకోసం తక్షణ సాయంగా కేంద్రాన్ని రూ.665 కోట్లు విడుదల చేయాలని కోరాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. మరోవైపున కొల్లేరులో ప్రస్తుతం తవ్విన చేపల చెరువుల ధ్వంసానికి రంగం సిద్ధమైంది. త్వరలోనే మరోసారి ఈ ప్రక్రియ చేపట్టనున్నారు.

గతంలో జిల్లా కలెక్టరుగా లవ్‌ అగర్వాల్‌ బాధ్యతలు నిర్వహించిన సమయంలో సుప్రీంకోర్టు సాధికారిక కమిటీ ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున చేపల చెరువులు ధ్వంసం చేశారు. దీంతో కొల్లేరు ప్రాంతంలోని దళితులు, బిసిలు ఘోరంగా నష్టపోయారు. ముఖ్యంగా బిసి వర్గానికి చెందిన వడ్డీ కులస్తుల చెరువులు, బడా భూస్వాముల ఆధీనంలో ఉన్న లీజు చెరువులు ధ్వంసమయ్యాయి. మళ్ళీ అదే తరహాలో ఈ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు ముందు విచ్చలవిడిగా, నిబంధనలకు విరుద్ధంగా చేపల చెరువులు తవ్వారు. అనూహ్యరీతిలో ఎన్నికల్లో కొల్లేరు పెద్దలు అధికార కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. కానీ మళ్ళీ కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో వారు ఖంగుతిన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు ఇంకా మౌనంగానే ఉన్నారు.

ఈ దశలో మరోసారి చేపల చెరువులు ధ్వంసం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.మూడు కోట్లు మంజూరు చేసింది. మరో రూ.మూడు కోట్లు అవసరమవుతాయని కూడా అధికారులు అంచనా వేసి నివేదిక పంపినట్లు తెలిసింది. ఈ పరిస్థితిపై మంత్రి రామచంద్రారెడ్డి 5వ కాంటూరు వరకు కొల్లేరు అభయరణ్యాన్ని అభివృద్ధిపరచేందుకు కేంద్రాన్ని సహాయం కోరాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. దీనిని బట్టి గతంలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయం బుట్టదాఖలైనట్లు తెలుస్తోంది.

అంతేగాకుండా కొల్లేరును ప్రముఖ టూరిస్టు సెంటర్‌గా తీర్చిదిద్దడానికి ఒక ప్రైవేటు ఏజెన్సీకి లీజుకు ఇచ్చినట్లు తెలిసింది. ఈ విధంగా కొల్లేరు మరోసారి వార్తల్లోకొచ్చింది. ఈ పరిణామం కొల్లేరు ప్రాంత ప్రజలకు మింగుడుపడని సమస్యగా మారింది. ఏది ఏమైనా టూరిస్టు సెంటర్‌గా కొల్లేరును తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయిస్తే స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో అగ్ర ప్రాధాన్యం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. 5వ కాంటూరు వరకు అభివృద్ధి చేసే క్రమంలో కొల్లేరు స్థానిక ప్రజలను భాగస్వాములను చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

Advertisements

సాగర్‌ నీటిని పంటలకు విడుదల చేయాలి: కోడెల


వినుకొండ (గుంటూరు): వినుకొండ ప్రాంత పరిధిలోని సుమారు 8లక్షల ఎకరాల భూమికి నాగర్జున సాగర్‌ జలాలను విడుదల చేయాలని మాజీ మంత్రి డాక్టర్‌ కోడెల శివప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం నర్సారావుపేట టిడిపి కార్యాలయంలో జరిగిన టెలికాన్పరెన్సులో ఆయన మాట్లాడుతూ, తమది రైతు ప్రభుత్వమని చెపుకుంటున్న ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి, ఖరీఫ్‌ ముగుస్తున్న నీటిని విడుదల చేయలేకపోవడం శోచనీయమని అన్నారు. 2003 -04 టిడిపి ప్రభుత్వం, సాగర్‌ రిజర్వాయర్‌లో నీటి పరిమానం అశించిన విధంగా లేకపోయిన సాగునీటిని విడుదల చేశామని అన్నారు. ప్రస్తుతం సాగర్‌ రిజర్వాయర్‌లో 500 అడుగులు, శ్రీశైలం రిజర్వాయర్‌ 800 అడుగుల నీరు ఉన్నప్పటికీ సాగునీటిని విడుదల చేయకపోవడం సమంజసంగా లేదని అన్నారు. శ్రీశైలం నీటిని, సాగర్‌ రిజర్వాయర్‌కు పంపకుండా పోతిరెడ్డిపాడు రిజర్వాయర్‌కు పంపడంలో ప్రభుత్వ విధానం ఏమిటో అర్థం కావడంలేదని అన్నారు. సాగర్‌ నీటిపై హక్కుఉన్న కృష్ణ, గుంటూరు, ప్రకాశం, ఖమ్మం జిల్లాలోని 30లక్షల మంది రైతులు సకాలంలో నీరు అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కోడెల అన్నారు. బియ్యం, కందిపప్పు ధరలు ఆకాశాన్నంటుతున్నాయని సామాన్యులు వాటిని కొనలేని దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం ధరలను తగ్గించడంలో చోద్యం చూస్తున్నదే తప్ప అదుపు చేయలేకపోతున్నదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని పెరిగిన ధరలను తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని కోడెల శివప్రసాద్‌ కోరారు. టెలికాన్పరెన్సులో మాజీ యార్డు చైర్మన్‌ ఆర్‌.లక్ష్మినారాయణ, టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

136 క్వింటాళ్ల బియ్యం పట్టివేత


ఏలూరు: కృష్ణా జిల్లానుండి, తూర్పుగోదావరి జిల్లాకు ఆక్రమంగా రవాణా అవుతున్న 136 క్వింటాళ్ల బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులు గురువారం ఏలూరులో పట్టుకున్నారు. బియ్యం విలువ 3 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ప్రజాపంపిణీ వ్యవస్థ కింద మంజూరైన ఈ బియ్యాన్ని లారీలో కృష్ణా జిల్లా విస్సన్నపేట నుంచి రవాణా చేస్తున్నారు. సమాచారం అందున్న జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధికారి కె. రంగాకుమారి సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఏలూరు బైపాస్‌ రోడ్డులో లారీని పట్టుకున్నారు. ఆనంతరం బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, లారీని సీజ్‌ చేశారు.

కరవు వాత – ధరల మోత


ఏలూరు: జిల్లాలో ఒక వైపున కరవు పట్టిపీడిస్తుండగా మరోవైపున రోజురోజుకూ ఆకాశానికి అంటుతున్న ధరలతో సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికీ అరకొరగా వర్షాలు పడుతున్నప్పటికీ, మెట్ట ప్రాంతంలో ఖరీఫ్‌కు ఎటువంటి ప్రయోజనం లేదని, ఇదే వర్షాలు పది రోజుల క్రితం వచ్చి ఉంటే కాస్త ప్రయోజనం ఉండేదని రైతు నాయకులు పేర్కొంటున్నారు. గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో, జిల్లాలోనూ సకాలంలో వర్షాలు పడి, పంట దిగుబడి బాగా వచ్చినప్పటికీ, ఈ ఏడాది నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. ఈ కరవు ప్రభావం వల్ల రానున్న రోజుల్లో అన్ని రకాల వస్తువుల ధరలు మరింతగా పెరుగుతాయోమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

నిత్యావసర ధరల వస్తువుల ధరలు తగ్గించడానికి రాష్ట్ర మంత్రులతో కూడిన సబ్‌ కమిటీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. మంత్రులు కనీసం కొన్ని జిల్లాల్లో అయినా పర్యటించి వాస్తవ పరిస్థితి తెలుసుకుని, నిత్యావసర వస్తువులు బ్లాక్‌ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవడం మాని రాజధానిలో కూర్చుని సమీక్షలకే పరిమితమయ్యారు. జిల్లా అధికార యంత్రాంగం కిలో బియ్యం 20 రూపాయలకు, కంది పప్పు కిలో 61 రూపాయలకు విక్రయించడానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసింది. అయితే జిల్లాలోని 26 కేంద్రాల్లో పిఎల్‌ బియ్యం రకం కిలో 20 చొప్పున కేవలం తెల్ల కార్డు ఉన్న వారికి ఐదు కిలోలు చొప్పున మాత్రమే అందిస్తోంది.

అంతేకాకుండా కందిపప్పు కిలో 61 రూపాయల చొప్పున తెల్ల కార్డుదారులకు కుటుంబానికి ఒక కిలో చొప్పున ఒక ఏడాది పాటు అందివ్వడానికి భీమవరం, పాలకొల్లు, నరసాపురం, కొవ్వూరులలోని రైతుబజార్లలో, తాడేపల్లిగూడెం, తణుకు, జంగారెడ్డిగూడెం, నిడదవోలులో ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయించడానికి రంగం సిద్ధం చేసింది. అయితే జిల్లాలోని తెల్ల కార్డుదారులందరికీ బియ్యం, కందిపప్పు సరిపడినంతగా ఇవ్వడం లేదు. అంతేకాకుండా పంచదార ధర కూడా భారీగా పెరిగింది. ఆయిల్‌ ధరలు, కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ధరల నియంత్రణకు అక్కడక్కడా ఆకస్మిక దాడులకు అధికార యంత్రాంగం ప్రయత్నిస్తున్నా, వాస్తవానికి ధరలు తగ్గక ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఈ పరిస్థితులను అధిగమించడానికి, ప్రజలను కరవు రోజుల్లో ఆదుకోవడానికి , భవిష్యత్తులో కూడా నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా ఉండడానికి చిత్తశుద్ధితో ప్రభుత్వం, అధికార యంత్రాంగం కృషి చేయాలి.

కారువు కాటేసింది…


సత్తుపల్లి: డివిజన్‌లోని 50వేల ఎకరాల్లో తిండి గింజలు పండుతున్నా యి. ప్రధాన జలాశయాలైన పెద్దవాగు, లంకాసాగర్‌, ఎన్‌ ఎస్‌పి, రాథోని, బేతుపల్లి ప్రాజెక్టుల కింద 30వేల ఎకరా లలో వరి వేయాల్సి ఉంది.ఇందుకు గానూ జూన్‌ నెలాఖరు లేదా జులై మొదటి వారంలో దాదాపు నాట్లు పూర్తి కావాలి. అందుకు జూన్‌ మొదటి వారంలోనే నారుమడులు సిద్ధం చేసుకొని నాట్ల కోసం దుక్కులు పూర్తి చేసుకుంటారు రైతు లు. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితులు లేవు, వాతావరణం అం దుకు పూర్తి విరుద్ధంగా మారింది. కనీసం రైతు కుటుంబా లకు సరిపడా తిండిగింజలు కూడా పండించే పరిస్థితి లేదు. బోర్లు, బావులపై ఆధారపడిన రైతాంగం విద్యుత్‌ సమస్యతో చేళ్లు తడవక విలవిల్లాడుతున్నారు. దీంతో బియ్యం భోజ నం మరచి రాగిమాల్టు, జొన్నకూడు, గంజి మెతుకులు తినే పరిస్థితి రాబోతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఈజీఎస్‌ పనులు కూడా దొరకడం లేదు:
డివిజన్‌ వ్యా ప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొని ప్రజలు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు.ఈజీఎస్‌ పనులకు వెళితే రోజుకు కనీసం రూ.50 పడటం కష్టంగా ఉందని, ఆ పనులు కూడా అందరికీ లభించడం లేదని వాపోతున్నారు. వేసవిని తల పిస్తుండటంతో చివరికి చివరికి కూలీపని చేసుకోవడానికి కూడా సహకరించిన పరిస్థితి నెలకొంది.

ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో విఫలం:
కరువును దృష్టిలో ఉంచుకొని తక్షణ చర్యలు చేపట్టాల్సి న బాధ్యత పాలకులపై ఉంది. అందుకు పోరాటాలు, ఆం దోళనలు చేయాల్సిన విది ప్రతిపక్షాలపై ఉంది. కానీ ఆ దిశ గా చర్యలు సాగడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ హామీలు ప్రకటనలకే తప్పా అమలుకు నోచుకోవ డం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు పర్యటనలతో కాలం వెల్లబుచ్చుతున్నాయే తప్పా ప్రభుత్వా లపై వత్తిడి తీసుకురాలేకపోతున్నాయని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది.

కరువు ఎమర్జెన్సీని ప్రకటించాలి:
మునుపెన్నడూ లేనం తగా దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వెంటనే కరు వు ఎమర్జోన్సీ విధించాలని వ్యవసాయ కార్మిక సంఘాలు డి మాండ్‌ చేస్తున్నాయి. పేదల కోసం గంజి కేంద్రాలు ఏర్పాటు చేయాలని., ఇతర రాష్ట్రాల నుంచి బియ్యం దిగుమతి జరి పి తక్కువ ధరకు పంపిణీ చేయాలని కోరుతున్నాయి. అదే విధంగా నిత్యావసరాల ధరలు భారీగా తగ్గించాలని., ప్రతి విద్యాసంస్థల్లో భోజన పథకం ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ పనుల ద్వారా ప్రజలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.

కరవు ప్రత్యేక అధికారిగా రఫత్‌ ఆలీ


గుంటూరు: జిల్లాలో కరవు పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ప్రత్యేకాధికారిగా రాష్ర్ట సర్వశిక్ష అభయాన్‌ కమిషనర్‌ రఫత్‌ ఆలీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీచేసింది. త్వరలో ఆయన జిల్లాకు రానున్నారు. జిల్లాలో పంటల పరిస్థితి, పశుగ్రాసం, ఉపాధి హామీ పధకాలను సమీక్షిస్తారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితులు క్రమంగా తగ్గి విస్తారంగా వర్షాలు కురవడంవల్ల రైతులు పెద్ద ఎత్తున సేద్యంపై దృష్టిసారించారు. ఇప్పటి వరకు డెల్టాలో 2 లక్షల ఎకరాల్లో వరినాట్లు వేశారు. అలాగే మెట్ట ప్రాంతంలో రెండు లక్షల ఎకరాల్లో పత్తి విత్తనాలు నాటారు. 25వేల ఎకరాల్లో మిర్చి నారు నాటారు.

నాగార్జునసాగర్‌ ఆయకట్టు పరిధిలో వరిపంట సాగు వ్యవహారం ప్రశ్నార్ధకంగా మారింది. సాగర్‌ నుంచి నీటి విడుదలలో తీవ్ర జాప్యం జరగడం వల్ల ఇబ్బంది ఏర్పడిందని రైతులు తెలిపారు. అలాగే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వ్యవసాయపనులు ముమ్మరంగా సాగుతున్నాయని జిల్లా వ్యవసాయ శాఖాధికారి రామకృష్ణమూర్తి తెలిపారు. నాగార్జున సాగర్‌ ఆయకట్టు పరిధిలో జోన్‌-2లో వరి పంటకు ప్రభుత్వం అనుమతించే విషయంలో ఇంకా స్పష్టత రాలేదన్నారు. మిగతా అన్నీ ప్రాంతాల్లో వివిధ రకాల పంటలు వేస్తున్నారని కృష్ణా, పశ్చిమ డెల్టా గుంటూరు ఛానల్‌ పరిధిలో వరినాట్లు నెలాఖరుకు పూర్తవుతాయన్నారు. నిర్ణీత లక్ష్యం మేరకు నాలుగు లక్షల ఎకరాల్లో పత్తి పంట వేసే అవకాశం ఉందన్నారు. 75వేల ఎకరాల్లో మిర్చిపంట వేయనున్నారు. జిల్లాలో పంటల పరిస్థితి ప్రస్తుతం ఆశాజనకంగానే ఉందని ఆయన తెలిపారు.