వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద కుటుంబసభ్యుల నివాళి


కడప: ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన భార్య ఎమ్మెల్యే విజయమ్మ, కూతురు షర్మిల, కోడలు భారతి, మనువడు, మనుమరాళ్లు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విజయమ్మ, షర్మిల ఘాట్‌ నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణ వివరాలను ఇంజనీర్లు వారికి వివరించారు.

టిటిడి బోర్డు మాజీ చైర్మన్‌ కరుణాకర రెడ్డి, బోర్డు సభ్యుడు చెవిరెడ్డి భాస్కర రెడ్డి వైఎస్‌ఆర్‌ ఘాట్‌కు చేరుకొని, ఘాట్‌ని పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.

Advertisements

మంత్రి గల్లా అరుణ కడప పర్యటన


కడప: జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి జిల్లా పర్యటనకు రానున్నారు. ఈ నెల 5న జిల్లాలో జరిగే ప్రజాపథం కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి హోదాలో ఆమె పాల్గొంటారు. ఈమేరకు జిల్లా కలెక్టర్ శశిభూషన్‌ కుమార్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.

మంత్రి 5న ఉదయం 8.30 గంటలకు ఒంటిమిట్ట మండలం, గొల్లపల్లె గ్రామ సభలో పాల్గొంటారు. అదే రోజ ఉదయం 11.30 గంటలకు కొండాపురం మండలం తాళ్ల ప్రోద్దటూరు, మధ్యాహ్నం 3 గంటలకు లక్కిరెడ్డిపల్లె మండలం దిన్నెపాడులో జరిగే ప్రజాపథం గ్రామసభల్లో పాల్గొంటారని కలెక్టర్ వివరించారు.

బడుగు వర్గాలను ఆదుకున్న వైఎస్‌


కడప: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పేద, బీద, బడుగు, బలహీనవర్గాల ప్రజలతోపాటు గిరిజనులు కూడా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ అన్ని విధాలుగా ఆదుకున్నారని ఏపి వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి అన్నారు. 2004లో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తరువాత డాక్టర్‌ వైఎస్‌ వృద్ధాప్య, వికలాంగ, పింఛన్‌లను పెంచరాన్నారు. అదేవిధంగా పక్కా గృహాల నిర్మాణ వ్యయాన్ని కూడా పెంచారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 46 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించినందు వల్ల పేదలకు ఉచితంగా నెలకు 50 కేజీల బియ్యం పంపిణీ చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే జిల్లాలోని రైతాంగాన్ని ఆదుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రైతాంగం తిరిగి పంటలు వేసుకునేందుకు అన్నిరకాలుగా ప్రభుత్వం సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఆ మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలి


కడప: కడప జిల్లాలోని ప్రభుత్వం ప్రకటించని ఐదు మండలాలను కూడా కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని పీఆర్పీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి హరిప్రసాద్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని మొత్తం 51 మండలాలలో ప్రభుత్వం 46 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించిందన్నారు. ఈ ప్రకటన జిల్లా ప్రజలకు ఆనందం కలిగించేదే అయినప్పటికీ మిగిలిన మండలాలను ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. వర్షాభావ పంటలపైనే ఆధారపడ్డ లక్కిరెడ్డిపల్లి, పిన్నమండం, కంభేపల్లి మండలాలతోపాటు రైల్వేకోడూరు, గోగులవారిపల్లి మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ మండలాల్లో కరువు లేదని ప్రభుత్వం ప్రకటించడం దురదృష్టకరమన్నారు. అధిక వర్షాల వల్ల ఈ మండలాల్లోని రైతులు వేసిన పంటలను కోల్పోయి అప్పుల ఊబిలో కూరుకుపోయారని అన్నారు. వర్షాపాత ఆధారంగా కరువు మండలాలను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అధిక వర్షాల వల్ల సర్వస్వం కోల్పోయి రిక్తహస్తాలతో మిగిలిన ఈ మండలాల రైతాంగ దుస్థితిని పరిగణలోకి తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ మండలాలను కూడా కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో తాము తమ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు


కడప: జిల్లాలో కానిస్టేబుళ్ల ఎంపికలో భాగంగా నిర్వహించిన వ్రాత పరీక్షలలో అభ్యర్థులు ఎలాంటి అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని కడప డిఎస్పీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఈనెల 13వ తేదీన రాత పరీక్షలు నిర్వహించనున్నామని ఆయన అన్నారు. కడపలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. వ్రాత పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. కెఎస్‌ఆర్‌ఎం ఇంజనీరింగ్‌ కళాశాలలో ఈ పరీక్షలు జరుగుతాయని అన్నారు. అభ్యర్థులు ఉదయం 8 గంటల లోపే పరీక్షా కేంద్రంలోకి రావాలని చెప్పారు. అభ్యర్థులు తమ వెంట పెన్సిల్‌, రబ్బరు, రోనాల్డ్‌ పెన్‌, హాల్‌ టికెట్‌ మాత్రమే వెంట పెట్టుకొని రావాలన్నారు.క్యాల్క్‌లెటర్‌, సెల్‌ఫోన్‌, ఇతర ఎలక్ట్రానిక్‌కు సంబంధించిన వస్తువులను వెంట తెచ్కుకోరాదని అన్నారు. దాదాపు 1800 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారని వివరించారు. వీరు సకాలంలో పరీక్షా కేంద్రానికి హాజరు కడప రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌, పాత బస్టాండ్‌లలో నుంచి ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులను ఏర్పాటు చేశామన్నారు. విధి లేని పరిస్థితిలో విద్యార్థులు ఏ రకంగా ఆలస్యంగా వచ్చినా 9 గంటల వరకు మాత్రమే ప్రవేశానికి అనుమతిస్తామని, అటు తరువాత పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించుకోవాలని ఆయన అన్నారు.

పదవి ఇవ్వకపోతే రాజీనామాలు ఆమోదించండి


కడప: కడప ఎంపి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమించని పక్షంలో తాము చేస్తున్న రాజీనామాలను ఆమోదించాలని ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ కమిటీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్‌బాబుకు విజ్ఞప్తి చేశారు. ప్రొద్దుటూరు మున్సిపల్‌ ఇన్‌ఛార్జ్‌ ఛైర్‌పర్సన్‌ ముక్తియార్‌ తోపాటు రాజుపాలెం ప్రొద్దుటూరు ఎంపిపిలు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు మొత్తం 79 మంది ప్రజాప్రతినిధులు తమ రాజీనామా పత్రాలను అధ్యక్షునికి అందజేశారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కుమారుడు కొండారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దివంగత ముఖ్యమంత్రి ఆశిస్సులు, అండదండలతోనే తాము రాజకీయంలోకి రావడం, ప్రజాప్రతినిధులుగా ఎంపిక కావడం జరిగిందన్నారు. అందువల్ల ఆ కుటుంబానికి రాష్ట్ర నాయకత్వం బాధ్యతలు లేకపోతే తాము పదవుల్లో కొనసాగలేమని వారు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా అధిష్ఠానవర్గం జగన్‌ను నియమించని పక్షంలో తాము చేసిన రాజీనామాలను ఆమోదించాలని వారు ముకుమ్మడిగా పార్టీ జిల్లా అధ్యక్షునికి విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి


కడప: కెసి కాల్వ సాగునీటి విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఆర్‌.వెంకటసుబ్బరెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ కాల్వ నీటి విడుదలపై అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రభుత్వం కెసి కాల్వ అధికారులు ఎవరికి వారుగా ప్రకటనలు చేస్తుండడంతో రైతాంగంలో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయని ఆయన నేడిక్కడ విడుదల చేసిన ప్రకటనలో చెప్పారు. ఆయకట్టు రైతాంగం అయోమయంలో ఉందని తెలిపారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం కాల్వ నీటి విడుదలపై స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. మైదుకూరు ఎమ్మెల్యే డాక్టర్‌ డిఎల్‌ రవీంద్రారెడ్డి కాల్వకు నీరు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అందువల్ల ఈ ప్రాంత రైతాంగం తమ పంటలను వేసుకోవచ్చునని ప్రకటించారని అన్నారు. అయితే ముఖ్యమంత్రి కె.రోశయ్య ఇటీవల సాగునీటి వనరులపై నిర్వహించిన సమావేశంలో ఈ విషయం అసలు ప్రస్తావనకు రాలేదని అన్నారు. కెసి కెనాల్‌ డిఇ మాత్రం ఇప్పుడిప్పుడే కాల్వకు అవసరమైన నీరు వచ్చేది లేదని చెప్పారని అన్నారు. ఇలా ఎవరికి తోచినవిధంగా వారు ప్రకటనలు చేస్తుండడంతో రైతుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ముందుగా ఎమ్మెల్యే ప్రకటించిన ప్రకటనతో రైతాంగం నార్లు పోసి గత వారం రోజులుగా నాట్లు కూడా వేస్తున్నారాన్నరు. కెసి కెనాల్‌ కింద వరి పైర్లు పంటకాలం పూర్తయ్యేంతవరకు సాగునీరు ఇవ్వకపోతే పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు.