ఐదవ కాంటూరు వరకు కొల్లేరు అభివృద్ధికి ప్రణాళిక


ఏలూరు: పశ్చిమ గోదావరి, కృష్ణాజిల్లాల పరిధిలో గల కొల్లేరు మరోసారి వార్తల్లోకెక్కింది. గతంలో ఆనాటిముఖ్యమంత్రి డా వైఎస్‌ రాజశేఖరరెడ్డి సారధ్యంలో కొల్లేరు అభయారణ్య పరిధిని 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరు వరకు తగ్గించాలని కోరుతూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. అయితే ఆ ప్రతిపాదనలను కేంద్రం తిరస్కరించినట్లు విదితమవుతోంది. రాజధానిలో కొల్లేరు సరస్సుపై ముఖ్యమంత్రి రోశయ్య సమక్షంలో సమీక్షా సమావేశం జరిగింది.

అనంతరం రాష్ట్ర అటవీ శాఖామంత్రి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కొల్లేరు సంరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, 5వ కాంటూరు వరకు అభివృద్ధి చేస్తామని, అందుకోసం తక్షణ సాయంగా కేంద్రాన్ని రూ.665 కోట్లు విడుదల చేయాలని కోరాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. మరోవైపున కొల్లేరులో ప్రస్తుతం తవ్విన చేపల చెరువుల ధ్వంసానికి రంగం సిద్ధమైంది. త్వరలోనే మరోసారి ఈ ప్రక్రియ చేపట్టనున్నారు.

గతంలో జిల్లా కలెక్టరుగా లవ్‌ అగర్వాల్‌ బాధ్యతలు నిర్వహించిన సమయంలో సుప్రీంకోర్టు సాధికారిక కమిటీ ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున చేపల చెరువులు ధ్వంసం చేశారు. దీంతో కొల్లేరు ప్రాంతంలోని దళితులు, బిసిలు ఘోరంగా నష్టపోయారు. ముఖ్యంగా బిసి వర్గానికి చెందిన వడ్డీ కులస్తుల చెరువులు, బడా భూస్వాముల ఆధీనంలో ఉన్న లీజు చెరువులు ధ్వంసమయ్యాయి. మళ్ళీ అదే తరహాలో ఈ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు ముందు విచ్చలవిడిగా, నిబంధనలకు విరుద్ధంగా చేపల చెరువులు తవ్వారు. అనూహ్యరీతిలో ఎన్నికల్లో కొల్లేరు పెద్దలు అధికార కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. కానీ మళ్ళీ కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో వారు ఖంగుతిన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు ఇంకా మౌనంగానే ఉన్నారు.

ఈ దశలో మరోసారి చేపల చెరువులు ధ్వంసం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.మూడు కోట్లు మంజూరు చేసింది. మరో రూ.మూడు కోట్లు అవసరమవుతాయని కూడా అధికారులు అంచనా వేసి నివేదిక పంపినట్లు తెలిసింది. ఈ పరిస్థితిపై మంత్రి రామచంద్రారెడ్డి 5వ కాంటూరు వరకు కొల్లేరు అభయరణ్యాన్ని అభివృద్ధిపరచేందుకు కేంద్రాన్ని సహాయం కోరాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. దీనిని బట్టి గతంలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయం బుట్టదాఖలైనట్లు తెలుస్తోంది.

అంతేగాకుండా కొల్లేరును ప్రముఖ టూరిస్టు సెంటర్‌గా తీర్చిదిద్దడానికి ఒక ప్రైవేటు ఏజెన్సీకి లీజుకు ఇచ్చినట్లు తెలిసింది. ఈ విధంగా కొల్లేరు మరోసారి వార్తల్లోకొచ్చింది. ఈ పరిణామం కొల్లేరు ప్రాంత ప్రజలకు మింగుడుపడని సమస్యగా మారింది. ఏది ఏమైనా టూరిస్టు సెంటర్‌గా కొల్లేరును తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయిస్తే స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో అగ్ర ప్రాధాన్యం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. 5వ కాంటూరు వరకు అభివృద్ధి చేసే క్రమంలో కొల్లేరు స్థానిక ప్రజలను భాగస్వాములను చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

Advertisements

ఔను! వాళ్లే జెండా పీకేశారు!!


ఏలూరు: ప్రజారాజ్యం పార్టీ అధినేత మెగాస్టార్‌ చిరంజీవి సొంత జిల్లాలోనే ఆ పార్టీ పరిస్థితి ఘోరంగా ఉంది. సెప్టెంబర్‌ 8న జరగనున్న రెండు జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పీఆర్పీ పోటీ చేయడానికి వెనుకంజ వేసింది. ఈ పరిణామం పీఆర్పీ భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకునేలా చేసింది. చిరంజీవి సొంత జిల్లాలోనే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం రాజకీయవర్గాల్లో తీవ్ర సంచలనాన్ని రేపింది. ద్వారకా తిరుమల, గణపవరం జడ్పీటీసీల ఉప ఎన్నికల సమరంలో పీఆర్పీ తలపడే పరిస్థితులు కరువయ్యాయి. పీఆర్పీకి చెందిన కోటగిరి విద్యాధరరావు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ పీఆర్పీ తరఫున పోటీ చేసేందుకు ఎవ్వరికీ ధైర్యం చాలడం లేడు. గణపవరం జడ్పీటీసీ ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ గెలుపు బాధ్యతను మంత్రి వట్టి వసంతకుమార్‌ భుజస్కందాలపై వేసుకున్నారు. ద్వారకా తిరుమలలో కూడా ఇదే తరహా బాధ్యతను ఆరోగ్య శాఖమంత్రి పితాని సత్యనారాయణ తీసుకున్నారు.
కాదు… కాదు…..
ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకే ఈ రెండు ఉప ఎన్నికలపైననే మంత్రుల భవిష్యత్‌ ఆధారపడి ఉన్నది. ఈ రెండు జడ్పీటీసీల ఉప ఎన్నికలను తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. రాజమండ్రి స్థానానికి పోటీచేసి ఓడిపోయిన మురళీమోహన్‌ తోపాటు మాజీమంత్రులు మాగంటిబాబు, కె.రామచంద్రరాజులు ఉప ఎన్నికల్లో టీడీపీ గెలిచే వ్యూహానికి పదునుపెట్టారు. మాగంటిబాబు ఏకంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడితే, ముఖ్యమంత్రి వైఎస్‌ మంత్రులిద్దరిని తొలగిస్తారా? అనే చర్చను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ పరిస్థితుల్లో పీఆర్పీ ఈ ఎన్నికల్లో తమ సత్తాను ఏ తరహాలో నిరూపించుకుంటుందో అన్న ఆసక్తి ప్రజల్లో నెలకొని ఉంది. అయితే నామినేషన్‌ల సమయంలో గణపవరం స్థానంలో పీఆర్పీ తరఫున పోటీకి ఎవ్వరూ ఇష్టపడలేదు. తెర వెనుకనుండి టీడీపీ అభ్యర్థి పి.నర్సింహరాజుకు సహకరించేందుకు పీఆర్పీ శ్రేణులు సిద్ధపడినట్లు సమాచారం అందుతున్నప్పటికీ ఆ వర్గం నేతలు కొందరు ఇప్పటికే రాష్ట్ర మంత్రి వసంతకుమార్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిపోయారు.
ఇక ద్వారకా తిరుమల స్థానంలో పీఆర్పీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన శ్రీనివాస్‌ ఆఖరి క్షణంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ రామచంద్రరాజు బావమరిది మేడవరపు అశోక్‌ జోక్యంతో రంగం నుండి తప్పుకున్నారు. మొత్తంమీద ఈ రెండు స్థానాల్లో టీడీపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరిగా తలపడే పరిస్థితికి ప్రజారాజ్యం పార్టీ కావడంతో పార్టీ భవిష్యత్‌పై ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ చర్య వ్యూహాత్మకమా? లేక ఆత్మస్థైర్యలోపమా? అన్న వాదన కూడా వినిపిస్తుండగా మొత్తంమీద పరిస్థితి చూస్తే సొంత జిల్లాలోనే చిరంజీవికి కష్టకాలం దాపురించినట్లు కనిపిస్తోంది. ఒకవర్గం నాయకులు తమ పార్టీని భూస్థాపితం చేయడానికి కుట్ర పన్నుతున్నారనే చిరంజీవి ఆరోపణల నేపథ్యంలో చర్చ సాగుతుండగా సొంత వర్గం నుండే ఆయనకు మెగా సహకారం రాకపోవడం విశిష్ట పరిణామంగా చెప్పుకుంటున్నారు.

వివాదానికి తెరతీసిన విలేఖరులపై కేసు నమోదు


ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఇద్దరు పత్రికా విలేఖరులపై పోలీసుల కేసు నమోదు వ్యవహారం తీవ్ర వివాదానికి తెరతీసింది. జర్నలిస్టుల సంఘాలు ఇది తప్పుడు కేసుగా ఆరోపిస్తున్నాయి. చివరకు మీడియా ప్రతినిధులకు, పోలీసు యంత్రాంగానికి మధ్య కోల్డ్‌వార్‌కు ఈ ఉదంతం శ్రీకారం చుట్టింది. అదే సమయంలో నిత్యం అవినీతి ఆరోపణల ఊబిలో చిక్కిన ఏలూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి అధికారులకు జర్నలిస్టులపై కేసు నమోదు వ్యవహారం ప్రచ్ఛన్న యుద్ధానాకి కారణమైంది. జర్నలిస్టులపై కేసుల నమోదు వ్యవహారంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని ఆరోపణలు మిన్నుముడుతున్నాయి. రాష్ట్ర డీజీపీ ఎస్‌ఎస్‌పి. యాదవ్‌కు ఏలూరులో సన్నిహితుడిగా చెప్పుకునే ఒక కళాశాల అధ్యాపకుడిపై జర్నలిస్టుల సంఘాలు కారాలు, మిరియాలు నూరుతున్నాయి. ఈ అధ్యాపకుడే ఈ కేసు నమోదు వ్యవహారంలో అన్ని తానై జిల్లా ఎస్పీ బాలకృష్ణపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని ప్రచారం సాగుతుంది. గతంలో ఈయనపై ఆంధ్రజ్యోతి దినపత్రికలో వెలువడిన వార్త కథనాల నేపథ్యంలోనే అదే పత్రికకు చెందిన క్రైం విలేఖరి బెనర్జీతోపాటు సాక్షిపత్రిక క్రైం విలేఖరి సంజయ్‌లపై ఏలూరు టూటౌన్‌ పోలీసులు నాన్‌బెయిలబుల్‌ సెక్షన్‌ క్రింద కేసు నమోదు చేసారు. ఈ ఇద్దరు విలేఖరుల ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే జూనియర్‌ అసిస్టెంట్‌ అయిన మహిళా ఉద్యోగి ఉమాదేవిని వేధించి ఆమె విధులకు ఆటంకం కలిగించడం తదితర నేరారోపణలపై టూటౌన్‌ ఎస్సై మురళీకృష్ణ కేసు నమోదు చేయడం జిల్లాలో ప్రకంపనాలు సృష్టిస్తున్నది.
కేసు నేపథ్యం ఇది!
గర్భిణీ స్త్రీలకు ప్రసూతి సహాయం పథకం కింద వైద్యఆరోగ్య శాఖ కొంత ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వ పరంగా మంజూరు చేస్తున్నది. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే గర్భిణులకు ఈ సోమ్మును పంపిణీ చేసే వ్యవహారంలో రూ.50చొప్పున సిబ్బంది స్వాహా చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కోఆర్డినేటర్‌ కార్యాలయ సిబ్బందిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ సోమ్మును కొద్దిరోజుల క్రితం పంపిణీ చేసారు. ఆ సమయంలోనే కొందరు బాధితులు పాత్రికేయులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న విలేఖరులు బెనర్జీ, సంజయ్‌లు ఆసుపత్రి ప్రాంగణానికి వెళ్ళి బాధితుల నుండి విషయాలు సేకరించారు. ఆంధ్రజ్యోతి పత్రికలో ఈ అవినీతి బాగోతంపై వెలువడిన వార్తాకథనం తీవ్ర దుమారం లేపింది. అయితే సాక్షిపత్రికలో ఈ వార్తా కథనం ప్రచురించలేదు. అయినప్పటికీ ఈ ఆరోపణలపై ఎటువంటి విచారణకు ఆదేశించని ఆసుపత్రి వర్గాలు తెరవెనుక దోషులను కాపాడేందుకు సరికొత్త ఎత్తులకు దిగాయి. ఈ క్రమంలోనే జూనియర్‌ అసిస్టెంట్‌ ఉమాదేవి ఈ ఇద్దరు విలేఖరులు తమను వేధించారని జిల్లా ఎస్పీ బాలకృష్ణకు నేరుగా ఫిర్యాదు చేసారు. ఇక అక్కడి నుండే తెరవెనుక కథ ప్రారంభం అయింది. టూటౌన్‌ పోలీసులు ఆఘామేఘాలపై స్పందించి ఆమె ఉదహరించినట్లు ఆసుపత్రి ప్రాంగణంలో లేని విలేఖరులపై కేసులు నమోదు చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. తనను వేధించారని ఉమాదేవి ఫిర్యాదు చేసిన తేదీన ఈ ఇద్దరు విలేఖరులు కొవ్వూరు ఎమ్మెల్యే రామారావు ఏలూరు న్యాయస్థానానికి హాజరె వార్తలను కవర్‌చేసే నిమిత్తం అక్కడకు వెళ్ళారు. అయినప్పటికీ పోలీసులు వీరిపై కేసు నమోదు చేయడం వెనుక ఆంతర్యమేమిటనేది జర్నలిస్టుల సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
మంత్రి మాటకు విలువలేదా?
జర్నలిస్టులపై కేసు నమోదు వ్వవహారంపై జర్నలిస్టుల సంఘాలు జిల్లాకు చెందిన రాజీవ్‌ఆరోగ్యశ్రీ శాఖమంత్రి పితానీ సత్యనారాయణ దృష్టికి తీసుకువెళ్ళాయి. ఎపియుడబ్ల్యుజే జిల్లా అధ్యక్షుడు కే.మాణిక్యరావుతోపాటు ఎలక్ట్రానిక్‌ మీడియా అధ్యక్షుడు రామాంజనేయులు ఏలూరు ప్రెస్‌ఫోరం ప్రతినిధులు రఘురాం కె.ఎస్‌.ఎన్‌.రాజు, సీతరామరాజు, నాగభూషణం, శివశ్రీ, బి.వి.రమణ తదితరులు ఈ విషయంలో చొరవచూపారు. మంత్రి సత్యనారాయణ ఈ కేసు రాజీకోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఆసుపత్రి కోఆర్డినేటర్‌ డాక్టర్‌ నాగార్జున, సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ శైలజలతో మాట్లాడారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం తమ అనుమతి తీసుకోకుండానే ఉమాదేవి విలేఖరులపై ఫిర్యాదు చేసారని వారు చెప్పినట్లు తెలుస్తుంది. అదే విషయాన్ని డాక్టర్‌ నాగార్జున, జర్నలిస్టు సంఘాలప్రతినిధులకు తెలియజేసారు. మంత్రి సత్యనారాయణ, ఉమాదేవిని పిలిపించి విషయాన్ని తెలుసుకుని కేసు రాజీకోసం చర్చలు జరిపారు. 48గంటల్లోగా తాను రాజీ విషయంలో స్పందిస్తానని హామీ ఇచ్చిన ఉమాదేవి చివరకు అడ్డం తిరిగారు. దాంతో జిల్లా ఎస్పీపై ఉన్నతస్థాయి ఒత్తిళ్లు ప్రారంభమయ్యాయి. విలేఖరులను అరెస్టు చేస్తామని మీరే తమకు అప్పగించండంటూ గురువారం రాత్రి జర్నలిస్టు సంఘాల ప్రతినిధులకు ఆయన వర్తమానం పంపారు. సదరు ఇద్దరు విలేఖరులు పోలీసుల దాటికి భయపడి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు.

136 క్వింటాళ్ల బియ్యం పట్టివేత


ఏలూరు: కృష్ణా జిల్లానుండి, తూర్పుగోదావరి జిల్లాకు ఆక్రమంగా రవాణా అవుతున్న 136 క్వింటాళ్ల బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులు గురువారం ఏలూరులో పట్టుకున్నారు. బియ్యం విలువ 3 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ప్రజాపంపిణీ వ్యవస్థ కింద మంజూరైన ఈ బియ్యాన్ని లారీలో కృష్ణా జిల్లా విస్సన్నపేట నుంచి రవాణా చేస్తున్నారు. సమాచారం అందున్న జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధికారి కె. రంగాకుమారి సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఏలూరు బైపాస్‌ రోడ్డులో లారీని పట్టుకున్నారు. ఆనంతరం బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, లారీని సీజ్‌ చేశారు.

20 మంది సిఐలకు స్థానచలనం


ఏలూరు: ఏలూరు రేంజ్‌ పరిధిలో 20 మంది పోలీస్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం కలిగింది. గురువారంనాడు ఈ మేరకు ఇన్‌ఛార్జీ డిఐజీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బదిలీ అయిన సిఐలు తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందినవారు. ఏపి టాస్క్‌లో పనిచేస్తున్న వీరారెడ్డిని కాకినాడ స్పెషల్‌ బ్రాంచీ సిఐగా నియమించారు. రాజవమ్మంగిలో పనిచేస్తున్న వెంగరాజును రాజమండ్రిలోని ప్రకాశ్‌నగర్‌కు బదిలీ చేశారు. వేకెన్సీలో ఉన్న రామచంద్రరావును రాజవొమ్మంగికి బదిలీ చేశారు. అలాగే కిశోర్‌ను కృష్ణా జిల్లా మైలవరానికి, అప్పారావును తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడుకు బదిలీ చేశారు. మండపేటలోని ఉమామహేశ్వరరావును కైకలూరుకు బదిలీ చేశారు. గుడివాడ రూరల్‌లో పనిచేస్తున్న పి.ఎస్‌.ఎన్‌.రావును కృష్ణా జిల్లా స్పెషల్‌ బ్రాంచీకి బదిలీ చేశారు. పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్న విజయశేఖర్‌ను పెద్దాపురానికి, శ్రీనివాసరావును విజయవాడకు బదిలీ చేశారు. రాజమండ్రి ట్రాఫిక్‌ సిఐ సత్యానందాన్ని మందపేటకు, పెద్దాపురం సిఐ దుర్గారావును రామచంద్రాపురానికి, రాజోలులోని సోమశేఖరాన్ని అమలాపురానికి, పత్తిపాడులోని శ్రీనివాసరావును కాకినాడలోని ట్రాఫిక్‌కు బదిలీ చేశారు. కాకినాడ ట్రాఫిక్‌ సిఐ మూర్తిని మారేడుపల్లికి, రాజమండ్రి ప్రకాశ్‌నగర్‌ సిఐ మోహనరావును రంపచోడవరానికి బదిలీ చేశారు. కాకినాడ స్పెషల్‌ బ్రాంచీ సిఐ అంబికాప్రసాద్‌ను రాజోలుకు, మారేడుమిల్లి సిఐ కిశోర్‌బాబును నందిగామకు, రామచంద్రపురం సిఐ పూర్ణచంద్రరావుకు ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. మూడేళ్లు దాటినా ఈ సిఐలందరికీ బదిలీల వేటు తప్పలేదు.

తక్కువ ధరకు బంగారం అమ్మే ముఠా అరెస్టు


ఏలూరు: తక్కువ ధరకే బంగారాన్ని అమ్ముదామని మోసగిస్తున్న ముఠాను పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగర పోలీసులు గురువారం వలపన్ని పట్టుకున్నారు. ఏలూరు నగర డిఎస్పీ సాయిశేఖర్‌ స్థానిక టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, విశాఖపట్నానికి చెందిన వై.నాగేశ్వరరావు, బి.శ్రీనివాసరావు, వాసు, మువ్వ శ్రీనివాస్‌ ఈ ముఠాలో కీలక వ్యక్తులని చెప్పారు. ఈ నలుగురు వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి తమవద్ద బంగారం బిస్కెట్లు ఉన్నాయని, వాటి ధర కిలో 12 లక్షల రూపాయలని, వాటిని 3 లక్షల రూపాయలకే ఇస్తామని అనేకమందిని ప్రలోభపెట్టారు. ఏలూరు నగరంలోని రామచంద్రరావుపేట ప్రాంతానికి చెందిన గాంధీ అనే వ్యక్తిని కలిసి ఇదేవిధంగా మాయమాటలు చెప్పి కొంత డబ్బు రాబట్టారు. దీనిపై అందిన సమాచారం మేరకు ఏలూరు టౌన్‌ సిఐ మూర్తి, టూటౌన్‌ ఎస్సై మురళీకృష్ణ ఈ ముఠాను వలపన్ని పట్టుకున్నారు. వారిని అరెస్టు చేసినట్లు డిఎస్పీ చెప్పారు.

కరవు వాత – ధరల మోత


ఏలూరు: జిల్లాలో ఒక వైపున కరవు పట్టిపీడిస్తుండగా మరోవైపున రోజురోజుకూ ఆకాశానికి అంటుతున్న ధరలతో సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికీ అరకొరగా వర్షాలు పడుతున్నప్పటికీ, మెట్ట ప్రాంతంలో ఖరీఫ్‌కు ఎటువంటి ప్రయోజనం లేదని, ఇదే వర్షాలు పది రోజుల క్రితం వచ్చి ఉంటే కాస్త ప్రయోజనం ఉండేదని రైతు నాయకులు పేర్కొంటున్నారు. గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో, జిల్లాలోనూ సకాలంలో వర్షాలు పడి, పంట దిగుబడి బాగా వచ్చినప్పటికీ, ఈ ఏడాది నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. ఈ కరవు ప్రభావం వల్ల రానున్న రోజుల్లో అన్ని రకాల వస్తువుల ధరలు మరింతగా పెరుగుతాయోమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

నిత్యావసర ధరల వస్తువుల ధరలు తగ్గించడానికి రాష్ట్ర మంత్రులతో కూడిన సబ్‌ కమిటీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. మంత్రులు కనీసం కొన్ని జిల్లాల్లో అయినా పర్యటించి వాస్తవ పరిస్థితి తెలుసుకుని, నిత్యావసర వస్తువులు బ్లాక్‌ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవడం మాని రాజధానిలో కూర్చుని సమీక్షలకే పరిమితమయ్యారు. జిల్లా అధికార యంత్రాంగం కిలో బియ్యం 20 రూపాయలకు, కంది పప్పు కిలో 61 రూపాయలకు విక్రయించడానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసింది. అయితే జిల్లాలోని 26 కేంద్రాల్లో పిఎల్‌ బియ్యం రకం కిలో 20 చొప్పున కేవలం తెల్ల కార్డు ఉన్న వారికి ఐదు కిలోలు చొప్పున మాత్రమే అందిస్తోంది.

అంతేకాకుండా కందిపప్పు కిలో 61 రూపాయల చొప్పున తెల్ల కార్డుదారులకు కుటుంబానికి ఒక కిలో చొప్పున ఒక ఏడాది పాటు అందివ్వడానికి భీమవరం, పాలకొల్లు, నరసాపురం, కొవ్వూరులలోని రైతుబజార్లలో, తాడేపల్లిగూడెం, తణుకు, జంగారెడ్డిగూడెం, నిడదవోలులో ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయించడానికి రంగం సిద్ధం చేసింది. అయితే జిల్లాలోని తెల్ల కార్డుదారులందరికీ బియ్యం, కందిపప్పు సరిపడినంతగా ఇవ్వడం లేదు. అంతేకాకుండా పంచదార ధర కూడా భారీగా పెరిగింది. ఆయిల్‌ ధరలు, కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ధరల నియంత్రణకు అక్కడక్కడా ఆకస్మిక దాడులకు అధికార యంత్రాంగం ప్రయత్నిస్తున్నా, వాస్తవానికి ధరలు తగ్గక ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఈ పరిస్థితులను అధిగమించడానికి, ప్రజలను కరవు రోజుల్లో ఆదుకోవడానికి , భవిష్యత్తులో కూడా నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా ఉండడానికి చిత్తశుద్ధితో ప్రభుత్వం, అధికార యంత్రాంగం కృషి చేయాలి.