2, 3వ తేదీలలో మనవహక్కుల మహాసభలు


ఆదిలాబాద్‌: అక్టోబర్‌ 2,3 తేదీలలో అనంతపురంలో మానవహక్కుల వేదిక 3వరాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.బాలగోపాల్‌ తెలిపారు. ఆహారభద్రత, ఆర్థికమాంద్యం బడుగుదేశాల జీవనంపై ప్రభావం శ్రీలంక తమిళలుల భద్రత అనే అంశాలపై ఈ సభలో చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.సభకు రాష్ట్రంలోని 20జిల్లాల నుండి సంఘం కార్యవర్గ సభ్యులు, అభిమానులు పాల్గొంటారని ఆయన వివరించారు. జిల్లాలోని గిరిజన ప్రాంతాలలో వివిధ వ్యాధులతో మృతిచెందుతున్నా సహాయం అందడం లేదని ఆయన ఆరోపించారు. ఓపెన్‌కాస్ట్‌ సింగరేణిలో భూములు కోల్పోయిన రైతులకు తమ మానవహక్కుల వేదిక బాసటగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేసారు. అక్టోబర్‌ 28న రామకృష్ణాపూర్‌లో జరిగే ఓపెన్‌కాస్ట్‌ అభిప్రాయ సేకరణలో మానవహక్కుల వేదిక పాల్గొంటుందని ఆయన పేర్కొన్నారు.

Advertisements

తెలంగాణా విషయంలో మాది స్పష్టమైన వైఖరి: సిపిఐ


ఆదిలాబాద్‌: తెలంగాణా విషయమై తమ పార్టీ స్పష్టమైన వైఖరితో ఉందని బెల్లంపల్లి ఎమ్మెల్యే సిపిఐ శాసనసభ పక్ష నేత జి.మల్లేష్‌ స్పష్టం చేసారు. తెలంగాణా విషయంలో గత 30సంవత్సరాలుగా కాంగ్రెస్‌ పార్టీ మోసం చేస్తూ వస్తుందని ఆయన ఆరోపించారు. నాడు చెన్నారెడ్డిని మొదలుకొని నిన్న రాజశేఖర్‌రెడ్డి వరకు తెలంగాణా ప్రజలకు ద్రోహం చేసారని విమర్శించారు. తెలంగాణా టిఆర్‌ఎస్‌ వల్ల రాదని ఆయన స్పష్టం చేసారు. టిఆర్‌ఎస్‌లో అంతర్గత సంక్షోభం ఉందని, తెలంగాణా ప్రజల మనోభావాలకు విరుద్ధంగా నడుచుకుంటూ తెలంగాణా వాదాన్ని నాశనం చేయడంలో టిఆర్‌ఎస్‌ నాయకులు నిమగ్నమై ఉన్నారని వారు అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే తమ పార్టీ అనుకూలంగా మద్ధతునిస్తుందని అన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ప్రలోభాలకు, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ నీతిమాలిన చర్యలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు. జడ్పీటీసీ సభ్యులను ఆపరేషన్‌ ఆకర్ష్‌ పథకం కింద పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తూ ప్రజాస్థానాన్ని మంటగలుపుతున్నారని అన్నారు. చట్టంకు విరుద్ధంగా స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసేందుకు ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం జీవోలను జారీ చేసిందని, వెంటనే వీటిని రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేసారు.

చైర్మన్‌ ఎంపికకై క్యాంపులతో టిడిపి, కాంగ్రెస్‌ బిజీబిజీ


ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి విషయమై అభ్యర్థిని ఖరారు చేయడంలో కాంగ్రెస్‌ పార్టీలో ఈనెల 30న జరగనున్న జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎంపిక కోసం తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీలు క్యాంపులు నిర్వహిస్తూ బిజీబిజీగా ఉన్నారు. చైర్మన్‌ పదవికి దాదాపుగా కాంగ్రెస్‌ పార్టీదేనని స్పష్టమైనప్పటికీ అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్‌ పార్టీలోని రెండు గ్రూపులలో వివాదం నెలకొంది. ఒక గ్రూపుకు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు నాయకత్వం వహిస్తూ 28సభ్యులతో క్యాంపు నిర్వహిస్తుండగా మాజీ ఎంపీ ఇంద్రకరణ్‌రెడ్డి 8మంది సభ్యులతో మరో గ్రూపును నిర్వహిస్తున్నారు. అభ్యర్థి విషయంలో తమ మాట చెల్లుబాటు కావాలని పట్టుబడ్డంతో ఈ విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.శ్రీనివాస్‌ ముఖ్యమంత్రి రోశయ్యలు కలుగజేసుకుని ఇద్దరిని ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌ టిక్కెట్టుపై గెలుపొందిన జడ్పీటీసీ సభ్యున్ని మాత్రమే చైర్మన్‌గా ఎంపిక చేయాలని ఇంద్రకరన్‌రెడ్డి వర్గం ప్రయత్నిస్తుండగా మరోవైపు 16మంది జడ్పీటీసీలను టిడిపి నుండి కాంగ్రెస్‌లోకి రప్పించిన ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు తాను సూచించిన అభ్యర్థిని మాత్రమే చైర్మన్‌గా ఎంపిక చేయాలని పట్టుబడుతున్నారు. గత 25సంవత్సరాలుగా చైర్మన్‌ పదవికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి ఈ అవకాశాన్ని జారవిడుచుకోకుండా చూడాలనేది జిల్లా నాయకులు అభిప్రాయపడుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో చావుదెబ్బతిన్న కాంగ్రెస్‌ పార్టీ చైర్మన్‌ పదవిని కైవసం చేసుకుని కాంగ్రెస్‌ పార్టీని పూర్వవైభవం తీసుకురావడమే కాకుండా కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపేందుకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పట్టుదలకు పోకుండా చూడాలని నాయకులు పీసీసీ అధ్యక్షునికి విన్నవించినట్లు తెలసింది.

ఆశావహులకు వేతనాలు విడుదల


ఆదిలాబాద్‌: జిల్లాలోని ఆశా వర్కర్లకు పెండింగ్‌లో ఉన్న పారితోషకాలను వైద్య ఆరోగ్య శాఖ అధికారి విడుదల చేశారని ఆంధ్రప్రదేశ్‌ వాలంటరీ హెల్త్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు రాములు తెలిపారు. ఈ విషయమై గత కొంత కాలంగా యూనియన్‌ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుందని దీని ఫలితంగానే గత ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న పారితోషకాలను విడుదలచేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని ఆశావహులకు సంబంధించిన మొత్తం 25 లక్షల 8 వేల రూపాయలు విడుదల అయ్యాయని జిల్లాలోని సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా తమ తమ వేతనాలను పొందాలని ఆయన సూచించారు. పెండింగ్‌లో ఉన్న ఇతర సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.

కార్మికులకు వేతన సవరణ అమలు చేయాలి


ఆదిలాబాద్‌: సిర్పూర్‌ పేపర్‌ మిల్లులో పని చేస్తున్న కార్మికులకు వేతన సవరణ ఒప్పందం చేయాలని, కాంట్రాక్ట్‌ కార్మికులకు ప్రభుత్వ జీవో ప్రకారం జీతాలు చెల్లించాలని విఐపిలు జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సిఐటియు మహాసభలో పలు అంశాలపై తీర్మానం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు నెల నెల వేతనాలు చెల్లించాలని, మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే మంజూరు చేయాలని ఆయన కోరారు. అంగన్‌వాడీ, ఆశా తదితర పథకాలలో పని చేస్తున్న కార్మికులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని తీర్మానించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈనెల 19, 20 తేదీలలో రామకృష్ణపూర్‌లో సిఐటియు రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ శిక్షణా తరగతులకు రాష్ట్ర నాయకులు పాల్గొంటారని ఈ తరగతులకు సభ్యులు అందరూ హాజరు కావాలని ఆయన కోరారు.

కరువు నివారణ చర్యల్లో అధికారులు విఫలం


ఆదిలాబాద్‌: జిల్లాలో వర్షాభావ పరిస్థితుల మూలంగా ప్రభుత్వం కరువు ప్రాంతంగా ప్రకటించినప్పటికీ నివారణ చర్యలు చేపట్టడంలో యంత్రాంగం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నదని మాజీ కేంద్రమంత్రి ముదోల్‌ ఎమ్మెల్యే వేణుగోపాల చారి ఆరోపించారు. వర్షాభావ పరిస్థితుల మూలంగా ఖరీఫ్‌లో రైతులు వేసిన పంటలు పూర్తిగా నష్టపోయాయని రైతులను ఆదుకునేందుకు జిల్లా యంత్రాంగం కరువు నివారణచర్యలు చేపట్టడంలో విఫలమైందని అన్నారు. ఇప్పటి వరకు నష్టం అంచనా వివరాలను సేకరించకపోవడం ఇందుకు నిదర్శనమని అన్నారు. జిల్లాలో ప్రధానంగా పత్తి, సోయ, వరి తదితర పంటలు తీవ్రంగా నష్టపోయాయని అన్నారు. వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటి తాగునీటి కోసం ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పశుగ్రాసం కొరత వల్ల పశువులకు మేత దొరకక మృత్యువాత పడుతున్నాయని అన్నారు. వెంటనే జిల్లా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి కరువు పరిస్థితుల నుంచి రైతులను, ప్రజలను ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

డెంగ్యూ, స్వైన్‌ఫ్లూ వ్యాధులకు భయపడుతున్న ప్రజలు


ఆదిలాబాద్‌: జిల్లాలో విష జ్వరాలతో ప్రజలు అతలాకుతలం అవుతుండగా కొత్తగా డెంగ్యూ, స్వైన్‌ఫ్లూలతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. గత రెండు మూడు సంవత్సరాలుగా మలేరియాతో గిరిజన ప్రాంతాల్లో వందలాది మంది మృతి చెందారు. దీంతో పాటు డయేరియా, అతిసార విజృంభించడంతో అనేక మంది మరణించగా ఎంతో మంది మంచాన పడి తీవ్ర అస్వస్థతతో ఉన్నారు. ప్రధానంగా గిరిజన మండలాలు అయిన ఇంద్రవెళ్లి, ఉట్నూరు చిలుకూరు, నార్నూర్‌, జయనూర్‌లలోని మారుమూల ప్రాంతాల్లో వ్యాధులు సోకి అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాలలో పారిశుధ్యం లోపించి, కలుషిత నీరు తాగి వ్యాధుల భారిన పడుతున్నా వాటిని నివారించడంలో యంత్రాంగం చర్యలు తీసుకున్న పరిస్థితిని అదుపులోకి తీసుకురాలేకపోయింది. తూర్పుప్రాంతమైన మంచిర్యాల డివిజన్‌లో గత పదిహేను రోజుల క్రితం ఇద్దరికి డెంగ్యూ సోకగా వరంగల్‌లో చికిత్స పొందారు. అయితే ఒకరికి ప్రాథమిక దశలోనే తగ్గిపోగా మరొకరు చనిపోవడం జరిగింది. తాజాగా ఇచ్చోడ మండలంలో సీమా అనే బాలికకు డెంగ్యూ లక్షణాలతో బాధపడుతూ మృతి చెందినట్లు సమాచారం. డెంగ్యూ విషయమై వైద్య ఆరోగ్యశాఖ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో జిల్లా ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో సుమారు 250 మందికి మలేరియా సోకినట్లు తెలుస్తోంది. వ్యాధి నివారణకోసం ప్రభుత్వం ద్వారా వైద్య సదుపాయాలు గాని, అందుకు సంబంధించి ప్రచారం లేకపోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఏ చిన్నపాటి జ్వరం వచ్చినా స్వైన్‌ఫ్లూ సోకిందని ప్రచారం జరగడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గత కొన్నేళ్లుగా జిల్లాలో మలేరియాతో వణికిస్తున్న కొత్తగా డెంగ్యూ, సైన్‌ఫ్లూ వంటి వ్యాధులతో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ఈ విషయమై ప్రచారం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.