జోరుగా కల్తీకల్లు వ్యాపారం


అనంతపురం: తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల జిల్లాలో ఈత వనాలు కనుమరుగు అవుతుండడం అందరికి తెలిసిందే. అయితే ఇంతవరకు పెరిగిన కొద్ది చెట్లల్లో వస్తున్న ప్రకృతి ల్లును వ్యాపారస్తులు మిశ్రమ రసాయనాలతో కల్లును తయారు చేసి ఇష్టారాజ్యంగా అమ్ముతూ లక్షలాది రుపా యలు ఆర్జిస్తున్నారు. ఈ తతంగం అంతా ఎకై్సజ్‌ పోలీసుల కళ్ళముందే జరుగుతున్నా చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. రాయదుర్గం నియోజకవర్గంలోని కణేకల్లు, బొమ్మనహాళ్‌, రాయదుర్గం, గుమ్మఘట్ట, డి.హిరేహాళ్‌ మండలాల్లో వ్యాపారస్తులు కల్తీకల్లును తయారుచేసి అమ్ముతున్నారు.

ఇటీవలె ప్రభుత్వం మద్యం ధరలను అధిక స్థాయిలో పెంచడంతో, వీటికి తోడు బ్రాందీషాపు నిర్వాహకులు మద్యం బాటిళ్ళపై ప్రభుత్వం ముద్రించిన ధర కంటే అధిక రేట్లలో విక్రయిస్తుండడంతో తాగుడుకు బానిసలైన మద్యం ప్రియులు కొనలేక అతితక్కువ ధరలో అమ్ముతున్న కల్లును సేవించేందుకు ఎగబడుతున్నారు. దీనిని ఆసరాగ తీసుకున్న కల్లు వ్యాపారస్తులు ప్రకృతికల్లుకు ఐదింతలు మిశ్రమ రసాయనాలు కలుపుతూ కల్తీకల్లును తయారు చేస్తున్నారు.

రాయదుర్గం ఎకై్సజ్‌ స్టేషన్‌ పరిధిలోని మూడు టిసిఎస్‌(కల్లుసొసైటీ)లు, 13 టిఎఫ్‌టీలు(లైసెన్స్‌దారులు), కణేకల్‌, బొమ్మనహాళ్‌ మండలాల్లో అధికారికంగా 23 లైసెన్స్‌ షాపుల ద్వారా కల్లును అందిస్తున్నారు. మద్యం మత్తుకు బానిసైన మద్యం ప్రియులు వేసవితాపానికి తట్టుకోలేక ఉదయం 7గంటలకే కల్లుఅంగళ్ళముందు క్యూలో ఎగబడుతూ కల్లును సేవిస్తున్నారు. షాపుల నిర్వాహకులు 500ఎంఎల్‌ బాటిల్‌ కల్లుధర రూ.6లకు అమ్ముతున్నారు. మరికొన్ని షాపుల్లో గ్లాసుల్లో అమ్ముతున్నారు. గ్లాసుకల్లు ధర రూ.4లకు విక్రయిస్తున్నారు.

ఒక్కొక్క వ్యక్తి మూడు బాటిళ్ళకుపైగా కల్లును సేవిస్తూ మత్తులో జోగుతున్నారు. రాయదుర్గం మండలంలో 74ఉడేగోళం, వేపరాల, డి.కొండాపురం గ్రామాల్లో కళ్యాణదుర్గం పట్టణానికి చెందినటువంటి ఒక వ్యక్తి కల్తీకల్లును యథేచ్చగా విక్రయిస్తున్నా వీటిని నిర్మూలించాల్సిన ఎకై్సస్‌ అధికారులు కళ్ళు మూసుకుని మామూళ్ళ మత్తులో జోగుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గుమ్మఘట్ట మండలంలోని బానేపల్లి, రంగచేడు, కలుగోడు, వెంకటాంపల్లి, రాయంపల్లి, బేలోడు తదితర గ్రామాల్లో గత పదిరోజుల క్రితం కల్లు అంగళ్ళు మూతపడ్డాయి. డి.హిరేహాళ్‌ మండలం ఓబుళాపురం గ్రామంలో కూడా కల్లు అంగళ్ళు మూతపడ్డాయి.

అయితే రాయదుర్గం పట్టణానికి 74ఉడేగోళం గ్రామం అత్యంత సమీపంలో వుండడంతో పట్టణంలోని వందలాదిమంది ప్రజలు ఉడేగోళం గ్రామంకు వెళ్ళి కల్తీకల్లును సేవిస్తుంటారు. ఏడాదిక్రితం రాయదుర్గం మండలం పల్లేపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఇక్కడ కల్తీకల్లును సేవించి మోటార్‌ సైకిల్‌పై వస్తూ ఎదురుగా వస్తున్న ప్రైవేట్‌ వాహనాన్ని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందారు. అంతేకాకుండా అనేకమంది ప్రజలు కల్లుతాగి మత్తులో తూగుతూ ఆటోలపై ప్రయాణించడంతో కిందపడి గాయాలపాలై చికిత్సలు పొందిన సందర్బాలు ఎన్నో వున్నాయి. శాస్తవ్రేత్తల పరిశీలన ప్రకారం తాటి ల్లు, ఈతకల్లు, కొబ్బరి నుండి తీసిన కల్లు సేవిస్తే ఆరోగ్యంగా వుంటారన్నారు.

ప్రస్తుతం బానుడి ప్రతాపానికి తట్టుకులేక కల్లు దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో కల్లుకు డిమాండ్‌ పెరిగిపోవడంతో కల్లు వ్యాపారస్తులు కల్తీకల్లు అమ్మకాలను జోరుగా కొనసాగిస్తున్నారు. ఈకల్తీకల్లు వల్ల ప్రజల అనారోగ్యం పాలవుతున్నారు. కావున కల్తీకల్లు అమ్మే వ్యాపారస్తులపై ఎకై్సజ్‌ అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందంటున్నారు.

Advertisements

సాంఘిక భద్రతా పింఛన్ల పంపిణీపై సమీక్ష


అనంతపురం: సాంఘిక భద్రతా పింఛన్ల పంపిణీ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.జనార్థన్‌రెడ్డి తన క్యాంప్‌ కార్యాలయంలో సమీక్షించారు. పింఛన్ల పంపిణీతో పాటు బినామీల ఏరివేతపై కూడా దృష్టిపెట్టాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. పింఛన్లను తనిఖీ చేసి విధాన నిర్ణయాలు తీసుకోవడంపై ఈ సమావేశంలో చర్చించారు.

జిల్లా జాయింట్‌ కలెక్టర్ అనితారామచంద్రన్‌, నగరపాలక కమిషనర్‌ శివకోటి ప్రసాద్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ టి.రంగయ్య తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో సాంఘిక భద్రతా పింఛన్లు మొత్తం 25,776 ఉండగా క్షేత్రా స్థాయి తనిఖీ చేయడం ద్వారా అర్హులను నిర్ధారించాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మార్గదర్శక సూత్రాల ప్రకారం తాము నిర్వహించిన సర్వేలో పింఛన్లు పొందుతున్న వారిలో 10,944 మంది అనర్హులుగా తేలిందన్నారు.

ఏడు కారణాలను బట్టి ప్రాధమికంగా అనర్హుల జాబితాను రూపొందించినట్లు చెప్పారు. శాశ్వత వలస, తాత్కాలిక వలస, మరణించడం, 65 సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు కలిగి ఉండడం, పేదలు కాకపోవడం, 40 శాతం తక్కువ అంగవైకల్యం కలిగి ఉండడం, వితంతువులు కాని వారు లాంటి కారణాలపై సర్వే జరిపి, అర్హుల జాబితాను సిద్ధం చేస్తున్నామన్నారు.

ప్రాధమిక స్థాయిలో అనర్హులుగా తేలిన వారికి నగరపాలక సంస్థ ద్వారా నోటీసులు పంపించడం జరుగుతోందన్నారు. ఇదే జాబితాను సంబంధిత వార్డు కార్పొరేటర్లకు అందించడం జరిగిందని కలెక్టర్ చెప్పారు. పింఛను పంపిణీ చేసే ప్రదేశంలోనే ఉండి పింఛను లబ్దిదారులందరికీ నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు జారీచేశామని, అర్హతల విషయంలో ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా నేరుగా తనకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. క్లైయిమ్‌ ఫారాలు ఇచ్చిన వారిని మళ్లీ క్షేత్ర స్థాయిలో జిల్లా స్థాయి అధికారులతో తనిఖీ చేసి అర్హుల జాబితాలో చేర్చనున్నట్లు తెలిపారు.

పొట్టకూటి కోసం పట్టణానికి వచ్చి…


అనంతపురం‌: అభివృద్ధికి చిహ్నాలుగా నిలవాల్సిన మన పట్టణాలు పేదరికానికి మురికివాడలలో ఆవాసాలుగా మారుతున్నాయి. గత ఎన్నికల సమయంలో పట్టణ శివారు ప్రాంతాల్లో నివసిస్తున్న పేద ప్రజలకు ఆయా రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలు ఇప్పటివరకు ఎటువంటి అమలుకు నోచుకోకపోవడం చూస్తే కేవలం పట్టణ శివారు ప్రాంతాలపై రాజకీయ నాయకులు, అధికారులు శీతకన్నును ప్రదర్శిస్తున్నారనే చెప్పవచ్చు. పొట్టచేతపట్టుకుని వసలబాట పట్టిన పేదల ఉపాధికి మజిలీలవుతున్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పూర్తీగా కొరవడ్డాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం నిరుపేద కూలీల ఆకలి తీర్చడం లేదన్న వాదన వినిపిస్తోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథాలేవి వారికి భుక్తి పెట్టడం లేదు. వ్యవసాయం గిట్టుబాటు ధరలేకపోవడం వల్ల చిన్న రైతులు కూడా ప్రత్యామ్నాయ ఉపాధిని వెతుక్కొంటున్నారు. ఫలితంగా పట్టణాలు పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలతో నిండిపోతున్నాయి. పట్టణ పేదల్లో అధికశాతం మందికి రేషన్‌కార్డులు లేకపోవడంతో సంక్షేమ పథకాలేవీ వారి దరి చేరడం లేదు. గ్రామీణ ప్రాంతాల నుంచి పనుల కోసం వలస వచ్చిన వారిలో సుమారు 83 శాతం మంది రోజూకూలీ పైనే ఆధారపడి జీవిస్తున్నారు.

వీరిలో కూడా కేవలం 60 శాతం మందికి రోజూ కూలీ దొరుకుతోంది. పని దొరికిన వారు సైతం నెలకు రూ.3 వేలు సంపాదించడం గగనమే. పుట్‌పాత్‌లపైన, ఖాళీస్థలాల్లో జీవిస్తునే అరకొరగా వచ్చిన కూలీ డబ్బులనే సొంత ఊళ్లోని కుటుంబ సభ్యులకు సైతం పంపుతుంటారు. ఇక వారి కుటుంబంలోని పనులు చేతకాని వృద్దులు, వికలాంగులు సైతం ఇంటికి భారం కాకుండా ఉంటూనే తమ వంతు సాయంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పట్టణ మంతా కలియ తిరుగుతూ బిక్షమెత్తుకుని జీవిస్తుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో బలహీన వర్గాలతో పాటు పట్టణ శివారు ప్రాంతాల్లో జీవించే పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని ప్రలోభాలు పలుకుతూనే ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం కోసం నివసించడానికి అనువుగాని స్థలాన్ని కేటాయించి, అరకొర సదుపాయాలు లభించే శివారు ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించింది.

దీంతో లబ్దిదారులు సదుపాయాలు లేకపోవడం వల్ల స్థానికంగా జీవించడానికి అయిష్టం చూపుతున్నారు. కానీ ప్రభుత్వం పెద్దల అనుచరులకు, బడా నాయకులకు ఎకరాల కొద్దీ భూములను తక్కువ ధరలకే ఎడపెడా కట్టబెడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పేదల విషయానికి వచ్చేసరికి ఇళ్ల నిర్మాణాలకు స్థలాలు లేవంటూ చేతులెత్తేస్తుంది. దీంతో వారు మున్సిపల్‌, ప్రభుత్వ ఖాళీ స్థలాలు, మురికికాలువలు, నదుల సమీపంలో గుడిశెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఇళ్ల స్థలాల కోసం పేదలు ఆక్రమణలకు దిగితే దానిపై ప్రభుత్వం పోలీసులను పెట్టి లాఠీచార్జీ చేయిస్తూ తరిమి తరిమి కొట్టిస్తోంది. అనంతపురం జిల్లా కేంద్రంలో మురికివాడలైన హెచ్‌ఎల్‌సి కాలనీ, చంద్రబాబు కొట్టాల, ముండ్ల సుబ్బారెడ్డి కాలనీ, సిపిఐ కాలనీ, సుందరయ్య కాలనీ, రాజీవ్‌ కాలనీ, కక్కలపల్లికాలనీ, క్వార్టర్స్‌ కాలనీ, రాణి నగర్‌, బిందెల కాలనీ, రిక్షా కాలనీ వంటి కాలనీల్లో నివసిస్తున్న ప్రజలు అధిక మంది ఇలాంటి జీవితాలనే గడుపుతున్నారు.

ప్రభుత్వం మాత్రం ఇందిరమ్మ, రాజీవ్‌ గృహ కల్ప లాంటి పథకాలను ప్రకటించిడం తప్పా ఇళ్ల నిర్మాణాలు మాత్రం పూర్తీ చేయడం లేదు. ఇళ్లు నిర్మించే ప్రాంతాల్లో మౌళిక సదుపాయాలు కల్పించడం లేదు. దీంతో రోజూ కూలీపై ఆధాపడి జీవించే పేదలు సైతం నెలకు రూ.600 నుంచి రూ.1500 వరకు ఇంటి అద్దెను చెల్లిస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో రాజకీయ జోక్యం వల్ల నిజమైన పేదలకు ఇళ్లు దక్కడం లేదు. ఇప్పటికీ ఇళ్లున్న వారికే రాజకీయ నాయకులు అండతో మళ్లీ ఇళ్లును కేటాయిస్తున్నారు.

దీంతో రోడ్లపైన, ఇతర ప్రాంతాల్లో గుడెశెలు వేసుకున్న వారికి చిన్న గదిని అద్దెకు తీసుకుని జీవిస్తున్న వారికి ప్రభుత్వం కేటాయించే ఇళ్లు దొరకడం లేదు. రాత్రి సమయాల్లో కూలీల బతుకులు మరింత దుర్భరంగా తయారవుతున్నాయి. ఆరు బయట, దోమలతో సావాసం చేస్తూనే నిద్రించాల్సిందే. కష్టపడి సంపాదించుకున్న కొద్దిపాటి సొమ్మును జ్వరం లాంటి చిన్న వ్యాధులకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి దాపురించింది.

ఇక ఇలా ఈ ప్రాంతాల్లో బతుకు బండిని లాగే పిల్లల చదువులు వారికి కేవలం కల గానే మిగిలిపోయాయి. కాగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలస వచ్చిన అనేక మంది పేదలు అధికంగా కేవలం గృహనిర్మాణ రంగాలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా వీరి బతుకుల్లో మాత్రం వెలుగును నింపలేక పోతున్నారు.

చదువుకోవాలని వుంది… గిరిజన విద్యార్థి


హిందూపురం: ప్రస్తుత సమాజంలో విద్యకు పెద్ద పీట వేయాలని ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. దీంతోపాటు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు చదువులో రాణించాలన్న సంకల్పంతో వారికి మరింత మెరుగ్గా రిజర్వేషన్లు, ఫీజుల్లో రాయితీలు కల్పించి ప్రోత్సహిస్తోంది. అయితే బడుగు బలహీన వర్గాలు చదువుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం వారిని అణగదొక్క డానికి చూస్తున్నారన్న ఆరోపణలు నిజమవుతున్నాయి.

ఇందుకు సంబంధించి అనంతపురం జిల్లా మండల కేంద్రమైన కంబదూరు ప్రాంతానికి చెందిన కమలేష్‌ ఇటీవల పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణుడైనాడు. అయితే టెక్నికల్‌ కోర్సు చదివితే ఉపాధి అవకాశాలు మెరుగ్గా వుంటాయని భావించి మడకశిర పాలిటెక్నిక్‌ కళాశాలలో చేరేందుకు నిర్ణయించుకున్నాడు. ఓ దినపత్రికలో వచ్చిన వార్త ప్రకారం 9, 10వ తేదీల్లో వచ్చిన విద్యార్థులకు స్పాట్‌ అడ్మిషన్‌ చేసుకొంటామని కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ ప్రకటించారు. దీని ప్రకారం సదరు విద్యార్థి పదవ తేదీన కౌన్సెలింగ్‌కు హాజరయ్యాడు. అయితే ప్రిన్సిపాల్‌ విజయకుమార్‌ మాత్రం గడువు అయిపోయింది.

సీట్లు భర్తీ అయిపోయాయంటూ ఢంకా భజాయించి చెబుతున్నాడు. వాస్తవంగా రిజర్వేషన్లు వున్నా విద్యార్థులు సమయానికి హాజరు కాలేదన్న ఒకచిన్న నెపంతో రిజర్వేషన్లకే తిలోదకాలు ఇచ్చి ఆ స్థానంలో ఇతర ఓసి విద్యార్థులకు భర్తీ చేశామంటూ చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎరుకుల, దళిత సమాఖ్య నాయకులు శుక్రవారం పాలిటెక్నిక్‌ కళాశాల, మడకశిర ఇన్‌చార్జ్‌ విజయకుమార్‌ను పురం పాలిటెక్నిక్‌ కళాశాలకు వచ్చి విషయాన్ని తెలిపి సీటు ఇవ్వాల్సిందిగా ప్రాధేయపడ్డారు. అయితే సీట్లు లేవని భర్తీ అయిపోయాయని, ప్రిన్సిపాల్‌ చెప్పడంతో ఎరుకుల సంఘం నాయకులు, దళిత సంఘం నాయకులు మా క్యాటగిరీకి అన్యాయం చేస్తున్నారంటూ ప్రిన్సిపాల్‌తో వాగ్వివాదానికి దిగారు.

బడుగు బలహీన వర్గాలు కుటుంబాలు పేదరికంతో మగ్గుతున్నాయని ఇటువంటి తరుణంలో వారి సీట్లను వారికి ఇవ్వకుండా ఇతరులకు కట్టబెట్టడం పట్ల అధికారుల ఆంతర్యమేమిటో అర్థం కాలేదని ఆవేదనకు లోనయ్యారు. ప్రస్తుతం గిరిజన, బడుగు విద్యార్థులు జీవితాలు చదువులు లేక అంధకారం అవుతున్నాయని తెలిపారు. అయితే విద్యార్థి మాత్రం తనకు న్యాయం చేయాలని అర్థించాడు. ప్రిన్సిపాల్‌ తన చేతుల్లో ఏమీ లేదని, మీరు మరో పది సీట్లను పెంచే విధంగా మంత్రులను ఆశ్రయిస్తే తప్పకుండా వాటి ప్రకారం కళాశాలలో జాయిన్‌ చేసుకుంటామని తెలిపారు.

ఏది ఏమైనా గిరిజన బడుగు విద్యార్థులు చదువుకుంటామని ఆసక్తిగా ముందుకు వస్తున్నా అధికారుల అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనిని దృష్టిలో వుంచుకొని రిజర్వేషన్లను ఆయా కులాలకే వర్తింపచేసే విధానం కొనసాగాలి. ఈ రిజర్వేషన్ల సౌకర్యాన్ని తప్పనిసరిగా ఆయా వర్గాలకే లబ్ధి చేకూరే విధంగా కట్టుదిట్టంగా అమలు చేయాల్సి వుంది. పేరుకు రిజర్వేషన్లు పెట్టి గిరిజన, బడుగు విద్యార్థులతో ఆటలాడుకోవడం సమంజసం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఎరుకుల దళిత సమాఖ్య మాత్రం ఈ విధానంపై ఆందోళనలు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.

అబ్కారీ నేరాల నియంత్రణలో నిర్లక్ష్యం వద్దు


అనంతపురం‌: జిల్లాలో అక్రమ మద్యం నివారణ, నాటు సారా నియంత్రణతో పాటు రవాణా, అమ్మకాలపై అధికారులు దృష్టిని కేంద్రీకరించి, ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూడాలని అనంతపురం, పెనుకొండ ఎకై్సజ్‌ జిల్లాల ఎకై్సజ్‌ సిఐలు, ఎస్‌ఐలకు ఉన్నతాధికారులు ఆదేశించారు. జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై్సజ్‌ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ రమేష్‌బాబు, డిప్యూటీ కమిషనర్‌ మనోరంజన్‌లు సంబంధిత జిల్లాల సూపరింటిండెంట్ల ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాలు నిర్వహించారు.

తొలుత పెనుకొండ ఎకై్సజ్‌ జిల్లా పరిధిలో సమావేశం పూర్తి చేసిన అధికారులు, శుక్రవారం అనంతపురం ఎకై్పజ్‌ జిల్లా పరిధిలోని ఎకై్సజ్‌ సర్కిల్‌ స్టేషన్‌ల అధికారులతో స్థానిక ఎకై్సజ్‌ సూపరింటిండెంట్‌ కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎసి, డిసిలు ఎకై్పజ్‌ సిఐలు, ఎస్‌ఐలకు ఆదేశాలు జారీ చేస్తూ ఆబ్కారీ నేరాల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆబ్కారీ కేసుల్లో పట్టుబడిన వివిధ రకాల నేరాలకు సంబంధించి నిందితులను కోర్టుకు హాజరు పర్చడంలో అధికారుల నుంచి చొరవ కొరవడుతోందన్న ఆరోపణలున్నాయని, నిందితులకు సంబంధించి ఛార్జిషీట్లు ఫైల్‌ చేయడంలో నిర్లక్షం కనబడుతోందని అన్నారు.

తక్షణం ఛార్జిషీట్లు ఫైల్‌ చేయడం, నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నట్లయితే వాటిలో నిందితులను కోర్టుకు హాజరు పర్చడం చేయాలని ఆదేశించారు. మద్యం అమ్మకాలు మందకోడిగా ఉన్నాయని, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు తగ్గాయని, వాటిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ లిఫ్టింగ్‌ను పెంచాలని స్పష్టం చేశారు. ఎకై్సజ్‌ సర్కిల్‌ పరిధిలోని సంబంధిత మద్యం దుకాణదారులను ఒప్పించి లిఫ్టింగ్‌ పెంచాలని, లిఫ్టింగ్‌ పెరగకుంటే శాఖాపరమైన చర్యలకు బాధ్యులు కావాల్సి వస్తుందని కూడా అధికారులు హెచ్చరించినట్లు సమాచారం. ఇండియన్‌ మేడ్‌ లిక్కర్‌ (ఐఎంఎల్‌) లిఫ్టింగ్‌ను గణనీయంగా పెంచడంతో పాటు బీరు అమ్మకాలు కూడా పెంచాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అనంతపురం ఎకై్సజ్‌ జిల్లా సూపరింటిండెంట్‌ అరుణరావుతో పాటు జిల్లా టాస్క్‌ఫోర్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పాల్గొన్నారు.

దివంగత సిఎం వైఎస్‌కు ఘన నివాళి
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మృతి పట్ల ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై్సజ్‌ అధికారులు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక ఎకై్సజ్‌ సూపరింటిండెంట్‌ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఆబ్కారీ నేర సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎకై్సజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ రమేష్‌బాబు, డిప్యూటీ కమిషనర్‌ మనోరంజన్‌, సూపరింటిండెంట్‌ అరుణరావు, అనంతపురం ఎకై్సజ్‌ జిల్లా పరిధిలోని సిఐలు, ఎస్‌ఐలు వైఎస్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.

పేరుకే ఆదర్శం గ్రామం.. తాగునీటి సమస్యకు లేదు పరిష్కారం


డి.హిరేహళ్‌: మండల పరిధిలోని అనుమాపురం పంచాయతీని ఇందిరమ్మ ఆదర్శ గ్రామంగా ఎంపిక చేశారు. సామాన్య మానవునికి కావాల్సిన కనీస మౌలిక సౌకర్యాలను కల్పించడానికి దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శ గ్రామాలను ఎంపిక చేసినది. ఇందిరమ్మ ఆదర్శ గ్రామమైన అనుమాపురంలో మంచినీటి సమస్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. కేవలం సత్యసాయి నీరు తప్పా పంచాయతీ నీరు సక్రమంగా రావడం లేదు. తాగునీరు కేవలం రెండు బిందెలు మాత్రమే వస్తున్నాయని మహిళలు ఆరోపిస్తున్నారు. గ్రామంలోని హరిజన కాలనీలో నేలమట్టానికి కింది భాగంలో కొళాయి వున్నందున మురికి నీటిలో కలిసిన నీటినే తాగుతున్నారు.

వర్షం వస్తే మురికి నీటిలో వెళ్లి నీరు తెచ్చుకునే పరిస్థితి దాపురించిందని దళితులైన మా కాలనీ సమస్యను పాలకులు , అధికారులు పట్టించుకోవడంలేదని , కాలనీకి చెందిన అనుమక్క, యన్నక్క , తిప్పన్నలు ఆరోపిస్తున్నారు. కేవలం పలుకుబడి వున్న వారికి ఇందిరమ్మ ఇళ్ళు, పింఛన్లు వస్తున్నాయని ఇవి మాత్రం ఇస్తే ఆదర్శ గ్రామం అయినట్లేనా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇక గ్రామంలో డ్రైనేజీలు, సిమెంటు రోడ్లు సక్రమంగా లేకపోవడంతో వీధులలో నడవడానికి కష్టంగా వుందని గ్రామస్తులంటున్నారు. అపరిశుభ్రత ఎక్కువగా ఉండడంతో గ్రామంలో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.

ఇక గ్రామంలో వీధిలైట్లు వెలగడం లేదు. చాలీచాలని నిధులతో పంచాయతీ అభివృద్ధి ఎలా జరుగుతుందని, మండల అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా దళిత కాలనీలో సిమెంటు రోడ్డు వేయడం లేదని, కొళాయి మరమ్మతులు చేయడం లేదని సర్పంచ్‌ చెప్తున్నాడు. అనుమాపురం నుండి జక్కలవడికి గ్రామానికి వెళ్ళే రోడ్డు కంకరతేలి,పాదచారులు కూడా నడవడానికి వీలు లేకుండా తయారైనది. గ్రామానికి నియమించిన ఆరోగ్య కార్యకర్తలు చుట్టపు చూపుగానైనా రావడం లేదని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇందిరమ్మ ఆదర్శ గ్రామమైన మా గ్రామాభివృద్ది జరగలేదని గ్రామస్తులు విమర్శిస్తున్నారు.

సర్పంచ్‌ వివరణ…
గ్రామాభివృద్ధికి నిధులు రావడం లేదని , ఆదర్శ గ్రామమైనా అదనపు నిధులు లేవని గ్రామాభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు.

ఉపాధి అక్రమార్కులకు నోటీసులు


కూడేరు: మండలంలో 2006-08 వరకు జరిగిన ఉపాధి పనుల్లో అక్రమాలకు పాల్పడిన మేట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, టెక్నికల్‌ అసిస్టెంట్లకు, ఎపిఓకు, బ్రాంచ్‌ ఫోస్టు మాస్టర్లకు నోటీసులు జారీ చేసినట్లు ఎంపిడిఓ రెహనాబేగం తెలిపారు. జిల్లా కలెక్టర్‌ జనార్ధన్‌రెడ్డి, డ్వామా పిడి మురళీ ఆదేశాల మేరకు వారికి నోటీసులు జారీ చేసినట్లు ఆమె తెలిపారు. సామూహిక తనిఖీలో 22 లక్షల 16 వేల 465 రూపాయలు అక్రమార్కులు స్వాహీ చేసినట్లు తేలింది. బిపిఎంలు 14 లక్షల 61 వేల 468లు అవినీతికి పాల్పడ్డారని తనిఖీ బృందం వెల్లడించిందన్నారు.

దీనిపై విచారణ జరిపి అవినీతి రుజువైన వారితో రికవరీ చేయించమని కలెక్టర్‌ ఆదేశించారన్నారు. బిపిఎంలపై విచారణ జరిపి రికవరీ చేయించాలని ఆ శాఖ సూపరింటెండెంట్‌కు నివేదిక పంపామన్నారు. మిగిలిన వారిపై గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి విచారణ జరిపామన్నారు. కూడేరు, కడదరగుంట గ్రామాల్లో విచారణ చేపట్టినట్లు ఆమె తెలిపారు. విచారణలో కొంత మంది కూలీలు తనిఖీ బృందం ఇంకా మీకు డబ్బులు వస్తాయంటే సంతకాలు పెట్టామని తెలిపారు. అవినీతి రుజువైన మొత్తాన్ని రికవరీ చేయించి మిగిలిన మొత్తాన్ని తొలగించామన్నారు.

పి.నారాయణపురంలో మేట్లు పోతన్న రూ.3565, కుళ్లాయిస్వామి వంద రూపాయలు, కమ్మూరులో మాజీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ రూ.6844, రామలక్ష్మి రూ.2700, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పెద్దన్న రూ.300, కరుట్ల పల్లిలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ గీతమ్మ రూ.4187, మేట్‌ చౌడప్ప రూ.3855, సర్పంచ్‌ విశాల రూ.1932, గొటుకూరులో మేట్‌ బాషా 22902, ఇప్పేరులో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఎర్రిస్వామి రూ.3427, మేట్‌ మల్లికార్జున రూ.1134, అరవకూరులో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ రామాంజినేయులు రూ.11,449, కాంట్రాక్టర్‌ నరసింహులు రూ.3307, కలగల్లలో మాజీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ మురళీ రూ.6025, కొర్రకోడులో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ కుంటెన్న రూ.2396,

మరుట్లలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ రామాంజినేయులు రూ.4102, చోళ సముద్రంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ వెంకటేశ్‌ రూ.2818, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ నారాయణస్వామి రూ.1415, ఉదిరిపికొండ మాజీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ నాగరాజు నాయక్‌ రూ.63000, ముద్దలాపురంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ మేఘనాథ్‌ రూ.15,208, కూడేరులో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ రామాంజినేయులు రూ.5 వేలు, టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఫమిదా రూ.7788, ఎపిఓ రూ.8090లు చొప్పున చెల్లించాలని నోటీసులు ఇచ్చామని ఆమె తెలిపారు. ఈనెల 25లోపు రికవరీ చేయక పోతే క్రిమినల్‌ కేసులు పెడతామని ఆమె హెచ్చరించారు.