రేడియేషన్ గమనించండి: బార్క్‌


ముంబై: ఢిల్లీలోని మాయాపురి ప్రాంతంలో తుక్కు విక్రయించే డీలర్లు రేడియోషన్‌ బారిన పడిన పరిణామం నేపథ్యంలో తీవ్ర రేడియేషన్‌ ప్రభావం (ఎక్కువ పరిణామంలో) వల్ల సంభవించే భౌతిక లక్షణాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని, వెంటనే సంబంధిత అధికార్లు, అంటే పోలీసులకు తెలియజేయాలని బార్క్‌ నిపుణులు సూచించారు.

”తీవ్రమైన (అత్యధిక) రేడియేషన్‌ ప్రభావం వల్ల రేడియేషన్‌ గాయాలు, జుట్టు రాలిపోవడం, అనారోగ్యానికి గురికావడం, వాంతులు చేసుకోవడం అనే లక్షణాలు కనిపిస్తాయి. అనారోగ్యం, వాంతులనేవి ఆందోళన వంటి ఇతర కారణాల వల్ల కూడా సంభవించవచ్చు” అని భాభా ఆటమిక్‌ రిసెర్చి కేంద్రంలోని ఆరోగ్య భౌతికశాస్త్రం, భద్రతా నిపుణులు అన్నారు. రేడియేషన్‌ను చూడటం, వాసనను గ్రహించడం కుదరదు కనుక పుకార్లతో ముందుకెళ్లరాదన్నారు.

”పరిస్థితిని అంచనావేసేందుకు, ఆందోళనకు కారణమైన దానిని తొలగించేందుకుగాను పర్యవేక్షణ జరిగితే తప్ప పూకార్లు భయాందోళనలు కల్గిస్తాయి. ప్రభావానికి గురికానప్పటికీ ప్రభావానికి గురైనట్లు నమ్మేవారు చాలామంది ఉంటారు. అందువల్ల ప్రజలు ఈ లక్షణాలను జాగ్రత్తగా పరిశీలించి మాయాపురిలోని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చెయ్యాలి” అని వారన్నారు. గత నెలలో చేపట్టిన మొత్తం ఆపరేషన్‌లో మన దేశంలోని రేడియేషన్‌ ఎమర్జెన్సీ వ్యవస్థ (ఆర్‌ఇఆర్‌ఎస్‌)కు మాయాపురి పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఇఒ రాజేంద్ర పటానియా చాలా సహకరిస్తున్నారని, ఆ ప్రాంతంలో ఉన్నట్లుగా అనుమానిస్తున్న మరిన్ని మూల కారకాల కోసం అన్వేషిస్తున్న డిఎఇ – ఎఇఆర్‌బి – ఆర్‌ఇఆర్‌ఎస్‌ సంయుక్త బృందానికి చేయూతను కొనసాగిస్తున్నారని వారన్నారు.

ప్రభావిత ప్రాంతంలో ప్రజలు తీసుకోవలసిన రక్షణ చర్యలపై బార్క్‌ ఆరోగ్య విభాగంతో పాటు జాతీయ విపత్తు నివారణ సంస్థ సూచనలు చేసింది.

కాలుష్యానికి కారణమయ్యే వాటిపట్ల మరింత జాగ్రత్తగా ఉండటం, మెరిసే ఎలాంటి వస్తువుల పట్లా ఆకర్షణకు గురికాకుండా ఉండటం, అలాంటివి కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయడం, కాలుష్య ప్రాంతాల్లో తినడం, తాగడం, స్మోకింగ్‌ వంటివి చెయ్యకపోవడం, చేతుల్ని నోటికి దూరంగా ఉంచడం, గాయాల్ని మూసి ఉంచడం, రేడియో ధార్మిక సామగ్రితో పని చేసిన తర్వాత పొగతాగకుండా ఉండటం, చేతులు కడుక్కోవడం లేదా ఆ ప్రాంతాన్ని విడిచి పెట్టడం లాంటి సూచనలు ఆందులో ఉన్నాయి.

Advertisements

వేధింపుల నిరోధానికి ‘చర్చ్‌’ మార్గదర్శకాలు


న్యూఢిల్లీ: ప్రీస్ట్‌లపై పెరుగుతూ వస్తున్న లైంగిక వేధింపుల ఫిర్యాదులతో కదిలిన భారత్‌లోని క్యాథలిక్‌ చర్చి తన సంస్థల్లో బాలలపై అన్ని రకాల వేధింపులను అరికట్టే దిశగా అవిభాజ్య మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నది. వివిధ పరిధుల్లోని బిషప్‌లను సంప్రదించిన అనంతరం జూన్‌ నాటికల్లా ఈ మార్గదర్శకాలను ఖరారు చేస్తారు.

వేధింపులకు పాల్పడే ప్రీస్ట్‌లు లేదా చర్చితో అనుబంధమున్న ఇతరులపై పోలీసులకు ఫిర్యాదు చెయ్యడం, దోషులైన ప్రీస్ట్‌లను బహిష్కరించడం వంటివి ఇందులో ఉన్నాయి. దేశంలోని క్యాథలిక్‌ చర్చిల సర్వోన్నత నియంత్రణ మండలి అయిన భారత క్యాథలిక్‌ బిషప్స్‌ కాన్ఫరెన్స్‌ (సిబిసిఐ) ఇటీవల బెంగళూరులో నిర్వహించిన సదస్సులో ఈ మార్గదర్శకాలకు తుదిరూపునిచ్చింది.

”చిన్నారులపై వేధింపులను ఎంతమాత్రం సహించం. భౌతిక, మానసికమైన వేధింపులను ఎదుర్కునేందుకుగాను మేం అవిభాజ్య మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నాం. ఇది కేవలం లైంగిక వేధింపులకు పరిమితం కాదు” అని సిబిసిఐ ప్రతినిధి అయిన బాబు జోసెఫ్‌ అన్నారు. ”మేం ఎవరినీ కాపాడం. పోలీసులకు తెలియజేయాల్సిన అవసరమున్న అంశాల్ని వారికి తెలియజేస్తాం” అని చెప్పారు.

అమెరికాలోని మినెసోటాలో చర్చి సభ్యత్వమున్న ఒక యుక్తవయసు చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు భారతీయ ప్రీస్ట్‌ రెవరెండ్‌ జోసెఫ్‌ పళనివేల్‌ జయపాల్‌పై ఇటీవల వచ్చిన ఆరోపణతో బాటు ప్రీస్ట్‌లపై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలతో క్యాథలిక్‌ చర్చి సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నది.

లైంగిక వేధింపు లేదా మరే ఇతర వేధింపుల్లో అయినా దోషిగా తేలినవారు చట్టాన్ని ఎదుర్కోవలసిందేనని జోసెఫ్‌ చెప్పారు. ”ఇదేగాక వారిపై మేం కూడా చర్యలు తీసుకుంటాం. అది విధులనుంచి సస్పెండ్‌ చెయ్యడం లేదా చర్చి నుంచి బహిష్కరించడం కావచ్చు” అని అన్నారు.

చర్చి తొందరపాటు చర్యలు తీసుకోదని ఆయన పేర్కొంటూ అనాథాశ్రమాలు, స్పెషల్‌ హోమ్స్‌, పాఠశాలల వంటి చర్చి సంస్థల్లోని చిన్నారులని ఎలా రక్షించాలనే దానిపై మార్గదర్శకాల్ని రూపొందిస్తాయన్నారు. మార్గదర్శకాలనేవి కేవలం క్లెర్జీని శిక్షించడానికి మాత్రమే కాదన్నారు.

”మా సంస్థల్లోని చిన్నారులకు ఎలా భద్రత కల్పించాలనే దానిపైన కూడా మేం దృష్టి సారిస్తాం” అన్నారు.

రాష్ట్ర రాజధానిలో భద్రత గోల్‌’మాల్‌’


హైదరాబాద్‌: ఉగ్రవాద హెచ్చరికల నేపథ్యంలో నగరంలో భద్రత ప్రశ్నార్ధకంగా మారింది. ముఖ్యంగా వాణిజ్య కేంద్రాలలో భద్రత పోలీసులకు పెద్ద తలనొప్పిగా పరిణమించింది. పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు తమ దుకాణాల వద్ద సొంత సెక్యూరిటీని ఏర్పాటుచేసుకుంటున్నా దాని వల్ల ఎలాంటి ప్రయోజనం కలగడం లేదు.

బేగంపేటలో ఉన్న లైఫ్‌స్టయిల్‌ కాంప్లెక్స్‌లోకి ప్రవేశిస్తే, మీ కారు తనిఖీ చెయ్యడానికి అక్కడ ఒక్క సెక్యూరిటీ గార్డు కూడా కనిపించడు. వాహనాల్లో పేలుడు పదార్థాలేవైనా ఉంటే వాటిని కనిపెట్టేందుకు వారి దగ్గర కనీస పరికరాలు కూడా లేవు. ఈ భవనాన్ని పేల్చేందుకు ఏ ఉగ్రవాది అయినా దీనిపై కన్నవేసి ఉంచితే ఇది ఒక ‘ఆహ్వానం’ లాంటిదే.

భద్రత పెంచాలని హైదరాబాద్‌ పోలీసులు పలుమార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ ఇక్కడి పలు మాల్స్‌లో నెలకొన్న నిర్లిప్తతతో అవన్నీ గాల్లో కలిసిపోయాయి. లైఫ్‌ స్టయిల్‌ వద్ద మేనేజిమెంట్‌ పట్టించుకుంటున్న విషయం పార్కింగ్‌ ఫీజు ఒక్కటే. రోజంతా లేదా కొన్ని గంటలపాటు ఇక్కడ వందల సంఖ్యలో కార్లు, టూవీలర్లు పార్క్‌ చేసి ఉంటాయి.

ఇక జివికె ఒన్‌ దగ్గర పెద్ద సంఖ్యలో కనిపించే ప్రయివేటు భద్రతా సిబ్బంది వాహనాల్ని తనిఖీ చేస్తుంటారు. ఆయుధ పరికరాల లేమి సుస్పష్టం. ఎలాంటి తనిఖీ లేకుండానే బేస్‌మెంట్‌ నుంచి ఎగ్జిట్‌ డోర్‌ ద్వారా ఈ ప్రతినిధి రాగలిగారు. ఎలివేటర్‌ ద్వారా వచ్చే వారిని మాత్రమే క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

ప్రసాద్స్‌ ఐమాక్స్‌లోకి ఎవరైనా రెండంచెల భద్రత గుండా వస్తారు. డోర్‌ ఫ్రేమ్‌ మెటల్‌ డిటెక్టర్స్‌ నుంచి, తర్వాత క్షుణ్ణమైన తనిఖీల మధ్య రావడం. అయితే, ఒక పోలీసు బృందం వెనుక నుంచి ఈ ఆవరణలోకి అడుగుపెట్టి లోపల డమ్మీ బాంబుల్ని పెట్టడం చూస్తూ ఇక్కడ ఏ మాత్రం సన్నద్ధత ఉందనేది తెలుస్తుంది.

వాస్తవానికి ఇక్కడ సుమారు 100 మంది సెక్యూర్టీ గార్డులు ఉన్నప్పటికీ వారి వద్ద ఒక్క ఆయుధం కూడా లేదు.

”మా వాళ్ళకు అన్నీ లోతుగా తెలియజేశాం. ఒక బాంబు తయారు చెయ్యడానికి ఉపయోగించే సామగ్రిని వారికి చూపించాం. ఉగ్రవాదులు విడివిడిగా లోపలికి తీసుకురావడానికి వీలుండే నట్లు, బోల్ట్‌లు, స్క్రూలు, మేకులు, వైర్లు లాంటి సామగ్రిని తనిఖీ చేస్తున్నారు” అని ప్రసాద్స్‌ వద్ద భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించే అజైల్‌ సెక్యూరిటీ సిఎండీ విఆర్‌కె రావు చెప్పారు.

అయితే, ”ప్రసాద్స్‌ అనేది వినోద కేంద్రం. మావాళ్ళకు ఆయుధాలిచ్చి ప్రజల్ని భయభ్రాంతుల్ని చెయ్యాలని మేం అనుకోవడంలేదు” అను రావు అన్నారు.

సెంట్రలో జోన్‌ డిసిపి డాక్టర్‌ అకున్‌ సభర్వాల్‌ మాట్లాడుతూ 26/11 లాంటి ఘటన సంభవిస్తే దానిని పోలీసులే తప్ప ప్రయివేటు గార్డులు ఎదుర్కొనలేరన్నారు. ”సెక్యూరిటీ ఏజెన్సీలు సింగిల్‌ లేదా డబుల్‌ బ్యారెల్‌ గన్స్‌ సంపాదించగలరు. అవి ఎకె-47కు సమానం కాదు” అన్నారు. కాగా, కొన్ని ఆయుధాల్ని తేలిగ్గా తీసుకురావచ్చని మరో అధికారి అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్‌ నగర పోలీసులు బస్టాండ్లలో తరచుగా తనిఖీలు నిర్వహిస్తూ బస్సుల్లో ప్రయాణీకుల్ని సోదా చేస్తున్నారు.

అదే సమయంలో కొందరు పోలీసులు వివిధ ప్రాంతాల్లోకి అడుగుపెట్టి అద్దెకుంటున్నవారిలో కొందరిని తనిఖీ చేశారు.

”ఏడాదికంటే తక్కువ కాలం అద్దెకున్న వారి గురించి మాకు సమాచారం ఇవ్వాలని మేం ఇళ్ళ యజమానుల్ని కోరుతున్నాం” అని సభర్వాల్‌ విజ్ఞప్తి చేశారు. ఇక రోడ్లపైన ఖాకీ దుస్తుల్లో ఉన్న పోలీసులు ప్రతిచోటా సోదాలు చేస్తుండటం కనిపిస్తూనే ఉంది.

భద్రతా దళాల ఆయుధాలకు పదును!


న్యూఢిల్లీ: ముంబై ఉగ్రవాద దాడులు, పలు రాష్ట్రాల్లో నక్సలైట్ల హింసాకాండ విసురుతున్న తాజా సవాళ్ళ నేపథ్యంలో పారామిలిటరీ దళాల కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు హోంమంత్రిత్వశాఖ సన్నద్ధమవుతున్నది. వీలైనంత త్వరగా సరికొత్త ఆయుధాలు, బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు, దాడులనెదుర్కునే సామగ్రి, సాయుధ వాహనాలతో ఈ దళాలకు మళ్లీ జవసత్వాలనందిస్తారు.

అంతర్జాతీయ ఆయుధ సరఫరాదార్లు ఇటీవల న్యూఢిల్లీలో మకాం వేశాయి. రాబోయే రెండు మూడేళ్ల కాలంలో భారత్‌లో అంతర్గత భద్రతా సామగ్రి మార్కెట్‌ రూ.45,000 కోట్లుగా ఉంటుందన్న అంచనాల మధ్య వాటి ప్రాణాంతక ఆయుధాల్ని ప్రదర్శించాయి. భద్రతా పరిశ్రమ మాంద్యం ప్రభావం లేనిదని, అంతర్గత భద్రతా విధుల్లో నిమగ్నమైన దళాలకోసం పెద్ద సంఖ్యలో టెక్నాలజీపరమైన పరిష్కారాలు చూపిందని వారం కిందట ఇక్కడ హోంల్యాండ్‌ సెక్యూరిటీ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన హోంశాఖ కార్యదర్శి జి కె పిళ్ళై అన్నారు.

సవాళ్ళు చాలా ఉన్నాయని, గత ఏడాది కాలంలో డిఫెన్స్‌ సెక్యూరిటీకి సంబంధించిన వరుస ఎగ్జిబిషన్‌లు అందుబాటులో ఉన్న సామగ్రి గురించి తెలియజేశాయన్నారు. పారామిలిటరీ దళాలు, రాష్ట్ర పోలీస్‌ దళాల్లో కొన్ని ఇప్పటికే ముందడుగువేసి వారి ముందున్న అవకాశాల నుంచి పూర్తి ప్రయోజనాలను పొందాయని పిళ్ళై అన్నారు. పారామిలిటరీ దళాలకు సంబంధించిన పలు ఆధునికీకరణ కార్యక్రమాలకు గత రెండు నెలల కాలంలోనే హోంశాఖ కేటాయింపులు ఇచ్చిందని, ఇందులో 59,000 లైట్‌ వెయిట్‌ బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్ల సేకరణ కూడా ఉందన్నారు.

సిఆర్‌పిఎఫ్‌ నుంచి బిఎస్‌ఎఫ్‌, ఎన్‌ఎస్‌జి, ఐటిబిపి వంటి పలు దళాలు కొత్త ఆయుధాలు, అన్ని వాతావరణాల్నీ తట్టుకునే వాహనాలు, హెలీకాఫ్టర్ల సేకరణలో ఉన్నాయని, బహుశా 26/11 తర్వాత ఆయుధాల్ని, ఆయుధ సామగ్రిని ఆధునికీకరించాల్సిన ముఖ్యమైన అవసరాన్ని గుర్తించినట్లు సీనియర్‌ పారామిలిటరీ అధికారి చెప్పారు.

చొరబాటుయత్నం ఉగ్రవాదులపనే: పాక్‌


జమ్ము: జమ్ము కాశ్మీర్‌లోని సాంబ జిల్లా సబ్‌ సెక్టార్‌ అయిన రాంగఢ్‌లో తమ దళాలపై ఎల్లల ఆవలి వైపు నుంచి కాల్పులు జరపడం, చొరబాటుకు అవకాశం కల్పించడంపై భారత సరిహద్దు భద్రతా దళం ఆదివారం పాకిస్థాన్‌ రేంజర్స్‌కు తన నిరసనను తెలియజేసింది.

ఇక్కడికి 50 కిలోమీటర్ల దూరంలో రాంగఢ్‌ వద్ద ఉన్న బల్లార్డ్‌ సరిహద్దు ఔట్‌పోస్ట్‌ వద్ద పాక్‌ రేంజర్లతో కంపెనీ కమాండర్‌ స్థాయి సమావేశాన్ని బిఎస్‌ఎఫ్‌ ఏర్పాటు చేసిందని పారామిలిటరీ దళానికి చెందిన అధికార్లు చెప్పారు. బల్లార్డ్‌ పోస్ట్‌ వద్ద శనివారం నాడు సరిహద్దుల ఆవలి నుంచి జరిగిన కాల్పులు, పాకిస్థాన్‌ వైపు నుంచి సాయుధ ఉగ్రవాదుల చొరబాటుకు అవకాశం కల్పించడంపై వారు తమ నిరసనను తెలియపరిచారు.

ఈ ఘటనలో తమ హస్తం లేదన్న పాక్‌ రేంజర్లు నెపాన్ని ఉగ్రవాదులపైకి నెట్టారు. బల్లార్డ్‌ ఫార్వర్డ్‌ పోస్ట్‌ వద్ద శనివారం ఉదయం పెద్ద సంఖ్యలో సాయుధ ఉగ్రవాదుల కదలికల్ని బిఎస్‌ఎఫ్‌ 59వ బెటాలియన్‌ జవాన్లు కనుగొన్నారు. ఉగ్రవాదులు ఈ పోస్ట్‌పై కాల్పులు జరుపగా బిఎస్‌ఎఫ్‌ జవాన్లు, గస్తీ దళాలు ఎదురుకాల్పులు జరిపాయి.

ఈ కాల్పులు ఆగి ఆగి కొంత సమయంపాటు కొనసాగాయి. తర్వాత ఉగ్రవాదులు తప్పించుకుని పాకిస్థాన్‌ వైపు పారిపోయారని అధికార్లు చెప్పారు. ఆవతలివైపు ఉన్న భద్రతా దళాలు ఉగ్రవాదులకు అనుకూలంగా కవర్‌ ఫైరింగ్‌ చేశారయన్నారు.