పొగాకు ఎగుమతులపై కసరత్తు


గుంటూరు: ఓ వైపు పొగాకు ఉత్పత్తి తగ్గించాలని, సాధ్యమైతే పూర్తిగా ఎత్తేయాలని సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్న తరుణంలో కేంద్రం పొగాకు ఉత్పత్తిని ఎలా పెంచాలా..? అని కసరత్తు చేస్తోంది. గుంటూరులోని కేంద్ర పొగాకు బోర్డు అధికారులకు ఎగుమతులు పెంచాలంటూ ఆదేశాలిచ్చింది. రానున్న మూడేళ్లల్లో విదేశాలకు వెళ్లే అన్ని ఎగుమతుల్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యంలో భాగంగా..పొగాకు ఉత్పత్తి పెంచాలని సూచించింది. దేశం నుంచి ఏటా బిలియన్ డాలర్ల విలువైన పొగాకు ఎగుమతి అవుతోంది. మూడేళ్లలో దీన్ని 20% పెంచాలంటూ వాణిజ్యశాఖ సూచించింది.

ఆ మేరకు బోర్డు చైర్మన్ గురువారం ఆయా కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. వారి సూచనలు, సలహాలు అడిగి తెలుసుకున్నారు. ఎగుమతులకు రాయితీలు, ట్యాక్స్ తగ్గింపు ఇస్తే సహకరిస్తామని వ్యాపారులు తెలిపారు. వాస్తవానికి ఇప్పటికే బోర్డు అనేక విధాలుగా పొగాకును నియంత్రిస్తూ వస్తోంది. పరిమితి లేకుండా పండించే పంటపై అపరాధ రుసుం కూడా విధిస్తోంది. ఇప్పుడు ఉత్పత్తి ఎలా పెంచాలంటూ బోర్డు అధికారులు అయోమయానికి గురవుతున్నారు. విస్తీర్ణం పెంచకుండా.. దిగుబడి ఎలా పెంచాలనే అంశంపై కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ సలహాలు, సూచనలు స్వీకరించేందుకు బోర్డు చైర్మన్ కమలవర్థనరావు 25న ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడి శాస్తవ్రేత్తలతో మాట్లాడి కసరత్తు ప్రారంభించనున్నారు.

రైతులతో మరోసారి భేటీ
పొగాకు ధర పెంపు మళ్లీ మొదటికి వచ్చింది. సగటు ధర ఆశించినంతగా లేకపోవడంతో రైతులు మళ్లీ ఆందోళనబాట పడుతున్నారు. దీనిపై మాట్లాడేందుకు వారు సోమవారం గుంటూరు రావాలని నిర్ణయించారు. ఆ రోజు బోర్డు చైర్మన్ ఢిల్లీ వెళ్లనుండటంతో.. ఆ తరువాతి రోజు భేటీ జరిగే అవకాశం ఉంది.

మైసూరు వెళ్లిన బోర్డు సభ్యులు
పొగాకు ధర విషయంలో కొనసాగుతున్న సందిగ్ధతకు తెరదించేందుకు బోర్డుసభ్యులు యత్నిస్తున్నారు. అందుకోసం మైసూరు ప్రాంతంలో పొగాకు కొనుగోళ్లను పరిశీలించేందుకు గురువారం అక్కడికి వెళ్లారు. హోస్‌నూరు, పెరియాపట్నం, రామనాథ్‌పురం, హెచ్‌డీ కోటల్లోని వేలం కేంద్రాలను పరిశీలించారు. అక్కడి రైతులు కూడా ధర విషయంలో అసంతృప్తిగా ఉన్నట్లు గుర్తించామని సభ్యులు జగన్నాథం, శేషగిరిరావు, శివరాం తెలిపారు.

Leave a comment