‘నిజాంపట్నం’ విస్తరణపై నీలినీడలు!


గుంటూరు: నిజాంపట్నం ఫిషింగ్‌ హార్బర్‌ విస్తరణ ప్రాజెక్టుకి ఇంకా గ్రహణం వీడలేదు. ఐదు ఎకరాల స్థలం ఇచ్చేందుకురాష్ట్ర అటవీ శాఖ ఎట్టకేలకు ఆమోదించినా ప్రాజెక్టుకి అవసరమైన నిధులు ఇంత వరకు మంజూరు కాలేదు. కేంద్ర నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తోంది. రూ.18 కోట్ల నిధులు కావాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. కేంద్రం నుంచి ఉలుకూ పలుకూ లేదు. మరోపక్క హార్బర్‌ను పరిశీలించేందుకు మే 15న ఐరోపా యూనియన్‌కు చెందిన ఒక బృందం నిజాంపట్నం వస్తోంది. ఈ నేపథ్యంలో హార్బర్‌లో మౌలిక వసతులు మెరుగు పరిచేందుకు జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (ఎన్‌ఎఫ్‌డీబీ) రూ.59 లక్షలు మంజూరు చేసింది. చిల్లింగ్‌ యూనిట్‌, ఐస్‌ ఫ్యాక్టరీలు నెలకొల్పేందుకు ఎంపెడా మరో రూ.47 లక్షల విలువైన యంత్ర సామగ్రి అందజేస్తోంది. ఈయూ బృందం సిఫారసులపైనే ఆ దేశాలకు మత్స్య ఎగుమతులు ఆధారపడి ఉండటంతో మత్స్య శాఖ అధికారులు నిజాంపట్నం హార్బర్‌లో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. నిజాంపట్నం హార్బర్‌లో 150 వరకు మెకనైజ్డ్‌ బోట్లు, 120 వరకు మోటారు బోట్లు ఉన్నాయి. హార్బర్‌ ఇప్పటికే ఇరుకుగా మారిపోయింది. ప్రకాశం, కృష్ణా జిల్లాలకు చెందిన బోట్లు కూడా ఇక్కడికే వస్తుంటాయి. ఈ ప్రాంతం చేపల వేటకు ఎంతోఅనుకూలం కావడమే కారణం. హార్బర్‌లో 600 బోట్లు నిలిపేందుకు వీలుగా విస్తరించేందుకు ఆరేళ్ల క్రితమే ప్రణాళిక సిద్ధం చేశారు. నిధుల కోసం కేంద్రానికి ప్రతిపాదన కూడా వెళ్లింది. కానీ అటవీ శాఖ మోకాలడ్డింది. హార్బర్‌ విస్తరణకు ఐదు ఎకరాల స్థలం కావాలి. అది అటవీశాఖకు చెందిన స్థలం. దాన్ని ఇచ్చేందుకు ఆ శాఖ ససేమిరా అంది. ఎట్టకేలకు ఆ శాఖను ఒప్పించినా తమకు 40-50 ఎకరాల ప్రత్యామ్నాయ స్థలం కావాలని పట్టుబట్టింది. చివరకు ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవడంతో ప్రత్యామ్నాయ స్థలం లేకుండానే మత్స్యశాఖకు ఐదు ఎకరాలు కేటాయించేందుకు అటవీశాఖ ఆమోదం తెలిపింది. కానీ వేరే చోట మడ అడవులు పెంచేందుకు తమకు రూ.46 లక్షలు ఇవ్వాలని కోరింది. దానికి ప్రభుత్వం అంగీకరించింది. స్థలమైతే వచ్చింది. ఇప్పుడు నిధులు కావాలి. హార్బర్‌ విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పుడు రూ.10 కోట్లు చాలనుకున్నారు. ప్రాజెక్టులో జాప్యం జరిగే కొద్దీ ఖర్చు పెరిగింది. ఇప్పుడు రూ.18 కోట్లు కావాలని చెబుతున్నారు. నిధుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లాయి. గుంటూరు జిల్లాలో తీర ప్రాంతం 43 కి.మీ. మాత్రమే ఉన్నప్పటికీ ఇక్కడి నుంచి పెద్ద సంఖ్యలోనే మత్స్య ఉత్పత్తులు ఇతర ప్రాంతాలకు వెళుతున్నాయి. ప్రస్తుతం మన రాష్ట్రం నుంచి ఎక్కువ మత్స్య ఉత్పత్తులు వెళుతోంది ఐరోపా దేశాలకే. ఐరోపాయూనియన్‌ బృందం ఏటా మన రాష్ట్రానికి వచ్చి ఫిషింగ్‌ హార్బర్‌లు, ప్రాసెసింగ్‌ యూనిట్లు, చెరువులు పరిశీలించి వెళుతుంది. పారిశుద్ధ్యం, ఇతర పరిస్థితులపై ఆ బృందం సంతృప్తి చెందితేనే ఎగుమతులకు అనుమతి లభిస్తుంది. ఆ బృందం మొదటిసారి మే 15న నిజాంపట్నం వస్తోంది. ఈ నేపథ్యంలో మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల తనిఖీ సంస్థ (ఈఐఏ) బృందం ఇది వరకే నిజాంపట్నం హార్బర్‌ను పరిశీలించి కొన్ని లోపాలను గుర్తించింది. సరిచేయాల్సిందిగా సూచించింది. ఎన్‌ఎఫ్‌డీబీ రూ.59 లక్షలు ఇచ్చింది. హార్బర్‌లో 12 రకాల పనులు చేపడుతున్నట్టు మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఎం.బసవరాజు తెలిపారు. హార్బర్‌లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి ఆధునికంగా తీర్చిదిద్దుతున్నామని ఆయన పేర్కొన్నారు. హార్బర్‌లో ఐస్‌ సమస్య కూడా ఎక్కువగా ఉంది. ఫ్లేక్స్‌,క్యూబికల్స్‌ రూపంలో ఐస్‌ తయారు చేసే యూనిట్‌ను, ఒక చిల్లింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. రూ.47 లక్షల విలువైన యంత్రాలను ఎంపెడా సమకూరుస్తోందని బసవరాజు తెలిపారు.నిజాంపట్నం హార్బర్‌ను విస్తరించాల్సిన అవసరం ఉందని, నిధుల కోసం ఎదురు చూస్తున్నామన్నారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: