కాంగ్రెస్‌కు కడప ఫీవర్!


గుంటూరు: జిల్లా కాంగ్రెస్‌కు కడప ఎన్నికల ఫీవర్ పట్టుకుంది. మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కడప జిల్లాకు ఇన్‌చార్జి మంత్రి కావడంతో జిల్లానుంచి అధికసంఖ్యలో శాసనసభ్యులు, నాయకులు ఈ ఎన్నికల్లో ప్రత్యక్ష్య, పరోక్ష సహకారాలు అందుతాయని భావించారు. అయితే దీనికి భిన్నంగా కాంగ్రెస్ నాయకులు ప్రచారానికి డుమ్మా కొట్టేందుకు నిర్ణయం తీసుకుంటున్నారు. రాష్టవ్య్రాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్‌కు లభిస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని రాబోయే పరిణామాలకు ఎదురుచూస్తూ మంత్రుల ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారు. ఇదే సమయంలో తమపై ఒత్తిడి ఉండకుండా దైవ దర్శనాలకు వెళ్తున్నారు. జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై ఎన్నికల ప్రచారంలో ఉన్న మంత్రులు ఆందోళన చెందుతున్నారు. అధికార పార్టీలో నాయకులకు దిశానిర్దేశం కరువు కావడంతో ఒకవైపు వర్గ విభేదాలు తారస్థాయికి చేరుకుంటుండగా, మరోవైపు ముఖ్యనాయకులు వలసబాట పడుతున్నారు.

కడప ఉప ఎన్నికల ప్రచారానికి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మంత్రులు వెళ్లి తమ శక్తియుక్తులను వెచ్చించాల్సిందిగా పీసీసీ ఆదేశించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వై.ఎస్.జగన్‌మోహనరెడ్డి, వై.ఎస్.విజయమ్మల ఓటమే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేసింది. ఈక్రమంలో వివిధ సామాజిక వర్గ ఓటర్లను ఆకర్షించేందుకు ఆయా సామాజిక వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులను రంగంలోకి దింపాలని జిల్లా మంత్రి, కడప ఇన్‌చార్జి మంత్రి కన్నా నిర్ణయించారు. అందులో భాగంగా మంత్రి మోపిదేవి వెంకటరమణను కడప నియోజకవర్గం పరిధిలో మైదుకూరుకు ఇన్‌చార్జిగా నియమించారు. దీనికి మిగిలిన ప్రజాప్రతినిధుల నుంచి.. ఆశించిన ఫలితం లభించలేదు. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు డొక్కా మాణిక్యవరప్రసాద్, కాసు వెంకటకృష్ణారెడ్డి శాఖాపరమైన అంశాల్లో హైదరాబాద్‌లో బిజీగా ఉన్నామని పీసీసీకి సమాచారం పంపారు.

ఇదేక్రమంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డిని ప్రచారంలో భాగస్వామిగా ఉండాలని కోరారు. గతంలో యువనేత జగన్‌తో సన్నిహితంగా మెలిగిన యర్రం తిరుపతి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. పీసీసీకి కూడా ఈ వర్తమానం పంపారు. మరోవైపు కొందరు ప్రజాప్రతినిధులు రాష్ట్రంలో ఉంటే ఇబ్బంది తప్పదని పార్టీ పనిపేరుతో ఢిల్లీలో మకాం వేశారు. ఎన్నికలయ్యేదాకా రాష్ట్రం వైపు కన్నెత్తి చూడకూడదని వారు కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలిసింది. ఇలా జిల్లాకు చెందిన శాసనసభ్యులు తప్పించుకుని తిరిగే ధోరణిలో ఉన్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ బాటలో కాంగ్రెస్ శ్రేణులు..
కడపలో ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్న తరుణంలో కాం గ్రెస్ శ్రేణులు రోజురోజుకూ వైఎస్సార్ కాంగ్రెస్ బాట పడుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఆర్థిక లావాదేవీలు, కాంట్రాక్ట్ పనులు, కొన్ని అవసరాలు ఉన్న వారు మాత్రమే పార్టీలో కొనసాగుతున్నారు. ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న ఆరు నియోజకవర్గాల్లోనూ దాదాపు ఇవే పరిస్థితులు కొనసాగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే వైఎస్సార్ కాంగ్రెస్‌కు చేరుకుంటే మంచి ఫలితాలు వస్తాయని వారు భావిస్తున్నారు. ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నేతలు వలస బాట పడుతుం డటంతో జిల్లా నాయకత్వం ఆందోళన చెందుతోంది.

సుదీర్ఘ చరిత్రకు తాళాలు..
ఓవైపు కడప ఎన్నికల హోరుతో పార్టీ సతమతమవుతుంగా, మరోవైపు నాయకుల ఆధిపత్యపోరుతో అధికార పార్టీ కార్యాలయాలకు తాళాలు పడుతున్నాయి. చిలకలూరిపేటలో మంత్రులు కన్నా, కాసు వెంకటకృష్ణారెడ్డి పట్టుపెంచుకునేందుకు వర్గ రాజకీయాలకు తెర తీశారు. ఈ రాజకీయాలు ఏకంగా పార్టీ కార్యాలయానికే తాళం వేసేందుకు పురికొల్పాయి. సీఎం పేషీ కలుగచేసుకోవడంతో వివాదానికి తెరపడింది. మంగళగిరిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే కాండ్రు కమల, మండల నేతలకు విభేదాలు తలెత్తిన నేపథ్యంలో పార్టీ కార్యాలయానికి నేతలు రావడంలేదు. జిల్లాలో అధిక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మంత్రులు నియోజకవర్గాల పరిధి దాటి వర్గాలను ప్రోత్సహిస్తుండటమే దీనికి కారణమని తెలుస్తోంది.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: