మెదక్: కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం వల్లే రాష్ట్రంలో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, మైక్రోసంస్థలను ఆశ్రయించి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నారని టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. మెదక్ జిల్లా గజ్వేల్ మండలంలో ఒకే వారంలో ఇద్దరు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. మరో వ్యక్తి ఫైనాన్స్ వేధింపుల మూలంగా గుండెపోటుతో మరణించారు. చంద్రబాబు బాధిత కుటుంబాలను పరామర్శించారు. గజ్వేల్ పట్టణంలోని కేతోజి రాంచంద్రచారి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. అక్కడి నుండి మండల పరిధిలోని పిడిచెడ్ గ్రామంలో రైతు పిట్ల గోపాల్ కుటుంబాన్ని పరామర్శించి అతని భార్యకు రూ.50 వేల చెక్కు అందజేశారు. శేరిపల్లి గ్రామంలో శేర్ల పర్షరాములు కుటుంబాన్ని ఓదార్చారు. ఈ సందర్భంగా వారి ఆర్థిక పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మైక్రో ఫైనాన్స్‌ల వేధింపులు రోజురోజుకూ పెరుగుతున్నాయని, అప్పు తీసుకున్న వారిని మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గురై కొందరు ఇంట్లో వస్తువులను తాకట్టుపెట్టి అప్పు తీర్చుతున్నారని, మరికొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకునేవరకు వదిలే ప్రసక్తే లేదన్నారు. బాధిత కుటుంబాల పిల్లలకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఉచిత విద్య అందిస్తామని హామినిచ్చారు. ఆత్మహత్య చేసుకునే ముందు కుటుంబం గురించి కాస్త ఆలోచించాలని ప్రజలకు సూచించారు. రైతు ప్రభుత్వమని చెప్పుకొని అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ రైతులను పూర్తిగా విస్మరించిందన్నారు.
Filed under: వార్తలు |
Leave a Reply