బెంగుళూరు: మంత్రివర్గ విస్తరణకు సంబంధించి బీజేపీలో మరోసారి అంతర్మథనం మొదలైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒకసారి మంత్రివర్గ విస్తరణ చేపట్టి చేతులు కాల్చుకున్న ముఖ్యమంత్రి తిరిగి ఆ తేనెతుట్టను కదుపుదామా? వద్దా? అనే సందేహంలో కొట్టుమిట్టాడుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీలో మంత్రి పదవి ఆశిస్తున్నవారు అధికం కావడం ఇందుకు కారణంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ, ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేసుకోవడం ఎలా అనే అంశాలపై ముఖ్యమంత్రి యడ్యూరప్ప, పార్టీ ప్రముఖులతో, ఆరెస్సెస్ నేతలతో చర్చలు జరిపారు. ప్రస్తుత తరుణంలో మంత్రివర్గ విస్తరణ కత్తిపై సాముగా భావించిన ముఖ్యమంత్రి అతి జాగరూకతతో అడుగు వేయనున్నారు. మంత్రి వర్గంలో ఖాళీగా ఉన్న 6 స్థానాలకు పార్టీలో పోటీ తీవ్రమయ్యింది. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి అవసరమైన ఇండిపెండెంట్ శాసనసభ్యుడు వర్తూరు ప్రకాశ్‌కు మంత్రి వర్గంలో చోటు కల్పించడం తప్పనిసరి. అయితే మిగిలిన స్థానాలు ఎవరికి ఇవ్వాలి? ఎవరికి వద్దు? అనే సందిగ్ధ పరిస్థితిలో ఉన్నారు. శాసనసభ్యుల అనర్హత కేసు తీర్పు వచ్చిన తర్వాత మంత్రి వర్గాన్ని విస్తరించడానికి ముఖ్యమంత్రి యడ్యూరప్ప నిర్ణయించారు. ఆపరేషన్ కమల ద్వారా బీజేపీకి మద్దతు ఇచ్చే శాసనసభ్యులకు మంత్రి పదవినివ్వాలని నిర్ణయించడం పార్టీకి నిజాయితీగా పనిచేసిన సీనియర్ శాసనసభ్యుల అసంతృప్తికి కారణమవుతోంది. ఈ పరిస్థితిలో ముఖ్యమంత్రి మథన పడుతున్నారు.
Filed under: వార్తలు |
Leave a Reply