విశాఖపట్నం: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య డేనైట్ క్రికెట్ సమరం బుధవారం జరుగనుంది. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్.రాజశేఖర్ రెడ్డి క్రికెట్ స్టేడియా ఈ వన్డే మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. మూడు వన్డేల సిరీస్‌లో ఈనెల 17వ తేదీన జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో విశాఖలో జరిగే రెండో వన్డే అత్యంత కీలకంగా మారింది. ప్రధానంగా భారత జట్టులో ప్రధాన ఆటగాళ్ళైన సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, గౌతం గంభీర్ వంటి క్రికెటర్లు లేరు. అలాగే, ఆస్ట్రేలియా జట్టులోనూ కెప్టెన్ రికీ పాంటింగ్‌తో సహా మరికొంతమంది కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా దూరమయ్యారు. ఫలితంగా ఇరు జట్లు యువ ఆటగాళ్ళకే అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇదిలావుండగా, ఈ స్టేడియంలో ఇప్పటి వరకు జరిగిన రెండు వన్డేల్లో భారత్ విజయభేరీ మోగించింది. దాయాది దేశం పాకిస్థాన్, శ్రీలంక జట్లతో జరిగిన వన్డేల్లో భారీ స్కోరు నమోదైనప్పటికీ..విజయం మాత్రం భారత్‌నే వరించింది. దీంతో బుధవారం జరిగే డే అండ్ నైట్ మ్యాచ్‌లో టాస్ కీలక పాత్ర పోషించనుంది. టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ వైపే మొగ్గు చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభంకానుంది. ఇరు జట్ల వివరాలు…టీమ్ ఇండియా.. ధోనీ (కెప్టెన్), సురేష్ రైనా, యువరాజ్, మురళీ విజయ్, శిఖర్ థావన్, కోహ్లీ, సౌరభ్ తివారీ, అశ్విన్, ప్రవీణ్‌కుమార్, ఆశిష్ నెహ్రా, మునాఫ్ పటేల్, వినయ్‌కుమార్, రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ. ఆస్ట్రేలియా.. మైఖేల్ క్లార్క్ (కెప్టెన్), మైక్ హస్సీ, బొలింగర్, ఫెర్గూసన్, హౌరిట్జ్, వైట్, హేస్టింగ్స్, జేమ్స్ హోప్స్, మార్ష్, క్లింట్ మెకే, టిమ్ పైనే, స్టీవ్ స్మిత్, మైఖేల్ స్టార్క్, డేవిడ్ వార్నర్.
Filed under: వార్తలు |
Leave a Reply