బెంగుళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కథ మరి కొద్దిరోజుల్లోనే ముగియనుందని జేడీఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి జోస్యం చెప్పారు. నగరంలో బుధవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. ముఖ్యమంత్రికి నేరుగా సంబంధమున్న ఓ భూకుంభకోణం రహస్యాన్ని త్వరలో బట్టబయలు చేయబోతున్నానని, ఇది వెలుగు చూసిన తక్షణం సీఎం తన పదవికి రాజీనామా చేయకతప్పదని ఆయన జోస్యం చెప్పారు. ప్రస్తుతం యడ్యూరప్ప హవా నడుస్తోందని, పాపం కొద్ది రోజులైనా ఆయనను ఆనందంగా ఉండనివ్వండంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఈ ధర్మయుద్ధంలో అంతిమ విజయం తమదేనన్నారు. ‘స్పీకర్‌ను అడ్డం పెట్టుకుని తాత్కాలికంగా బీజేపీ నెంబర్ గేమ్‌లో గెలుపొంది ఉండవచ్చు. కోర్టు తీర్పు వెలువడ్డ తక్షణం ఇందుకు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది’ అని కుమారస్వామి పేర్కొన్నారు. తమ ఎమ్మెల్యేలను అధికార బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తోందని, అందుకే వారిని ఇంకా రిసార్టులోనే ఉంచామని ఆయన పాత్రికేయులకు చెప్పారు. స్వేచ్ఛగా వదిలేస్తే బీజేపీ నుంచి కనీసం 30 మంది ఎమ్మెల్యేలు యడ్యూరప్పపై తిరుగుబాటు బావుటా ఎగురవేసేందుకు సిద్ధంగా ఉన్నారని కుమారస్వామి పేర్కొన్నారు.
Filed under: వార్తలు |
Leave a Reply