హైదరాబాద్: ఎమ్మార్ వల్ల ఏపీఐఐసీ నిండా మునిగినట్లు స్పష్టంగా రుజువైంది. ఎమ్మార్ ప్రాపర్టీస్ సంస్థ తనకు తాను ఎమ్మార్ ఎంజీఎఫ్‌తో కుదుర్చుకున్న ఒప్పందంతో ఏపీఐఐసీ వాటాలో భారీగా కోత పడినట్లు విజిలెన్స్ విభాగం సైతం నిర్ధారించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సొంతంగా భూమిని అమ్ముకున్నా…ఎలాంటి వివాదాలు, గొడవలు లేకుండా ఏపీఐఐసీకి భారీగా లాభం వచ్చేదని విజిలెన్స్ స్పష్టం చేసినట్లు సమాచారం. ఎమ్మార్ వ్యవహారంపై విచారణ జరిపిన విజిలెన్స్ విభాగం దీనిపై ఒక పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేసింది. ఏపీఐఐసీకి ఎమ్మార్ ఏ విధంగా కుచ్చుటోపీ పెట్టింది ఇందులో సవివరంగా ప్రస్తావించినట్లు తెలిసింది. ఈ మొత్తం కుంభకోణానికి ఎమ్మార్ ప్రాపర్టీస్ సంస్థ తన అనుబంధ సంస్థ అయిన ఎమ్మార్ ఎంజీఎఫ్‌తో కుదుర్చుకున్న ఒప్పందమే కీలకమని తేల్చింది. ఎమ్మార్ ప్రాపర్టీస్‌తో ఏపీఐఐసీ కుదుర్చుకున్న తొలి ఒప్పందం ప్రకారం ఈహెచ్‌టీపీఎల్‌లో ఏపీఐఐసీకి 26 శాతం వాటా దక్కాలి. కానీ…ఆ తర్వాత ఎమ్మార్ ప్రాపర్టీస్ మొత్తంగా ఈహెచ్‌టీపీఎల్ వాటాను 25 శాతానికి కుదించి, 75 శాతం వాటాను ఎమ్మార్ ఎంజీఎఫ్‌కు కట్టబెట్టింది. దీంతో…ఈహెచ్‌టీపీఎల్‌లో ఏపీఐఐసీ వాటా 26 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గిపోయింది. ఇక్కడే భారీ మోసం జరిగిందని విజిలెన్స్ విభాగం తేల్చింది. ఈహెచ్‌టీపీఎల్‌కు అప్పగించిన భూమి విలువ లెక్కకట్టడంలోనూ గోల్మాల్ జరిగినట్లు నిర్ధారించింది. మొత్తం భూమిలో 285 ఎకరాలను విక్రయించేందుకు వీలుండగా…ఒక్కో ఎకరాకు రూ.29 లక్షలు మాత్రమే విలువకట్టారు. దీని విలువను రూ.83 కోట్లుగా నిర్ణయించారు. ఇందులో ఏపీఐఐసీ వాటాను (26 శాతం ప్రకారం) కేవలం రూ.21.5 కోట్లుగా చూపించారు. నిజానికి…మార్కెట్ ధర ప్రకారం చూసుకుంటే ఒక్కో ఎకరం విలువ రూ.2 కోట్లు అవుతుంది. 285 ఎకరాల విలువ రూ.570 కోట్లకు చేరుతుంది. అంటే ఇక్కడే ఎమ్మార్ సంస్థ రూ.426 కోట్ల మేరకు లాభం పొందినట్లు విజిలెన్స్ విభాగం నిర్ధారించినట్లు తెలిసింది. నిజానికి…ఈ మొత్తం స్థలం ఏపీఐఐసీదే. దీనిని పెట్టుబడిగా పెట్టే ఎమ్మార్ సంస్థ రియల్ వ్యాపారానికి తెరలేపింది. అందులోనూ గోల్‌మాల్‌కు పాల్పడింది. ఈ వివరాలను కూడా విజిలెన్స్ విభాగం తన నివేదికలో సవివరంగా పేర్కొన్నట్లు తెలిసింది. మొత్తంగా చూస్తే…ఏపీఐఐసీ భూమిని పెట్టుబడిగా పెట్టి ఎమ్మార్ సంస్థ రూ.1758 కోట్ల వ్యాపారం చేసే అవకాశముందని…ఇందులో ఏపీఐఐసీకి దక్కేది కేవలం 122 కోట్లని విజిలెన్స్ తేల్చింది. ఎమ్మార్ ప్రాపర్టీస్ – ఎమ్మార్ ఎంజీఎఫ్‌ల మధ్య జీపీఏ కుదరకుండా…ఏపీఐఐసీ వాటా 26 శాతంగా ఉండి ఉంటే రూ.490 కోట్లు లాభం దక్కేది. అసలు ఈ లావాదేవీలు, వివాదాలు లేకుండా ఏపీఐఐసీయే సొంతంగా అమ్మకాలు చేపట్టి ఉంటే…ఈ లాభం మూడింతలయ్యేదని విజిలెన్స్ నిర్ధారించింది. ఎమ్మార్ ప్రాపర్టీస్ గానీ, ఎమ్మార్ ఎంజీఎఫ్గానీ ఏమాత్రం అదనపు పెట్టుబడి పెట్టకుండానే… తన లాభాలను, వాటాలను భారీగా పెంచుకున్నట్లు విజిలెన్స్ స్పష్టంగా నిర్ధారించినట్లు తేలింది. ఈ డీల్‌లో ఏపీఐఐసీకి ఇప్పటిదాకా పైసా కూడా రాకపోవడం గమనార్హం. మొత్తం ఐదు జిల్లాలకు చెందిన విజిలెన్స్ ఎస్పీలు పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించి వివరాలను ఉన్నతాధికారులకు పంపినట్లు సమాచారం. హైదరాబాద్‌కు చెందిన జి.మోహన్‌రావు అనే అడ్వకేట్ ఈ ఏడాది జూన్ 18న ఇచ్చిన ఫిర్యాదుపై విజిలెన్స్ ఈ వివరాలు సేకరించినట్లు తెలిసింది
Filed under: వార్తలు |
Leave a Reply