‘రాజకీయశక్తి’గా గద్దర్ ఫ్రంట్


ఎన్నికల ద్వారా తెలంగాణ అసాధ్యమని ప్రకటన
ఉద్యమాలే శరణ్యమని వెల్లడి
రాష్ట్ర సాధనలో పార్టీల వైఫల్యమని విమర్శ
కేసిఆర్‌ తాగింది నిమ్మరసం కాదు… తెలంగాణ రక్తమంటూ ఎద్దేవా
తెలంగాణా ప్రజా ఫ్రంట్‌ ముసాయిదా విడుదల
ఫ్రంట్‌ అధ్యక్షునిగా గద్దర్‌ ఏకగ్రీవ ఎన్నిక
హైదరాబాద్‌: తెలంగాణ ప్రాంతంలో పాతుకుపోయిన రాజకీయ పక్షాలను అంచునకు చేరుస్తున్నట్టుగా ప్రజాగాయకుడు గద్దర్‌ ప్రతిపాదించిన తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ (టిపిఎఫ్‌) పురుడుపోసుకుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం పార్లమెంట్‌లో ఒక బిల్లు ప్రవేశపెట్టేలా ఎంపీలపై ఒత్తిడి తీసుకువచ్చే ఏకైక లక్ష్యంతో టిపిఎఫ్‌ ఆవిర్భవించింది. టిపిఎఫ్‌ ఆవిర్భావానికి చోటు కల్పించిన సమావేశంలో ప్రతినిధులను ఉద్దేశించి గద్దర్‌ ప్రసంగిస్తూ ”డిసెంబర్‌ మాసంలో అనగా పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టే కార్యక్రమం జరగాలి. ఎంపీలపై ఒత్తిడి తెచ్చేందుకుగాను టిపిఎఫ్‌ వారి నివాసాల ఎదుట ధర్నాలు చేపడుతుంది. కేంద్రానికి సెగ తగిలే విధంగా మా డిమాండ్‌కు అంగీకరించిన ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంపీలందరిని బరిలోకి దింపుతాం” అని తెలిపారు.

తెలంగాణ జిల్లాల్లో పనిచేస్తున్న 100కు పైగా సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న దాదాపు వెయ్యి మంది ప్రతినిధులు హాజరైన ఆ సమావేశం ఐదు తీర్మానాలను చేసింది. ఆ తీర్మానాలు ఇలా ఉన్నాయి… పార్లమెంట్‌లో ఒక బిల్లు ప్రవేశపెట్టేందుకు ఎంపీల ఒత్తిడి చేసేందుకు ఒక ఉద్యమాన్ని నిర్మించాలి. డిమాండ్‌ను బతికించుకునే క్రమంలో అన్ని గ్రామాల్లో క్రమం తప్పకుండా స్థానిక స్థాయి ఆందోళనలు చేపట్టాలి. ప్రధాన డిమాండ్‌ను సాధించుకునేందుకు ఎంపీల నివాసాల ఎదుట నిరసన కార్యక్రమాలు నిర్వహించాలి. సామాజిక న్యాయం ప్రాతిపదికగా ఉద్యమాన్ని నిర్మించాలి. ఎన్నికలు ప్రస్తుతం లేనందున ఎన్నికలు వచ్చిన సమయంలో ఫ్రంట్‌ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే దానిపై ఎట్టకేలకు ఒక నిర్ణయం తీసుకోవాలి. టిపిఎఫ్‌ అధ్యక్షుడిగా గద్దర్‌ను సమావేశం ఎన్నుకుంది. 84 మంది సభ్యులతో కూడిన తాత్కాలిక కమిటీని నియమించింది. వారి పేర్లను త్వరలో ప్రకటిస్తారు. ఫ్రంట్‌ ఒక ప్రిసీడియం, సెక్రటేరియట్‌ కలిగి ఉంటుంది. ఆందోళనలను కొనసాగించేందుకు ప్రతి జిల్లాలో మండల, గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటవుతాయి.

”గ్రామాల్లో చిన్నవైనా ప్రభావితమైన ఉద్యమాలను చేపట్టాలని మేం కోరుకుంటున్నాం. ఆ ఉద్యమాలన్నీ కలిసి మహోద్యమానికి దారి తీస్తాయి కనుక ఇది కీలకమైన సూత్రమవుతుంది” అని గద్దర్‌ వివరించారు. సమావేశంలో చర్చనీయాంశమైన ఫ్రంట్‌ సంస్థాగత ముసాయిదాలో తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేస్తున్నారంటూ టిఆర్‌ఎస్‌ అధినేత చంద్రశేఖరరావుపై టిపిఎఫ్‌ విరుచుకుపడింది. ”మొదటగా ఆయన ఆమరణదీక్ష చేపట్టారు. అనంతరం దాన్ని విరమించుకున్నారు. ఆ తర్వాత విద్యార్థుల చేతుల్లోకి ఉద్యమం వెళ్లిపోవటంతో ఆమరణ దీక్షను తిరిగి ప్రారంభించారు” అని వేలెత్తి చూపుతూ కేసీఆర్‌ చిత్తశుద్ధిలో డొల్లతనాన్ని ఆ ముసాయిదా ఎండగట్టింది. గద్దర్‌ తన ప్రారంభ, ముగింపు వ్యాఖ్యల్లో ఉద్యమ చరిత్ర మూలాలు, అది నీరుగారిపోవటం లేకుంటే పరాధీనం కావటం లేదా దారి తప్పిన దశలను పూసగుచ్చినట్టుగా వివరించారు.

టిపిఎఫ్‌ ఒక రాజకీయ పార్టీ కాదని, రాజకీయ లక్ష్యాన్ని సాధించేందుకు ఆవిర్భవించిన ఒక శక్తిగా గద్దర్‌ వర్ణించారు. కేంద్రం తనంతట తానుగా రాష్ట్ర విభజన శక్తి తాలూకు దర్పాన్ని ప్రదర్శించిందని, దాంతో కేంద్రం లక్ష్యంగా ఇప్పుడిక ఉద్యమం పురుడుపోసుకుందని ప్రజాగాయకుడు పేర్కొన్నారు. ”కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యమాలను నిర్మించటమే ఏకైక మార్గం” అని వాటి ప్రాముఖ్యతను నొక్కి చెపుతున్నట్టుగా గద్దర్‌ అదేపనిగా ప్రస్తావించారు. గతంలో చేపట్టిన ప్రయోగాల వైఫల్యం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ”ఎం.చెన్నారెడ్డి రోజుల నుంచి ప్రస్తుతం కె.చంద్రశేఖరరావు దాకా ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి” అని చెప్పటం ద్వారా ఎన్నికలు, రాజకీయ చొరవలు ఫలితాలు రాబట్టలేవనే నిజాన్ని నిర్మించేందుకు ఆయన ప్రయత్నించారు.

విద్యార్థులు ఆందోన చేపట్టినప్పుడు కేంద్రం సాగిలపడిందని గద్దర్‌ చెప్పారు. మరుసటి రోజు విద్యార్థుల ర్యాలీకి భీతిల్లిన కేంద్రం గత సంవత్సరం డిసెంబర్‌ తొమ్మిదిన తెలంగాణ ప్రకటించిందని ఆయన తెలిపారు. అనంతరం రాజకీయ అంశం ప్రవేశించటంతో కేంద్రం మరోసారి ఘనీభవించిందని గద్దర్‌ ఆరోపించారు. రాజకీయ పక్షాలు కేంద్రంతో ఒక శాంతి ఒడంబడికను కుదుర్చుకోవటంతో ప్రస్తుతం కేంద్రానికి పైచేయిగా మారింది. ”కేంద్ర హోమ్‌ మంత్రి పరిస్థితికి లోబడి ఉన్నారు” అని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల ద్వారా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అసాధ్యమని తెలంగాణ ప్రజాఫ్రంట్‌ (టిపిఎఫ్‌) తేల్చిచెప్పింది. రాష్ట్ర సాధనకు విశాల ఐక్య ఉద్యమాలే మార్గమని ఫ్రంట్‌ స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు శనివారంనాడు ఆవిర్భవించిన ఫ్రంట్‌ తన ముసాయిదా ప్రణాళికలో ఈ అంశాలను పేర్కొంది.

కాంగ్రెస్‌ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి వరకు అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ సాధనలో విఫలమయ్యాయని పేర్కొంది. 1971లో పదిమంది ఎంపీలను తెలంగాణ ప్రజలు గెలిపించినా, నాయకులు తమ స్వల్ప లాభాలకు అమ్ముకొని ఉద్యమాన్ని నిర్వీర్యం చేశాయని ముసాయిదా అభిప్రాయపడింది. అటు తరువాత ఆరు సుత్రాల పథకం పేరిట తెలంగాణ ప్రాంత దోపిడీని శాశ్వతం చేసే ప్రయత్నం జరిగిందని ముసాయిదా పేర్కొంది. ఫలితంగా పోరాటాలు, త్యాగాలు తెలంగాణ ప్రజల వంతైతే విజయం మాత్రం ఆంధ్ర పాలకులకు దక్కిందని పేర్కొంది. కేసిఆర్‌ నిరహార దీక్ష విరమించింది నిమ్మరసం తాగి కాదని, అది తెలంగాణ రక్తమని, తెలంగాణాలోని విద్యార్థి, యువజన, కార్మిక, కర్షక, మేధావులందరూ భావించారని ముసాయిదా పేర్కొంది. విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఉద్యమించిన ఫలితంగా డిసెంబర్‌ 9వ తేదీ ప్రకటనను కేంద్రం చేసిందని పేర్కొంది.

అటు తరువాత ఉద్యమాలు కొనసాగించని ఫలితంగా, సీమాంధ్ర, రాజకీయ పార్టీల నాయకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రల కారణంగా 23వ తేదీన మరో ప్రకటన వచ్చిందని, 5వ తేదీన చర్చల నాటకం తెరపైకి వచ్చిందని, ఇది మరొక ద్రోహమని ముసాయిదా పేర్కొంది. శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు కూడా దీని ఫలితమేనని పేర్కొంది. శ్రీకృష్ణ కమిటీ ఏ నివేదిక ఇచ్చినా ఒత్తిడి లేకుండా రాష్ట్రం ఏర్పడదని ముసాయిదా అభిప్రాయపడింది. ఉద్యమ లక్ష్యంతో ఆవిర్భవించిన టిఆర్‌ఎస్‌ తరువాతి కాలంలో ఎన్నికలు ప్రధాన లక్ష్యం ముందుకు సాగిందని ఈ క్రమంలో తెలంగాణను కాంక్షించే శక్తులన్నీ ఏకంచేసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చే లక్ష్యంతో ఫ్రంట్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. పార్లమెంటులో బిల్లు పెట్టించడం నాలుగు కోట్లమంది తెలంగాణ ప్రజలను ఒకతాటిపైకి తీసుకురావడం, వనరుల పరిరక్షణకు పోరాటాలు నిర్వహించడం అంతి మంగా రాష్ట్రాన్ని సాధించడమని పేర్కొంది.

ఫ్రంట్‌ అధ్యక్షునిగా విప్లవ గాయకుడు, ప్రజా కళాకారుడిగా పేరొందిన గద్దర్‌ను ప్రతిపాదించింది. ఫ్రంట్‌ నిర్మాణం మూడంచెల్లో ఉంటుందని, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో కమిటీ, కార్యవర్గం, జనరల్‌బాడీలుండనున్నాయి. జెఎసిల రాష్ట్ర కమిటీ సభ్యులు, పార్టీల రాష్ట్ర కమిటీలు, సంస్థలు, సంఘాల రాష్ట్ర కమిటీల నుంచి ఒక్కొక్క సభ్యుడి చొప్పున రాష్ట్రస్థాయి జనరల్‌బాడీ రూపుదిద్దు కోనుంది. సంవత్సరానికి ఒకమారు జనరల్‌బాడీ సమావేశం కావాలని నిర్ణయిం చింది. రాష్ట్ర కమిటీలో 15మంది, కార్యవర్గంలో 61 మంది సభ్యులుంటారు. జిల్లాకు ముగ్గురు చొప్పున పది జిల్లాల నుంచి 30 మంది సభ్యులుంటారు. రాష్ట్ర కమిటీలో ఏడుగురితో అధ్యక్ష వర్గం, ఆరుగురితో కార్యవర్గం ఉంటుంది.

రాష్ట్ర కమిటీలో ఒకరు సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. సమన్వయకర్త ఆరునెలలు కొనసాగుతారు. జిల్లా, మండల స్థాయిలో నిర్మాణం ఇలాగే ఉం డనుంది. ఫ్రంట్‌ సమిష్టి నాయకత్వంలో పనిచేయాలని ముసాయిదాలో ప్రతి పాదించారు. జిల్లాల వారీగా సమస్యలపై పోరాటాలు నిర్వహించాలని ప్రతిపాదించింది. హైదరాబాద్‌ నగరం తెలంగాణలో సహజ అంతర్భాగంగా ముసాయిదా పేర్కొంది. సెజ్‌లు, రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలకు కేటా యించిన వేలాది ఎకరాల భూములు స్థానికులకు దక్కేలా పోరాటం జరపాలని, నగరంలోని ముస్లింలపై వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలని ముసాయిదా ప్రతిపాదించింది.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: