పోలిక అవసరమే.. కానీ…?!


(డాక్టర్ ఎస్వీ లక్ష్మణరావు)
ప్రస్తుత సమాజంలో విలువలు తగ్గిపోవటానికి అనేక కారణాలున్నాయి. ప్రపంచీకరణ, సరళీకరణ మరియు ప్రైవేటీకరణలకు ప్రాధాన్యం పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో పోటీ అనేది విపరీతంగా ఉంటోంది. ప్రతీ ఒక్కరూ తమ తమ ప్రాధాన్యత లను పెంచుకుని అందరిలో పేరు, పలుకుబడి సంపాదించుకోవటానికి విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. గమ్యం ప్రధానం కాని దానిని చేరుకునే విధానం మంచిదా, కాదా అనే ఆలోచన లేకుండా ప్రవర్తిస్తుంటారు నేటి సమాజంలో ఎక్కువమంది. హక్కులకోసం పోరాడే వ్యక్తులు వారియొక్క విధులను గూర్చి ఎందుకు పట్టించుకోరు? ఒక ఉపాధ్యాయుడు తనయొక్క విద్యార్ధులను మంచి పౌరులుగా తీర్చిదిద్దటం కోసం అకుంఠిత దీక్ష, అణకువ మరియు అంకితభావంతో పని చేయవలసి ఉంటుంది. అలాగే ఒక వైద్యుడు పూర్తి సేవాభావం కలిగియుండి రోగులను ప్రేమతో వైద్య సేవలు అందించాలి. ఒక న్యాయవాది న్యాయం గెలిచే విధంగా పని చేయాలి.

ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో పక్కవారితో పోల్చుకోవటం సహజమే. అలా పోల్చుకుంటేనే తాను సరైన మార్గంలో వెళుతున్నానో లేదో అర్థం అవుతుంది. ఇది పిల్లలకు మినహాయింపేమీ కాదు. చదువుల్లో తాను వేగంగా ముందుకెళ్లాలనుకునే విద్యార్థి పక్క విద్యార్థితో సరిపోల్చుకోవటం అవసరమే. ఇలా చేస్తేనే అతను మరింత శక్తివంతంగా ముందుకు వెళతాడు. కాబట్టి పక్కవారితో పోల్చుకోవటం నేరమేమీ కాదు. అలాగని సాటి విద్యార్థులందరితోనూ సరిపోల్చుకోవటం మంచి పద్ధతి కాదు. అదే విధంగా ఎప్పుడూ ఒకే విద్యార్థితో పోల్చి చూసుకోవటంవల్ల సామర్థ్యం పెరగటం అటుంచి, అసూయపాళ్లు పెరిగిపోతాయి. తద్వారా ఆ విద్యార్థిపై ద్వేష భావం పెరిగే ప్రమాదం లేకపోలేదు.

అయితే చదువుల్లో ముందు రాణించే ఎలాంటి విద్యార్థితో అయినా సరే సరిపోల్చుకోవాలి. అదే సమయంలో మనలోని లోపాలను సరిజేసుకుని, సందేహాలను నివృత్తి చేసుకుంటేనే ఆయా విద్యార్థుల అభివృద్ధికి దోహదమవుతాయి. ఇతర విద్యార్థులతో పోల్చటం అనే విషయంలో ఉపాధ్యాయులు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చదువును చదువుతోనే పోల్చాలి, చదివే విధానాన్ని పోల్చాలి. అంతేగానీ మొత్తం వ్యక్తిత్వంతో పోల్చడం వల్ల ఆ విద్యార్థుల్లో మానసిక స్థైర్యం దెబ్బతింటుందన్న సంగతిని గుర్తు పెట్టుకోవాలి. పరీక్షా ఫలితాలలో వ్యత్యాసాలు కనిపిస్తే, వాటికి సరైన కారణాలను పరిశీలించి, లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకునేలా విద్యార్థులను ప్రోత్సహించాలి.

ఆరోగ్యకరమైన పోటీ వలన మంచి అభివృద్ధి సాధించగలము. అభివృద్ధి సాధించటానికి అడ్డదారులు తొక్కటం, నియమావళిని తుంగలో తొక్కటం వలన సాధించిన అభివృద్ధి అసలు నిలువదు. ప్రతివ్యక్తి ఇతరులతో పోల్చి చూసుకోవటం అనేది సర్వసామాన్యమైన విషయం. ఒక అంశంలో బాగా రాణించేవారితో పోల్చుకోవటం ద్వారా వెనుకబడటానికి కారణాలు అన్వేషించి వారిని అందుకోవటానికి ఎలా పయనించాలి? ఎటువంటి పద్ధతులు పాటించాలి? ఎలా కష్టపడి పని చేయాలి? అనేవి గమనించి వాటిని అనుసరించాలి. ఎదుటి వ్యక్తిలోని మంచిని గ్రహించవలసి ఉంటుంది. ఎల్లప్పుడు మన అభివృద్ధిని కోరుకోవటం తప్పు కాదు కాని ఇతరుల అభివృద్ధిని ఆటంకం కలిగించటం, వారిని అడ్డుకోవటం ద్వారా మనం ముందుకు దూసుకు పోవాలి అనుకోవటం మన పతనానికి దారి తీస్తుంది. ఈ విషయం ఈ క్రింది కధ ద్వారా మనకు బాగా అవగతమవుతుంది.

ఇద్దరు మహా శక్తివంతమైన ఋషులు ఉండేవారు. వారియొక్క ఘోర తపస్సు ద్వారా దేవుణ్ణి సైతం మెప్పించగల శక్తి సంపన్నం కలిగినవారు. వారిద్దరూ ఒకరంటే ఒకరికి అసూయ కలిగి వారిద్దరిలో ఒకరికంటె ఒకరు గొప్పగా భావించేవారు. ఒక ఋషి విష్ణువుని, ఇంకో ఋషి శివునికి భక్తులు. వైష్ణవ భక్తుడు మహా శక్తివంతమైన తపస్వి అయినప్పటికిని ఎక్కువ అసూయ కలిగి ఉండేవాడు. శైవ భక్తునికంటె ఎలాగైనా ఎక్కువ సాధించాలనే కోరిక కలిగి ఉండేవాడు. శివుడు భోళా శంకరుడు, వేగంగా భక్తులకు దర్శనమిస్తాడు, మిగిలిన దేవతలకంటె శివుడు వేగంగా ప్రసన్నుడవుతాడు. శైవ భక్తుడు వైష్ణవ భక్తుని అసూయను గమనిస్తూనే ఉంటాడు. అసూయ అతని పతనానికి దారి తీస్తుందని గ్రహించినవాడు. ఇద్దరూ ఘోర తపస్సు చేయ సంకల్పించారు. తమ తమ దైవాలను ప్రసన్నం చేసుకుని మంచి కోరికలతో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని భావించి తపస్సు ఆరంభిస్తారు.

కొన్ని సంవత్సరాలు గడచిన అనంతరం భోళా శంకరుడు తన భక్తుని యొక్క తపస్సుని మెచ్చి తనకు దర్శనమిస్తాడు. తన భక్తుని చూసి ఇంత భక్తి శ్రద్ధలతో నిష్టగా నన్ను పూజించినందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను, నీవు ఏదో ఒక కోరిక కోరుకోమని అడుగుతాడు. శివ భక్తుడు తన కోరికను చెప్పిన తరువాత శివుడు చాలా ఆశ్చర్యచకితుడవుతాడు, అతనియొక్క దూరదృష్టిని, ధైర్యాన్ని మెచ్చుకుంటాడు. మరికొంత కాలానికి వైష్ణవ భక్తుని ఘోర తపస్సుని మెచ్చి ప్రసన్నుడైన విష్ణుమూర్తి ప్రత్యక్షమై తన భక్తునికి ఏదైనా ఒక వరం కోరుకొమ్మని అడుగుతాడు.

వైష్ణవ భక్తుడు రెండో ఆలోచన లేకుండా ఎక్కువమంది ప్రజలు, ఋషులు ఆ శైవ భక్తుడినే మెచ్చుకుంటున్నారు, అతనికంటె ఎక్కువ తపశ్శక్తి కలిగిన నాకు అతను కోరుకున్నదానికి రెండింతలు కావాలి అని కోరుకుంటాడు, దానికి విష్ణుమూర్తి ఇంతగా తపస్సు చేసిన నీవు అతనితో పోలిక లేకుండా నీకు కావలసింది కోరుకుంటే బాగుంటుంది అనే సలహా ఇస్తాడు. అప్పుడు ఆ భక్తుడు నా తపస్సుయొక్క ప్రధాన ఆశయం కేవలం శైవ భక్తునికంటె గొప్పగా ఉండటమే అని సెలవిస్తాడు. ఎంతగా వివరించినా భక్తుని ఒప్పించలేకపోతాడు విష్ణువు. చివరిగా తన భక్తునికి తనమీద భక్తికన్న శివ భక్తునిపై అసూయనే ఎక్కువ అని గ్రహించిన విష్ణువు తనయొక్క కోరికను అంగీకరిస్తాడు. తర్వాత శివ భక్తుడు కోరికను తన భక్తునికి సెలవిస్తాడు. అది విన్న భక్తుడు హతాశుడవుతాడు.

శివ భక్తుని తెలివితేటలు, సమయస్ఫూర్తి, దూరదృష్టితో అతను కోరుకున్న కోరిక “నాకు ఒక కన్ను యొక్క చూపును కోల్పోయేటట్లు వరమివ్వు శివయ్యా!” ను మరొక్కసారి గుర్తు చేసుకుని వైష్ణవ భక్తుడు తనయొక్క అసూయ, మూర్ఖత్వానికి సిగ్గుపడి తనయొక్క కోరికను స్వీకరిస్తాడు. విషయాన్ని గమనించిన శివుడు, విష్ణువులు ఇద్దరు భక్తులకూ తిరిగి చూపును ప్రసాదించి సఖ్యతగా ఉండేలా చూస్తారు. అప్పటినుండి ఎవరు గొప్ప అని కాక ఇద్దరూ అందరికీ సహాయం చేస్తూ ఉంటారు.

రచయిత: ఆంధ్రా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: