ఎరువుల కొరత… రైతన్న కలత


అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందన్నట్లు తయారైంది ఆంధ్రప్రదేశ్లో అన్నదాత పరిస్థితి. రుతుపవనాలు అనుకూలించి మెండుగా వర్షాలు కురిసి ఖరీఫ్ కలిసి వస్తుందని గంపెడాశతో ఉన్న కర్షకులకు ఎరువులు, విత్తనాల కొరత తీవ్రంగా పట్టిపీడిస్తోంది. వరి వరకు విత్తనాల కొరత పెద్దగా లేనప్పటికీ మిగిలిన అన్ని రకాల విత్తనాలకూ ఇబ్బందులు తప్పలేదు. ఎరువులు, పురుగు మందుల విషయంలో మాత్రం దాదాపు అన్ని రకాలకూ తీవ్రమైన కొరత ఏర్పడింది. రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో వర్షాలు సజావుగా కురవడంతో చెరువులు, కుంటలు, బావుల క్రింద, వివిధ కాల్వల ఆయకట్టు పరిధిలో రైతులు ఎక్కువ విస్తీర్ణంలో వరి నాట్లు వేశారు. అనేక ప్రాంతాలలో ఇప్పటికే వరి నాట్లు వేసి నెల రోజులు దాటుతున్నప్పటికీ అవసరమైన ఎరువులను అందించడంలో పాలకులు విఫలమయ్యారు. దానితో పది జిల్లాల్లో పంటలు వెలవెలబోతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ఎరువుల కొరత రైతాంగాన్ని తీవ్రమైన సంక్షోభంలోకి నెడుతున్నది. సీజన్‌ ప్రారంభానికి ముందు ఎరువులు సమృద్ధిగా వున్నాయని ప్రకటనలు గుప్పించిన ప్రభుత్వం తీరా వ్యవసాయ సీజన్‌ ప్రారంభమయ్యేసరికి చేతులెత్తేయటంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ఎరువులు బ్లాక్‌ మార్కెట్‌కు తరలుతున్నాయి. ఎరువుల కోసం రైతన్నలు రాత్రింబవళ్లు దుకాణాల ముందు పడిగాపులు పడుతున్నా ఫలితం వుండటం లేదు. వరంగల్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, మెదక్‌, ఖమ్మం, శ్రీకాకుళం, నెల్లూరు, ఆదిలాబాద్‌, కర్నూలు, కడప జిల్లాల్లో ప్రధానంగా ఎరువుల కొరత ఎదుర్కొంటున్నారు. వరి పంటకు ఎకరాకు డిఏపి, యూరియా, అమోనియం, పొటాషియం తదితర ఎరువులను వాడాల్సి వున్నప్పటికీ దుక్కిలో డిఏపితో పాటు ఇతర ఎరువులను వేసి వరి పంటను నాటుతారు. పంట పచ్చబడిన తరువాత 15 రోజుల నుంచి 20 రోజులకోసారి యూరియాను ఎక్కువగా వాడుతుంటారు. ఎకరాకు యూరియాను ఎనిమిది నుంచి పది బస్తాల వరకు వాడుతుంటారు. మార్కెట్‌లో ఇటీవల రైతులకు అత్యవసరమయ్యే యూరియా దొరకకపోవటంతో పాటు బ్లాక్‌ మార్కెట్‌కు తరలించి పలువురు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇదేమని రైతులు ప్రశ్నిస్తే తమ వద్ద స్టాక్‌ లేదంటూ ప్రభుత్వం నుంచి తమకు సరఫరా కావటం లేదని చేతులు ఎత్తేస్తున్నట్లు తెలుస్తున్నది. పలు ప్రాంతాలలో యూరియా వున్నప్పటికీ ఎక్కువ ధరలు చెల్లించిన వారికే లభిస్తున్నాయనే ఆరోపణలు చోటుచేసుకుంటున్నాయి. ఖరీఫ్‌ సీజన్‌లో పత్తి, మిర్చి, వరి, మొక్కజొన్న తదితర కూరగాయల పంటలతో పాటు దీర్ఘకాలిక పంటలైన మామిడి, సపోట, అరటి, పసుపు తదితర పంటలకు ఎక్కువగా యూరియా, పొటాషియంను రైతులు వాడుతుంటారు. పంట పక్వానికి వచ్చే దశలో ఈ ఎరువులను వేయని పక్షంలో దిగుబడులు కూడా పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం వుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చెపుతున్న మాటలకు, వాస్తవ పరిస్థితులకు ఏ మాత్రం పొంతన కుదరడం లేదు. ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచడంలో, సకాలంలో సరఫరా చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం కావడంతో ఆగ్రహించిన రైతులు ప్రత్యక్ష దాడులకు దిగుతున్నారు. అడుగడుగునా ప్రభుత్వాధికారులను నిలదీస్తున్నారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా గోడౌన్లు, దుకాణాలపై దాడులు నిర్వహించి, దొరికిన బస్తాలను దొరికినట్లుగా పట్టుకుపోతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టడం లేదు. యూరియా కొరత రైతుల కంట కన్నీరు పెట్టిస్తున్నా, అధికారగణం ఒక్కడుగు కూడా ముందుకు కదలడం లేదు. పనులు మానుకొని మరీ రైతులు తమ కుటుంబాలతోసహా పగలనకా, రాత్రనకా ఎరువుల దుకాణాల ముందు రైతులు పడిగాపులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారుల అలక్ష్యం పూర్తిగా కన్పిస్తున్నా, ముఖ్యమంత్రి గానీ, వ్యవసాయ శాఖ మంత్రిగానీ ఏ మాత్రం స్పందించకపోవడం గమనార్హం. అప్పుడప్పుడూ స్పందించినా, ఎరువుల కొరత లేదంటూ ఒకటే మాట వారి నోట విన్పిస్తోంది. గత ఏడాది కూడా ఇదే తంతు. ఎరువులు అక్రమంగా నిల్వచేసిన వారిపై చర్య తీసుకోవలసిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా రైతులపై కేసులు బనాయించింది. గత సంవత్సరం జరిగిన అనుభవాన్ని దృష్టిలో వుంచుకుని రైతులకు అవసరమయ్యే ఎరువులను అందించాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఇప్పటికే పలు ప్రాంతాలలో ఎరువులను బ్లాక్‌ మార్కెట్‌లకు తరలించి కృత్రిమ కొరత పేరుతో సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాల్సి వుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఎరువులను కేటాయించినప్పటికీ తగు మోతాదులో విడుదల చేయటంలో విఫలమవుతోంది. జూన్‌, జులై నెలలకు కేంద్ర ప్రభుత్వం 5.58 లక్షల టన్నులు అయితే, కేవలం 3.57 లక్షల టన్నులను మాత్రమే సరఫరా చేసింది. గత సీజన్‌లో కూడా సరిపడా ఎరువులను సరఫరా చేయటంలో ప్రభుత్వం విఫలమైంది. మే నెలలో 1.02 లక్షల టన్నుల యూరియా అవసరం కాగా, కేవలం 0.96 లక్షల టన్నులను మాత్రమే సరఫరా చేసింది. జూన్‌ నెలలో 1.35 లక్షల టన్నుల యూరియా అవసరం కాగా 1.31 లక్షల టన్నులను సరఫరా చేసింది. జులై నెలలో 2.31 లక్షల టన్నుల యూరియా డిమాండ్‌ కాగా, 2.10 లక్షల టన్నులను మాత్రమే ప్రభుత్వం సరఫరా చేసింది. ఆగస్టు నెలలో 4.5 లక్షల టన్నులు అవసరం కాగా, ఆగస్టు 20వ తేదీ వరకు 1.2 లక్షల టన్నులు మాత్రమే సరఫరా చేసింది. సెప్టెంబరు 10వ తేదీ నాటికి కూడా అదనంగా ఏమి సరఫరా చేయలేదు. పైగా ఎరువులు పుష్కలంగా వున్నాయని, సరఫరా చేస్తున్నామని అసత్య ప్రకటనలు చేస్తోంది. రైతులు అవసరానికి మించి కొనుగోలు చేసి నిల్వ చేయటం వల్లే ఎరువుల కొరత ఏర్పడుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎన్‌. రఘువీరా రెడ్డి వితండవాదం చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు సర్వత్రా విమర్శకు దారితీశాయి. వ్యవసాయ పరిశోధకులు సూచించిన పద్దతిలో ఎరువుల తయారీకీీ ఆదేశించాల్సిందిపోయి, ఎరువుల కంపెనీల ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నడుచుకుంటున్నదని విమర్శలున్నాయి. రైతాంగానికి ఎలాంటి ఎరువులు అవసరమో వాటిని ఉత్పత్తి చేయాల్సింది పోయి, పరిశ్రమల అధిపతులకు లాభాలు వచ్చే నాసిరకం, అవసరం లేని ఎరువులను మార్కెట్‌లోకి పంపి ఎరువుల డీలర్లు ద్వారా బ్లాక్‌ మార్కెట్ను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కష్టాలలో వున్న రైతాంగాన్ని ఆదుకుని, ఎరువులను సమృద్ధిగా సరఫరా చేయటంతో పాటు బ్లాక్‌ మార్కెట్‌ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడం గమనార్హం. ఎరువులు బ్లాక్ మార్కెటింగ్ చేసే వాళ్లపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్న వ్యవసాయ మంత్రి మాటలు కేవలం ప్రకటనలకే పరిమితమన్నది ఇప్పటికీ అర్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎంత మంది అక్రమార్కులపై కేసులు పెట్టారో చెప్పడానికి కూడా అధికారుల దగ్గర ఆధారాలు లేవంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికైనా పాలకులు ప్రకటనలకు పరిమితం కాకుండా అన్నదాతను ఆదుకునే చర్యలు చేపడితే మంచింది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: