భారత్‌-శ్రీలంక తుదిపోరు


దంబుల్లా: రెండేళ్లుగా ఆటగాళ్లకు విసుగెత్తేలా, అభిమానులకు మొహం మొత్తేలా సాగుతున్న భారత్‌-శ్రీలంక క్రికెట్‌ యుద్ధానికి నేటితో ముగింపు! ముక్కోణపు వన్డే సిరీస్‌ ఫైనల్‌ పోరాటం శనివారమే. సందు దొరికితే లంకేయులతో మ్యాచ్‌లు ఆడేస్తున్న ధోనీ సేన.. ప్రపంచకప్‌ను మినహాయిస్తే వచ్చే రెండేళ్లలో లంక ఛాయలకు వెళ్లే అవకాశాల్లేవు! ఆ జట్టూ మన గడ్డపై అడుగు పెట్టే సూచనల్లేవు!
ఈ నేపథ్యంలో రెండేళ్లుగా లంక గడ్డపై ఆడిన వన్డే సిరీస్‌లన్నింట్లో ఆతిథ్య జట్టును ఓడిస్తూ వస్తున్న టీమ్‌ ఇండియా ఈ ‘తుది’ యుద్ధంలోనూ విజయ పతాకం ఎగురవేస్తుందా? సారథ్య బాధ్యతలు అందుకున్నాక ఆడిన నాలుగు సిరీస్‌ల్లోనూ లంకేయులకు వారి సొంత గడ్డపై చెక్‌ పెడుతూ వస్తున్న ధోనీ తన అజేయ రికార్డును నిలబెట్టుకుంటాడా?
పైచేయి ఎవరిదో?: టెస్టు సిరీస్‌ డ్రాగా ముగిసింది. ముక్కోణపు వన్డే సిరీస్‌ లీగ్‌ దశలో మొదట లంకను భారత్‌ ఓడిస్తే… తర్వాత ఆతిథ్య జట్టు మనపై నెగ్గి ప్రతీకారం తీర్చుకుంది. ఇక ఈ పర్యటనలో విజేత ఎవరో తేల్చేది శనివారం నాటి మ్యాచే.
నిలకడ లేమే సమస్య: బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాలు రెండిట్లోనూ భారత్‌ను వేధిస్తోన్న సమస్య నిలకడ లేమి. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో భారత్‌ గెలిచింది కానీ బలహీనతల్ని మాత్రం అధిగమించలేకపోయింది. ఓ దశలో 32 ఓవర్లలో 171/4తో భారీ స్కోరు దిశగా సాగిన ధోనీ సేన.. 223 పరుగులకే ఆలౌటైంది. బౌలర్లు రాణించబట్టి సరిపోయింది కానీ.. లేకుంటే టీమ్‌ ఇండియా ఆ మ్యాచ్‌తో ఇంటిముఖం పట్టేదే. బ్యాటింగ్‌ భారమంతా సెహ్వాగే మోస్తున్నాడు. సిరీస్‌లో రెండు విజయాలూ వీరూ పుణ్యమే. టాప్‌ఆర్డర్లో కార్తీక్‌, కోహ్లి, రోహిత్‌ల వైఫల్యం కొనసాగుతోంది. మిడిలార్డర్లో రైనా ఘోరంగా విఫలమవుతున్నాడు. యువీ, ధోనీల ప్రదర్శనా అంతంతమాత్రమే. ఫైనల్లోనైనా బ్యాట్స్‌మెన్‌ తలోచెయ్యి వెయ్యాలి. లేకుంటే కప్‌పై ఆశలు పెట్టుకోలేం.
బౌలింగ్‌ విభాగం గాడిలో పడినట్లే కనిపిస్తోంది. నలుగురు పేసర్ల మంత్రం గత మ్యాచ్‌లో అద్భుత ఫలితాన్నివ్వడంతో ధోనీ ఈ మ్యాచ్‌లోనూ అదే కూర్పును కొనసాగించనున్నాడు. ఐతే ఆరంభంలో వికెట్లు పడగొట్టి మధ్యలో కాడి వదిలేసే ధోరణిని బౌలర్లు మానుకోవాలి. కివీస్‌తో మ్యాచ్‌లో 53 పరుగులకే 8 వికెట్లు తీసిన బౌలర్లు.. లోయర్‌ ఆర్డర్‌ ముందు తలవంచారు. మరో 65 పరుగులు సమర్పించుకుని కానీ.. చివరి రెండు వికెట్లు పడగొట్టలేకపోయారు. ఈ బలహీనత ఫైనల్లో పునరావృతం కాకుండా చూడాలి.
కసి మీద సంగ సేన: మరోవైపు వరుసగా ఫైనళ్లలో తమను దెబ్బ తీస్తున్న టీమ్‌ ఇండియాకు ఈ ఫైనల్‌తో చెక్‌ పెట్టాలని సంగక్కర సేన కసిగా ఉంది. ‘నోబాల్‌’ వివాదాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఈ ఫైనల్‌ను లంకేయులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. భారత్‌తో పోలిస్తే లంక బ్యాటింగ్‌ మెరుగ్గా ఉంది. దిల్షాన్‌, తరంగ, జయవర్దనే, సంగక్కర ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో ఏ సమస్యలూ లేవు. మలింగ, కులశేఖర కీలకపాత్ర పోషిస్తున్నారు. గత మ్యాచ్‌లో పెరీరా చెలరేగడం మరో సానుకూలాంశం. భారత జట్టులో పెద్దగా మార్పులుండకపోవచ్చు. రోహిత్‌ స్థానంలో ఆడిన కోహ్లి కూడా విఫలమయ్యాడు. వీరిద్దరిలో ఎవరికి అవకాశమివ్వాలో ధోనీ తేల్చుకోలేకపోతున్నాడు. ఇక వరుసగా నిరాశ పరుస్తున్న జడేజాపై ధోనీ మరోసారి నమ్మకముంచే అవకాశముంది. ఓజా పెవిలియన్‌కే పరిమితమయ్యే సూచనలున్నాయి.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: