మున్సిపల్ స్థాలాల లీజుపై రగడ!


విశాఖపట్నం: అనకాపల్లి మున్సిపల్ స్థలాల లీజు, కబ్జా వ్యవహారాలపై మున్సిపల్ కౌన్సిల్‌లో అధికార, విపక్ష సభ్యులు అరుపులు, కేకలు వేసుకున్నారు. చైర్‌పర్సన్ కేవీ మహాలక్ష్మి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో తొలుత ఆజెండాలోని 45వ అంశమైన దీర్ఘకాల లీజు విషయమై దుమారం రేగింది. విపక్ష సభ్యులు పోడియం వద్దకు దూసుకువెళ్లి సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. దీంతో అధికార పార్టీ సభ్యులు కూడా పోడియం వద్దకు వెళ్లి వారితో వాగ్వివాదానికి దిగారు. అరుపులు, కేకలతో సమావేశం రసాభాసగా మారడంతో చైర్‌పర్సన్ సమావేశాన్ని అర్ధంతరంగా ముగించి వెళ్లడానికి సిద్ధమయ్యారు. కానీ విపక్ష సభ్యులు అమెను అడ్డుకున్నారు. చివరకు అధికార పార్టీ సభ్యుల సహకారంతో తన చాంబర్‌లోకి వెళ్లిపోయారు. చైర్‌పర్సన్ వైఖరిని నిరసిస్తూ విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. అజెండాలో 45వ అంశమైన ఆదినారాయణ మహిళా కళాశాలకు మున్సిపల్ స్థలాన్ని 25 ఏళ్లకు లీజుకు ఇచ్చే అంశం ప్రస్తావనకు రాగానే టీడీపీ ఫ్లోర్ లీడర్ బుద్ద నాగ జగదీశ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కళాశాల యాజమాన్యం 1980లో 25 ఏళ్లకు స్థలాన్ని లీజుకు తీసుకుని ఒక్క ఏడాది కూడా అద్దె చెల్లించలేదని అన్నారు. అటువంటి సంస్థలకు మరో 25 ఏళ్లపాటు లీజుకు ఇవ్వడం చట్ట విరుద్ధమని అన్నారు. లీజుకు తీసుకున్న స్థలంతోపాటు పక్కనే ఉన్న 1,127 చదరపు గజాల స్థలాన్ని కబ్జా చేశారని, కళాశాల నిర్వాహకుడు మాజీమంత్రి కొణతాల రామకృష్ణ బంధువు కావడం వల్లనే నిబంధనలకు నీళ్లొదులుతున్నారని విమర్శించారు. దీనికి అధికార పార్టీ సభ్యులు యల్లపు చంద్రమోహన్, పొలమరశెట్టి మురళీకృష్ణ, మడగల శ్రీనివాసరావు, పెతకంశెట్టి జగన్మోహనరావులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, కబ్జా చేశారని వ్యాఖ్యలు చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. నిరుపేద విద్యార్థుల కోసం స్థలాన్ని కళాశాలకు లీజుకు ఇస్తున్నామే తప్ప ఇందులో వ్యక్తిగత స్వార్థం లేదని అన్నారు. ‘మీ వివరణ మాకు అనవసరం. దీనిపై అధికారులు సమాధానం చెప్పాలి’ అని విపక్ష సభ్యులు నాగ జగదీశ్, రాజాసతీష్, కొణతాల మురళీకృష్ణ, తాకాసి వెంకటేశ్వరరావు, తాడి రామకృష్ణ, గొర్లి సూరిబాబు, అన్నపూర్ణ, రత్నాజీ డిమాండ్ చేస్తూ పోడియం వద్దకు వెళ్లి చైర్‌పర్సన్‌తో వాగ్వివాదానికి దిగారు. దీంతో అధికార పార్టీ సభ్యులు కూడా పోడియం వద్దకు వెళ్లి విపక్ష సభ్యులతో వాదనకు దిగారు. కబ్జా చేసిన స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని 1986లో కోర్టు ఆదేశించిందని గుర్తు చేశారు. అప్పుడు అధికారంలో ఉన్న మీరేం చేశారంటూ అధికార పార్టీ సభ్యులు ఎదురు ప్రశ్న వేశారు. దీంతో ఉభయ పక్షాల సభ్యులు వ్యక్తిగత దూషణలతో తోపులాటకు దిగారు. మెజారిటీ సభ్యుల ఆమోదం మేరకు ఈ అంశాన్ని తీర్మానిస్తున్నట్టు చైర్‌పర్సన్ ప్రకటించడం, అధికారపార్టీ సభ్యులు ఆమోదం తెలపడంతో విపక్ష సభ్యులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పకపోతే కదలనిచ్చేది లేదంటూ చైర్‌పర్సన్‌కు అడ్డుగా బైఠాయించారు. దీంతో ప్రధాన ద్వారం నుంచి కాకుండా మరో ద్వారం నుంచి తన చాంబర్‌కు వెళ్లిపోయారు. విపక్ష సభ్యులు కొంత దూరం ఆమెను అనుసరిస్తూ నినాదాలు చేశారు. అనంతరం కమిషనర్ వెంకటేశ్వరరావు వద్దకు వెళ్లి డిసెంట్ మార్కు చేశారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: