నిలిచిన ఆయుకట్టు ఆధునీకరణ


విశాఖపట్నం: రైవాడ నీరు రైతుల హక్కు అన్నది శాశ్వత నినాదంగా మిగిలిపోతుందేమోననే ఆందోళన ఆయకట్టుదారుల్లో నెలకొంది. ఆ కాలువ ఆధునీకరణ పనులను కాంట్రాక్టర్‌ మధ్యలో నిలిపివేశాడు. దీంతో, చివరి ఆయకట్టు వరకూ సమృద్ధిగా నీటినందిస్తామన్న నాయకుల హామీలు నీటిమూటలయ్యాయి. కాలువ ఆధునీకరణ పనులు పూర్తయితే సాగునీటి సమస్య పరిష్కారమవుతుందని ఆనందించిన రైతుల ఆశలు ఆవిరయ్యాయి. కొండనాలుకకు మందేస్తే ఉన్ననాలుక ఊడిందన్న చందంగా రైవాడ రైతుల పరిస్థితి తయారైంది. నీరు పారలేదు సరికదా పంటలు పండించుకోలేని పరిస్థితి దాపరించిందని ఆయకట్టుదారులు గగ్గోలు పెడుతున్నారు. ఆధునీకరణ పనులు అస్తవ్యస్తంగా జరగడం, మధ్యలో నిల్చిపోవడమే ఇందుకు కారణమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 18 నెలల్లో పూర్తి చేయాల్సిన పనులు మూడేళ్లు కావస్తున్నా 30 శాతం కూడా జరగలేదు. ఆధునీకరణ పేరుతో కాలువల డ్యాములు, మదుములు తొలగించేశారు. దీంతో, నీరు చివరి ఆయకట్టు భూముల వరకూ పారని పరిస్థితి ఏర్పడింది. రైతులే తాత్కాలిక ఏర్పాట్లు చేసుకుని కాలువ నుంచి నీరు మళ్లించుకుంటున్నారు. ఈ ఆయకట్టు పరిధి 15 వేల ఎకరాలు కాగా, మూడు వేల ఎకరాలకు కూడా పుష్కలంగా నీరందని పరిస్థితి ఏర్పడింది. రూ.21.42 కోట్లతో కాలువను ఆధునీకరించేందుకు 2005 మే 20న సాంకేతిక ఆమోదం లభించింది. తక్కువగా కోట్‌ చేసిన రత్నా కన్‌స్ట్రక్షన్‌కు రూ.19.20 కోట్లకు 2007 మార్చి 23న టెండరు ఖరారైంది. 18 నెలల కాలంలో పనులు పూర్తి చేయాలనేది నిబంధన. 67.29 కిలోమీటర్ల పొడవున కాలువ ఆధునీకరణ పనులు జరగాలి. ఇంతవరకూ 18.25 కిలోమీటర్ల పనులు మాత్రమే జరిగాయి. ఇంకా 49.04 కిలోమీటర్ల మేర పనులు జరగాల్సి ఉంది. ఇప్పటి వరకూ ఐదు కోట్లా 11 లక్షల రూపాయిలు ఖర్చయినట్లు అధికారులు చెప్తున్నారు. కాలువలో సిల్ట్‌ పేరుకుపోవడంతో పారుతున్న నీటి పరిమాణం తక్కువగా ఉంది. ఈ కాలువపై తిమిరాం వద్ద ఉన్న డైవర్షన్‌ డ్యాముకు తలుపులు బిగించలేదు. లక్కవరం, బోయిలకింతాడ వద్ద రైతుల నుంచి సేకరించిన భూములకు నష్టపరిహారం పది లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉండగా, ఆరు లక్షలు మాత్రమే ఇస్తానని ప్రభుత్వం చెప్తుండటంతో నిర్వాసితులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: