తుంగా తీరంలో..రాఘవ ఉత్సవ భేరి!


మత్రాలయం: మంచాలమ్మ సన్నిధిలో బృందావనమైన గురురాఘవేంద్రస్వామి 339వ ఆరాధన, సప్తరాత్రోత్సవాల ఘట్టం సోమవారం సాయంత్రం వైభవంగా ప్రారంభమైంది. పీఠాధిపతి సుయతీంద్రతీర్థులు ధ్వజారోహణతో ఏడు రోజులపాటు సాగే ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా రాఘవుడికి నిత్యసేవలు అందించే గజరాజుకు ప్రత్యేక పూజలు చేశారు. హిందువుల ఆరాధ్యమైన గోవులకు పూజ జరిగింది. అనంతరం సేవా కేంద్రం, నగదు కేంద్రాల్లో లక్ష్మీ పూజ నిర్వహించారు. అనంతరం ఆహారధాన్య పూజతో ధ్వజారోహణ ఘట్టాన్ని పూర్తి చేశారు. ఉదయం రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి పంచామృతాభిషేకం అలంకరణ చేశారు. పూర్ణ బోధ మందిరంలో ప్రహ్లాదరాయులు, మూలరాములు పూజలందుకున్నారు.
రాత్రి మఠం ప్రాంగణంలో ప్రహ్లాదరాయులును బంగారు రథంపై వూరేగించారు. ముందుగా చెక్క, వెండి రథాలపై వూరేగించిన తరువాత బంగారు రథంపై స్వామివారు వూరేగారు. శ్రావణ మాసంలో భాగంగా ఉరుకుంద ఈరన్నస్వామి దర్శనానికి వచ్చిన భక్తులు మంత్రాలయానికి రావడంతో రద్దీ కనిపించింది.
25 నుంచి తిరుపతిలో..
తిరుపతి(క్రీడలు), న్యూస్‌టుడే: రాఘవేంద్రస్వామి 339వ ఆరాధన మహోత్సవాలు బుధవారం నుంచి శుక్రవారం వరకు నిర్వహించనున్నట్లు మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం శాఖ మేనేజరు కె.రాఘవేంద్రరావు తెలిపారు. మంగళవారం ఉదయం 6 గంటలకు యజుర్వేద నిత్యనూతన ఉపాకర్మలు, 9 గంటలకు పౌర్ణిమ ప్రయుక్తం సామూహిక సత్యనారాయణ పూజలు, సాయంత్రం 5.30కు గోపూజ, ధ్వజారోహణం, శాకోత్సవం, ధ్యాన పూజలు జరుగుతాయన్నారు.
రోజువారి సాంస్కృతిక కార్యక్రమాల వివరాలు
రాములవారి తూర్పు మాడవీధి శాఖలో మూడు రోజులపాటు రుక్మిణీశ, భారతీశ, తిరుమల రాఘవేంద్ర భజన మండళ్ల ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు జరుగుతాయి. సాయంత్రం 5 గంటలకు వేదపారాయణం, 6 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల ఆధ్వర్యంలో సంగీత విభావరి, రాత్రి 8.30 గంటలకు పల్లకిసేవ, మహామంగళారతి నిర్వహిస్తామన్నారు. 27న ఉదయం 10 గంటలకు ప్రహ్లాదరాజుల భవ్యమైన వూరేగింపు, రథోత్సవం జరుగుతుందన్నారు.
ఆర్‌ఎస్‌ గార్డెన్స్‌ రాఘవేంద్రస్వామి మఠం ఆవరణలో..
మంగళవారం నుంచి నిత్యం సాయంత్రం 4.30 గంటలకు వేదపండితుల ఆధ్వర్యంలో వేదపారాయణం, సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు అన్నమాచార్యుని పాటలు, సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Leave a comment