శ్రీశైల భ్రమరాంబకు కాసుల హారం


శ్రీశైలం: శ్రీశైల భ్రమరాంబాదేవికి తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన వ్యాపారవేత్త వల్లూరి రామన్నచౌదరి, సత్యవతి దంపతులు బంగారు కాసుల హారాన్ని సమర్పించారు. సుమారు 2.75 లక్షల రూపాయల విలువైన ఈ హారాన్ని 145 గ్రాముల బంగారుతో తయారు చేయించినట్లు రామన్న చౌదరి దంపతులు మీడియాకు తెలిపారు.
‘సిరిగిరి మల్లన్న శరణన్న చాలు
పరమ పాతక కోట్లు భస్మమై తూలు..’
.. అన్న నమ్మకం భక్తులది.
‘చేదుకో మల్లయ్య చేదుకోవయ్యా
చేదుకొని మమ్మెల్ల ఏలుకోవయ్యా..’
– అంటూ బారులు తీరి శ్రీశైల మల్లికార్జున దర్శనానికి వెళుతూ ఉంటారు భక్తులు. ‘స్పర్శవేదుల రాశి ప్రత్యక్షకాశి’ అని పేరు పొందింది శ్రీశైలం. కేదారంలో స్నానం చేసినా, కాశీలో మరణించినా పునర్జన్మ ఉండదంటారు. అలాంటిది శ్రీశైల శిఖర దర్శన యాత్రతోనే ముక్తి కలుగుతుందని ప్రతీతి. అందుకే భక్తులు శ్రీశైల యాత్రకు, శిఖర దర్శనానికి ఎన్ని ప్రయాసలకయినా ఓర్చి సిద్ధమవుతుంటారు. ఆధునిక ప్రయాణ సౌకర్యాలు లేని పూర్వకాలంలో శ్రీశైల మల్లికార్జునుని దర్శనానికి కాలి నడకే శరణ్యమయేది. అడవులలో కొండ దారుల గుండా నడిచి వెళ్ళి శ్రీశైలం చేరవలసి వచ్చేది. అయినా ఈ ప్రయాసను లెక్కచేయకుండా శివరాత్రి నాటికి శ్రీశైలం చేరాలనే సంకల్పంతో ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రల నుండి అనేకమంది భక్తులు శ్రీశైల యాత్రకు బయలుదేరేవారు. ఈ రోజులలో శ్రీశైల యాత్ర అంత కష్టమేమీ కాదు. రవాణా సౌకర్యాలు ఉన్నాయి. శ్రీశైల స్వామి దర్శనం, శిఖర సౌందర్యం, శ్రీశైలం నలు పక్కలా పరుచుకొని ఉన్న ప్రకృతి రమణీయత యాత్రికులను అలౌకిక ఆనందంలో ముంచెత్తి వేస్తాయి. వారు భక్తి ప్రపత్తులతో పరవశమవుతాయి. యాత్రికులను ఇంతగా ఆకర్షించే శ్రీశైలం కర్నూలు జిల్లాలో నల్లమల అడవుల మధ్య ఉంది. పరమ పావనమైన కృష్ణా నదీ తీరంలో సముద్ర మట్టానికి 1500 అడుగుల ఎత్తులో ఉంది. శ్రీశైల శిఖరం సముద్ర మట్టానికి 2830 అడుగుల ఎత్తులో ఉంది. శ్రీశైలం దక్షిణ భారతదేశంలో నెలకొని ఉన్న అతి ప్రాచీన శైవక్షేత్రం. శ్రీ శైలాన్ని శ్రీ గిరి. శ్రీ పర్వతం, శ్రీ నగరం అని కూడా పిలుస్తారు. శ్రీశైల శిఖరం మీద మల్లికార్జున స్వామి స్వయం భూ లింగమై వెలిశాడు. భారతదేశంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీశైల మల్లికార్జున లింగం ఒకటి. అలాగే దేశంలో ఉన్న అష్టాదశ మహా శక్తి పీఠాలలో శ్రీశైల భ్రమరాంబికా శక్తి పీఠం రెండవది అంటారు. శ్రీశైల ప్రసక్తి స్కంధ పురాణంలో ఉంది, మహా భారతం వన పర్వంలో ఉంది. శ్రీ రామ చంద్రుడు వనవాస సమయంలో సీతాలక్ష్మణ సమేతుడై శ్రీశైలం వచ్చాడని పురాణకథనం. పాండవులు కూడా శ్రీశైల స్వామిని దర్శించి పూజలు చేశారంటారు. శ్రీశైల ప్రశస్తి బౌద్ధయుగంలో మహాయానానికి పూర్వంనుండీ ప్రచారంలో ఉంది. చైనా యాత్రికులు ఫాహియాన్‌, హుయాన్‌ సాంగ్‌లు తమ పర్యటనానుభవాలలో శ్రీశైలాన్ని గురించి కూడా పేర్కొన్నారు. పూర్వపు రాజులలో చాలా మంది మల్లికార్జున స్వామికి తమవంతు సేవగా యథాశక్తి శ్రీశైల అభివృద్ధికి కృషిచేశారు. శ్రీ కృష్ణ దేవ రాయలు శ్రీశైలాన్ని దర్శించి రథోత్సవం జరిగే వీధిలో ఇరువైపులా ఎన్నో మందిరాలను కట్టించినట్లు చరిత్ర చెపుతోంది. ఛత్రపతి శివాజీ కూడా ఇక్కడో గోపురాన్ని నిర్మించాడు. శ్రీ శంకరాచార్యులు శ్రీశైలంలో ఉండి కొన్నాళ్ళు తపస్సు చేశారంటారు. ఇక్కడే ఆయన ‘భ్రమరాంబాష్టకాన్ని , ‘శివానందలహరి’ ని కూడా రాశారని అంటారు. శ్రీ శైల మల్లికార్జునుడు అందరి దేవుడు. స్వామి గర్భగుడిలోకి జాతి, మత, కుల, లింగ, వయో భేదాలు లేకుండా అందరూ ప్రవేశించి, అర్చించుకోవచ్చు. ఆ కొండ ప్రాంతాలలో నివసించే చెంచు జాతివారు శ్రీ శైల మల్లయ్యను తమ అల్లుడిగాను, భ్రమరాంబను తమ కుమార్తెగాను భావించి పూజిస్తారు. వీరికి స్వామివారి సేవలో ప్రత్యేక ప్రాతినిధ్యం ఉంది. ఇప్పటికీ శివరాత్రి ఉత్సవాలలో స్వామి రథం లాగేది చెంచు జాతి ప్రజలే. వీరు స్వామిని ‘చెంచు మల్లయ్య’ అని కూడా పిలుస్తారు. శ్రీశైల మల్లికార్జున స్వామి ఆవిర్భావాన్ని గురించి స్కంధపురాణంలో ఒక కథ ఉంది. పూర్వం శిలాదుడనే మహర్షి శివుణ్ణి గురించి తపస్సు చేసి, వర ప్రసాదంగా నందీశ్వరుడు, పర్వతుడనే ఇద్దరు కుమారులను పొందాడు. పర్వతుడు కూడా శివుణ్ణి గురించి తపస్సు చేసి, సాక్షాత్కరింప జేసుకున్నాడు. ”స్వామీ! నన్నిలా ఉన్న రీతిగానే ఒక కొండగా చేసి ఆ పర్వత శిఖరం పై దివ్య లింగాకారంలో నువ్వు నివసించు” అని కోరుకున్నాడు. ఆ ప్రకారమే శివుడు అనుగ్రహించాడు. పర్వతుడు ఒక శైలంగా మారిపోయాడు. దానిపై పరమశివుడు స్వయంభూలింగాకారమై వెలిశాడు. ప్రమధగణాలంతా శ్రీశైలానికి చేరుకున్నారు. అంతా వెళ్లి పోయిన తరువాత నేనొక్కదాన్నే ఇక్కడెందుకు అని పార్వతి కూడా వెండికొండ వదలి భ్రమరాంబికా రూపంలో శ్రీశైలమే తన నివాస స్థానంగా చేసుకొంది. వీరందరి రాకతో శ్రీశైలం ప్రత్యక్ష కైలాసమే అయిపోయి భక్తుల పాలిట కల్పతరువుగా మారిపోయింది. శ్రీశైల స్వామికి మల్లికార్జునుడని, అమ్మవారికి భ్రమరాంబ అనీ పేర్లు రావటానికి వెనుక మరి రెండు పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. పూర్వం చంద్ర వంశ రాజు చంద్రగుప్తుడి కుమార్తె చంద్రవతి శివ భక్తురాలు. ఆమె ప్రతి రోజూ స్వామిని సేవిస్తూండేది. చంద్రవతి భక్తికి మెచ్చి ఈశ్వరుడు పార్వతీ సమేతుడై ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకోమంటాడు. దానికి చంద్రవతి ”స్వామీ! ఇప్పుడు నేను మీ శిరస్సున ఉంచిన మల్లెపూల దండ ఎన్నటికీ వాడకుండా అలాగే ఉండేటట్లు వరం ఇవ్వు” అని అడుగుతుంది. దానికి స్వామి సరేనని ఆ మల్లెపూల దండను తన జటాజూటంలో గంగమ్మకు నెల వంకకు మధ్య ధరిస్తాడు. అప్పటి నుంచే ఆయన ”మల్లికార్జునుడు ” అయ్యాడు. అరుణాసురుడు అనే రాక్షసుడు తన దుశ్చేష్టలతో సాధు జనాన్ని హింసిస్తూ ఉంటే దేవి సహించలేకపోతుంది. శక్తి స్వరూపిణి అయి భ్రమర రూపం దాల్చి ఝంకారం చేస్తూ అరుణాసురునితో తలపడి అతన్ని సంహరించిందట. అప్పటి నుంచీ ఆమెను భ్రమరాంబగా వ్యవహరిస్తూ ప్రజలు కొలుస్తున్నారంటారు. ఈ నాటికీ దేవి గర్భగుడి వెనుక గోడ కున్న రంధ్రం నుంచి తుమ్మెద ఝంకారం వినిపిస్తూనే ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు. శ్రీ శైల క్షేత్రానికి నాలుగు ద్వారాలు, ఎనిమిది శిఖరాలు, పదహారు గవాక్షాలు ఉన్నాయి. శ్రీశైల ఆలయంలో ఉన్న ప్రాకార శిల్పాలు చాలా అందంగా ఉంటాయి. శివుని భిక్షాటన, గౌరీ కల్యాణం, కిరాతార్జునీయం మొదలైన శివ గాథలను మనోహర శిల్పాలుగా తీర్చిదిద్దారు అలనాటి కళాకారులు. ఆలయంలో ఉన్న నటరాజస్వామి కంచు విగ్రహం మరో అపూర్వ కళాఖండం. శ్రీశైలంలో చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అక్కడ గల సాక్షిగణపతి ఆలయం దాటిన వెంటనే హటకేశ్వరం వస్తుంది. ఇక్కడ ఆగస్త్య మహర్షి తపస్సు చేశాడంటారు. ముకుందాశ్రమం, హటకేశ్వర నైమిశారణ్యం అనే పేర్లు గల రెండు ఆశ్రమాలు ఇక్కడ కనబడతాయి. వీటికి సమీపంలో తూర్పు వైపున పాలధార, పంచధారలు ఉన్నాయి. ఒక కొండ లోపలి నుంచి రెండు నీటి ధారలు జాలు వారుతూ ఉంటాయి. వీటినే పాలధార, పంచధారలంటారు. ఈ ప్రదేశంలో ఆదిశంకరులు తపస్సు చేశారని ప్రతీతి. ఇవన్నీ చూసుకొని కొండమీద మరి కొంత దూరం ముందుకు వెళితే సముద్ర మట్టానికి 2830 అడుగుల ఎత్తున ఉన్న శ్రీశైల శిఖర దర్శనం లభిస్తుంది. ఇక్కడ ఉండే నందీశ్వరుని రెండు కొమ్ముల మధ్య నుంచి దూరంగా కనిపించే మల్లికార్జున దేవాలయ కలశాన్ని చూడగలిగిన వారికి పునర్జన్మ ఉండదని భక్తుల నమ్మకం. శ్రీశైలం ప్రాజెక్టు కూడా తప్పక చూడవలసిందే. బ్రహ్మగిరి, విష్ణుగిరి కొండల మధ్య ఉరుకులు పరుగులు పెడుతున్న కృష్ణవేణమ్మకు అడ్డు కట్టవేయగా రూపొందిందే శ్రీశైలం ప్రాజెక్టు. ఇక్కడి నుంచి బస్సులో మరింత కిందకి వెళితే పాతాళగంగ స్నాన ఘట్టం ఎదురవుతుంది. ఇవన్నీ ఒక ఎత్తయితే నాగార్జున సాగర్‌- శ్రీశైలం అభయారణ్యం ఒక్కటీ ఒక ఎత్తు. కృష్ణానదికి రెండు వైపులా 3568 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది ఈ అరణ్యం. ఇది ఖనిజ సంపదకు, వృక్షసంపదకు నిలయం. ఔషధాలకు పనికి వచ్చే వన మూలికలు కూడా ఇక్కడ విస్తారంగా లభిస్తాయి. ఇక్కడి వన్య ప్రాణులను కాపాడటానికి ఈ ప్రాంతాన్ని వన్య ప్రాణి అభయారణ్యంగా ప్రభుత్వం ప్రకటించింది. పరమేశ్వరుని దర్శనం చేసుకోవాలని కాంక్షించే భక్తులూ, ప్రకృతి సౌందర్యాన్ని చూసి పులకించిపోవాలనుకునేవారూ తప్పక దర్శించవలసిన క్షేత్రం శ్రీశైలం.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: