వరంగల్‌ నిట్‌ డైరెక్టర్‌ వైవీఆర్‌పై వేటు


హైదరాబాద్: వరంగల్‌ జాతీయ సాంకేతిక విద్యాసంస్థ(నిట్‌) నిధుల దుర్వినియోగ వ్యవహారం పూర్తి స్థాయిలో రాజుకుంది. అధికారుల మధ్య నెలకొన్న అంతర్గత కలహాల నేపథ్యంలో వెలుగుచూసిన అక్రమాలపై కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ తీవ్రంగానే స్పందించింది. నిట్ సంచాలకునిపై సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. వైవిఆర్ నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ప్రవేశాల్లో అక్రమాలు, సిబ్బందిని వేధించడం, అవినీతి తదితర ఆరోపణలు నిట్‌ డైరెక్టర్‌పై ఆరోపణలు వెలువెత్తాయి. ఆయనపై వచ్చిన ఆరోపణలు తమ విచారణలో రుజువుకావడంతో వైవీ రావుపై సస్పెన్షన్‌ వేటు వేసినట్లు కేంద్ర మానవవనరుల శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. నిట్‌ డైరెక్టర్‌పై సస్పెన్షన్‌ వేటు వేయడం దేశంలో ఇదే తొలిసారి. నిట్‌లో కోట్లాది రూపాయల పనులు ఎలాంటి పరిపాలనా, ఆర్థిక పరమైన అనుమతులు లేకుండానే జరిగిపోయాయి. నిట్‌ ప్రవేశాల్లో 27 శాతం బీసీల రిజ ర్వేషన్‌ అమలు చేస్తానని చెప్పడంతో డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ హాస్టల్‌ ఫండ్‌ కింద 200 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులను నియమ, నిబంధనలకు విరుద్ధంగా వెచ్చించారు. కోట్లాది రూపాయల నిధులున్నా హాస్టళ్లలో నాసిరకపు భోజనంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. తాగు నీరు లేక విలవిల్లాడుతున్నారు. నిట్‌ డైరెక్టర్‌గా వ్యవహ రించిన ప్రొఫెసర్‌ యడ్లపూడి వెంకటేశ్వర్‌రావు (వైవి రావు) యధేచ్ఛగా అవినీతికి పాల్పడినట్లు లిఖితపూర్వక ఫిర్యాదులు వచ్చాయి. నిట్‌ ఉద్యోగులు సదరు వ్యవహారాలపై ఎన్ని ఫిర్యాదులు చేసినా మానవ వనరుల మంత్రిత్వ శాఖ పట్టించుకోకపోవడం, వైవి రావు లాబీయింగ్‌ ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చన్న విమర్శలూ ఎదురయ్యాయి. కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్న దగ్గుబాటి పురంధరేశ్వరీ రాష్ట్రానికి చెందిన వారైనా, వరంగల్‌ నిట్‌లో జరుగుతున్న వ్యవహారాన్నిపట్టించుకోకపోవడం విమర్శలకు తావిచ్చింది. ప్రభుత్వాలు గొప్పగా చెప్పుకుంటున్న సమాచార హక్కు చట్టం అమలును సైతం వైవి రావు ఖాతరుచేయకపోవడం గమనార్హం. కాజీపేటకు చెందిన నజీర్‌ అహ్మద్‌ నిట్‌లో జరుగుతున్న నిర్మాణపనులకు సంబంధించి వివరాలు కోరినా, సకాలంలో ఇవ్వకపోవడం వివాదాస్పదంగా మారింది. కర్నాటక రీజనల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో మైనింగ్‌ డిపార్ట్‌ మెంట్‌లో పనిచేసిన వైవి రావు తన సహచర ప్రొఫెసర్‌ కుమారుడైన టాప్‌ ర్యాంకర్‌ను తండ్రి మీద కోపంతో ఫెయిల్‌ చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంపై వేసిన విచారణ కమిటీ వైవి రావును తప్పు పట్టడమే కాకుండా, ప్రిన్సిపాల్‌, డీన్‌, ఎగ్జామినేషన్స్‌, ఛీఫ్‌ వార్డెన్‌ తదితర పాలనాపరమైన పదవుల్లో వైవి రావును నియమించవద్దని బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌కు నివేదించింది. ఈ మేరకు నిర్ణయం సైతం జరిగింది. అలాంటి బోర్డుతోనే ఆ సిఫార్సులను ఎత్తివేయించి మరీ వరంగల్‌ నిట్‌ డైరెక్టర్‌గా వైవి రావు నియమితులయ్యారంటే.. ఆయన లాబీయింగ్‌ ఎంత బలమైందో అర్ధం చేసుకోవచ్చు. ఎఐసిసి నేతలు, మానవ వనరుల అభివృద్ధి శాఖలో అధికారులు ఆయన వెనుక ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే వరంగల్‌ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో అవినీతి రాజ్యమేలుతోంది. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వైవి రావు వ్యవహరించారు. నిట్‌ క్యాంపస్‌లో 200కోట్ల రూపాయల పనులకు ఎలాంటి పరిపాలనాపరమైన అనుమతులు లేకపోవడం, ఆర్థికపరమైన అనుమతులు లేకపోవడం విస్మయం కలిగిస్తోంది. నియమ, నిబంధనల ప్రకారం టెండర్‌లలో 5 శాతం ఎక్సెస్‌ రేట్స్‌ కంటే అధికంగా పోకూడదు. అలాంటిది కోట్లాది రూపాయలతో చేపట్టిన హాస్టళ్ల భవన నిర్మాణపు పనులను 8.5 శాతం ఎక్సెస్‌తో సైతం పనులను అప్పగించారు. ఈ నిర్మాణపు పనుల్లోనూ అవినీతి రాజ్యమేలుతోంది. నాణ్యతకు స్వస్తి పలికి కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యం పనులను అత్యంత వేగంగా చేసుకు పోతున్నారు. ఈ నిర్మాణపు పనుల్లో నాణ్యత ప్రమాణాలను పరిశీలించాల్సిన ప్రాజెక్టు ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌ను వైవిరావు డమ్మీగా మార్చేశారు. ఈ డిపార్ట్‌మెంట్‌ చేయాల్సిన పనులను ప్రైవేట్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ (పిఎంసి)తో చేయిస్తున్నారు. ఈ సంస్థ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంది. ఎలాంటి నాణ్యతా ప్రమాణాలను పరిశీలించకుండానే ఈ సంస్థ బిల్లులు పాస్‌ చేయడం, నిధులను డ్రా చేయించడం జరిగిపోతోంది. ఇప్పటివరకు ఈ పనులకు సంబంధించిన యుటిలైజేషన్‌ సర్టిఫికేట్‌లను సైతం బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌క గాని, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు గాని సమర్పించకపోవడం గమనార్హం. డైరెక్టర్‌ అవినీతి, అక్రమాలను ప్రశ్నించిన ఉద్యోగులను వేధింపులకు గురిచేశారు. ఇంక్రిమెంట్ల కోత పెట్టడంతోపాటు ఇతర డిపార్ట్‌మెంట్లకు బదిలీ చేశారు. నిట్‌ ప్రవేశాల్లో 27 శాతం బిసి రిజర్వేషన్లను అమలు చేయాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆదేశించి నపుడు తు.చ తప్పకుండా అమలు చేస్తామని ఇందుకు గాను డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ హాస్టల్‌ ఫండ్‌ నిధులు మంజూరు చేయాలని వైవి రావు గతంలో కోరారు. దీంతో 200 కోట్ల రూపాయలను వరంగల్‌ నిట్‌కు మంజూరు చేశారు. హాస్టళ్ల భవన నిర్మాణాలు జరిగినా, అందులో తాగునీటిని సరఫరా చేయడం లేదు. దీంతో విద్యార్థులు తీవ్ర వ్యయ, ప్రయా సాలకు గురవుతున్నారు. 27 శాతం బిసి రిజర్వేషన్లను అమలు చేసినా, ఈ రిజర్వేషన్ల నెపంతో పొందిన నిధులతో తాగు నీటి వసతిని కల్పించడంలో వైవి రావు విఫలమయ్యారు. నిట్‌ ఆవరణలో ల్యాండ్‌ స్కేపింగ్‌ పనులను దక్కించుకున్న వెనిర్మా కంపెనీ 1.50 కోట్ల రూపాయల అంచనా లతో రూపొందించిన సబ్‌స్టేషన్‌ పనులను కూడా చేపట్టింది. రాత్రి, పగలూ ఈ సబ్‌స్టేషన్‌ నిర్మాణపు పనులు సాగాయి. ఒకవైపు వైవి రావు నిర్మాణపు పనుల్లో అవినీతికి, అక్రమాలకు పాల్పడ్డట్లు సర్వత్రా విమర్శలు వ్యక్తంకావడం, సంబంధిత మంత్రిత్వ శాఖ ఆయన్ను సెలవుపై వెళ్లమని ఆదేశించిన నేపథ్యంలో ఈ సబ్‌స్టేషన్‌ నిర్మాణపు పనులను ముమ్మరం చేశారు. నిట్‌లో సివిల్‌ పనులను పర్యవేక్షించే బాధ్యత ప్రాజెక్టు అండ్‌ ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌దే. ఈ డిపార్ట్‌మెంట్‌ను వైవి రావు డమ్మీగా మార్చేశారు. ప్రైవేట్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ (పీఎంసీ) ప్రవేశపెట్టి పిఇని నిర్వీర్యం చేశారు. భారీ నిర్మాణపు పనులను ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించినా, వాటి అంచనాలు, డిజైన్‌లను పీఈ డిపార్ట్‌మెంట్‌నే పర్య వేక్షించాల్సింది. క్వాలిటీని సైతం ఈ డిపార్ట్‌మెంటే స్వయంగా పరిశీలించాల్సి ఉంది. ఆ కాంట్రాక్టర్ల బిల్లులను సైతం స్వయంగా పరిశీలించి పాస్‌ చేసే బాధ్యత పిఇదే కాగా, వైవిరావు నియమ, నిబంధనలకు విరుద్ధంగా (పీఎంసీ) బిల్లులను పాస్‌ చేస్తే ఫ్యాకల్టీ ఇన్‌ఛార్జి సంత కాలు చేసి నేరుగా అక్కౌంట్‌ సెక్షన్‌ నుండి నిధులను డ్రా చేస్తున్నారు. పీఈ ఉన్న నిట్‌లలో ప్రైవేట్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ (పిఎంసి)ని పెట్టుకోవద్దని సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) ఆదేశాలున్నాయి. అయినా ఇందుకు భిన్నంగా వైవి యధేచ్ఛగా నియమ, నిబంధనలను సివిసి ఆదేశాలను భేఖాతర్‌ చేసి ఇష్టారాజ్యంగా నిధులను దుర్వినియోగం చేశారు. వరంగల్‌ నిట్‌లో నిధుల దుర్వినియోగం, అవినీతి, అక్రమాలపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి సీరియస్‌గా స్పందించకపోవడం సందేహాలకు తావిచ్చింది. వివాదాస్పదుడిగా మారిన ప్రొఫెసర్‌ వైవిరావు, మంత్రి పురంధరేశ్వరి అండ ఉందన్న ప్రచారం కూడా జరిగింది. నిట్‌లో ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులు డైరెక్టర్‌ అక్రమాలపై ఆందోళన కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా ఢిల్లీకి వెళ్లి ఎంపిలు, మానవ వనరుల అభివృద్ధి శాఖ అధికారులను కలిసి వాస్తవాలను వివరించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. వరంగల్‌ నిట్‌ చరిత్రలో విద్యార్థులు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమించడం ఇదే ప్రథమం. ఈ నేపథ్యలోనే వైవిఆర్ సస్పెన్షన్ జరిగినట్లు భావిస్తున్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: