ప్రత్యేక రైళ్లలో బెర్తులు ఖాళీ


హైదరాబాద్‌: వివిధ మార్గాల్లో నడుస్తున్న ప్రత్యేక రైళ్లల్లో బెర్తులు ఖాళీలున్నాయని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో చంద్రిమారాయ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రైళ్లకు అన్ని రిజర్వేషన్‌ కేంద్రాల్లో అడ్వాన్స్‌ టికెట్లు లభిస్తాయని ఆమె తెలిపారు. జంట నగరాల నుంచి చెన్నై, జైపూర్‌, అజ్మీర్‌, గుంటూరు, కాకినాడ, కొల్లాం, బెంగళూరు ప్రాంతాలకు, నాగర్‌సోల్‌-నర్సాపూర్‌, తిరుపతి-నాందేడ్‌, నిజామాబాద్‌-విశాఖపట్నం మార్గాల్లో నడిచే ప్రత్యేక రైళ్లల్లో ఈ ఖాళీలు ఉన్నట్లు ఆమె వివరించారు. మరిన్ని వివరాలకు 139 నెంబర్లో లేదా http://www.scrailway.gov.in వెబ్‌సైట్లో సంప్రదించవచ్చు. ఒకపక్క ఇలా ప్రత్యేక రైళ్లలో బెర్తులు భర్తీకాక ఖాళీగా వెళ్లే పరిస్థితి నెలకొని ఉంటుంటే… మరోపక్క ప్రస్తుతం నడుస్తున్న రైళ్లలో మాత్రం నిరీక్షణ జాబితా చాంతాడులా పెరిగిపోతూనే ఉంది. తత్కాల్ సీట్ల లభ్యత కూడా అంతంత మాత్రంగానే ఉంటుండడంతో ప్రయాణీకులకు ఇబ్బందులు తప్పడం లేదు. తత్కాల్‌ విధానంలో అదనపు సొమ్ము చెల్లించి బెర్తుల్ని తీసుకునేందుకుగానూ రిజర్వేషన్‌ వ్యవస్థ ఉదయం ఎనిమిది గంటలకు మొదలవుతుందంటే ముందురోజు రాత్రి నుంచీ ప్రయాణికులు క్యూ కడుతున్నారు! గిరాకీ తారస్థాయిలో ఉండడంతో ఒకటిరెండు నిమిషాల్లోనే బెర్తులన్నీ నిండిపోతున్నాయి. దీంతో ఆ రెండు నిమిషాల వ్యవధిలోనే తమకు అవకాశం వచ్చేలా చూసుకునేందుకు ప్రయాణికులు పడుతున్న తాపత్రయం అంతాఇంతా కాదు. రాత్రంతా జాగారం చేసే ఓపిక లేనివారు మరింత ఎక్కువ సొమ్ము ముట్టజెప్పి, ఆ బాధ్యతను దళారులకు అప్పగిస్తున్నారు. ఈ సీజన్లో గణనీయంగా కనిపించే రద్దీ దృష్ట్యా అదనపు రైళ్లను నడపాలంటూ చాలా ముందు నుంచీ ప్రయాణికులు మొత్తుకుంటున్నా తూర్పుకోస్తా రైల్వే దానిని చెవికెక్కించుకోలేదు. అటు దక్షిణమధ్య రైల్వే కూడా అరకొరగానే సరిపెట్టేసింది. దీంతో ప్రయాణికులు నరకం చూస్తున్నారు. నిరీక్షణ జాబితాలో ఉన్నవారికి బెర్తులు ఖాయం కావడం గగనమవుతోంది. ఆఖరికి తత్కాల్‌ వెయిటింగ్‌లిస్టులో అయిదు లోపు స్థానాల్లో ఉన్నవారికి కూడా కొన్ని రైళ్లలో బెర్తులు ఖాయడం కావడం లేదు. ఈ పరిస్థితుల్లో అదనపు కోచ్‌లు, అదనపు బళ్లు వేయడంపై దృష్టి సారించాల్సిన తూర్పుకోస్తా రైల్వే నిమ్మకు నీరెత్తినట్లు మిన్నకుంది. దీంతో ప్రయాణికులు పడరాని కష్టాలు పడుతున్నారు. తత్కాల్‌ కోటా కింద బెర్తుల్ని ప్రయాణపు తేదీకి రెండు రోజులు ముందుగా తీసుకునే వీలుంది. ఉదాహరణకు 10వ తేదీన ప్రయాణం కోసం బెర్తులు తీసుకోవాలంటే 8వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాధ్యమవుతుంది. గతంలో ఈ బెర్తుల్ని తీసుకోగోరేవారు ఉదయం ఒకటిరెండు గంటల ముందు వచ్చి క్యూలో నిల్చొనేవారు. వేసవి రద్దీలో రైళ్లన్నీ కిటకిటలాడుతుండడంతో గత కొద్దిరోజులుగా ముందురోజు రాత్రి నుంచీ క్యూ కడుతున్నారు. రాత్రి 11-12 గంటల సమయం నుంచి ఇది మొదలవుతోంది. ఉదయం 7.30 గంటల తర్వాత రిజర్వేషన్‌ కేంద్రం తాళాలు తీయగానే అదే వరసలో టోకెన్‌ కౌంటర్‌ వద్దకు వెళ్లి అక్కడ నిరీక్షిస్తున్నారు. ఇంతా తంటాలు పడితే చాలా రైళ్లకు రెండు నిమిషాల్లోపే టికెట్లు హుష్‌కాకి అయిపోతున్నాయి. దేశంలో ఏ రిజర్వేషన్‌ కేంద్రం నుంచైనా ఎవరైనా ఏ టికెట్‌నైనా తీసుకునేందుకు ఉన్న వెసులుబాటు దీనికి కారణం. భారతీయ రైల్వే ఆహార, విహార సంస్థ (ఐ.ఆర్‌.సి.టి.సి.) వెబ్‌సైట్‌ http://www.irctc.co.inద్వారానూ టికెట్లను బుక్‌ చేసుకునే అవకాశం ఉన్నా దేశవ్యాప్తంగా అనేక వేల మంది ఒకేసారి ప్రయత్నిస్తుండడం వల్ల ఉదయం 8-8.30 గంటల మధ్య ఆ సైట్‌ లభ్యం కావడం కష్టమే. దీంతో ఎక్కువమంది రైల్వే రిజర్వేషన్‌ కేంద్రాలకు రాక తప్పడం లేదు. దీంతో అక్కడ తాకిడి పెరిగిపోతోంది. దాని ఫలితంగానే ముందురోజు అర్థరాత్రి నుంచీ పడిగాపులు. ఆయా కేంద్రాల వెలుపల కూర్చొనేందుకు కూడా తగిన ఏర్పాట్లు లేకపోయినా నానా అవస్థలు పడుతూ అక్కడే పడి ఉంటున్నారు. ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా వందల సంఖ్యలో రైళ్లను ద.మ. రైల్వే వేస్తుంటే తూర్పుకోస్తా రైల్వే మాత్రం ఒక్కో పెట్టెను జతచేయడానికే కళ్లు తేలుస్తోంది. విశాఖ-ముంబాయి, విశాఖ-షిర్డీ రైళ్లకు మాత్రం ఇటీవల ఒక్కో స్లీపర్‌ పెట్టెను జత చేశారు. అవీ వెంటనే నిండిపోతున్నాయి.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: