అవినీతి ఉచ్చులో వైవీఆర్!?


వరంగల్‌: వివాదానికి కేంద్ర బిందువుగా మారిన వరంగల్‌ జాతీయ సాంకేతిక విద్యాలయం (నిట్‌) మాజీ డైరెక్టర్‌ వై.వెంకటేశ్వరరావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఐదేళ్లకు పైగా నిట్‌కు వైవీ రావు డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన కాలంలో జరిగిన అక్రమాలపై మూడు కమిటీలు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.. వీటిపై ప్రాథమిక విచారణ నివేదిక అందడంతో కేంద్ర మానవ వనరులు, అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఆర్డీ)లో కదలిక వచ్చింది. విచారణ కమిటీలకు అందిన ఫిర్యాదులు, వచ్చిన ఆరోపణలు, నివేదికల్లో పొందుపర్చిన అంశాలపై ఆగస్టు నాలుగో తేదీలోగా వివరణ ఇవ్వాల్సిందిగా ప్రొఫెసర్‌ వైవీ రావుకు ఎంహెచ్‌ఆర్డీ ఆదేశించింది. దీంతో బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ (బీవోజీ) ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ బి.ఎల్‌.దీక్షితులు రావుకు లేఖ రాశారు. గడువు ముగిసిన తర్వాత ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. వరంగల్‌ నిట్‌ పరిధిలో సివిల్‌ పనులు, పరిపాలన, అడ్మిషన్స్‌, రిక్రూట్‌మెంట్లు, ఆర్థిక సంబంధిత విషయాల్లో జరిగిన అక్రమాలపై సుమారు 75 ఫిర్యాదులు అందాయి. వీటిపై మూడు కమిటీలతో విచారణ జరిపించాలని గత మార్చి 26న ఢిల్లీలో జరిగిన ఎంహెచ్‌ఆర్డీ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నెన్స్‌ సమావేశంలో తీర్మానించారు. ఈ కమిటీలు పలుమార్లు నిట్‌ను సందర్శించి రికార్డులను, సివిల్‌ పనులను పరిశీలించాయి. ఫిర్యాదుదారులతో మాట్లాడాయి. ఈ ప్రాథమిక విచారణ కమిటీలు తమ తుది నివేదికలను నిట్‌ పాలకమండలికి సమర్పించాయి. ఈ నేపథ్యంలోనే మూడు కమిటీలు ఇచ్చిన నివేదికల్లో గుర్తించిన అంశాలపై రాతపూర్వకంగా వివరణ ఇవ్వాల్సిందిగా.. ప్రొఫెసర్‌ వైవీ రావుకు బీవోజీ ఛైర్మన్‌ దీక్షితులు శుక్రవారం లేఖ రాశారు. వైవీ రావు నుంచి రాతపూర్వకంగా వివరణ కోరిన నేపథ్యంలో.. వైవీ రావుపై చర్యలు తీసుకునేందుకు నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. అందుకే వివరణ ఇవ్వాల్సిందిగా కాస్త సమయం ఇచ్చినట్టు నిపుణులు భావిస్తున్నారు. అయితే ప్రాథమిక విచారణ కమిటీలు నిర్ధరించిన అవకతవకలపై మరోసారి పూర్తిస్థాయిలో విచారణ చేయిస్తారని తెలుస్తోంది. ఆపై ఆరోపణలు చేసిన వ్యక్తి ఇచ్చిన వివరణలను పోల్చి చూసుకుని ఎంహెచ్‌ఆర్డీ స్థాయిలో చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరో పక్క నిట్‌లో ముగ్గురు డైరెక్లర్లు తెరపైకి రావడంతో సిబ్బంది, అధికారుల్లో అయోమయం నెలకొంది. ఎవరి ఆదేశాలు పాటించాలో తెలియడం లేదు. ఎవరి సంతకాలు తీసుకుంటే.. చెల్లుబాటవుతాయనేది తేలడం లేదు. దీంతో ఫైళ్లు పేరుకుపోతున్నాయి. ముగ్గురు డైరెక్టర్లలో వ్యవహారంపై నిట్‌ ఛైర్మన్‌, బోర్డు ఆఫ్‌ గవర్నర్స్‌, డైరెక్టర్‌లకు ఉన్న పరిమితులు, అధికారుల విషయంలో అవగాహన లోపమే ప్రస్తుత సమస్యకు కారణంగా తెలుస్తుంది. బోర్డు ఆఫ్‌ గవర్నర్స్‌ (బీవోజీ)లో నిట్‌ ఛైర్మన్‌, డైరెక్టర్‌తో పాటు 8 మంది సభ్యులుంటారు. ఎన్‌ఐటీలు ఏర్పాటు కాకముందు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో రీజినల్‌ ఇంజినీరింగ్‌ కళాశాల (ఆర్‌ఈసీ)లు ఉన్నప్పుడు డైరెక్టర్‌ పదవి లేకపోవడంతో ఛైర్మన్‌ బోర్డు ఆఫ్‌ గవర్నర్స్‌కు పూర్తి అధికారాలు ఉండేవి. ఆర్‌ఈసీలను ఎన్‌ఐటీలుగా మార్చాక డైరెక్టర్‌ను కేబినెట్‌ ఎంపిక చేసి నిట్‌ ఛైర్మన్‌ ద్వారా నియామక ఉత్తర్వులు ఇస్తున్నారు. దీంతో ఛైర్మన్‌, డైరెక్టర్‌ల మధ్య సమన్వయ లోపం తలెత్తుతోంది. దీంతో పలు సమస్యలతో ఎన్‌ఐటీలు సతమతమవుతున్నాయి. దేశంలో మొత్తం ఎన్‌ఐటీల పాలన, ఆర్థిక వ్యవహారాలన్నింటిని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ(ఎంహెచ్‌ఆర్డీ) చూస్తుంది. ఏ నిట్‌కైనా ఎంహెచ్‌ఆర్డీ తన ఆదేశాలను ఛైర్మన్‌ల ద్వారా డైరెక్టర్లకుకు అందిస్తుంది. వీటి ఆధారంగానే నిట్‌ల పాలన కొనసాగుతోంది. డైరెక్టర్లను కేబినెట్‌ నియమించటంతో వీరు సెంట్రల్‌ కేడర్‌ సర్వీసు (సీసీఎస్‌) ఉద్యోగులుగా పరిగణిస్తున్నారు. కాబట్టి, డైరెక్టర్‌పై ఆరోపణలు వచ్చినప్పుడు సాంకేతికంగా అనేక దశలలో విచారణ చేపట్టాల్సి ఉంటోంది. తర్వాతే.. ఎలాంటి చర్యలనైనా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం వరంగల్‌ నిట్‌ డైరెక్టర్‌ వైవీ రావు ఇదే సంక్షోభం ఎదుర్కోవడంతో తనపై ఆరోపణలు వచ్చిన దృష్ట్యా నాగపూర్‌ నిట్‌ డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌.గోఖేలేకు అదనపు బాధ్యతలు అప్పగించారు. సమయాభావం, దూరంగా ఉండటంతో ఇన్‌ఛార్జి డైరెక్టర్‌గా వి.రామారావు కొనసాగుతున్నారు. ఈ దశలో ఎవరి ఆదేశాలు పాటించాలనేది ఇబ్బందులను సృష్టిస్తోంది. అధికారికంగా వైవీ రావు గురించి ఎలాంటి లేఖ అందకపోవడంతో రిజిస్ట్రార్‌ ఎలాంటి రికార్డులను డైరెక్టర్‌ ఛాంబర్‌కు పంపించడంలేదు. పోనీ అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తోన్న నాగ్‌పూర్‌కు చెందిన ప్రొఫెసర్‌ గోఖలే ఇక్కడికి రావడం లేదు. ఉన్న ఇంఛార్జీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ రామారావుకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. దీంతో ముగ్గురు డైరెక్టర్‌లతో నిట్‌లో పాలన నలుగుతోంది. ఇలా ఎన్ని రోజులు కొనసాగుతుందోనని అధికార, అనధికార వర్గాలు గందరగోళానికి గురవుతున్నాయి. విద్యార్థులు ఎవరికి చెప్పుకుంటే.. సమస్య పరిష్కారం అవుతుందనేది తేలియక సతమతమవుతున్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: