పట్టుదల ఉంటే కానిది లేదు…


గొప్ప లక్ష్యాన్ని సాధించాలని ప్రయత్నించి విఫలం కావడం నేరం కాదు, గొప్ప లక్ష్యం లేకపోవడం నేరం. ప్రణాళికాబద్ధంగా పనిచేసేవాడు జీవితంలో అనేక విజయాలు సాధిస్తాడు. ఒక మంచి లక్ష్యాన్ని ఏర్పరుచుకుని దానిని సాధించటానికి ఎంతో కృషి చేయాలి. కృషి ఉంటే మనుషులు కూడా ఋషులవుతారు. కృషి చేయనివాడే సోమరుడై గుర్తింపు లేకుండా మిగిలిపోతాడు. ప్రయత్నించేవారు విజయం లేదా పరాజయం పొందుతాడు కాని ప్రయత్నించనివారు తప్పకుండ పరాజయాన్ని చవిచూస్తారు. నిరంతర సాధన, విషయపరిజ్ఞానం, నేర్చుకోవాలన్న తపన, శ్రమ ఉంటే దేనిలోనయినా రాణించగలరు. మనం అందరికంటే భిన్నంగా, గొప్పగా ఉండాలనుకుంటాం. ఇతరుల కంటే ఎక్కువ పేరు తెచ్చుకోవాలని ఉంటుంది. అందరికంటే ఎక్కువగా సంపాదించాలని ఉంటుంది. అలాంటప్పుడు మనం ఇతరులకంటే ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది. ఎంతో త్యాగం చేయవలసి ఉంటుంది. బద్ధకంలో దారిద్ర్యం ఉంది. కృషిలో ఐశ్వర్యం ఉంది. సర్వ శక్తులను కూడదీసుకొని మన ఆదర్శంపై, ఆశయంపై మనస్సును లగ్నం చేయవలసి ఉంటుంది. నిరంతర కఠోర శ్రమ, అంకిత భావం, ద్రుఢచిత్తం మన యొక్క స్థానాన్ని అగ్రభాగాన నిలబెట్టేలా చేస్తుంది. ఏ లక్ష్యమూ కూడా అందుకోలేనంత దూరమైనది కాదు. మనపై మనకున్న నమ్మకం కంటే ఏ శక్తీ అగ్రశక్తి కాదు. ముందుగా లక్ష్యాన్ని నిలుపుకొని, దానిని సాధించడానికి ప్రయత్నాలు చేస్తే మనిషి సాధించలేనిది ఏమీ లేదు. మొదటగా లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. దానిని ఎలా సాధించుకోవాలో ఒక ప్రణాళికలో వ్రాసుకోవాలి. తగిన బలాన్ని, బలగాన్ని సమకూర్చుకోవాలి. తగిన సంబంధాలు ఏర్పరచుకోవాలి. అప్పుడు ప్రణాళికను అమలు చేయాలి. మధ్య మధ్యలో పని అనుకున్న ప్రకారం అవుతున్న లేదా అని సమీక్షించుకోవాలి. సరిగా జరగక పోతే ఎలా చేస్తే సరిపోతుందో చూసుకొని దిద్దుబాటు ప్రయత్నాలు చేయాలి. ఈ విధంగా పథకం ప్రకారం చేసినట్లైతే ఏ పని అయినా విజయవంతం అవుతుంది. నమ్మకం మనిషిని నడిపించే ఇంధనం. భవిష్యత్తు మీద నమ్మకం లేని వ్యక్తి వర్తమానంలో కుంటినడకే నడుస్తాడు. మనిషి తనలోని అంతర్గత శక్తులను వెలికి తీయాలన్నా, తన కలలను, ఆశలను, ఆశయాలను, నెరవేర్చుకోవాలన్నా మొదట ప్రయత్నించాలి. ఆత్మవిశ్వాసం, అంకిత భావం, క్రమ శిక్షణ, చిత్తశుద్ధి, కష్టించి పని చేసే తత్వం అందరికీ అవసరం. ఇలా ఉంటే కొండను సైతం ఎదుర్కొనగలం. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దానికోసం నిరంతరం తపన పడేవారు ఆ లక్ష్యాన్ని తప్పక సాధించగలుగుతారు. సంకల్పబలం, సంకల్ప శుద్ధి ఉంటే సత్పలసిద్ధి కలుగుతుంది. మానసిక దృక్పధాలను మార్చుకోవటం ద్వారా జీవితాన్ని సరిచేసుకోగలుగుతాము. దేనినైనా సాధించగలననే నమ్మకం విజయం సాధించిపెడుతుంది. పనికి రాని మనిషి అంటూ ఈ ప్రపంచం లో ఉండడు. కొందరిలో తెలివి తేటలు తక్కువగా ఉండొచ్చు. కాని వారు కూడా పరిశ్రమ తో గొప్ప వారు కాగలరు. కొందరిలో తెలివితేటలు ఎక్కువగా ఉండొచ్చు. కాని వీరు బద్ధకానికి లోనైతే జీవితంలో ఏమీ సాధించలేరు. ప్రకృతి అన్నింటినీ మనిషికి ఇచ్చింది. ఒక్క బద్ధకాన్ని, సోమరి తనాన్నిఒదిలించుకో గలిగితే, ధైర్యాన్ని పుంజుకో గలిగితే మనిషి సాధించలేనిది లేదు. ఎన్నెన్నో విద్యలు మానవుని కోసంఎదురు చూస్తూ చీకటిలో ఉన్నాయి. వాటిని అందుకునే వారు, సాధించే వారే లేరు. ఇంద్రియ వ్యామోహం తో కొందరు, దురహంకారం తో ఇంకొందరు, బద్ధకంతో ఇంకొందరు, పిరికి తనం తో మరి కొందరు పరిస్థితుల ప్రభావం వల్ల కొందరు ఇలా రకరకాలుగా ఏమీ సాధించలేని అప్రయోజకులుగా మారుతారు. వీటిని వదిలించుకో గలిగితే మనిషిని విజయ లక్ష్మి ఏదో నాటికి వరిస్తుంది. విజయమనేది గమ్యంకాదు. అదొక నిరంతర ప్రయాణం. లెక్కలేనన్ని అపజయాలు ఎదురైనా, నిరాశా నిస్పృహలు నిండా ఆవహించినా, కష్టాల కడలి చుట్టుముట్టినా, భవిష్యత్తు బహు అంధకార బంధురమై తోచినా ఖచ్చితమైన సమయపాలన, నిర్విరామ కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసము ఉంటే విజయం మీకు దాసోహమవుతుంది. అప్పుడే మనం ఆదర్శ జీవితాన్ని గడిపి, పదిమందికి స్ఫూర్తిదాయకంగా నిలువ గలుగుతాం. కసితో కూడిన కృషి విజయాన్ని సాధించి పెడుతుంది. ఆత్మవిశ్వాసము లేకుండుట మరణంతో సమానమని స్వామి వివేకానంద అన్నారు. “సూర్యుడొకరోజు బద్ధకిస్తే లోకానికి వెలుగే వుండదు. చంద్రుడొకరోజు వెన్నెలను కురిపించకపోతే చల్లదనపు అనుభూతి కరువవుతుంది. వాయిదా మాటే ఎరుగని ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ కూడ జీవితాన్ని అత్యున్నత శిఖరం వైపు నడిపించవలసిన మనం మాత్రం వాయిదాకు అలవాటుపడటం నేరమే అవుతుంది”.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: