సోంపేట థర్మల్ వ్యతిరేక పోరులో ఏకమైన విపక్షాలు


న్యూఢిల్లీ: శ్రీకాకుళం జిల్లా సోంపేటలో నిర్మించతలపెట్టిన థర్మల్‌ విద్యుత్‌కేంద్రానికి సంబంధించిన దర్యాప్తు కమిటీ ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకుని తక్షణమే ఆ ప్రాజెక్టు అనుమతులు రద్దు చేయవలసిందిగా టిడిపి, సిపిఐ, సిపిఐ(ఎం), ఆర్‌ఎస్‌పి, సిపిఐఎంఎల్‌ న్యూడెమొక్రసీ, లోక్‌సత్తా పార్టీలతో కూడిన అఖిల పక్షం డిమాండ్‌ చేసింది. టి.డి.పి ఎంపీ నామా నాగేశ్వర రావు, సి.పి.ఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ తదితరులు రెండు రోజుల కిందట ఢిల్లీలో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి జైరాం రమేష్‌ను కలసి, ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ఆగస్టు 11న హైదరాబాద్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశం చేసిన డిమాండ్‌ను వారు మంత్రి వద్ద ప్రస్తావించారు. పర్యావరణ అనుమతిని పూర్తిగా రద్దు చేయాలని ఈ విషయంలో ఎటువంటి ప్రయత్నాలను అంగీకరించవద్దని అఖిలపక్షం కేంద్రమంత్రి జయరామ్‌ రమేష్‌ను కోరింది. సోంపేటలో థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు నిర్మాణంకోసం నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎన్‌సిసి) పర్యావరణ అనుమతులకోసం దరఖాస్తు చేసుకుందని, అయితే పూర్తి వాస్తవాలు తెలియక కేంద్రమంత్రిత్వశాఖ పర్యావరణ అనుమతి మంజూరు చేసి తరువాత నిలిపివేసిందని గుర్తుచేశారు. దీనిపై మంత్రి జైరాం రమేష్‌ స్పందిస్తూ, ఎన్‌.సి.సి ప్లాంటుకు సంబంధించిన పర్యావరణ అనుమతులను ప్రభుత్వం రద్దుచేసిందని స్పష్టంచేశారు. తమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బృందం సోంపేట వెళ్ళి, అక్కడ జరుగుతున్న ఉల్లంఘనలను గుర్తించిందని, అది ఏ తరహా భూమి అయినప్పటికీ, పర్యావరణ అనుమతులను రద్దుచేసిందని చెప్పారు. ఈ భూమిలో ఎలాంటి పనులు చేపట్టరాదని, ఎన్‌.సి.సి అందులోకి ప్రవేశిస్తే, హైకోర్టుకు వెళ్లడం జరుగుతుందని తెలిపారు. అఖిలపక్షం దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మంత్రికి అందజేసి, ప్లాంట్‌ను రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. సి.పి.ఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సారధ్యంలోని ఈ ప్రతినిధి బృందంలో టి.డి.పి సభాపక్ష నాయకుడు నామా నాగేశ్వరరావు, సోంపేటకు చెందిన న్యాయవాది సి.ఎస్‌.భగవాన్‌, పర్యావరణ పరిరక్షణ సం ఘం అధ్యక్షులు డాక్టర్‌ కృష్ణమూర్తి, జెడ్‌.పి.టి.సి కె.వెంకటేశ్వరరావు తదితరులు వున్నారు. మంత్రిని కలసి సమావేశం ఏర్పాటు చేయడంలో సి.పి.ఐ రాజ్యసభ సభ్యులు డి.రాజా, అజీజ్‌పాషాలు చొరవచూపారు.

థర్మల్ పవర్ ప్రాజెక్టు వివరాల్లోకి వెళ్తే… శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలోని గొల్లగండి, బారువా, గ్రామాలలో 2,640 మెగావాట్ల(4×660 మెగావాట్లు) బొగ్గు ఆధారిత థర్మల్‌ విద్యుత్‌కేంద్రం ఏర్పాటుకు పర్యావరణ అనుమతికోసం నాగార్జున కనస్ట్రక్షన్‌ కంపెనీ దరఖాస్తు చేసుకుంది. అయితే స్థానిక ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు విద్యుత్‌కేంద్రం ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించారు. దీనికి సంబంధించి సుదీర్ఘమైన ఆందోళన కూడా జరిగింది. ఎన్‌సిసికి కేటాయించిన భూమిలో జలవనరులు ఉన్నాయి. స్థానికంగా వీటిని బీలలు అంటారు. ఇవి అక్కడ వ్యవసాయ భూములకు సాగునీటి వసతి, భూమిని తేమగా ఉంచేందుకు దోహదపడుతున్నాయి. ప్రతిపాదిత ప్రాజెక్టు వాస్తవరూపం దాల్చినట్లయితే రెండు పట్టణాలు, 30కిపైగా గ్రామాలకు చెందిన వేలాదిమంది రైతులు, జాలర్ల జీవనోపాధి దెబ్బతింటుంది. దాంతోపాటు పర్యావరణానికి తిరుగులేని నష్టం వాటిల్లుతుంది. అంతేకాక ఈ బీల భూములు వలస పక్షులకు ఆవాసాలు. ప్రతిఏటా 120జాతులకు చెందిన వేలాదిపక్షులు ఆస్ట్రేలియా, సైబిరియాల నుండి వచ్చి ఆరు నెలల పాటు ఇక్కడ ఆవాసం ఏర్పరచుకుంటాయి. కానీ స్థానిక పాలనాయంత్రాంగం ఈ వాస్తవాలన్నిటినీ మరుగుపరచి ప్రతిపాదిత కేంద్రాన్ని తేమ, వినియోగంలోలేని భూమిలో ఏర్పాటు చేయవచ్చునంటూ తప్పుడు నివేదికను పంపింది. ఇది కొన్ని షరతులతో కూడిన పర్యావరణ అనుమతికి దారితీసింది. ఈ అనుమతిని పర్యావరణ అప్పిలెంట్‌ ట్రిబ్యునల్‌లో సవాలు చేశారు.

ప్రతిపాదిత నిర్మాణ స్థలాన్ని ప్రత్యక్షంగా సందర్శించి వాస్తవ నివేదికను సమర్పించేందుకు బెంగళూరుకు చెందిన ప్రాంతీయ ప్రధాన అటవీ సంరక్షణాధికారిని ఆదేశిస్తూ మంత్రి తీసుకున్న చర్యను అఖిలపక్షం అభినందించింది. సదరు కమిటీ పర్యటనకు వెళ్ళముందే ఎన్‌సిసి 2010 జులై 14న పని ప్రారంభించేందుకు ప్రయత్నించింది. అదికూడా సొంతగూం డాలు, పోలీసుల రక్షణలో. ఈ ప్రయత్నాన్ని స్థానిక ప్రజలు బలంగా ప్రతిఘ టించారు. ఇది కాల్పులకు, కాల్పుల్లో ఇద్దరు మృతికి, పలువురు గాయపడ డానికి దారితీసింది. అదే రోజున కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ విద్యుత్‌కేంద్రానికి వచ్చిన పర్యావరణ అనుమతిని నిలిపివేసింది.

ఈ పరిణామాల అనంతరం పర్యావరణ మంత్రిత్వశాఖ సూచనల మేరకు నియమించబడిన కమిటీ నిర్మాణ స్థలాన్ని సందర్శించి నివేదికను సమర్పించింది. ఈ నివేదిక వాస్తవపరిస్థితులను, స్థానికులు, స్వచ్ఛందసంస్థలు లేవనెత్తిన అభ్యంతరాలు, సందేహాలను ధృవీకరిస్తూ వాస్తవ సమాచారాన్ని అందచేసింది. ప్రతిపాదిత విద్యుత్‌కేంద్రం ఆ ప్రాంత పర్యావరణ వ్యవస్థకు తీరని నష్టం కలుగచేస్తుందని నివేదిక స్పష్టంగా పేర్కొంది. కమిటీ ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకుని సోంపేటలో థర్మల్‌ కేంద్రాన్ని తక్షణమే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను డిమాండ్‌ చేస్తూ టిడిపి, సిపిఐ, సిపిఐ(ఎం), ఆర్‌ఎస్‌పి, సిపిఐ(ఎంఎల్‌), న్యూడెమొక్రసి, లోక్‌సత్తా పార్టీలతో కూడిన అఖిలపక్ష సమావేశం ఏకగ్రీవంగా ఒక తీర్మానం ఆమోదించింది. ఈ తీర్మానాన్ని కమిటీ నివేదికను ఆధారంగా చేసుకుని ఎన్‌సిసికి కేటాయించిన విద్యుత్‌ కేంద్రానికి పర్యావరణ అనుమతిని రద్దు చేయాలని, ఈ విషయంలో జరిగే ఇతర ప్రయత్నాలను అనుమతించవద్దని అఖిలపక్షం మంత్రిని కోరింది. కేంద్రమంత్రికి సమర్పించిన విజ్ఞాపనపై టిడిపి ఎంపి నామా నాగేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు, లోక్‌సత్తా పార్టీ నాయకుడు బి.బాబ్జి, న్యూ డెమొక్రసి, ఆర్‌ఎస్‌పి నాయకులు సంతకాలు చేశారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: